తెలుగు సాహిత్యాన్ని మరింత చేరువ చేస్తున్న ‘వాట్స్‌యాప్’ గ్రూపులు (పరిశోధక వ్యాసం ) డా॥ నాగార్జునకొండ విద్యా ప్రవీణ

సంపుటి – 15, సంచిక – 179 , నవంబర్ 2025,
సమర్పణ : 14.09.2025 ఎంపిక : 05.10.2025 ప్రచురణ : 01.11.2025

పరిచయం :-
వాట్స్యాప్కు ఇంటర్నెట్ ఉంటే చాలు. దీంతో ఏదైనా చేయవచ్చు. ఉచితంగా సందేశాలు పంపుకోవచ్చు. వీడియోలను సెకన్లలో సెండ్ చేయవచ్చు. ఆడియో, ఫైల్స్, పిడిఎఫ్,లను కూడా మిత్రులకు ఎంతో వేగంగా చేరవేయవచ్చు. వాట్సప్ వాడని వారు ఈ రోజుల్లో లేరంటే అతిశయోక్తికాదు. 2009లో ‘‘బ్రియాన్ ఆక్టన్’’ మరియు ‘‘జాన్ కౌమ్’’ వాట్సప్‌ను స్థాపించారు. 2014లో దీన్ని ఫేస్బుక్ కొనుగోలు చేసింది.
ఉద్దేశం:-
తొలినాళ్ళలో సాంప్రదాయ సాహిత్యానికి, కథా కవిత ప్రక్రియలకు పరిమితమైన అంతర్జాల తెలుగు సాహిత్యం అస్తిత్వ ప్రాంతీయ చైతన్య సాహిత్యాలకి అంతర్జాలం ప్రధానవేదికగా నిలిచింది. చదువుకున్న పాఠకులు ఎలక్ట్రానిక్ స్క్రీన్ మీద ప్రపంచ సాహిత్యాన్ని చదువుకోవటానికి మార్గం సుగమం అయింది. దీని వల్ల అధ్యయన దృష్టిమారింది. ఇప్పుడు పత్రికలు చదువుకోవటానికి గ్రంథాలయాల వరకు వెళ్ళక్కరలేదు. మాతృదేశానికి దూరంగా నివసిస్తున్న ప్రవాసాంధ్రులకి తెలుగు పత్రికల కోసం వెతుక్కునే అవసరం తప్పింది. స్వదేశానికి దగ్గరయ్యారు. పత్రికలు తీరిగ్గా చదవలేని వారికి పని విరామసమయంలో కంప్యూటర్లో అంతర్జాల సాహిత్యాన్ని చదువుకునే అవకాశం కలిగింది. (అంతర్జాల సాహిత్య దర్శనం (సంపా) ` పుట `246)
నేటి ఆధునిక యువతకు, సాహిత్యకారులకు ఈ వాట్సప్ ఎంతో మేలు చేస్తుంది. రాతి పలకల నుండి, రాగి రేకుల నుండి, తాళపత్ర గ్రంథాల నుండి అచ్చు యంత్రాల దాకా తెలుగు సాహిత్యం విభిన్న పరిణామాలకు దారి తీసింది. మారుతున్న కాలంతోపాటు సాహిత్యం కూడా కొత్త మలుపులు తీసుకుంది. ఆదికవి యుగం నుండి అంతర్జాల యుగంలోకి తెలుగు సాహిత్యం ప్రవేశించింది.
ఈ నా వ్యాసంలో నా ఫోన్లో ఉన్న వాట్సప్‌లోని తెలుగు సాహిత్య గ్రూపుల గురించి అవి అందిస్తున్న సాహిత్య సేవల గురించి తద్వారా నాకు కలుగుతున్న మేలును, ఆహ్లాదాన్ని పొందుపరుస్తున్నాను. నా ఫోన్లో దాదాపు పదుల సంఖ్యలో తెలుగు సాహిత్య గ్రూపులు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి వివరించే ప్రయత్నం చేస్తాను.
వ్యక్తిగత బ్లాగుల్లో ఆసక్తికరమైన మరో బ్లాగు ‘వి.బి.సౌమ్య’ గారిది. ‘సౌమ్య రైట్స్’ పేరుతో 2006 జూలైలో ప్రారంభించిన ఈ బ్లాగులో మొదట ఇంగ్లీషులో పోస్టులు రాసిన సౌమ్యగారు తరువాత చక్కటి తెలుగులో రాయడం కనిపిస్తుంది. తన బ్లాగులో సాహిత్యం నుండి ఆటల వరకు, అనుభూతుల నుండి ఆలోచన రేకెత్తించే విశ్లేషణ వరకు, పుస్తక పరిచయాలు, సంగీతం, అనువాదం, యాత్రలు వంటి ఎన్నో అంశాల గురించి చాలా విస్తృతంగా రాశారు. ‘‘క్షేత్రశీల భాషాశాస్త్రం’’ అనే అంశంపైన తన నోట్సు భాషాపరిశోధకులకు చాలా ఉపయుక్తమైన సమాచారం కలిగి ఉంది. తను చదివిన మిథునం, గబ్బిలం, గజేంద్రమోక్షం వంటి వాటిపై రాసిన విశ్లేషణల వల్ల ఇందులోని చాలా పోస్టుల్లో బ్లాగరుకున్న తెలుగు భాషాసాహిత్యాభిమానం కనబడుతుంది. (అంతర్జాలంలో తెలుగు భాషా సాహిత్యాలు ` పుట` 17)
‘‘అక్షరాలతోవ సాహిత్య సంస్థ’’ 20`10`2017లో ఈ గ్రూపును ఓ లక్ష్యంతో ముగ్గురు మిత్రులు దాసరోజు శ్రీనివాస్, నామా పురుషోత్తం, రాచమళ్ళ ఉపేందర్‌లు క్రియేట్ చేశారు. ఈ వేదిక ద్వారా కవితల, కథల పోటీలు, వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. కొన్ని పుస్తకావిష్కరణ సభలు కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారు. వీరు నిర్వహించే పోటీలలో, విజేతలకు ప్రశంసా పత్రం, శాలువా మరియు నగదుతో సత్కరిస్తారు.
ఇటీవల ‘‘ఉరిమళ్ళ ఫౌండేషన్’’వారు అక్షరాలతోవ తోడ్పాటుతో కథలు, కవితల పోటీల విజేతలను ఆగష్టు 29న ఖమ్మంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ గ్రూపులో 231 మంది సభ్యులలో నేను ఒక సభ్యురాలిని కావడం, ఆనందించదగ్గ విషయం. అలాగే ఈ గ్రూపులో సభ్యులు రాసిన కవితలు, కథలు, సమీక్షలు, ఇతర సాహిత్య సమాచారం చేరవేస్తుంటారు.
దేశీయ అంతర్జాలం వినియోగం పెరగాలంటే అంతర్జాలంలో రచనలు పెరగాలి, అంతర్జాల క్షేత్రీయ పరిభాష రూపొందాలి. ఇప్పటికే ఆ దిశలో విశేష ప్రయత్నం జరిగింది. ఇంకా జరగాల్సిన పని ఎంతో ఉంది. ఉదాహరణకు, తెలుగు అంతర్జాల వినియోగానికి కొద్దో గొప్పో తెలుగు అంతర్జాల పరిభాష అందరికీ అందుబాటులోకి రావాలి. అది ప్రత్యేక ప్రయత్నం లేకుండా అర్థమయ్యే రీతిలో ఉండాలి. (అంతర్జాలంలో తెలుగు సాహిత్యం ` పుట `11)
నేను ఉద్యోగ రీత్య ప్రతిరోజూ ఖమ్మం నుండి కొత్తగూడెం దాదాపు 200 కి.మీ.లు ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణంలో నాకు కొంత సాంత్వన కలిగించేది ఈ వాట్సప్ లోని సాహిత్య అంశాలే. ఫోన్లో చార్జింగ్, నెట్ బ్యాలెన్స్ ఉంటే సరి దేశం అంతా చుట్టేయొచ్చు.
నా వాట్సప్‌లోని మరో సాహిత్య గ్రూపు ‘‘జాషువా సాహిత్య వేదిక’’ దీనికి డా॥పగిడిపల్లి వెంకటేశ్వర్లు, మువ్వా శ్రీనివాసరావులు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని 14 జనవరి 2020లో క్రియేట్ చేయడం జరిగింది. 681 మంది సభ్యులున్న ఈ గ్రూపులో వారు చేసే సాహిత్య కార్యక్రమాల సమాచారం గ్రూపులోని ప్రతి సభ్యుడికి వ్యక్తిగతంగా చేరుతుంది. సాహిత్యకారుల జయంతులు, వర్థంతులు, నిర్వహించడంలో ఈ సాహిత్య సంస్థకి మంచి పేరు ఉంది. ఈ రోజు (09`09`2025) కాళోజీ జయంతి సందర్భంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఖమ్మంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానికి ప్రధాన వక్తగా డా॥ బానోత్‌రెడ్డి వ్యవహించనున్నారు.
అలాగే ఈ గ్రూపు సభ్యులు రాసిన కవితలు, పొడుపు పద్యాలను కూడా పంపుతుంటారు.
‘ఆ’‘‘జగతిలోన నున్న
జంతుజాలమునకు
తప్పకుండ నుండి తనరజేయు
అదియు లేక జీవి అడుగు వేయగ లేదు
దీని భావమేమి? ధీవరేణ్య?
జవాబు: ప్రాణం
డా॥ఎన్.ఎన్.రెడ్డి (9`9`2025న రాసిన పొడుపు పద్యం. వీరు ఈ గ్రూపులో 162 పొడుపు పద్యాలను రాశారు. రోజుకొకటి రాసి దాని సమాధానం తరువాతి రోజు గ్రూపులో పంపిస్తారు.
అంతంలేని ప్రపంచం అంతటా విస్తరించిన ఖర్చులేని తెల్లకాగితం అంతర్జాలం. ఆధునిక సాహిత్యపు నవ సమాజపు ధోరణులకు ఆయువుపట్టు అంతర్జాలం. ఆధునిక తెలుగు సాహిత్య విశ్లేషణకు అంతర్జాల పుటలు మౌలిక వనరులు. ఆధునిక నవ సమాజపు రూపురేఖలకు అద్దం పట్టేటటువంటి అంతర్జాల సాహిత్యాన్ని విశ్లేషించడం తప్పనిసరి.
ప్రపంచీకరణ తర్వాత దేశాల మధ్య ప్రాంతాల మధ్య ఎడం తగ్గింది. ఆధునిక ప్రపంచం అన్ని రంగాలలో శరవేగంగా దూసుకుపోతుంది. ఈ కాలంలోనే అంతర్జాల వినియోగం ప్రపంచ ప్రజల మధ్య దూరాన్ని దగ్గర చేసింది. అనేక అంశాలు విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు విభిన్న ఆచార వ్యవహారాలు అంతర్జాలంలో మనకు లభ్యమౌతున్నాయి.
నా వాట్సప్‌లో మరో గ్రూపు ‘‘టైం పాస్’’ నవ్వకపోవడం ఒక రోగం, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం అంటూ సాహిత్య అంశాలతో పాటు నవ్వించడం కోసం ఏర్పాటు చేసిన గ్రూపు ఇది. 10`10`2017న దీనిని డా॥ఇడికూడ చిదానందం ఏర్పాటు చేశారు. 143 మంది సభ్యులున్న ఈ సమూహంలో ఎక్కువగా డా॥ పాత అశోక్ భార్యాభర్తలపై చిన్న చిన్న జోకులు పంపుతుంటారు. టీచర్, స్టూడెంట్ జోకులు, ఉచిత బస్సులపై జోకులు వేస్తుంటారు. కిరణ్ కుమార్ ఆగష్టు 17న ఓ జోక్ పంపారు.
‘‘ఉచిత బస్సు అని ప్రభుత్వం ప్రకటిస్తే, ఎగబడి ఎక్కేస్తున్న జనం. కానీ ఉచితంగా విద్య అన్నా సరే పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించట్లేదు. ఆర్టీసీ డ్రైవర్ మీద ఉన్న నమ్మకం మాస్టార్ల మీద ఉండట్లేదంటారా?’’
ఇది వ్యవస్థపై వ్యంగ్యంతో పాటు చిన్నపాటి కామెడీని పండిస్తుంది. నేటి కాలానికి సరిగ్గా సరిపోయే జోక్.
నవ రసాల్లో హాస్యం ప్రధానమైంది. అందుకే నవ్వని వాడు రోగి నవ్వడం ఒక భోగం అని జంధ్యాల ఊరకనే అనలేదు. మనసు బాగోలేనపుడు చికాకులో ఉన్నపుడు ధ్యాస మళ్ళించుకునేందుకు, మనసారా నవ్వుకునేందుకు హాస్యాన్ని వెతుక్కుంటాం. హాస్యాన్ని మించిన ఔషదం లేదంటే అతిశయోక్తికాదు.
‘‘తెలుగు సాహిత్య పరిశోధకులు’’ గ్రూపును 04`08`2019న డా॥ శ్రీనివాసాచారి క్రియేట్ చేశారు. ఇందులో భాష, సాహిత్యం, జానపదం, విమర్శ, సంస్కృతి, చరిత్ర, సెమినార్లు, జూమ్ మీటింగులు జరుగుతుంటాయి. కాళోజీ జయంతి సందర్భంగా డా॥తిరునగరి శ్రీనివాస్ ‘‘ప్రజామిత్రుడు’’ అనే కవిత రాశాడు.
‘‘ప్రజలే ఇష్టులు
పీడితులే బంధువులు
జన క్షేత్రమే యుద్ధ రంగం
దౌర్జన్యం పైనే సమరం
అన్యాయం కీలలు విరిచే నైజం
కవిత్వమే ఆయన పాశుపతాస్త్రం’’ (09`09`2025) వాట్సప్ కవిత)
మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, తెలుగు సినిమా దర్శకులు త్రిపురనేని గోపీచంద్ గారి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 8న ప్రొఫెసర్ అండమ్మ గారు ఆయన జీవితంపై ఓ వ్యాసం రాశారు. మానవుడు సగం జీవితం నేర్చుకోవడం తోనూ, మిగిలిన సగం తాను నేర్చుకున్నది తప్పు అని తెలుసుకోవడంతోనూ గడుపుతున్నాడు అంటారు. గోపీచంద్ జీవితం, సాహిత్య గ్రంథాల పరిచయం చేశారు ప్రొఫెసర్ అండమ్మ. ఆయన జీవితమే ఒక చైతన్య స్రవంతి. ఆయన లాగా ఆలోచించటమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అంటూ వ్యాసం ముగించారు.
‘‘తెలుగు సాహితీ కుటీరం’’ గ్రూపులో 226 సభ్యులున్నారు. డా॥రామారావు గంజికుంట్ల దీనిని 17`08`2015న దీనిని తన పరిశోధన కొరకు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజూ ఈ గ్రూపే కాకుండా దాదాపు 8 సం॥లుగా 10 సాహిత్య గ్రూపులకు రెండు సాహిత్య గ్రంథాల పిడిఎఫ్లు పంపుతున్నారు. ఈ రోజు (9`9`2025) ‘‘తెలుగు కవితా వికాసం’’ ` కడియాల రామమోహనరాయ్ (1982), ‘‘స్రవంతి’’ ` వేమూరి రాధాకృష్ణమూర్తి (1983) గ్రంథాలతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల న్యూస్ పేపర్ కూడా పంపడం జరిగింది. ఆదివారం అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్, స్వాతి, అన్నిరకాల వార్తాపత్రికల సండే బుక్స్ కూడా ఈ సమూహంలో చేరవేస్తున్నారు గ్రూప్ అడ్మిన్.
ముగింపు:-
బుక్స్ మోయడం బరువుగా భావిస్తున్న నేటి తరంలో ఉదయమే వాట్సాప్‌లో పిడిఎఫ్‌ల రూపంలో సాహిత్య గ్రంథాలు, న్యూస్ పేపర్స్, సండే బుక్స్ చేరుతున్నాయి.
వాట్సప్ గ్రూపుల పేరుతో అందరినీ ఒకే దగ్గర చేరుస్తూ, ఎలాంటి ధన సాయాన్ని అర్థించక సాహిత్య సేవ చేస్తున్నారు కొందరు. ప్రయాణంలో ఒక గ్రంథాన్ని, ఆ రోజు న్యూస్ పేపర్ని చదువుతూ ప్రయాణించటం సౌకర్యంగా ఉంటుంది.
ఆంగ్ల భాషా విజ్ఞానం తన ఆధిపత్యం చెలాయిస్తున్న తరుణంలో తెలుగు భాష కూడా తనవంతు భాగస్వామ్యాన్ని ప్రపంచానికి అందించే ప్రయత్నం ఈ దశాబ్దంలో చాలా బాగా పెరిగింది. నేడు తెలుగు భాషలో అనేక వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. తెలుగులో వచ్చిన వెబ్సైట్లలో వార్తా సంబంధమైనవి, సాహిత్య సంబంధమైనవి, రాజకీయ సంబంధమైనవి అని విభజించవచ్చు.
నేటి ఆధునిక సమాజం వారి బిజీ జీవితంలో కొన్నింటికి సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకే ఒకటి సాహిత్య పఠనం. ఎవరెంత బిజీగా ఉన్న వాట్సప్ గ్రూపుల ద్వారా వారికి తెలుగు సాహిత్యం దగ్గరౌతుంది అనే ఉద్దేశంతో నా వాట్సప్‌లోని కొన్ని సాహిత్య గ్రూపుల గురించిన సమాచారం ఇది. తెలుగు సాహిత్యాన్ని ఇంకా నేర్చుకునే వారికి ఈ గ్రూపులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. ప్రతి బంధాన్ని ఆర్థిక కోణంలో చూస్తున్న నేటి తరుణంలో తమ సమయాన్ని వెచ్చించి వాట్సాప్ ద్వారా సాహిత్య సేవ చేస్తున్న వారందరికీ నమస్సులు.
ఆధార గ్రంథాలు:
1. అంతర్జాలం ` సాహిత్య దర్శనం (2017) – డా॥ పుట్ల హేమలత (సంపా)
2. అంతర్జాలంలో తెలుగు సాహిత్యం (2015) – డా॥ పుట్ల హేమలత
3. అంతర్జాలంలో తెలుగు భాషా సాహిత్యాలు (2023) – డా॥ గణేష్ గొల్లపెల్లి
4. అంతర్జాలంలో తెలుగు భాషా సాహిత్యాల వికాసం (వ్యాసం) – బొడ్డు మహేందర్
5. అంతర్జాలంలో తెలుగు సాహిత్యం (వ్యాసం) – వై. మెరీచా.
డా॥ నాగార్జునకొండ విద్యా ప్రవీణ ,
తెలుగు సహాచార్యులు,
శ్రీరామచంద్ర ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల,
కొత్తగూడెం ,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
తెలంగాణ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
తెలుగు సాహిత్యాన్ని మరింత చేరువ చేస్తున్న ‘వాట్స్‌యాప్’ గ్రూపులు (పరిశోధక వ్యాసం ) డా॥ నాగార్జునకొండ విద్యా ప్రవీణ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>