“దాశరథి,ఆరుద్ర సినిమా పాటలు – జానపద బాణీలు” (పరిశోధనాత్మక వ్యాసం)-ఎరుకల శ్రీనివాస రావు

పరిచయం :
“తెలుగు సినిమా పాటలు తెలుగు సాహిత్యానికి ఒక శాఖ అని అనకూడదు, సినిమా పాటలు అవసరాన్ని బట్టి సన్నివేశానుగుణంగా రాయబడతాయి. వీటిని సాహిత్య శాఖగా గుర్తించలేక పోవడానికి ప్రధానమైన కారణం ఇవి ఆత్మానందం కోసమే రాయబడేవి. ఇది కచ్చితంగా సినిమాకు అనుకూలంగా అవసరానికి తగ్గట్టుగా రాయబడినవి మాత్రమే”(రామలక్ష్మి,కె,ఆరుద్ర సినీగీతాలు ముందుమాట పుట:iii).అయితే ఈ పాటలలో ఆనాటి పరిస్తితులకు తగినవిధంగా జన వ్యవహారంలో అందుబాటులో ఉన్న వస్తువులను స్వీకరించారు.
సినిమా పాట జనరంజకంగా ఉండాలన్నది మొదటి లక్షణంగా పేర్కొనవచ్చు, అందుకేకాబోలు కొన్ని సినిమా పాటలు ఇప్పటికీ కూడా ప్రజల నాలుకల మీద తాండవం చేస్తున్నాయి. అయితే పాతతరం మరియు కొత్తతరం పాటలలో కొంత భాషా ,శైలిపరమైన మార్పు ఉంటుంది. ఆనాటి సినిమా పాటల్లో శృంగారాన్ని కూడా అశ్లీల భావజాలం లేకుండా చూపించగలిగారు, కానీ ప్రస్తుత కాలంలో శృంగార సాహిత్యానికి, శృంగార పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం గమనించదగిన విషయం . ఈ అశ్లీల భావజాలం సినిమా పాటల్లో ద్వంద్వ అర్థాల్లో చిత్రించడం ఈనాటి పరిస్థుతులలో రాయడం కనిపిస్తుంది.
ఉద్దేశ్యం :
దాశరథి,ఆరుద్రల సాహిత్యంలో మరియు వారు సినీ ప్రంపంచానికి అందించిన పాటలలో ఎక్కువ జానపద పదాలు, భాష, బాణీలు కన్పిస్తాయి.ఆనాటి జానపద సమాజంలో ఉన్నటువంటి వస్తువుని స్వీకరించి, జానపద బాణీలను వారి సాహిత్యంలో , పాటలలో ఉపయోగించారు. ఎందుకు అనే ప్రశ్నకు జానపదుడి యొక్క పాటలలోని లాలిత్యం, సరళమైన జానపద భాష ,సుపరిచితమైన జానపద బాణీలు ప్రజల హృదయాలను చేరి,వారిని యిట్టే ఆకట్టుకుంటాయి. అందువలన వారు జానపద బాణీలను స్వీకరించారు, అనే విషయాన్ని ప్రస్పుటము చేయడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.
జానపద సమాజంలో “శ్రమను మరిచిపోయేందుకు జానపదులు పాడుకునే పాటలు, పదాలు ,నాగీ గీతాలు సినిమా పాటలలో ఎక్కువ ప్రాచుర్యం పొందాయి.”(మోహన్ జి.ఎస్.జానపద విజ్ఞాన అధ్యయనం,పుట:287)సినిమా పాటలకు జానపద పాటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎలా అంటే సినిమా ప్రపంచం మొత్తం ఈ పాటలను వెనుకకు నెట్టి జానపద గేయాల యొక్క మనుగడని దెబ్బతీసే విధంగా వ్యత్యాసం చుపగలిగాయి.
కానీ కొంతమంది కవులు మనసున్న రచయితలు మాత్రం ఈ సినిమా పాటలలో కూడా జానపదుడి యొక్క భాష, శైలి ,వాని యొక్క భావాలను ఆదరించి చక్కగా ఉపయోగించుకున్నారు. ఆ పాటలు కూడా ప్రజలలో మంచి మన్ననలను అందుకున్నాయి.జానపదుల యొక్క గేయాల బాణీలను సినిమా పాటలలో ఉపయోగించిన ప్రముఖులలో దాశరథి కృష్ణమాచార్యులు మరియు ఆరుద్ర గార్లు ,శ్రీ శ్రీ మొదలగు ప్రముఖమైనటువంటి కవులు కనిపిస్తుంటారు.
ఆరుద్ర గారు సినిమా పాటల రచనల వల్ల వచ్చిన ధనంలోంచి సాహితీ సంపద సేకరించడానికి వినియోగించారు. ఆరుద్ర దాశరథి యొక్క సినిమా పాటల లోని ‘’జానపద బాణీలను వెతకడం అంటే గడ్డివాములో సూదిని వెతకడం ఎంత కష్టమో వీరి పాటలను కూడా ఏది జానపదం ఏది సినిమా పాట అన్నట్టుగా మిళితమైపోయాయి” .(రామలక్ష్మి, కె, ఆరుద్ర సినీగీతాలు పుట:21) . ఎందుకంటే జానపదుల యొక్క గేయాలలోని బాణీలను వీరు రాసిన సినిమా పాటలలోని బాణీలు ఒకదానికొకటిగా ఏది జానపదుల బాణీయో,ఏది సినిమా పాటయో అని గుర్తించలేనంతగా కలిసిపోయాయి, ప్రజల నాలుకల పైన నిలిచిపోయాయి.
‘’కస్తూరి రంగ రంగా
చిన్నారి కావేరి రంగ రంగ
బంగారు ముద్దుకొండ
బజ్జోరా నీ కడుపు చల్లగుండ
నీళ్లు నేలమట్ట నీ ఇల్లు నేల కట్ట
బాబు నోట బెల్లం ముక్క
బెల్లం చీమలై చుట్టాలు చుట్టూ ముట్ట
రామయ్య మంచి తండ్రి
అచ్చముగా సీతమ్మ వంటి తల్లి
లక్ష్మణుడు నేనుండగా
నా తండ్రి నీకేంక లోటేను రా’’
(సోమన్న చారి, వయసు 70,ముదిగొండ గ్రా,మండలం,ఖమ్మం జి.)
కస్తూరి రంగ రంగా అనే ఈ పాట మంగళ హారతుల యొక్క బాణీ నుండి స్వీకరించడం జరిగింది .మంగళహారతులు అనేవి శుభకార్యాలలో స్త్రీలు ఎక్కువగా పాడుకునే పాటలు, వీటిలో నుండి చక్కటి బాణీలను ఆరుద్ర మరియు దాశరథిలు సినిమా సాహిత్య సృష్టిలోకి మలచి పాటల్లో వినూత్నమైన ప్రయోగం చేయటం ప్రారంభించారు.ఈనాటికీ కూడా ప్రపంచానికి జానపదుల బాణీలలో మచ్చుతునకలుగా చెప్పదగినటువంటి జానపద గేయాలు మనుగడలో ఉండేందుకు సినిమా పాటలు కూడా కొంతమేరకు భూమికగా నిలిచాయి . అదేవిధంగా ఈ మంగళహారతుల పాటలను సినిమా ప్రపంచమే కాక కొన్ని విప్లవ సంఘాలు కూడా ఈ బాణీలను ఉపయోగించి ప్రజలను చైతన్యవంతం చేశాయి.( ఆరుద్ర సినీ గేయాలు – శ్రీ రంగారావు, 2 సంపుటము,పుట:35)
దాశరథి కృష్ణమాచార్యులు, భాగవతుల సదాశివ శంకర శాస్త్రి వీరి యొక్క కాలంలో “జానపద సాహిత్యము పదాలు, గేయాలు, శృతులు, మంగళహారతులు,రోకటి పాటలు, లాలి పాటలు ఎక్కువగా లభించడం వలన వీటిలో ప్రజల నాలుకల యందు ప్రాచుర్యంలో ఉన్న విశిష్టమైన బాణీలను స్వీకరించి ఈ బాణీలను సినిమా పాటల్లో చేర్చారు.” (నారాయణ రెడ్డి,మాదాడి,ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు, పుట:211)
‘’నీతోటే ఉంటాను శేషగిరి బావ
నీ మాటే వింటాను మాటకారి బావ
ఒక్కదాన్నే పోయి బిక్కుమని నేనుంటే
వెన్నెల నువ్వు లేక పచ్చనైపోతుంటే
కంటికి నిదురుందా కాలమే కదిలింగ
సొగసరి బావ గడసరి బావ’’
(“గునగుంట్ల కోటయ్య,వయస్సు 55 జక్కేపల్లి గ్రామం,కూసుమంచి మం.,ఖమ్మం జి.)
ప్రస్తుతం ఈ బాణీ “ఎమ్మెల్యే” సినిమాలో కనిపిస్తుంది. ఈ గేయంలో ఒక గిరిజన తెగకు చెందిన లంబాడాల స్థితిగతులను కవి వివరించారు. చితికిన మనసు అతుకుటకు సాధ్యం కాదని అంటున్నారు. ఈ గేయం చాలా నెమ్మదిగా సాగుతుంది. ఈ పాట వింటుంటే చెవిలో తన బాధను మాట్లాడినట్టుగా, గోడును చెబుతున్నట్లుగా కనిపిస్తున్నది. “ఖమ్మం జిల్లా జక్కేపల్లి గ్రామానికి చెందిన గునగుంట్ల కోటయ్య,వయస్సు 55. అనే వ్యక్తి ఈ పాటకు సరిపోయే బాణీలను పాడుతున్నారు . ఈవ్యక్తి నుండి ఈ రకమైన బాణీలను సేకరించడం జరిగింది.
‘’ బులి బులి ఎర్రని బుగ్గల దానా
చంపకు చారుడు కన్నుల దాన
మరిచిపోయావా నువ్వే
మారిపోయావా
చెడ్డదారిలో తిరిగానే నీ
చెంప దెబ్బ నే తిన్నాను
మంచి మాట నీ నోట వినాలని
మనసు మార్చుకోవచ్చు’’
(కోరుప్రోలు సత్యనారాయణ ,వయస్సు 70.,తలంపాడు గ్రా.,ఖమ్మం రూరల్.,ఖమ్మం జి.)
చంపకు చారడు కన్నుల దాన అనే ఈ బాణీ కూడా చక్కటి జానపద బాని నుండి స్వీకరించారని నా భావన జానపదడు తన సరసాన్ని కూడా సున్నితమైన సరళమైన పదాలతో అల్లినటువంటి భాషను ఉపయోగిస్తాడు అదేవిధంగా జానపద యొక్క బాణీలలో ఒక ప్రత్యేకత కనిపిస్తా ఉంటది . ఆ ప్రత్యేకత అనేది సినిమా పాటలకు చాలా విరుద్ధంగా ఉంటుంది.
మరికొన్ని పాటలు :
- ‘’పచ్చజొన్న చేలు చూసి పకపకానవి
గుట్టమీద నన్ను చూసి కుడి మీసం దువ్వే
దొంగచాటుగా వచ్చి కొంగు పట్టి లాగి
కళ్ళు మూసి మూసి కంగారు చేసి చేసి
బహు రద్దీ చేసి పోతావు ఇది ఏమిరా
రాయి గాలి పోకెళ్ళు తెలిసి పోయారా
ఎందుకో నన్ను కుంటి ఎందుకో అని అనుకుంది’’
- ‘’గోదారి గట్టుంది
గట్టుమీద చెట్టుంది
చెట్టు కొమ్మన పిట్టుంది.
పిట్టమనుసులో ఏముంది
వగరు వగరుగా పొగరు ఉంది
పొగరుకు తగ్గ బిగువుంది
తీయ తీయని సొగసు ఉంది
సొగసును మించే మనసు ఉంది’’
- ‘’ ఓయ్ ఓయ్ నా సామి రంగ
హోయ్ హోయ్ నా సామి రంగ
నా జన్మభూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామి రంగ ఓయ్ నా సాంగ్’’
(కోరుప్రోలు సత్యనారాయణ ,వయస్సు 70.,తలంపాడు గ్రా.,ఖమ్మం రూరల్.,ఖమ్మం జి.)
ముగింపు
ఇలా ప్రస్తుత సమాజంలో పాత సినిమాల్లో మరియు ఇప్పుడు వస్తున్నటువంటి నూతనమైనటువంటి సినిమాల్లో కూడా జానపదుడి యొక్క భాషను శైలిని వారి యొక్క గేయాలను మంగళహారతులను చూపిస్తా ఉంటారు ఇక్కడ గమనించినట్లయితే తెలుగు సినిమా ప్రపంచంలో దాశరధి ఆరుద్ర గార్లు చేసినటువంటి సేవలో జానపద గేయాలకు ప్రముఖ స్థానాన్ని కల్పించారు కాకపోతే ఆ పాటలు పూర్తి బాణీలను కాకుండా కొంత అవసరమైన చోట వీటిని వాడుకున్నారు అనేది తెలుస్తున్నది
ఇంకా వీరి యొక్క గేయాలను పరిశీలించినట్లయితే సామాజికత అనేది సమాజ శ్రేయస్సు కోసమే పరితపించినట్లుగా తెలుస్తుంది. ఇంకా వీరి సాహిత్యం పై ఎక్కువ స్తాయిలో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉన్నది .
తెలుగు సాహిత్యం లో సినిమా పాటలకు అవసరానికి తగ్గట్టుగా ,పాత్రకు తగిన విధంగా పాటలు రాసే సంప్రదాయం ఉండడం చేత వీటిని ప్రత్యేక శాఖగా గుర్తించలేకున్నారు. అయినప్పటికినీ సాహిత్యం ద్వారా అందే అన్ని ప్రయోజనాలు సినిమా పాట ద్వారా లభిస్తాయి అనేది వాస్తవదూరం కాదు.
ఆధార గ్రంధాలు
- ఆరుద్ర సినీ గీతాలు – కే రామలక్ష్మి .సంకలనం
- ఆరుద్ర సినీ గేయాలు – ఐదు సంపుటాలు. శ్రీ రంగారావు
౩. రామరాజు బిరుదు రాజు.- తెలుగు జానపద గేయ సాహిత్యం.
4.కృష్ణకుమారి నాయని.- జానపద గేయ గాథలు.
5.సుందరం. ఆర్.వి.ఎస్. – జానపద విజ్ఞానం.
6.మోహన్ జి.ఎస్. – జానపద విజ్ఞాన అధ్యయనం.
7.నారాయణ రెడ్డి మాదాటి. – ఆదిలాబాద్ జానపద గేయాలు.
,
-ఎరుకల శ్రీనివాస రావు
ఎస్.ఆర్. & బి.జి.ఎన్.ఆర్.
ప్రభత్వ ఆర్ట్స్ & సైన్సు కళాశాల (ఎ),ఖమ్మం ,
తెలుగు ఉపన్యాసకులు ,ఖమ్మం,
సెల్ నెం. 6281294128
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
“దాశరథి,ఆరుద్ర సినిమా పాటలు – జానపద బాణీలు” (పరిశోధనాత్మక వ్యాసం)-ఎరుకల శ్రీనివాస రావు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>