“దాంపత్యమంటే…”(కథ) – డా.మజ్జి భారతి
పెళ్లై రెండునెలలయిందేమో ఇప్పుడిప్పుడే అతనికి అలవాటు పడుతుంటే… యింతలో యిలా…. వాళ్ల ఊరునుండి వస్తూ మా ఇంటిదగ్గర దించెయ్యండంటే, “ఇప్పుడెందుకు? తర్వాత వెళ్దా”మనేమీ అనకుండా దించేశాడు సరే, తనెప్పుడొస్తాననీ చెప్పలేదు…. నువ్వెప్పుడొస్తావనీ అడగలేదు.
అమ్మ, నాన్న, అన్నయ్య ముగ్గురూ ఏమైందన్నట్టు అనుమానంగా చూస్తుంటే మామూలుగా ఉండలేక పోతుంది. మొన్నటి వరకు ఇది నా ఇల్లని స్వతంత్రంగా తిరిగే తనకిప్పుడేమిటో తనీయింటికి పరాయిదానిలా అనిపిస్తుంది. ఫ్రీగా ఉండలేకపోతుంది. తనకే యిలా అనిపిస్తుందా, లేక పెళ్లైన అమ్మాయిలందరూ ఇలాగే ఆలోచిస్తారా? పోనీ అక్కడికి వెళ్లిపోదామంటే, మనసులో ఏదో అడ్డొస్తుంది. అదీ తన ఇల్లని పూర్తిగా అనిపించడంలేదు.
అన్నయ్య ఇతను క్లాస్మేట్సే కాకుండా మంచి ఫ్రెండ్సట. ఆ విషయం పెళ్లిముందే తెలిసింది తనకు. పెద్దతరహాగా అనిపిస్తాడు. అందుకే అన్నయ్యతో ఉన్నంత చనువుగా, ఉండలేక పోతుంది. సరదాగానే ఉంటాడు. కాని ఎక్కువగా మాట్లాడడు. తన ఇష్టాయిష్టాలు బాగా తెలుసన్నట్టనిపిస్తుంది అతని ప్రవర్తన. ఇప్పుడు మాత్రం తనకి కోపం వచ్చిందని తెలిసినా ఫోనుకూడా చెయ్యలేదు. తనకెందుకు కోపం రావాలనా అతని ఉద్దేశ్యం? కోపమెందుకు రాదు? పెళ్లి ముందు తానన్ని విషయాలూ చెప్పినట్టు, అతనెందుకు చెప్పలేదు? చెప్పితే తనకింత కోపం రాకపోనేమో!
ఎంత సొంత మరదలైనా…. చిన్నప్పుడు అతనికే ఇచ్చి పెళ్లి చేస్తారనుకున్నా… భార్యను తాను ఎదురుగా ఉండగానే… అతనికంత దగ్గరగా… ఇంకా అంత దగ్గరగా తానే ఉండలేదు…. అటువంటిది… అతను కూర్చున్న కుర్చీ చేతిమీద కూర్చుని, అతని భుజంమీద చెయ్యివేసి… “నాకు చదువులేదని బావ వద్దన్నాడు కాని, లేకపోతే బావప్రక్క స్థానం నాదేనంటే” అదేదో హాస్యంలా “చాల్లే నువ్వూ, నీ మాటలూ! ఇంకా చిన్నతనం పోలేదంటూ” అందరూ నవ్వేశారు.
వాళ్ల సంగతి సరే! ఈయనైనా “దూరంగా కూర్చో” అనాలి కదా! ఏమీ అనకుండా వుంటే తనకు కోపం రాదా! అతనికంత సన్నిహితంగా భుజంమీద చెయ్యివేసి కూర్చునే అర్హత తనకి తప్పించి, ఇంకెవరికైనా ఎలా ఉంటుంది? లేకపోతే… ఒకవేళ… తాను ప్రకాష్ ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాననుకున్నట్టు, ఈయన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారా? కాని పెళ్ళికిముందు తానన్ని విషయాలూ ఈయనకు చెప్పేసింది కదా! మరి ఆ మరదలి గురించి అలా అనుకోవడం లేదా? ఇప్పటికీ ఈయనకు ఆమెమీద ఫీలింగ్స్ ఉన్నాయా? ఆ ఆలోచనే మనసుకు రుచించలేదు సుమకు. అసలా అమ్మాయి అతని ప్రక్కన కూర్చున్న దృశ్యం జ్ఞప్తికి రాగానే మనసు కోపంతో కుతకుత లాడిపోతుంది. ఈయన తనను మోసం చేశాడనిపిస్తుంది.
****
శుక్రవారం రాత్రి ఆఫీసునుండి తిన్నగా అత్తవారింటికి వచ్చిన రాజా, పడకగదిలో కూడా ముభావంగానే ఉన్న సుమను చూసి ఇంకా కోపం పోలేదన్నమాట అనుకున్నాడు.
ఆరేళ్ల క్రిందట తొలిసారి సుమని చూసినప్పుడు ఇలాగే ముభావంగా… వాళ్ళన్నయ్య, రవితో… అప్పుడే ఏ విషయానికో ఘర్షణ పడినట్టున్నారిద్దరూ…. కాని ఆ క్షణం తన మనసులో మల్లెలు కురిసినట్లనిపించింది. అప్పటినుండి, అవకాశం దొరికినప్పుడల్లా సుమకోసం ఈ యింటికి వచ్చేవాడు. ఆ విషయం రవికి కూడా తెలియదు.
సుమ ఇంజినీరింగ్ అయిపోయాక, సుమంటే తనకిష్టమని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని రవితో చెప్దామనుకుంటే, “రెండేళ్లవరకూ పెళ్లి సంబంధాలు చూడొద్దందిరా మా చెల్లి. అమ్మ,నాన్న వర్రీ అవుతున్నారు” అని మాటల్లో చెప్పాడు. రెండేళ్లుపోయాక తన మనసులోని మాట చెప్దామనుకుంటే, “తన కొలీగ్ ని ఇష్టపడిందట. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పిందిరా. ఒకసారెళ్లి చూసొద్దామా అబ్బాయిని. పద” అంటే మరల తన మనసులోని మాట ఆగిపోయింది.
మరో రెండు నెలలకి “ఆ అబ్బాయిని చేసుకోనంటుందిరా!” అని ప్రశ్నార్ధకంగా చూసిన తనతో “సుమకి ఆత్మాభిమానం ఎక్కువ. టెన్త్ లో స్కూల్ ఫస్ట్ వస్తే, వాళ్ల నాన్న డీఈవో కాబట్టి స్కూల్ ఫస్ట్ వచ్చిందని జువాలజీ లెక్చరర్ అన్నారని తెలిసి, తనకిష్టమైన బైపిసి తీసుకోకుండా ఎంపీసీలో చేరింది. అటువంటిది, పెళ్లిచూపుల్లో అబ్బాయి తరఫువాళ్లు కట్నాల గురించి అడిగినప్పుడు, నీ అభిప్రాయమేమిటని సుమ అబ్బాయినడిగితే, ‘కట్నమివ్వడమనేది మన సంప్రదాయం. అందరూ యేభైలక్షలు ఇస్తామన్నప్పుడు ఎంత ప్రేమ పెళ్లైనా పాతిక లక్షలన్నా ఇవ్వకపోతే బాగుండదన్నాడట. అంతటితో వూరుకోకుండా ‘ప్రేమపేరుతో నన్ను ఫ్రీగా కొట్టేద్దామనుకున్నావా!’ అని అదేదో హాస్యంలా అన్నాడట. ఇటువంటి వ్యక్తిని నేనెలా ఇష్టపడ్డానని కొంచెం బాధపడి, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోనందిరా” అన్నాడు.
తర్వాత తన ఇష్టాన్ని రవికి తెలియజెయ్యడం, సుమ తనతో మాట్లాడాలనడం… కలిసిన తనతో అన్ని విషయాలూ చెప్పి, “ఈ పెళ్లి గురించి మా అన్నయ్య మిమ్మల్ని అడిగాడా? లేక మీరు మా అన్నయ్యని అడిగారా?” అని తానిచ్చిన సమాధానంతో ఈ పెళ్లికి ఒప్పుకుంది. అటువంటి సుమకు మా ఇంట్లో జరిగిన సంఘటనతో కోపం వచ్చినట్టుంది. పల్లెటూర్లలో హాస్యాలు కాస్త మోటుగానే ఉంటాయి. సుమ పట్నంలో పెరిగిన పిల్ల. ఆమెకి కోపం రావడంలో ఆశ్చర్యం లేదు. కాని ఏంచేస్తే సుమ కోపంపోతుంది అని ఆలోచిస్తూ మంచంమీద పడుకున్న రాజా, చేతిలో పుస్తకాన్ని తిరగేస్తున్నాడు.
*****
ఇటు తిరిగి పడుకున్న సుమకు తమ తొలిరాత్రి గుర్తుకొచ్చింది. అప్పుడుకూడా ఇలాగే తన మనసు మనసులో లేదు. పెళ్లైపోయినా ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియకుండానే తొలి రాత్రంటే తన మనసును తాను సమాధానపరుచుకోలేక పోయినప్పుడు “ఇది మన మొదటిరాత్రని నువ్వేమీ ప్రెజర్ ఫీలవ్వద్దు. నీకు పూర్తిగా ఓకే అనిపించిన రోజే మన మొదటిరాత్రి. అంతవరకు నేను నీకు మంచి స్నేహితుడను మాత్రమే” అని అప్పటినుండి తనకు మంచి స్నేహితుడులానే ఉంటున్నాడు. అందుకే హనీమూన్ కని వెళ్ళినా, తాను అతనితో ఫ్రీగా ఉండగలిగింది. ఇప్పుడెందుకలా ఉండలేక పోతుంది? తన మనసులోని భావాలు అతనితో ఫ్రీగా ఎందుకు పంచుకోలేకపోతుంది? ఏ మూలో అతనంటే తనలో ప్రేమ ఉదయిస్తుందా? అందుకే ఆరోజు తనకు కోపం వచ్చిందా? ఆలోచిస్తుంటే అవుననే సమాధానం వస్తుంది.
అటువంటప్పుడు ప్రకాష్ మాటలకు రాజాకి కోపం ఎందుకు రాలేదు? “మీకు తెలుసో తెలియదో! ముందు నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది సుమ” అని తన క్లాస్మేట్స్ గెట్ టుగెదర్ లో, రెచ్చగొట్టినట్లు ప్రకాష్ మాట్లాడినా, “మీరు నన్ను మర్చిపోయారు కాని, రవితో పాటు నేనూ మీ దగ్గరికి వచ్చాను. సుమ చెయ్యిందుకునే అదృష్టాన్ని జారవిడుచుకున్నారు మీరని” అంత కూల్ గా ఎలా చెప్పగలిగాడు? తనంటే అతనికి ఏ ఫీలింగ్స్ లేవా? అందుకే ప్రకాష్ మాటలకి అతనికి కోపం రాలేదా? తానంటే యిష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడా? కాని తనంటే అతనికిష్టమని అతని చేతల్లో తెలుస్తూనే ఉంటుంది. అటువంటప్పుడు, ప్రకాష్ ఎంత రెచ్చగొట్టినా అతనికెందుకు కోపం రాలేదు? ఆలోచిస్తుంటే, దాంపత్యం గురించి అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
అవును దాంపత్యమంటే నమ్మకం. ఆ నమ్మకం ఉండబట్టే రాజా ఎప్పుడూ అభద్రతా భావానికి గురి కాలేదు. పెళ్లికి ముందు, ప్రకాష్ ని తానిష్టపడ్డానని తెలిసినా…. ఆ యిష్టం పెళ్లివరకు వచ్చిందని తెలిసినా…. ప్రకాష్ ఎంత రెచ్చగొట్టాలని చూసినా…. తనపై అతని నమ్మకంలో యే మార్పూ రాలేదు. నమ్మకముంటే అభద్రతాభావమూ వుండదు, అసూయా ఉండదు. ఈ ఆలోచన రాగానే రాజాపై ప్రేమ పొంగుకొచ్చింది. మనసు మరి ఆగలేదు. అతని సహచర్యాన్ని కోరుకుంది. నెమ్మదిగా అతనిపై చెయ్యి వేసింది.
ఎప్పుడైనా రాజా వేళ్ళకొసలు తగిలినా తనలో కలిగిన స్పందన… తాను చెయ్యి వేయగానే రాజాలో అదే స్పందన… తన స్పర్శకు అతనిలోనూ ప్రకంపనలు… మునుపెన్నడూ ఎరగని అనుభవం… ఎవరి స్పర్శతోనూ…ఆఖరికి ప్రకాష్ తనను హగ్ చేసుకున్నప్పుడుకూడా కలగని కొత్త అనుభవం… ఇదేనా ప్రేమంటే… ప్రేమించిన వారిదగ్గర మనసే కాదు తనువుకూడా యింతలా స్పందిస్తుందా? సుమను దగ్గరకు తీసుకుంటూ “కోపం పోయిందా?” మార్ధవంగా రాజా గొంతు. అంతే రాజా ప్రేమలో కరిగిపోయింది సుమ.
– డా.మజ్జి భారతి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
Comments
“దాంపత్యమంటే…”(కథ) – డా.మజ్జి భారతి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>