సోమర్సెట్ మామ్ కథలు – అనువాదం ‘ఎలనాగ’ (పరిశోధక వ్యాసం) – ఇళ్ల మురళీధరరావు
సోమర్సెట్ మామ్ వంటి గొప్ప కథకుని కథలను తెలుగు పాఠకులకు అందించిన ‘ఎలనాగ’ గారు అభినందనీయులు.
“మామ్ కు నోబెల్ ప్రైజ్ రాలేదని బాధపడేవాళ్ళలో నేనొకడిని. కథా రచయితల్లో మామ్ అగ్రగణ్యుడనడానికి సందేహించను” అన్నాడు బుచ్చిబాబు. మామ్ స్నేహితుడైన కారల్ ఫీఫర్ చెప్పిన ప్రకారం సోమర్సెట్ మామ్ 150 కథలు రాశాడు.
“మామ్ రాసిన కథలు కేవలం మానవ ప్రకృతిని విశదపరచే కథలవడం వల్ల, అవి చారిత్రక మార్పులతో వెనకబడిపోవు. మామ్ రచించిన సానటోరియం, రెయిన్ లాంటి ఎన్నో గొప్పకథలు ఈ అనువాదంలో లేకపోయినప్పటికీ ఈ పుస్తకంలో ఉన్న పదిహేను కథలూ మామ్ కథల్లోని ప్రత్యేకతల్ని అవగాహన చేసుకొని ఆనందించడానికి సరిపోతాయి”
– అంపశయ్య నవీన్
మామ్ చాలా కథల్ని ‘నేనూ’ అంటూ ఉత్తమపురుషలో చెప్పాడు. రండి. ‘కొన్ని’ కథల్ని చూద్దాం.
1) ‘ఇల్లు’ The Home కథలో ఇష్టపడిన ఇంట్లో ఇష్టంగా చనిపోవడం ఉంటుంది. ఎన్నో దేశాలు తిరిగి, వృద్ధాప్యంలో చర్మమంతా ముడుతలు పడి, నడవలేని స్థితిలో వచ్చిన టోనీ ఆ పరిసరాలను చూసి నూతనోత్సాహం పుంజుకొని కారుదిగిన చోటు నుంచి ఎల్మ్ చెట్ల వరుస పక్కగా ఇంటివరకు తనంత తానుగా నడిచిరావడం ఒక అద్భుతం.
పాత ఇల్లైనా, ఫర్నిచర్ పాడైనా ఆధునిక కాలపు ప్రత్యేక కోరికలేవీ లేని ఆ కుటుంబసభ్యులు “తమ స్థాయీ తాహతూ ఏమిటో బాగా తెలుసుకుని, వాటినే తమ గర్వకారణాలుగా తలుస్తారు”. ఈ కథనం బాగుంటుంది.
2) ‘కవి’ The Poet కథలో అపాయింటుమెంటు తీసుకుని ఒక అభిమానిగా వెళ్ళి, అక్కడ వాతావరణాన్ని అందుకు తగ్గట్టుగా ఊహించుకోవడం, సదరు కవికి సమయపాలన లేదని చిరాకుపడడం, చివరికి లావాదేవీలతో తలమునకలై ఉన్న వ్యాపారవేత్త అయిన ఆ యింటి యజమాని వచ్చి ‘కాలిస్టో గారు పక్క యింట్లో వుంటారు’ అనడంతో కథ ముగుస్తుంది. ఇది పాఠకులు ఊహించని మలుపు.
3) ‘సంతుష్టుడు’ The Happy Man అనే కథ మానవజీవితంలో ‘తృప్తీ’ని గూర్చి రాయబడింది. ఇందులోని కొన్ని వాక్యాలు:
- మనలోని ప్రతివాడూ ఒంటరి మిద్దె లోని ఒక ఖైదీయే. అతడు ఇతర ఖైదీలతో సంజ్ఞలను, మాటలను పంచుకుంటాడు.
- వేరే వ్యక్తి తన జీవితాన్ని ఫలానా విధంగా గడపాలని చెప్పడానికి, నేనెవర్ని?
- (స్పెయిన్ జీవనం గూర్చి ఒకనాడిచ్చిన సలహా) మీకు బాగా డబ్బు వద్దనుకుంటే, కేవలం మామూలు స్థాయిలో జీవించడం మీకు తృప్తినిస్తే వెళ్ళండి. అప్పుడు మీరక్కడ అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు.
- (సలహా పాటించి స్పెయిన్ వచ్చి సెటిలైన డాక్టర్) నేను అప్పుడూ బీదవానిగానే ఉన్నాను, ఇప్పుడూ బీదవానిగానే ఉన్నాను. కాని యిక్కడ చాలా ఆనందంగా ఉన్నానని మాత్రం సత్యప్రమాణకంగా చెప్తున్నాను. ప్రపంచంలోని ఏ రాజైనా తన జీవితాన్ని యిస్తానన్నా, ఈ జీవితాన్ని వొదులుకోలేను.
4) ‘కొలను’ The Pool కథ భిన్న చిత్తవృత్తుల గూర్చి రాయబడినది. ఇందులో డబ్బును స్వేచ్ఛను ఇష్టపడే భార్య, ప్రేమతో బంధించాలనుకునే భర్త. సంపాదన లేనివాడు, వ్యసనపరుడు సమాజానికి, కుటుంబానికి, చివరికి భార్యకు కూడా ఎంత చులకనో చెప్పబడింది. ఏ కొలను దగ్గర ఆమెను చూసి ప్రేమించాడో, అదే కొలనులో దూకి అతనాత్మహత్య చేసుకోవడం ఇందలి విషాదం. ఇందులోంచి కొన్ని వాక్యాలు:
ప్రేమ’మాయ’మైన ఆలోచనలు:
- (ప్రకృతి అందం, ఆకర్షణ) అవన్నీ అగోచరత్వంతో కూడి, హృదయాన్ని కదిలించి ఇబ్బంది పెట్టె దృశ్యాలు. ప్రవాహానికి రెండువైపులా గట్లమీద కొబ్బరి చెట్లు దట్టంగా పెరిగి ‘నిర్లక్ష్యంతో కూడిన మనోహరత్వాన్ని’ వెలయిస్తూ ఉంటాయి.
- ఎతెల్ శరీరస్పర్శతో ఆ నీళ్ళకు సుగంధం అంటిందనిపించిందతనికి.
‘ఆమె’ (ప్రేమించి పెళ్లాడిన భార్య) తరఫు మనుషులు:
- ఆక్షణంలో అతనికి నాగరికత పట్ల విముఖత కలిగింది. అనాదితత్వం గల ఆ మనుషులతో కేవలం కొంతసేపు గడిపినందుకే అతడు యెంతో స్వేచ్ఛను అనుభవించాడు.
తను ప్రేమించి పెళ్లాడిన భార్య మరొకరితో దగ్గరగా ఉండడం:
- అతనికి నిశ్చయంగా తెలిసిపోయింది. తనవెనుక ఏదో జరుగుతోందనీ, అదేమిటో తనకు తప్ప ఇతరులందరికీ తెలుసుననీ….
- “నేను నిన్ను ప్రేమించినంతగా ప్రపంచంలో మరెవ్వరినీ ప్రేమించలేదు. తర్వాత ఏర్పడబోయే బాధనూ అవమానన్నీ ఆపడం కోసమే నిన్ను కొట్టాల్సి వచ్చింది. నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. నువ్వైనా నన్ను క్షమించు”
- నేను ఊపిరి బిగబట్టాను. ఎందుకంటే ఒక వ్యక్తి నగ్నమైన తన ఆత్మను మరొకరి ముందుంచటం కన్న ఎక్కువ అద్భుతమైన విషయం నాకు వేరొకటి ఉండదు. సానుభూతిని రగిలింపజేసే వెలుగురవ్వ ఉంటుంది అటువంటి మనసులో.
5) ‘సర్వజ్ఞుడు’ Mr Know All కథ మరోతీరు. ముత్యాల నాణ్యత గూర్చి బాగా తెలిసిన కెలాడాఅనే వ్యక్తి ఒకామె ధరించిన ముత్యాలహారం నాణ్యత గూర్చి ఆమె భర్తతో పందెం కాస్తాడు. కానీ చివరిక్షణంలో కావాలని పందెం ఓడిపోతాడు. చెప్పవద్దని ఆమె సైగచేసి బతిమాలింది. ఎందుకంటే ఖరీదైన ఆ హారం ఆమె కొనిన విషయం భర్తకు తెలీదు. తెలిస్తే ఆమెకు నష్టమూ కష్టమూనూ.
6) ‘పలాయనం’ The Escape కథలో తొలి వాక్యం. ‘ఒక స్త్రీ పురుషుణ్ణి పెళ్ళి చేసుకోవాలని ఒక్కసారి గట్టిగా నిర్ణయించుకున్నదంటే, వెంటనే పలాయనం చిత్తగించడం తప్ప, వేరే యేదీ ఆ మగాణ్ణి కాపాడదని నా బలమైన నమ్మకం’. ఈ వాక్యంలోనే కథ ఉంది. రోజర్ చేరింగ్ అప్పటికే రెండుసార్లు విడాకులు తీసుకున్న రూత్ బార్లో ని ప్రేమిస్తాడు. ఆమె కోరినట్లుగా ఇల్లు కొనలేక ఏవో సాకులు చెప్తూ ఆ పనిని పొడిగిస్తాడు. ఆమె వేరే ధనవంతుడ్ని చూసుకున్నానని జాబు రాస్తుంది. ఏజంట్లు ఏడు ఇళ్ళు చూశారని, వచ్చి ఏదో ఒకటి ఎంచుకొమ్మని జవాబిస్తాడు. ఫలితం లేదని తెలిసినా.
7) ‘మూతపడ్డ వ్యాపారం’ The Closed Shop కథలో దేశాధ్యక్షుడే లొసుగుల చట్టాన్ని చేయిస్తాడు. అతడు వద్దనుకున్న వ్యాపారం మూతపడినప్పటికీ దివ్యంగా కొనసాగుతుంది. ఇందులో కొన్ని వాక్యాలు:
- న్యాయకోవిదులు అధ్యక్షుల వారి నుండి సెలవు తీసుకుని పోయి, ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని రోజులకే ఒక విడాకులచట్టాన్ని తయారుచేసుకుని తెచ్చారు. దాని రూపొందించేటప్పుడు అది అధ్యక్షునికి నచ్చేలా జాగ్రత్త పడ్డారు.
- ఒక ప్రతిపాదనకు వ్యతిరేకంగా పురుషుడు ఎంతగానైనా వాదించవచ్చును. కాని చివరకు ఆ వాదాన్ని వదిలి తోకాడిస్తాడని ప్రతి స్త్రీకీ తెలుసు.
8) ‘కలుపు మొక్క’ (The Alien Corn) పెద్ద కథ లేదా నవలిక అనవచ్చు. పిల్లలపై పెద్దల ఆశలు. వాటికనుగుణంగానే పెద్దల తీరని కోరికలను పిల్లలపై బలవంతంగా రుద్ది వారి భవిష్యత్తును దిశమార్చడం గూర్చి. పిల్లలు తమ అభిరుచికి ఎంతగా కట్టుబడి ఉంటారనే విషయాన్ని అత్యంత సహజంగా చూపించిన తీరు బాగుంది. పెద్దల కర్కశత్వం జార్జిని బలితీసుకున్న తీరు హృద్యంగా ఉంది. ఇందులోని కొన్ని వాక్యాలు:
- నేటి ఈ కర్కశ ప్రపంచంలో సూక్ష్మ విషయాలను కూడా మృదువైన సానుభూతితో చూసి నిరర్థకత లోంచి సున్నితమైన హృదయవిదారకతను పిండగలిగే వాళ్ళు…
- దగా చేయడం సాధ్యం కానంత గొప్ప అభిరుచి అతనిది.
- సమాజం ఇప్పుడు కలగాపులగం అయిపోయింది. పార్టీల్లో కోలాహలం హెచ్చింది.
- (ఆ యింటి అలకరణ) అందం ఉందిగానీ అక్కడ భావస్ఫూర్తి లేదు.
- రచయిత కావడం వల్ల ఒక లాభముంది. ఎందుకంటే ప్రజలు మన్ననతో చూస్తారు కాబట్టి తమ సమానులతో చెప్పుకోని విషయాలను చాలాసార్లు మనతో చెప్పుకుంటారు.
- ‘తాను అలవర్చుకున్న విస్తృతమైన సహృదయతతో’ నాకు స్వాగతమిచ్చాడు ఫెర్డీ.
- అమానుషమైన ఈ పరాయి ప్రపంచంలో అతి స్వల్పకాలం నివసించే ఈ మనుషులు తమకు తాము స్వయంగా దుఃఖాన్ని కలిగించుకోవడానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేయవలసి రావడం విచిత్రం.
- నాకు విసుగు కలిగించేవాటికోసం (నేను) శ్రమించడంలో ప్రయోజనం కనిపించలేదు నాకు.
- మ్యూనిక్ అంటే నాకు వల్లమాలిన ప్రేమ. ‘మనం పీల్చే గాలిలోనే కళ ఉండే పట్టణం’ ప్రపంచంలో ఇదొక్కటే.
- ఆ గది విశాలంగా, బోసిగా ఉంది. నువ్వు ‘నమ్మశక్యం కానంత కళాత్మకంగా’ కనబడుతున్నావు.
- నేను చూసి విన్నదాని పట్ల ఏకాగ్రత వహించకపోవడంనా బుద్ధితక్కువ తనమని అనుకోకుండా ఉండలేకపోయాను.
- మై గాడ్! పరువుగలవాడిగా బతకాలంటే ఎంత మనోవేదనో చెప్పలేను. డబ్బు అనేది ఏమంత పెద్ద విషయం కాదు. అది కొనగలిగే వస్తువులేవీ నేను కోరను. పోతే, నేను డాబుమనుషుల సాంగత్యాన్ని మాత్రమే ఇష్టపడేవాణ్ణి కాను.
- కళ అనేది ఎంతో ఘాటైన మధువు. దాన్ని భరించడానికి బలమైన మస్తిష్కం కావాలి. దివ్యజ్వాల అనేది దాని ఉధృతిని సాధారణమైన తెలివితేటలతో మలచగలిగే వాళ్లలోనే గొప్పగా మండుతుంది.
- జీవితం నిరాశలమయం. కానీ వాటి నుండి తేరుకోవడం నేర్చుకోవాలి.
కానీ, జార్జి తేరుకోలేకపోయాడు. అటు చదువూ రాలేదు. ఇటు వయొలిన్ రాలేదు. తండ్రితో సవాలు చేసిన విధంగా వయొలిన్ నేర్చుకోలేకపోయాడు. వారు చెప్పిన విధంగా జీవించడానికి మనసు రాక పిస్తోలుతో తనను తానే కాల్చుకుని చంపుకున్నాడు.
గొప్ప కథారచయితగా కొనియాడబడిన సోమర్సెట్ మామ్ గారు రచించిన ఈ కథలలో వివిధ పాత్రల అత్యంత సహజసిద్ధమైన ప్రవర్తన, మనస్తత్వాలు, మానసిక సంఘర్షణలు, ఊహకందని మలుపులు, కొసమెరుపులు ఏకబిగిన చదివిస్తాయి. కథలు జరిగిన ప్రాంతాలు విదేశీయమైనా మానవ నడవడి విశ్వైకమే కదా. మనదేశంలో మద్యపానం నిషేధం కానీ, ఆయా దేశాల్లో మద్యపానం అవశ్యం. ఆ విషయం అటుంచితే రాగద్వేషాలు, నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలు మనుషులందరికీ ఒకటే.
వాటిని రచయిత చెప్పిన తీరు, కథలోని మూలప్రాణం చెడకుండా ‘ఎలనాగ’ గారు యధాతథంగా అనువదించిన విధానం ఆస్వాదనీయములు.
వేర్వేరు భాషలకు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన కథలు తెలుగులో రావాలి. అసలా మాటకొస్తే అన్ని భాషల కథలూ మిగిలిన అన్ని భాషల లోనికీ తర్జుమా కావాలి. అప్పుడే పాఠకులలో, తద్వారా సమాజంలో ప్రపంచజ్ఞానం పెంపొందుతుంది. ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, అలవాట్లు ఇతర ప్రాంతాల ప్రజలకు ఎంతో కొంత అవగాహనకు వస్తాయి. అన్ని దేశాల పౌరుల మధ్య ‘కొత్త’ పోయి సోదరభావం పాదుకొంటుంది. ప్రపంచీకరణ సంపూర్ణమవుతుంది.
– ఇళ్ల మురళీధరరావు
ఆధార గ్రంథాలు:
సోమర్సెట్ మామ్ కథలు – (అనువాదం: ఎలనాగ)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
సోమర్సెట్ మామ్ కథలు – అనువాదం ‘ఎలనాగ’ (పరిశోధక వ్యాసం) – ఇళ్ల మురళీధరరావు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>