స్నేహశీలి రజిత!(స్మృతి వ్యాసం ) – శాంతిశ్రీ బెనర్జీ
ఆగస్టు 11న రజిత మరణించిందన్న హఠాత్తుగా వచ్చిన వార్త నన్ను విషాదంలో ముంచడమే కాదు ఒక ఆప్తురాలిని కోల్పోయిన బాధ కృంగదీసింది. మామధ్య చాలా తరచుగా కాకపోయినా, అప్పుడప్పుడు ఫోన్లో సంభాషణలు జరుగుతుండేవి. ఎప్పుడు మాట్లాడినా రజిత ఎంతో స్నేహంగా, ఆప్యాయంగా వ్యవహరించేది. ఆమెతో పరిచయం, జరిపిన సాహిత్య చర్చలు, ఆత్మీయ సంభాషణలు ఇలా స్మృతులుగా మిగిలిపోతాయన్నది నేను ఊహించని పరిణామం!
ఢల్లీిలో ఉద్యోగ విరమణ తర్వాత నేనూ, మావారు ప్రణాబ్ బెనర్జీ హైదరాబాద్‌లో స్థిరపడాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడ వాతావరణం, పొల్యూషన్ ఎక్కువగా లేకపోవడం, మా అక్క చెల్లెళ్లు ఇక్కడ ఉండంటం అందుకు కారణాలు. 2018 నవంబర్‌లో హైదరాబాద్ వచ్చేసాం. కొత్త ప్రదేశం అవడం వలన మొదట్లో నాకు పరిచయస్థులు, స్నేహితులు తక్కువగా ఉండేవారు. సరిగ్గా అటువంటి సమయంలోనే రజితతో పరిచయం కలిగింది.
2020, మార్చిలో స్త్రీవాద మాస పత్రిక ‘భూమిక’లో నా కథ ‘అసహజమనిపించే సహజం’ ప్రచురించబడిరది. అది లెస్బియన్ యువతి కమిలిని కథ. మార్చిలో ఒక ఉదయం రజిత దగ్గర నుంచి హఠాత్తుగా ఫోను వచ్చింది. ముందుగా, తనని తాను పరిచయం చేసుకుంది. రజిత గురించి అదివరకే తెలుసు కాబట్టి వెంటనే గుర్తుపట్టాను. నా కథను ప్రస్తావిస్తూ కథ బాగుందని, మంచి అవగాహనతో రాసానని మెచ్చుకుంది. నాకెంతో సంతోషమనిపించింది. తెలంగాణా కవయిత్రిగా ప్రసిద్ధురాలైన రజిత సామాన్యురాలనైన నాకు ఫోన్ చేసి మరీ అభినందనలు తెలపడం ఆమె స్వచ్ఛమైన, అందమైన మనస్థత్వానికి నిదర్శనం!
ఇక అప్పటినుంచి అప్పడప్పడు మాట్లాడుకునే వాళ్ళం. వాట్సాప్‌లో మెసేజ్‌లు పంచుకునేవాళ్ళం. నా రచన ఏది ప్రచురించబడినా ఆమెకు పంపుతుండేదాన్ని. ఆమె ఎటువంటి మొహమాటం లేకుండా నచ్చితే నచ్చిందనీ, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో వివరించేది. మనస్సులో ఒకటి ఉంచుకుని బయట ఇంకొకటి మాట్లాడే మనస్థత్వం ఆమెకు లేదు. సద్విమర్శలు చేస్తూ ఇంకా రాయమని ప్రోత్సహిస్తూ నుంచి సలహాలు ఇస్తుండేది. అందుకే ఆమె స్వభావం నాకెంతో నచ్చింది. ఆమె తన కవితలు, వ్యాసాలు కూడా నాకు పంపుతుండేది. అలా ఇద్దరి మధ్య స్నేహం క్రమేణ పెరుగుతూ వచ్చింది.
అప్పటి నుంచి తను సంపాదకత్వం వహించే సంకలనాలకు నన్ను రాయమని కోరేది. ‘కరోనా కాలం కథలు’ (డిసెంబర్ 2020) సంకలనం కోసం కథ రాయమని అడిగితే ‘ఆత్మస్థైర్యం’ అనే కథ రాసి పంపాను. వెంటనే ఇష్టపడి బాగుందని తీసుకుంది. తర్వాత ప్రరవే వాళ్ళు ‘ఆమె పదం’ (ఫిబ్రవరి 2023) కవితా సంకలనం తీసుకురావాలని అనుకున్నారు. దానికి రాయమని అడిగింది. ‘సింగిల్ ఉమెన్’ అన్న కవిత రాసి పంపాను. కొన్ని మార్పులు చెయ్యమని సూచించింది. మార్పులతో మళ్ళీ రాసి పంపగా బాగుందని తీసుకుంది. ‘‘భారతదేశంలో వితంతు వ్యవస్థ’’ (డిసెంబర్ 2023) అన్న సంకలనం కోసం వితంతువుల సంక్షేమం కోసం పాటుబడిన కొందరు మహిళా కార్యకర్తలను పేర్కొని, వారిలో నాకిష్టమైన మహిళను సెలెక్ట్ చేసుకుని రాయమంది. నేను మోహినిగిరి గురించి రాస్తానని చెప్పి ‘వితంతువుల సంక్షేమంలో మోహినిగిరి’ అన్న వ్యాసం పంపాను. అది ఆమెకు నచ్చింది. మళ్ళీ అదే సంకలనం కోసం మాళవిక హెగ్డే గురించి కూడా రాయమని ప్రోత్సహించింది. ‘అసాధ్యాన్ని సాధ్యం చేసిన అతివ’ అన్న వ్యాసం రాసి పంపాను. అది కూడా నచ్చి తీసుకుంది. ఈ విధంగా ఆమె నా సాహిత్య ప్రస్థానంలో సహాయ సహకారాలు అందించిన నెచ్చెలి.
నా కథల సంపుటి ‘మానుషి (జూలై 2022) కోసం ఎవరయినా ముందుమాట రాస్తే బాగుంటుందని ఆమెను సంప్రదించాను. కాత్యాయినీ విద్మహే గారిని అడిగి చూస్తానని మాట ఇచ్చింది. మాట ఇచ్చినట్లుగానే కాత్యాయిని గారిని అడిగి, ఆమె అంగీకరించినట్లు తెలిపింది. కాత్యాయిని గారు అప్పుడు అమెరికాలో కూతురు దగ్గరున్నా సద్భావంతో చక్కటి ముందుమాట రాసారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రజిత తనకు ఏమాత్రం వీలున్నా సహాయం చెయ్యడానికి వెనకాడని మంచి మనీషి అని తెలుపడానికి.
వితంతు వ్యవస్థ సంకలనం కోసం వ్యాసాలు రాస్తున్నప్పుడు, రిఫరెన్స్ కోసం ఏవైనా పుస్తకాలు కావాలంటే తెప్పించుకోమని, రాయడం అయిన తర్వాత ఆ పుస్తకాలు తనకందజేస్తే, వాటి ధర చెల్లిస్తానని చెప్పింది. నేను రెండు మూడు పుస్తకాలు తెప్పించుకుని చదివాను. ముప్ఫయి సంవత్సరాల ‘భూమిక’ పత్రిక సుదీర్ఘ ప్రయాణం సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లిలో సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వచ్చే ముందు రజిత నాకు ఫోన్ చేసి రిఫరెన్స్ పుస్తకాలు తీసుకు రమ్మని కోరింది. తీసుకెళ్లి ఇచ్చాను. ఆమె వెంటనే డబ్బు ఇచ్చింది. ఆమె సిన్సియారిటీకి నేను అబ్బురపడ్డాను. ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనిషని నాకనిపించింది. ‘ఆమె పదం’ సంకలనం కాపీలు కూడా నాకా సమయంలో మర్చిపోకుండా అందజేసింది.
మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలలో మరొక ముఖ్యమైన విషయం మా పెట్ డాగ్‌ల గురించి మాట్లాడుకోవడం. వయను పై పడ్డ వాటిని ఎలా చూసుకోవాలి, ఎలాంటి ఆహారం ఇవ్వాలి అన్న విషయాలు చర్చించుకుంటూ, ఒకరికొకరం సలహాలు ఇచ్చుకునే వాళ్ళం. మా ఇద్దరి పెట్ డాగ్‌లు చాలా సంవత్సరాలు జీవించి, చివరికి వృద్ధాప్యం వలన చనిపోయాయి. ఆమె పెట్ డాగ్ పోయినప్పుడు నేనామెను ఓదార్చగా, మా పెట్ డాగ్ పోయినప్పుడు తన మాటలతో సాత్వంన కలిగించింది.
రజిత లాంటి కవయిత్రి, సాహిత్యకారిణి, సామాజిక కార్యకర్త పోవడం తెలుగు సమాజానికి, సాహిత్య లోకానికి తీరని లోటు! ఆమె నుంచి ఇంకా ఎన్నో కవితా సంపుటులు, సంకలనాలు, వ్యాసాలు వస్తాయన్న ఆశ నిరాశే అయింది. గత రెండు మూడేళ్ళ నుండి ఆమె అస్వస్థతతో బాధపడ్తున్నట్లు చెప్పేది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని నేను పదేపదే చెప్పేదాన్ని. అంతటి అనారోగ్యంలో కూడా ఆమె దీక్షగా, అంకిత భావంతో సంకలనాలు తీసుకురావడానికి నిర్విరామంగా కృషి చేసింది. ఆమె నుండి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం అది. ఆమె మరణం నాకు తీరని లోటు. ఒక మంచి స్నేహితురాలిని, శ్రేయోభిలాషిని పొగొట్టుకున్న బాధ మిగిలింది. ఆమె నా సృతులలో సదా నిలచిపోయే ఆత్మయురాలు! చిరస్మరణీయురాలు!
`-శాంతిశ్రీ బెనర్జీ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
స్నేహశీలి రజిత!(స్మృతి వ్యాసం ) – శాంతిశ్రీ బెనర్జీ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>