భారతంలో శల్యుని పాత్ర – ఔచిత్య విచారణ – (పరిశోధక వ్యాసం )-డాక్టర్ ఏ. ఈశ్వరమ్మ అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు విభాగం ఆంధ్ర విశ్వకళా పరిషత్
పంచమవేదంగా ప్రఖ్యాతి గాంచిన మహాభారతం, వివిధ తత్త్వముల ప్రదర్శనాలయమగు చిత్రశాల. ఇందు ప్రతిపాత్ర మానవాళికి ఏదో ఒక ప్రబోధం గావిస్తూనే ఉంటుంది. ఆదిపర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు మనసుపెట్టి చదివితే ‘ఇందులేని అంశం ఏది?’ అని ఆలోచిస్తే ఏదీ దొరకదు. ఆయా పాత్రల మనోవిశ్లేషణ అద్భుతం. గమ్యం తెలియనివారికి దిక్సూచి. విజ్ఞానఘని. తరచి చూసే కొద్దీ ఏదో ఒక కొత్తకోణం పొడసూపుతూనే ఉంటుంది.
వేల సంవత్సరాలనాడు సంస్కృతంలో వ్యాసమహర్షి రచించిన మహాభారతాన్ని 11వ శతాబ్దికి చెందిన నన్నయ, 13వ శతాబ్దికి చెందిన తిక్కన, 14వ శతాబ్దికి చెందిన ఎఱ్ఱన స్వతంత్రాస్వతంత్ర పద్ధతిలో ఆంధ్రీకరించారు. ఆదిసభాపర్వాలు, అరణ్యపర్వంలో సగభాగం నన్నయగారు ఆంధ్రీకరించగా, విరాటపర్వం మొదలుకొని స్వర్గారోహణపర్వం వరకు 15 పర్వాలు తిక్కనగారు ఆంధ్రీకరించారు. అరణ్యపర్వశేషాన్ని మాత్రం ముట్టుకోలేదు. ఆ ప్రవాన్ని అనువాదిస్తున్న కాలంలోనే నన్నయగారు కాలధర్మం చెందారని ఆయన మనసులో శంక ఉండడం ఒక కారణంగా చెబుతారు. ధర్మరాజాదుల కష్టకాలాన్ని వివరించడానికి మనస్కరించకపోవడం మరొక కారణంగా చెబుతారు. ఎఱ్ఱన గారికి ఆ అవకాశం దక్కి ‘కవిత్రయం’ అనిపించుకున్నారు.
ప్రస్తుత విషయానికి వస్తే, శల్యుని ప్రసక్తి ఉద్యోగపర్వం నుంచి విస్తృతంగా వస్తుంది. ఈయన మాద్రి సోదరుడు. నకులసహదేవులకు మేనమామ. మద్రదేశపు రాజు. విలక్షణ వ్యక్తిత్వం. శౌర్యధైర్య పరాక్రమాలు గల క్షత్రియుడు. అరివీర భయంకరుడు. కానీ ప్రలోభాలకు వశుడై ఎన్ని అనుచితకార్యాలకు పాల్పడ్డాడో ఈ పాత్ర ద్వారా పాఠకులు గ్రహిస్తారు.
పాండవుల అరణ్యవాస, అజ్ఞాతవాసకాలాలు పూర్తయినవి. సంజయ రాయబారం, శ్రీకృష్ణ రాయబారం పూర్తయినవి. సంధి పోసాగలేదు. యుద్ధం తప్పని పరిస్థితులు దాపురించినవి. కరావుల పక్షాన, పాండవుల పక్షాన వ్యూహరచనా నిపుణులున్నారు. ఏపక్షాన చేరాలనుకున్నవారు ఆపక్షాన చేరుతున్నారు. ధర్మాధర్మ అంతర్మధనంతో ఎటూ తేల్చుకోలేనివారు తటస్థులుగా ఉండిపోయారు. పాండవులు దృపదుని సలహామేరకు శల్యునికి వర్తమానం పంపారు. క్షత్రియాచారం ప్రకారం మొదట కోరినవారికే సహాయం చేయాలనే నియమం, బలమైన రక్తసంబంధం కారణంగా ‘పాండవుల పక్షాన’ యుద్ధం చేయ సంకల్పించి, ఉపప్లావ్యం వైపు శల్యుడు ససైన్యంగా బయలుదేరి వస్తున్నాడు. హస్తినాపురంలో కౌరవులున్నారు. వేగులద్వారా ఈ సమాచారం సేకరించాడు దుర్యోధనుడు. శల్యుని సమర్థత తెలుసు. ఆతని విశ్వసనీయతను సంపాదించాలి. శత్రువే అయినా, వీలుచూసుకొని ఆ శత్రువును తమవైపు తిప్పుకొని, శతృత్వ శాతాన్ని తగ్గించుకోగలగాలి. ఆ సంగతి దుర్యోధనునికి బాగా తెలుసు. శల్యుని బలహీన్ఆటల పట్ల అవగాహన గల దుర్యోధనుడు, శల్యుని వాత్సల్యాన్ని పొందడానికి ప్రణాళిక రూపొందించాడు. సంకల్పం బలంగా లేకపోతే అనేక శక్తులు దాడిచేసి వశపరచుకుంటాయి. వ్యక్తిత్వంలో ప్రమాదకర పోకడ శల్యునిది.
శల్యున్ని సహాయం చెయ్యమని దుర్యోధనుడు స్వయంగా అడక్కుండా, శల్యుడు ప్రయాణిస్తున్న మార్గంలో వారందరి అవసరాలను అంచనావేసి, చతురంగబలాలకూ సకల సౌకర్యాలను అద్భుతంగా సమకూర్చాడు. పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలు చేసి వచ్చారు. వారికి రాజ్యం లేదు. ఇంత ఘనమైన ఏర్పాట్లు చేయగలిగే స్థితిలో వారులేరు. ఆ విషయం తెలిసే దుర్యోధనుడు వారి ప్రతికూలతను తనకు అనుకూలంగా మలచుకున్నాడు. భోగలాలసుడైన శల్యుడు ఆ సౌకర్యాలకు పరవశించిపోయాడు. ఇదంతా దుర్యోధనుడే చేయిస్తున్నాడని తెలియని శల్యుడు, అవి పాండవుల ఏర్పాట్లేననుకున్నాడు. శల్యుడు తనకాతిథ్యమిచ్చినవారిని చూడగోరగా దుర్యోధనాదులు ప్రవేశించారు. పరమానందాశ్చర్యచకితుడైన శల్యుడు, దుర్యోధనుని ఆలింగనం చేసుకొని ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. మట్టుకి అలవాటుపడినవారు విచక్షణ కోల్పోతారు. ఆ అవకాశాన్ని నేర్పుగా వినియోగించుకున్నాడు దుర్యోధనుడు.
“సత్యసరస్వతివగు మైచిత్య విశారదము నీదు చిత్తము నియమౌదాత్యంబు మెఱయ నాకునమాత్యుడవై పూని నడపు మత్సైన్యంబున్”
“తలప బాండావులును, ధార్తరాష్ట్రులు నీకు, నొక్కరూప భక్తియుక్తిజాల నీవు నన్ను మాననీయుండు కాగ నన్ననుగ్రహించి తగ బరిగ్రహింపు” అని కోరాడు.
‘నీవు ధైర్యవంతుడవు, నియమశీలివి. నాపక్షంలో ఉండి, నాకు మంత్రివై, నాసైన్యాన్ని నడిపించు’ అన్నాడు. పాండవులకు, కౌరవులకు నీదృష్టిలో భేదం ఉండనవసరం లేదు. మాకందరికీ నీవు మేనమామవే. నన్ను మన్నింపదగినవాడిగా స్వీకరించు అంటూ చతురతతో మాట్లాడాడు దుర్యోధనుడు. శల్యుడా మాటలకు ముగ్ధుడై ఇంకా ఏమైనా అడగమన్నాడు. ‘ఇదిచాలు’ అన్నాడు దుర్యోధనుడు. ఉపప్లావ్యం వెళ్ళి, పాండవుల్నొకసారి చూసివస్తానన్నాడు శల్యుడు. ఇచ్చిన మాట మరిచిపోవద్దన్నాడు రారాజు. అతన్ని కౌగిలించుకొని ‘అనుమానించవద్ద’న్నాడు శల్యుడు.
“దరహాసముతో మద్రేశ్వరుడాలింగానము చేసి సందియపడకీవని పలికెనాతడు, కరిపురికింజనియె మాది వికాసము బొందన్
ధర్మరాజు సపరివార సమేతంగా సుభద్ర, ద్రౌపది, సోదరులు వెంటరాగా ఎదురేగి, అత్యంత వినయంతో శల్యుడిని స్వాగతించాడు. శల్యుడు కరిగిపోయాడు. అరణ్య, అజ్ఞాతవాసకాలంలో వీరుపడ్డ కష్టాలు తలచుకొని బాధపడ్డాడు. మీ దయాగుణం వల్లే మీరు రక్షించబడ్డారని ప్రశంసించాడు. మీరు కష్టాల్లో ఉంటే ప్రజలంతా బాధపడ్డారని ధర్మరాజు నుద్దేశించి పలికాడు. నీవు ధన్యుడవు అని పొగిదాడు. ఆ పొగడ్తలో యదార్థముంది. దాపరికం లేకుండా దుర్యోధనుడికి తనకి మధ్య జరిగిందంతా చెప్పాడు. ధర్మజుడు రాజనీతిజ్ఞుడు. నీవు చేసినది నాకు సంతోషము. అది నీకే సాధ్యము. నీవంటి సారథ్యం తెలిసిన వ్యక్తి లేడు అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. అనితరసాధ్యమైన ప్రజ్ఞ ధర్మరాజుది. శల్యుడిని ఏవిధంగా ఉపయోగించుకోవాలో ఆలోచించాడు.
“మేలు చేసితీరొక్కరి మెచ్చువారి, కోర్కె తీర్చుట పెద్దల గుణమ కాదె, యది మదీయ చిత్తమునకు హర్ష కరమ, టివిరి యొక్కటి వేడెద నవధరింపు”
“సమర సమయంబున నిరాకరించి పలికి కర్నూ చిత్తంబునకుంగలంక పుట్టించి పార్థు రక్షింపవలయు నకృత్యంబని యనుమానింపక మత్ప్రార్థనంబున నెల్లభంగుల 0నివ్విధంబనుష్టింపవలయునని యభ్యర్థించిన సమ్మతించి శల్యుండిట్లనియె”
అకార్యం చెయ్యమని అర్థించాడు ధర్మరాజు. బలహీనమనస్కుడైన శల్యుడు సంతోషంతో అంగీకరించాడు.
“కర్ణుని సారథినైనను
నిర్ణయమున నేను పార్థునింగాచెద నా
దుర్ణయ విచార నెమ్మెయి
గర్ణ కఠోరంబులాడి కలతుంబోరన్”
“దర్పమును దేజమును మాయ దరల బలికి
చిక్కు పరిచిన నేయంగ జేతులాడ
కునికి రాధాతనూజు నర్జునుడు తీవ్ర
బహుళ బాణపరంపర పాలు పరచు”
“ఇది యొక్కడేల నీవు మదినెయ్యది కోరిన జేయువాడ” అంటూ ధారాళంగా వాగ్దానం చేశాడు.
కృష్ణునికి, శల్యునికి సారథ్యం అభిమానవిద్య. రథిని కాపాడడం సారథి ప్రధాన ధర్మం. అర్జునుడు జీవించడానికి అతని సారథి కృష్ణుడు ప్రధాన కారకుడు. కర్ణుని మరణానికి ఇతని సారథి శల్యుడు ప్రధాన కారకుడు. “శల్య సారథ్యం” అన్నమాట లోకంలో చాలా ప్రాచుర్యం పొందింది. ఎంతటి నిపుణులైనా ఆకర్షణకు లోనైతే, పొగడ్తలకు పొంగిపోతే ఎలాంటి అకృత్యాలకైనా సిద్ధపడతారనడానికి బలమైన ఉదాహరణ శల్యుని పాత్ర. జీవితంలో పెద్దపెద్ద దోషాలను దిద్దుకోవడానికి శల్యుని కథ ఉపయోగపడుతుంది. ఎలా ఉండకూడదో, ఎలా ప్రవర్తించకూడదో, మనసునెలా అదుపులో ఉంచుకోవాలో భారతం చెబుతుంది.
కర్ణుని గర్వం నశించిపోయేటట్లు మాట్లాడుతానన్నాడు. కర్ణుని ఆత్మవిశ్వాసాన్ని ధ్వంసం చేస్తానన్నాడు. కర్ణుని పరాక్రమం క్షీణింపజేస్తానన్నాడు. పైగా శల్యుడు ఇది అకార్యం కాదు, సకార్యమే అన్నాడు ధర్మరాజుతో. తనకు తానే సవాలుగా మారిపోయాడు. శల్యుడు గదాయుద్ధంలోనూ, ధనుర్విద్యలోనూ నిపుణుడు. అద్భుతమైన సారథి. రాజ్యం నీకు తప్పకుండా దక్కుతుందని ధర్మజునికి చెప్పాడు. దుర్యోధనుని పాచికకు పైపాచిక వేసి సఫలీకృతుడయ్యాడు ధర్మరాజు. పొగడ్తకు లొంగడమనే బలహీనత శల్యుని జీవితాన్ని నశింపచేసింది. నహుషుని వృత్తాంతం పాండవులకు చెప్పి, నహుషునిలా దుర్యోధనుడు పడిపోతాడు. ఇంద్రునికి లభించినట్లు మీకు(పాండవులకు) సంపదలు సమకూరుతాయని చెప్పాడు. ధర్మరాజు స్నానభోజనాదికములు ఏర్పాటుచేయించాడు. శ్రద్ధగా సాగనంపుతూ కర్ణుని రథం ఎక్కునపుడు మమ్మల్ని తల్చుకోమని చెప్పాడు. కౌగిలించుకొని మామను మరింత ప్రసన్నపరచుకున్నాడు.
“మొత్తం భారతంలో శల్యునిది ఉభయ భ్రష్టత్వం”
భీష్మద్రోణులు ఒరిగిపోయాక దుర్యోధనుడు అశ్వత్థామ నుద్దేశించి సర్వసైన్యాధ్యక్ష పదవిని ఎవరికివ్వాలని అడుగగా, అశ్వత్థామ శల్యుని అపారప్రతిభావిశేషాలను చెప్పి, శల్యునికే ఇమ్మన్నాడు. నామీద ఎంతో ప్రేమతో ఉన్న నీకు, నాకు సహాయం చెయ్యడానికి కాలం కలిసివచ్చింది. నీ భుజబలం చేత నన్ను గెలిపించు. నీవుండగా నేనోడిపోవడం జరగదు. నీకు సర్వసైన్యాధిపత్యం ఇస్తున్నాను. స్వీకరించమన్నాడు దుర్యోధనుడు. సత్యదీక్షాపరుడవని గుర్తుచేశాడు. శత్రువులను కష్టపెట్టుటలో సమర్థుడవు. నిన్నూ, కర్ణుడినీ నమ్ముకున్నానన్నాడు.
“చాలా బలమైన బలహీనత శల్యునిది.” తనాగురించి తాను అతిశయంగా మాట్లాడాడు శల్యుడు. నేను ఉత్తమ క్షత్రియుణ్ణి. కులపర్వతాలు బద్దలుకొడతాను. భూమినంతటినీ క్షోభింపజేస్తాను. సముద్రాలు ఘూర్ణిల్లిపోతాయి. శత్రుసైన్యం కకావికలవుతుంది. నాశక్తిలో పదహారో వంతైనా లేదు కర్ణునికి. కర్ణుడు గెలవడం సారథి చేతిలో ఉంది. మొదలైన ప్రగల్భాలు పలికాడు. దుర్యోధనుడు సమయస్ఫూర్తితో కృష్ణునికన్నా ఎక్కువచేసి, శల్యుడి సారథ్య ప్రౌఢి గూర్చి ప్రశంసించాడు.
“జీవితంలో సమతుల్యత పాటించడం తెలియాలి” భారతం ఒకకథ అన్న ధోరణిలోనే చదవకూడదు. మానవ మనస్తత్వాలు చదవాలి.
‘ఇతనితో నేను విచ్చలవిడిగా మాట్లాడుతాను. అడ్డుచెప్పగూడదు’ అని దుర్యోధనుని వద్ద మాట తీసుకున్నాడు శల్యుడు. ఇక క్షణక్షణం కర్ణుడిని కించపరిచాడు. కర్ణుడు ఎంతో ఉత్సాహంతో తన అస్త్రవిద్యాకౌశలం గురించి శల్యునితో చెప్పాడు. దానికి శల్యుడు, సారథి ధర్మానికి విరుద్ధంగా ‘పాండవులు సత్యపరాక్రమవంతులు. అపార తేజోవంతులు. ఇంద్రుని కూడా భయపెట్టగల పరాక్రమవంతులు. అర్జునుని గాండీవధారణ ధ్వని భరించలేవు అంటాడు. ఎన్ని సందర్భాలలో అర్జునుని చేతిలో ఎందరు ఓడిపోయారో చెబుతాడు. అంగారపర్ణుని అర్జునుడు గెలిచిన సందర్భం, చిత్రసేనుడు కౌరవుల్ని ఓడించిన సందర్భం, ఖాండవవనం దహించిన వృత్తాంతం, శంకరునితో మల్లయుద్ధం మొదలైనవన్నీ చెబుతూ ‘సూత పుత్రా!’ అని సంబోధిస్తూ ‘జింక సింహంతో యుద్ధం చెయ్యగలదా? పెద్దపెద్ద దంతాలతో మదజలధారాలుగల ఏనుగు మీదికి కుందేలు యుద్ధమా? పులితో కుక్క యుద్ధమా? వాడి ముక్కు గల గ్రద్దతో పిల్ల పాము యుద్ధమా?’ అంటూ శూలాల్లాంటి మాటలతో కర్ణుని హేళనచేశాడు. గోగ్రహణఘట్టం చెబుతాడు. ‘అర్జునుని బాణాలకు తుప్పు పట్టిందనుకున్నావా? అంటాడు.
అశ్వహృదయం తెలిసిన సారథి రథక్షేమం, అశ్వాల క్షేమం చూడాలి. ప్రమాద పరిస్థితిలో రథి ఉంటే కాపాడాలి. తగు సూచనలు ఇవ్వాలి. మేలుకోరాలి. విజయం చేకూర్చాలి. కానీ శల్యుడది చెయ్యలేదు. ఎన్నోవిధాలుగా అవమానపరుస్తున్నాడు. ‘అగ్నిహోత్రాన్ని ముట్టుకుంటే కాలకుండా ఉంటుందా? అర్జునుని దగ్గరకెళ్ళి బతికుండాలంటే సాధ్యమా? ఎంగిలి మెతుకులు తిని బలిసిన కాకులు హంసలతో సమానంగా ఎగరగలవా?’ అంటూ మానసికంగా క్షోభకు గురిచేసి, నిరాశావాదం నూరిపోయడానికి శతవిధాలా కృషిచేశాడు.
కర్ణుడు మహాబలసంపన్నుడు. సూర్యుని అంశతో జన్మించాడు. అలాంటి వీరుడు, సారథి నీచానికి దిగజారడం వల్ల అపజయం పొందాడు. నిరాశావాదం వల్ల ఉత్సాహం కొరవడుతుంది. స్ఫురణాశక్తి నశిస్తుంది. మనసుమీద వ్యతిరేకధోరణులు ప్రవేశిస్తాయి. కార్యం సాధించలేరు. కర్ణుని విషయంలో అదే జరిగింది. ఎంతో ఉత్సాహంతో బయలుదేరినవాడు అర్జునుని జయిస్తానన్న నమ్మకం లేదంటాడు. జీవితంలో ఎన్ని కోణాలలో జాగ్రత్త పడితే కీర్తిప్రతిష్టలొస్తాయో, పదిమందికీ పనికొచ్చేవ్యక్తిగా నిలబడగలడో, అలా నిలబడగలగాలంటే సఖ్యత విషయంలో ఎంత జాగ్రత్తపడాలో, ఎలాంటి వ్యక్తుల్ని పరిహసించాలో, ప్రయత్నపూర్వకంగా ఎటువంటి వ్యక్తులతో కూడి ఉండాలో ఈఘట్టం మనకు చెబుతుంది.
కర్ణుడు తన శాపాన్ని చెప్పి, ‘అయినా సరే నా పౌరుషప్రతాపాలే నన్ను కాపాడుతాయి, అర్జునునివైపు రథాన్ని తిప్పు’ అంటాడు. అనగానే శల్యుడు ‘కర్ణా! నక్కలు ఇటువైపు తిరిగి అరుస్తున్నాయి. అలా అరిస్తే బయలుదేరినవారు తిరిగిరారు. అకారణంగా పెద్దగాలి వీస్తూంది. అది దుశ్శకునం. గ్రద్దలు కాకులు భూమికి దగ్గరగా వచ్చి తిరుగుతున్నాయి. దాని బట్టి చూస్తే నువ్వు విజయం పొందలేవు’ అంటాడు. శల్యునికి సమర్థత ఉన్నా విశ్వసనీయత, వినయం లేకపోగా ప్రమాదకరమైన అహంకారగుణాలున్నాయి.
అరివీరభయంకరమైన యుద్ధం జరిగింది. అర్జునుడు వేసిన అనేక అస్త్రాలను కర్ణుడు ఉపసంహరించాడు. అర్జునుడు నిరుత్సాహపడ్డాడు. అతన్ని కృష్ణుడనేక విధాలుగా ప్రోత్సహించాడు. ఉత్సాహం పుంజుకో. కర్ణుడు నీముందు నిలబడగలడా? నీవద్దనున్న అస్త్రశస్త్రాలెటువంటివి? అంటూ ఉత్సాహపరిచాడు. కర్ణుడు ప్రయోగించిన అశ్వసేనుడనే సర్పాస్త్రం నుండి యుక్తిగా అర్జునుడిని కాపాడాడు సారథి కృష్ణుడు. మహాబలసంపన్నుడైన కర్ణుని చంపేశాడు సారథి శల్యుడు. ఇరువురూ సారథ్యంలో నిపుణులే. వ్యక్తిత్వపరంగా నీచాతినీచుడు శల్యుడు. దుర్యోధనుని దగ్గరకొచ్చి, కర్ణుని యుద్ధాన్ని ప్రశంసిస్తూ కృష్ణార్జునులు చాలా భయపడ్డారు. బ్రహ్మ కర్ణునికి ఆయుష్షు ఇవ్వలేదు అన్నాడు. తన అధీనంలో లేని చాలా ‘బలమైన బలహీనత’ శల్యునిది. గొప్ప సారథ్యం ఉంది, అది కర్ణుని పడగొట్టడానికి ఉపయోగపడింది. గొప్ప పౌరుషపరాక్రమాలున్నాయి. ఏ విద్య తనను ఉద్ధరించడానికి పనికొచ్చింది? ఏ విభూతి ఎవర్ని ఉద్ధరించడానికి జీవితంలో పనికొచ్చింది? ఎన్ని ఉన్నా అన్నీ లేనివే అయినవి. గొప్ప అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.
ఏనాడూ నీ పక్షానికొచ్చానో, నాకు సంబంధించిన సమస్తం నీవే అన్నాడు దుర్యోధనునితో. పదవిలో నియమింపబడ్డాడు. తనగురించి తాను చాలా చెప్పుకున్నాడు. భీష్ముని మించి, ద్రోణుని మించి, కర్ణుని మించి దేవతలంతా ఆశ్చర్యపోయేవిధంగా యుద్ధం చేస్తానన్నాడు. దారుణమైన పనికి ఒడిగట్టాడు. శాశ్వతమైన అపకీర్తిని మూటగట్టుకున్నాడు.
అనేకానేకబలాలు ఉన్నప్పటికీ వ్యక్తిత్వలోపమనే బలహీనతవల్ల పద్ధెనిమిది అక్షౌహిణులలో ఒక సంఖ్యగా మాత్రమే మిగిలాడు. ఈ పాత్ర నుండి లోకం తెలుసుకోవలసింది, జాగ్రత్తపడవలసిందీ ఎంతో ఉంది. కార్యసాధనలో జాగరూకత ఎంత కీలకమో బోధపడుతుంది. మహాభారతం వేలసంవత్సరాల నాటిదైనా ప్రభోధం రీత్యా నిత్యనూతనం.
“ ఏ బీజాలు చల్లినవారు ఆ ఫలాలే స్వీకరిస్తారు” అనేది అధ్యాత్మికమే కాదు, శాస్త్రీయం కూడా. “ధర్మొ రక్షతి రక్షితః”
-డాక్టర్ ఏ. ఈశ్వరమ్మ
అసోసియేట్ ప్రొఫెసర్
తెలుగు విభాగం
ఆంధ్ర విశ్వకళా పరిషత్
–
ఆధార గ్రంథాలు :
- పురిపండా భారతం
- కవిత్రయ భారతం
- ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
భారతంలో శల్యుని పాత్ర – ఔచిత్య విచారణ – (పరిశోధక వ్యాసం )-డాక్టర్ ఏ. ఈశ్వరమ్మ అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు విభాగం ఆంధ్ర విశ్వకళా పరిషత్ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>