###ఎందుకు వద్దు###( కథ)- శశి,
“ఇవాళ స్కూల్ నుండి త్వరగా వచ్చేస్తాను. హాస్పటల్ కి ఫోన్ చేసి, అపాయింట్మెంట్ తీసుకున్న. నువ్వు రెడీగా ఉండు. నాలుగు గంటల కల్లా మనం అక్కడ ఉండాలి”
“హాస్పిటలా? వద్దు ,నాకు హాస్పిటల్ కి రావాలని లేదు. ప్లీజ్ నా బాధ అర్థం చేసుకోండి”
“ఏంటి అర్థం చేసుకునేది? నేను ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నాగా ,మనకు ఒక్కళ్ళు చాలు అని .బాబు పుట్టినప్పుడే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోమంటే ,తక్కువ వెయిట్ లో పుట్టాడు, ఉమ్మనీరు తాగాడు ,అంటూ ఏవేవో కాకమ్మ కబుర్లు చెప్పి దాటేశారు .తర్వాత చేయించుకో అంటే, కుట్లింకా తగ్గలేదని, మూడో నెల వరకు పిల్లాడు చంటి పిల్లాడని, నీరసంగా ఉందని, సంవత్సరం కాలక్షేపం చేసేసావ్. ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తున్నాం కదా! ఈ అబార్షన్ గొడవ అయిపోయాక ,డాక్టర్ తో మాట్లాడి వీలైనంత త్వరగా, ఇక్కడే ఆపరేషన్ చేయించేస్తాను. మీ అమ్మగారిని ఇక్కడికి రమ్మను. నాకు స్కూల్ టైం అవుతుంది .నువ్వు రెడీగా ఉండు మూడు గంటల కల్లా వచ్చేస్తాను” అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటకు వెళ్ళిపోయాడు అజయ్.
అజయ్ వెళ్లిన వైపే కన్నీళ్ళతో, నిస్సహాయంగా నిలబడి చూస్తూ ఉండిపోయింది అంజలి.
పనమ్మాయి కేకతో కళ్ళు తుడుచుకుని , ఇవతలకి వచ్చి ,అన్యమనస్కంగానే తన పనులు చేసుకో సాగింది.
అన్నట్లుగానే మూడు గంటలకు వచ్చాడు అజయ్. అప్పటికే సిద్ధంగా ఉన్న అంజలి, టీ పెట్టి పట్టుకొచ్చింది. టీ పూర్తి చేసి, కొడుకుని ఎత్తుకొని ,బయటికి నడిచిన అజయ్ ను,తప్పక అనుసరించింది అంజలి.
బైక్ మీద వెళుతూ”నువ్వు నెల తప్పిన విషయం మీ వాళ్లకు గాని, మా వాళ్లకు గాని, చెప్పలేదుగా?”అని అడిగాడు.
‘లేదు మీరు చెప్పొద్దు అన్నారుగా”
“మంచి పని చేసావ్. చెప్పిన దగ్గర నుండి ,ఏదో ఒకటి చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తారు”.
____
హాస్పిటల్లో అరగంట ఎదురు చూశాక పిలుపు వచ్చింది. డాక్టర్ టెస్టులు చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసింది.”కంగ్రాట్యులేషన్స్ అంతా బావుంది .మందులు రాస్తున్నాను. వీక్ గా ఉన్నారు. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి”అంటే ఇంకా ఏవో చెప్పబోతుంటే
“మేడం మేము ఈ బిడ్డని వద్దనుకుంటున్నాం తీసేయండి”అంటూ డాక్టర్ మాటకు అడ్డు వచ్చి చెప్పాడు అజయ్.
డాక్టర్ ఇద్దరు వైపు ఒకసారి చూసి “ఎందుకు మరి వద్దనుకున్నప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సింది “
“సారీ డాక్టర్ మాకు ఒకరు చాలు అనుకున్నాం. కానీ, అనుకోని పరిస్థితుల్లో, ఆపరేషన్ కుదరలేదు .ఈ అబార్షన్ అయ్యాక ,మా ఆవిడకు ఆపరేషన్ కూడా మీరే చేయాలి .ఆపరేషన్ ఎప్పుడు చేస్తే బాగుంటుందో, ఆ డేట్ కూడా మీరే చెప్పండి. ఆ ప్రకారం నేను ఏర్పాట్లు చేసుకుంటాను”
డాక్టర్ ఒకసారి అంజలి ముఖంలోకి చూసింది .అంజలి మౌనంగా, తలవంచుకొని, కూర్చోవడం చూసి”ఏమ్మా అబార్షన్ చేయించుకోవడం నీకు ఇష్టమేనా”అని అడిగింది.
ఊహించని ఆ ప్రశ్నకి, తల ఎత్తిన అంజలి కంట్లోంచి కన్నీళ్లు, అప్రయత్నంగా జలజలా రాలాయి.
పరిస్థితి అర్థం చేసుకున్న డాక్టర్”చూడండి బిడ్డ కావాలి వద్దు అని నిర్ణయం తీసుకోవాల్సింది మీరే .కానీ, ప్రస్తుతం ఎంతోమంది పిల్లలు లేక ఐవీఎఫ్ వంటి పద్ధతులు అనుసరిస్తూ, ఎంత మదన పడుతున్నారో తెలుసా?
పిల్లలు భగవంతుడిచ్చిన వరం .పురుడు మరో జన్మని తెలిసినా ,ఎంతో బాధాకరమైన పురిటి నొప్పులకు కూడా సిద్ధపడి, ఎన్నో ఇబ్బందులకు ఓర్చి, స్త్రీ తన బిడ్డను భూమి మీదకు తీసుకురావాలనుకుంటుంది. పిల్లలు పుట్టాక కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది .శరీరాకృతి మారిపోతుంది. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయినా వాటి అన్నింటినీ సంతోషంగా భరిస్తుంది స్త్రీ. అటువంటి ఉత్తమ మూర్తి ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండా ఆమెను ఆట వస్తువుగా మార్చి పురుషులు ఆడుకుంటున్నారు.
ఒకడు _’నాకు కొడుకు కావాలి .కొడుకు పుట్టే వరకు పిల్లల్ని కంటూనే ఉండు’ అంటే
ఇంకొకడు_ తన శరీర అవసరాల కోసం స్త్రీని వాడుకుని వదిలేస్తున్నాడు.
మరొకడు _అబార్షన్ చేయించుకుని తీరాల్సిందే అని అధికారం ప్రదర్శిస్తున్నాడు.
ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న ప్రాణిని ,ఇంకా ప్రపంచాన్ని కూడా చూడని జీవాన్ని, మీ అంశము ,మీ రక్తాన్ని, మీ చేజేతులారా,మీరే ఎలా చంపేయాలనుకుంటున్నారు? అయినా స్త్రీ ఇష్టానికి వ్యతిరేకంగా అబార్షన్ చేయించడం చట్టరీత్యా నేరం కూడా.
పక్క గదిలో ఇవాల్టి ఐవీఎఫ్ ప్రాసెస్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్లతో మీరిద్దరూ ఒక్కసారి మాట్లాడండి. నేను ఓపి పూర్తి చేయడానికి ,ఇంకో గంట పైన పడుతుంది. తర్వాత మిమ్మల్ని పిలుస్తా. మీరు బాగా ఆలోచించుకుని నాకు నిర్ణయం చెప్పండి,” అని చెప్పి నర్సుని పిలిచి,” వీళ్ళని ఐ వి ఎఫ్ పేషెంట్లు ఉన్న రూంలోకి తీసుకెళ్ళు” అని చెప్పింది.
ఆ రూమ్ కి వెళ్లి ,నర్స్ పరిచయం చేయగా వారితో మాట్లాడి, వారి గాథల్ని తెలుసుకున్న అజయ్ కి, కళ్ళ నీళ్లు వచ్చాయి.
అప్రయత్నంగా అజయ్ కళ్ళు ముద్దులొలికే తన ఏడాది కొడుకు మీదకి, తర్వాత అంజలి పొట్ట మీదకి వెళ్లాయి.
ఆ క్షణంలో తను చాలా అదృష్టవంతుడు అనిపించి కన్నీళ్ళతో అంజలిని చూస్తూ,”అంజు నన్ను క్షమించు. నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను. ఈ బిడ్డను ఉంచుకుందాం. అబార్షన్ వద్దు. మన నలుగురం సంతోషంగా ఉందాం”అన్నాడు.
అజయ్ బాబుని ఎత్తుకొని, భార్య చెయ్యి పట్టుకుని, డాక్టర్ రూమ్ వైపు నడిచాడు.
ఆనందభాష్పాలు తుడుచుకుంటూ అనుసరించింది అంజలి.
– శశి,
అజ్జమూరు,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
###ఎందుకు వద్దు###( కథ)- శశి, — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>