శాశ్వతంగా ఓ యాతనే….. ( కవిత) – చందలూరి నారాయణరావు
ఓ బాధ తలకెక్కి
మనసు చిట్లి , మాట పోయి
అన్ని వదిలేసి, అందరినీ తుంచేసి
చావును పిలుచుకుని
లోకం నుండి సర్దుకున్నావు.
ప్రతి అడుగు అలికిడిలో
కళ్లకు కలవరింతే…
ప్రతి పలుకు సవ్వడిలో
అర్థాల కవ్వింపులే
రోజూకో జ్ఞాపకం కనురెప్పలుపై వాలి
చప్పుడు చేసే అనుభవం
హృదయమంతా పరచుకుని
తలకొరివి పెట్టాల్సిన నీవే
కన్నకడుపులో అగ్గి రగిల్చి
జీవితాలను మసి చేసి
ఇంటిని చీకటిలో ముంచి
కన్నీటి దీపాన్ని వెలిగించి
శవమై సెలవు తీసుకున్నావు.
నాన్న ఆశ, అమ్మ ప్రేమ, అక్క ఇష్టం
పొంగి పొర్లిన సంతోషాన్ని అంతా
క్షణంలో ఇంకేలా చేసి
ఇల్లును ఎడారిగా మార్చావు.
ఇంటా బయటా
నీతో వంశానికే వెలుగురావాలని
శ్రమించిన మనసు చల్లపడిపోయింది.
ఏ దేవుడిని వరమడిగి
ఈ శాపాన్ని ఇప్పించావు?
ఏ పాపం చేశామని
ఈ కర్మను వ్రాయించావు?
మనసంతా శూన్యం చేసుకుని
బతుకు హత్యలో
నిన్ను నీవు పోగొట్టుకోవడం కాదు…
నిన్ను పోగొట్టుకుని
మిగిలిన కన్నవారికి
నీ మరణం శాశ్వతంగా ఓ యాతనే.
( ఉన్నత విద్యను అభ్యసించిన ఓ యువకుని ఆత్మహత్యకు చలించి….).
Comments
శాశ్వతంగా ఓ యాతనే….. ( కవిత) – చందలూరి నారాయణరావు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>