అంతర్వీక్షణం-6 (ఆత్మకథ ) – విజయభాను కోటే
మొన్న ఒక కవిత పంపారు తెలిసిన వ్యక్తి. ఆ కవిత నిండా అమ్మ గురించి ఉంది. అమ్మ గురించి అంటే అమ్మ త్యాగమయ జీవితం గురించి. ఎందుకో.. మనసంతా చేదుగా అయిపోయింది. నిజానికి ఆ కవిత చదవగానే నాకు మా మమ్మీనే గుర్తుకువచ్చింది. వంట ఇల్లు, పిల్లల్ని పెంచడం, ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకూ ఒకటే పని చెయ్యడం..
ఆ జ్ఞాపకాల్ని నేను రోజూ రాజుబావతో, బడ్డీతో పంచుకుంటూనే ఉంటాను. ఒక్కోసారి మమ్మీ గురించి నేను చెప్పుకున్నట్లు బడ్డీ నా గురించి చెప్పుకోలేడు కదా అని బాధ పడుతూ ఉంటాను కూడా!
కానీ ఆ కవిత చదవగానే నాకు మమ్మీ గురించిన కొన్ని ఆలోచనలు చుట్టుముట్టాయి. నిజమే కదా.. మమ్మీ ఉదయం 4 గంటలకు నిద్ర లేచేది. తను చిన్నప్పటినుండి చాలా నింపాదిగానే తన పనులు చేసుకునేదట. ఆ నెమ్మదితనం వల్ల మా రోజు పాడవకూడదు, ఇంటి పనులు అయిపోవాలి కాబట్టి, అంత త్వరగా నిద్ర లేచేదని నాకు పెళ్ళయి, చాలా కాలం గడిచాక అర్థం అయింది.
తెల్లవారుఝాము 4 నుండి 8.30 వరకూ విశ్రాంతి లేకుండా పని చేస్తే మా ముగ్గురికీ భోజనాలు కట్టడం, టిఫిన్ చెయ్యడం అయ్యేది. ముగ్గురికీ మూడు పెద్ద గ్లాసుల బూస్ట్, టిఫిన్! తినకపోతే ఒప్పుకునేది కాదు. వెంటపడి తిడుతూనే ఉండేది.
నేను వంటింట్లోకి వెళ్ళి, గిన్నెల క్రింద, గ్లాసుల క్రింద చేసిన టిఫిన్ పెట్టేసి, బూస్ట్ సింక్ లో వంపేసి స్కూల్ కి వెళ్లిపోయేదాన్ని. ఎంత నిర్లక్ష్యం! మూడు గ్లాసుల పాల ఖరీదు, తెల్లవారి లేచి అంత కష్టపడి చేసిన టిఫిన్ కోసం మమ్మీ పడిన శ్రమ, టిఫిన్ ఖరీదు ఏదీ అర్థం కాలేదు అపుడు. ఇపుడు తలచుకుంటే కళ్ల నుండి నీరు ఆగదు.
సాయంత్రం మేము ఇంటికి వచ్చాక, యుద్ధ వాతావరణమో, గోల వాతావరణమో.. ఏదో ఒకటి ఉండేది. చెల్లి, తమ్ముడు బాగా కొట్టుకునేవారు. నేను బాగా అల్లరి చేసేదాన్ని. ముగ్గురం మూకుమ్మడిగా వెళ్ళి, “మమ్మీ, మమ్మీ, మమ్మీ..”అంటూ ఏదో ఒక కంప్లయింట్ చెప్తూనే ఉండేవాళ్లం.
ఒక్కోసారి ముగ్గురం “మమ్మీ” అంటే, “చచ్చిపోయింది మీ మమ్మీ” అనేది. మేము నవ్వే వాళ్ళం గట్టిగా! అది మా గోల భరించలేక ఓపిక నశించి అలా అనేదని నాకు పెళ్లి అయ్యి, బడ్డీ పుట్టాక అర్థం అయింది.
రాత్రి నిద్రకు ఆగలేకపోయేది మమ్మీ. పుస్తకం పట్టుకుంటే నిద్ర పట్టేది ఆమెకి. అది చూసి మా డాడీ బాగా ఏడిపించేవారు. కానీ చేతిలో పుస్తకం పట్టుకుని, చదువుతూ కళ్ళు మూతలు పడుతూ ఉండగా, చేతిలోంచి పుస్తకం జారి క్రింద పడుతూ ఉన్నప్పటి మమ్మీ బాగా గుర్తు.
మొన్న ఆ కవిత చదివాక, “మేము ఉదయం స్కూల్ కి వెళ్ళిన దగ్గర నుండి స్కూల్ నుండి తిరిగి వచ్చేవరకూ మమ్మీ ఏమి చేసేది?” అనే ఆలోచన వచ్చింది. వెంటనే బోలెడు జ్ఞాపకాలు కూడా నన్ను చుట్టుముట్టాయి.
ఒక పని చేయాలంటే మనకు ఒక గంట సమయం పడితే, మా మమ్మీకి కనీసం మూడు నుండి నాలుగు గంటలు పడుతుంది. మేము సాయంత్రం ఇంటికి వచ్చి, డోర్ బెల్ కొట్టినపుడు మా ముక్కులకు రోజూ ఏదో ఒక వంటకం వాసన తగిలేది. కడుపు ఆనందంతో గెంతులు వేసేది. లోపలికి రాగానే వంటింట్లోకో, డైనింగ్ టేబుల్ దగ్గరకో పరుగులు పెట్టేవాళ్ళం.
అవును! ఒక రోజు సున్నుండలు, జంతికలు, ఒకరోజు కారప్పూస, ఒకరోజు లడ్డూలు.. ఇలా ఏవో ఒకటి చేస్తూనే ఉండేది.
అంటే, మా మమ్మీ మేము లేని సమయంలో కూడా మా కోసం ఏదో ఒకటి వండుతూనే ఉండేది. పనికి సహాయానికి ఎవరినీ పెట్టుకోవడానికి ఇష్టపడేది కాదు. ఇక రోజంతా అన్ని పనులూ చేస్తూనే ఉండేది.
ఇవన్నీ అందరు అమ్మలు చేసే పనులే కదా!
అవును! కానీ అమ్మలు చదువుకుంటారు, వాళ్ళకంటూ కొన్ని నైపుణ్యాలు ఉంటాయి. చదువు లేని వారైనా ఏవో హాబీస్ ఉండే ఉంటాయి. కానీ అవన్నీ పెళ్ళయ్యాక ఏమైపోతాయి?
మమ్మీ టీచర్ ట్రైనింగ్ అయినప్పటి ప్రాజెక్టు వర్క్ మెటీరీయల్ మేము టీనేజ్ కి వచ్చేవరకూ ఇంట్లో కనిపించేవి. ఎన్ని కుట్లు, ఎలా నేర్చుకుందో కథలుగా చెప్పేది వాటిని చూపిస్తూ.
మనిషిని చూస్తే అలా మనిషిని చిత్రంగా మలచగల చిత్రకారిణి. తాను పెళ్లి అయ్యేవరకూ వేసిన చిత్రాలు ఎన్నో ఇంట్లో ఉండేవి. మాకు చూపించి, కథలు చెప్పేది.
మనం ఏ మాట మాట్లాడితే ఆ మాటకు పాట పాడగల నేర్పరి. అద్భుతమైన గాత్రం ఆమె సొంతం. సంగీతం నేర్చుకోలేదు. కానీ ఆ శ్రావ్యమైన గొంతును మేము ఎప్పటికీ మర్చిపోలేము.
పెళ్లి అయ్యాక శ్రద్ధగా నేర్చుకున్న వంట! ఈ రోజుకీ ఆమె వంట గురించి మా కుటుంబం మొత్తం మాట్లాడుకుంటూనే ఉంటుంది.
ఆమె చెప్పినట్లు సైన్స్ ఎవరూ చెప్పలేరు. కానీ అసలు తన ఉద్యోగాన్ని ఏ మాత్రం ఆలోచించకుండా మా ముగ్గురు పిల్లలకోసం మానేసింది. ఇటువంటి త్యాగాలన్నీ అమ్మలే చేస్తారు. దీన్ని conditioned పెంపకం యొక్క ఫలితం అనాలా? బిడ్డలు పుట్టాక అలా మారిపోతారు అనాలా?
మేము స్కూల్ కి వెళ్ళిన సమయంలో తనకంటూ కొంత సమయం అయినా కేటాయించుకునేది కాదేమో! ఆ సమయమే తనకు దొరకదు. ఎందుకంటే ఈ పనులకే ఆమెకు 24 గంటలు సరిపోవు. తనలో ఉన్న ఆ ఆలస్యం అనే drawback ను మాకు అవరోధం కానివ్వలేదు. ఆ ఆలస్యాన్ని అధిగమించడానికి తెల్లవారుఝాము 4 కి నిద్ర లేచేది.
ఇపుడు ఆమె త్యాగాన్ని గ్లోరీఫై చేయడానికి ఇదంతా రాయడం లేదు. నిజానికి తన నైపుణ్యాలను మెరుగు పెట్టుకోవడంపై, వాటిని తన జీవితంలో వినియోగించడంపై శ్రద్ధ పెట్టి ఉంటే బావుండేది. అలా శ్రద్ధ పెట్టడం వల్ల, ఇంతింతై, వటుడింతై అన్నట్లు క్రమేపీ ఆమెలో schizophrenia లక్షణాలు పెరగకుండా ఉండేవేమో. అలా ఆ లక్షణాలు పెరగకుండా ఉంటే మా కుటుంబం ఆమెను కోల్పోకుండా ఉండేదేమో!
మనిషి మెదడు అన్నింటికన్నా విలువైనది. దాన్ని ఎప్పటికప్పుడు పదును పెట్టాలి. అనవసరమైన ఆలోచనలనుండి బయటపడాలి అంటే శరీరంతో పాటు, మెదడుకు పని ఉండాలి. మమ్మీ మెదడుకు పని చెప్పలేదు. గానుగ తిప్పుతూ ఉండిపోయింది. ఎంత తెలివైన మెదడు! Schizophrenia కి బలయిపోయింది!
అమ్మ గురించి రాసిన అనేక కథలు, కవితలు చదివినపుడు నాకు కోపం వస్తూ ఉంటుంది. నేను చదివిన ఆ కవితకు, ఆ కవిగారికి ఒక చిన్న కామెంట్ మాత్రం పెట్టాను. ఆయన ఆ కామెంట్ ను ఒప్పుకుంటూ “అవును” అని తిరిగి సమాధానం ఇవ్వడం కాస్త ఊరట నాకు.
ఆ కామెంట్:
“నా బిడ్డకి ఇలాంటి కవిత రాసే అవకాశం తక్కువ.
వాడి పిల్లలకి ఇంకా తక్కువ.
ఆ అవకాశం ఎంత తగ్గితే
ఆమె (స్త్రీ/తల్లి) తన రెక్కలకు పని కల్పించే వీలు అంత పెరుగుతుంది.
మమ్మీని అలా చూసిన నేను నా జీవితంలో ఏమి చేశాను? పితృస్వామ్యంలో ఏదీ తప్పు కాదు. ఎందుకంటే అవన్నీ యుగయుగాలుగా వస్తున్న ఆచారాలు, జీవన విధానాలు. ఒకరు ఉద్యోగం చేస్తే, ఒకరు ఇంటిని చక్కదిద్దడం ఒక ఒరవడి. ఆ ఒరవడి లో నష్టపోయేది స్త్రీ అన్నది మన సమాజానికి, మన కుటుంబాలకు అర్థం కావడానికి చాలా కాలం పట్టింది. నిజానికి ఎవరూ అడగకుండానే స్త్రీ తన అడుగు వెనక్కి తీసుకుంటుంది. అడుగు వెనక్కి వేయడం, కుటుంబం కోసం, పిల్లల బాగోగులకోసం తనను తాను వదిలేసుకోవడం పెద్ద విషయంగా అనిపించదు. అసలు అదొక విషయం అని కుటుంబంలో ఎవరూ ఆలోచించరు.
నేను నా జీవితాన్ని నేనే రాసుకున్నాను. ఎవరూ రాసే అవకాశం ఇవ్వలేదు. పితృస్వామ్యం అనే పదం తెలియక మునుపే నేను నా జీవితంలోకి ఆ ఒరవడిని రానివ్వలేదు. వంట చెయ్యడం ఒక జీవన నైపుణ్యం. అది అందరికీ వచ్చి ఉండాలి. ఇక్కడ భార్య, భర్త, బిడ్డ అనే భేదం లేదు. జీవన నైపుణ్యాలు అందరికీ ఉండాలి. ఇదే నా కుటుంబంలో విత్తనంగా నాటాము. అదెలా అన్నది తరువాత చెప్పుకుందాం. ఈ నెలకు మాత్రం ఈ విషయం పంచుకోవాలి అనిపించింది.
– విజయభాను కోటే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
Comments
అంతర్వీక్షణం-6 (ఆత్మకథ ) – విజయభాను కోటే — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>