‘‘ఖమ్మం జిల్లా కోలాటం పాటలు ` విశేషాలు’’ ( పరిశోధనాత్మక వ్యాసం ) – చల్లా మాలతీ దేవి
సంపుటి – 15, సంచిక – 177 , సెప్టంబర్ 2025
సమర్పణ : 10.08.2025 ఎంపిక : 25.08.2025 ప్రచురణ : 01.09.2025

పరిచయం:-
‘‘జనానామ్ పదమ్ జానపదమ్’’ జానపదం అనే పదం జనపదం అనే సంస్కృత శబ్దం నుండి వచ్చినది. జనపదం అంటే పల్లె, గ్రామము, దేశము, జనులుండే తావు’’ అనే అర్ధాలు ఉన్నాయి. జనపదాలలో నివసించేవారే జానపదులు. వారికి సంబంధించిన విజ్ఞానమే జానపద విజ్ఞానం.
ఆంగ్లంలోని Folklore అనే మాటకు సమానార్ధకంగా తెలుగులో ‘జానపదవిజ్ఞానం’ అనే మాటను వాడుతున్నాం. Folk, Lore అనే రెండు శబ్దాల కలయిక వలన Folklore అనే ఆంగ్లపదం ఏర్పడిరది. ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా ఆంగ్లంలో విలయంథామస్ (Willium Thomus) అనునతడు క్రీ.శ. 1846వ సంవత్సరంలో ‘‘ది అథేనియం’’ (The Athenaeum) అనే పత్రికలో సూచించాడు. Folk అంటే నిరక్షరాస్యులైన రైతులు Lore అంటే విజ్ఞానం అనే అర్ధాలున్నాయి. ఖీశీశ్రీసశ్రీశీతీవ అంటే అక్షరజ్ఞానం లేని పల్లెప్రజల సాంప్రదాయ విజ్ఞానం.
‘‘జానపద విజ్ఞానం జానపదులకు సంబంధించిన విజ్ఞానం అంతా వచ్చి దీనిలో చేరుతుంది. దీనిలో జానపదుల భాష, జానపదుల వాఙ్మయం, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, మంత్రతంత్రాలు, శాస్త్రవిజ్ఞానము, జానపదుల భావములు, వినోదములు, వేడుకలు, ఆటపాటలు, సామెతలు, పొడుపుకథలు, జానపదకళలు, జానపద సంస్కృతి మొదలైన అనేక అంశాలు ఉంటాయి’’ (సుందరం, ఆర్.వి.ఎస్, ఆంధ్రుల జానపద విజ్ఞానం, పుట : 04)
జానపద విజ్ఞానాన్ని అనేకమంది అనేకరకాలుగా విభజించారు. ప్రాచ్యపాశ్చాత్యుల వర్గీకరణలను పరిశీలించిన తరువాత దీనిని స్థూలంగా ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చును. (1) వాగ్రూపం లేదా మౌఖిక జానపద వాఙ్మయం (2) వస్తు సంస్కృతి (3) జానపదుల సాంఫీుకాచారములు (4) జానపదుల భాష (5) జానపదుల కళలు. (మోహన్.జి.ఎస్, జానపద విజ్ఞాన వ్యాసావళి, పుట: 29) పాశ్చాత్య జానపద విద్వాంసులు రిచర్డ్ యం.డార్సన్ కోలాటంను జానపద ప్రదర్శన కళలు అనే విభాగంలో చేర్చారు. అలాగే డా॥జి.యస్. మోహన్‌గారు కూడా కోలాటంను జానపద కళల విభాగంలోకి చేర్చారు.
జానపద కళలను వర్గీకరిస్తూ డా॥ బట్టు వెంకటేశ్వర్లు గారు (1) శబ్ద సహిత కళలు (2) శబ్ధరహిత కళలు (3) మిశ్రమ కళలు అని వర్గీకరించారు. కోలాటంలో నృత్యసాదృశ్య ఆటలున్నాయి. వాగ్రూపమైన పాటలున్నాయి. ఆటపాటలకు లయాన్వితమైన కోలల, మద్దెల శబ్దాలున్నాయి. కాబట్టి ఆట, పాట, లయ ఇలా అన్నీ మేళవించిన కోలాటం ఒక మిశ్రమ కళ (మిక్సిడ్ ఆర్ట్) అని అనవచ్చు’’ (వెంకటేశ్వర్లు, బిట్టు, పల్నాటి సీమలో కోలాటం, పుట: 77-78)
కోలాటం అనే పదం కోలంఆట అనే పదాల కలయిక తమిళంలో కోలాటం (కోలGఆట్టం), అనేది వ్యుత్పత్తి (చక్రధర రావు, లంకపాటి, తెలుగు వ్యుత్పత్తి పదకోశం, పుట: 146) కోలాటానికి దండరానకం, దండనర్తనం, దండలాసకం, కోలంట్లు పర్యాయపదాలు. కోలాటాన్ని కన్నడంలో కోలాటం అనీ మళయాళంలో కోల్కేళి అనీ వ్యవహరిస్తారు.
కోల అనే పదానికి పుల్ల, దండము, కట్టి, కట్టియ, పుడక అనేవి పర్యాయపదాలు ఆట అనే శబ్దానికి క్రీడ, విహారం, లాస్యం, తాండవం, నటన, నృత్తం, నృత్యం, నాట్యం, నర్తనం అనేవి పర్యాయపదాలు.
‘‘కోలాటం స్త్రీలు మరియు పురుషులు చేతి కోలలతో తాళము వేయుచు పాడుచు చుట్టును, తిరిగి ఆడెడు ఒక విధమగు ఆట’’ (రామయ్య పంతులు జయంతి, సూర్యరాయాంధ్ర నిఘంటువు -1 పుట: 562)
రెండు చేతులతోనూ కర్రముక్కలు పట్టుకొని పదములు పాడుచూ గుండ్రముగా తిరుగుచు లయానుగుణముగ అడుగులు వేయుచు ఒకరి చేతికర్రముక్కలను వేరొకరి చేతి కర్రముక్కలతో తాకించుచు ఆడెడి ఒక ఆట అని శబ్ద రత్నాకరంలో నిర్వచింపబడినది. (రంగాచార్యులు, చలమ చర్ల, ఆంధ్రుల శబ్ధ రత్నాకరం, పుట ` 772) స్థూలంగా కోలాటం అనే జానపద కళారూపంలో ఆటపాట అనే రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఆట అనేది జానపదకళలకు సంబంధించినది కాగా, పాట అనేది జానపద కవిత్వానికి సంబంధించినదైయున్నది. అయితే ప్రస్తుత నా పరిశోధనపత్రంలో ఆటపాటల మిశ్రమమైన కోలాటంలోని ఆటకు అంటే కళకు అంతగా ప్రాధాన్యమివ్వక, కేవలం పాటకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ సాహిత్యపరంగా విశ్లేషణ చేయదలచాను.
ఉద్దేశ్యం:
జానపద గేయాలైన కోలాటం పాటలు మౌఖిక రూపంలోనే ఉంటాయి. అవి ఒక తరం నుండి మరొక తరానికి మౌఖిక ప్రసారం జరుగుతుంటాయి. అందువలన అవి కాలాన్నిబట్టి, ప్రాంతాన్ని బట్టి రూపాంతరం చెందుతూ ఉంటాయి. ఒక వేళ మౌఖిక ప్రసారమే కనుక ఆగిపోతే….? జానపద గేయాల ఉనికే ప్రశ్నార్ధకం అవుతుంది, ఆధునికయుగంలోని నేటి తరంలో జానపద గేయాలను ఆదరించి మౌఖిక ప్రసారంలో బ్రతికించే అవకాశాలు తగ్గిపోతున్నాయి. అందుకే జానపద గేయాలు ఉనికి ప్రశ్నార్ధకం కాకుండా రానున్న తరాలకు వాటి విజ్ఞానాన్ని వాటి విశేషాల్ని అందించాలంటే వాటిని సేకరించి భద్రపరచి తద్వారా జానపద సాహిత్యాన్ని సుసంపన్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జానపదుల సమస్తమైన జీవితానుభూతుల్ని, ఆచారవ్యవహారాలను, ఆహారవిహారాలను నిండుగ, దండిగ ఎఱుక పరచేవి జానపదగేయాలు. అవి జాతికి ఆత్మరూపాలు. నిస్వార్ధమైన, నిష్కల్మషమైన జానపదుల హృదయాలకు అద్దంపట్టేవి జానపదగేయాలు. అవి వివిధ కాలాల్లోని వివిధ వర్గాల, వివిధ జాతుల మనస్తత్వాలను, జీవిత ధృక్పథాలను ప్రతిబింబించి సామాజిక, చారిత్రక అవగాహనకు తోడ్పడతాయి. ఖమ్మం జిల్లాలోని జానపదుల ఆచారవ్యవహారాలను, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, మత, కళాసంబంధ చారిత్రక అంశాలను ప్రతిబింబించే కోలాటం పాటలలోని ఆయా విశేషాల్ని వెలికితీస్తూ, వాటిలోని భాషా, విశేషాలను, చందో అలంకార విధానాలను విశ్లేషించి, బాహ్యప్రపంచానికి విశదపర్చడమే నా పత్రోద్దేశ్యం.
1. సాహిత్యంలో కోలాటస్థానం :-
కోలాటం అనేది తెలుగునాట అనాదిగా ప్రాచీన కాలం నుండి తెలుగు ప్రజలచే ఆదరింపబడుతున్న ప్రక్రియ కాబట్టి తెలుగుచరిత్రలోనూ, సాహిత్యంలోనూ దానికి ప్రాధాన్యత ఇవ్వబడిరది. ఇటు ప్రాచీన, ఆధునిక చరిత్రలోనూ, ప్రాచీన ఆధునిక సాహిత్యాలలోనూ, పాల్కురికి బసవపురాణం, శ్రీనాథుని క్రీడాభిరామం, గంగుల సాయిరెడ్డి కాపుబిడ్డ కావ్యాలలో కోలాటం గురించి ప్రస్తావించారు.
2.జానపద విజ్ఞానంలో కోలాట స్థానం :-
కోలాటం అనే ప్రక్రియ జానపద విజ్ఞానంలో విచిత్రమైన, ప్రత్యేకమైన స్థానాన్ని కల్గియున్నది. జానపద విజ్ఞానాన్ని స్థూలంగా (1) మౌఖిక జానపద వాఙ్మయం (2) జానపద సాంఫీుక ఆచారాలు (3) వస్తు సంస్కృతి (4) జానపదముల భాష (5) జానపదుల కళలు అని వర్గీకరించారు. ఆటపాటల మిశ్రమమైన కోలాటంను జానపద కళల్లో చేర్చినప్పటికీ కోలాటం పాటలు మాత్రము జానపద సాహిత్యం విభాగంలో చేరుతాయి.
3. కోలాటం పాటలు ఇతివృత్త వర్గీకరణ :
ఖమ్మం జిల్లా కోలాటం పాటలలోని ప్రతిబింబించే జానపద ప్రజాజీవన విధానాన్ని, సాంస్కృతిక భౌగోళిక, భాషా, సాహిత్య విశేషాల్ని అధ్యయనం చెయ్యడానికిగాను ఇక్కడ లభించిన, కోలాటం పాటలను వస్తుదృష్ట్యా, రసందృష్ట్యా విభజించి, విశ్లేషించి ఖమ్మం జిల్లాలోని కోలాటం పాటలను క్రింది విధంగా వర్గీకరించవచ్చునని నేను భావిస్తున్నాను.
(i) ప్రార్ధనా గేయాలు
(ii) మంగళహారతులు
(iii) భక్తి గేయాలు
(ఎ) శైవ సంబంధాలు
(బి) వైష్ణవ సంబంధాలు
(సి) గ్రామదేవత సంబంధాలు
(iv) దేశభక్తి గేయాలు
(v) వలపు పాటలు (శృంగార రస ప్రధానాలు)
(vi) కన్నీటి పాటలు (కరుణ రసగేయాలు)
(vii) శ్రామిక గేయాలు:
(i) ప్రార్ధన గేయాలు :-
నాటక సమాజాలు, భజన సమాజాల వారు మొట్టమొదట ప్రార్ధనాగేయం పాడి వారి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే కోలాటంలో కూడా ఆట అనేది ప్రార్ధనా గేయంతో ఆరంభిస్తారు.
‘‘పొద్దు పొద్దునా లేవరే పొన్నపూలు కోయరే
పొన్నపూలు కోసి రామునీ పూజింపరే’’ (బొల్లినేని వెంకటేశ్వర్లు, వయస్సు 55 సం॥ సిరిపురం గ్రామం, వైరా (మం)).
అనే ప్రార్ధనా గేయాలను భద్రాచలం ప్రాంతంలో ఎక్కువగా పాడుతారు.
(ii) మంగళహారతి పాటలు :-
జానపదాలు పాడుకునే పాటల్లో మంగళ హారతి పాటలు ప్రత్యేకంగా ఉన్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలైన పెండ్లి వేడుకల సందర్భాలలో పాడుకునేవి. కాని కోలాటంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఆటముగిసిన తరువాత చివరలో మంగళహారతి పాటలు పాడుకోవడం ఆనవాయితీగా కన్పిస్తుంది.
‘‘బద్రాసెల స్రీ రాములాకు మంగలం
మముగన్న సీతమ్మకు మంగలం…
అనే పాట మరియు
‘‘కరుపూర ఆరతి గొనుమా
శ్రీ బద్రాసెల వాసా
సేవింతుము నిను రామసెంద్రా… (ఎం. కృష్ణయ్య, వయస్సు 48 సం॥లు, రాజుగూడెం గ్రామం,)
అనేపాటలో శ్రీరామునికి హారతినిస్తారు.
(iii) భక్తిపాటలు :
భక్తిపాటలలో శైవ, వైష్ణవ సంబంధాలు అనే రెండు రకాలు ఉంటాయి. కోలాటం పాటలు భజన సంప్రదాయానికి సంబంధించినవి. కావున ఎక్కువగా భక్తిగేయాలే ఉంటాయి. ఆయా ప్రాంతాలలోని ప్రసిద్ధ తిరునాళ్ళు, జాతర్లలో ఉత్సవ సమయాల్లో కోలాటంను వేసే సందర్భాలలో భక్తిగేయాలనే ఎక్కువగా ఆలపిస్తారు. భద్రాచలం ప్రాంతంలో శ్రీరామనవమి, ముక్కోటి పండుగల సందర్భాలలో ఎక్కువగా వైష్ణవ సంబంధ గేయాలనే పాడుతాం.
‘‘శ్రీరాముడు అన్నయ్య సీతమ్మ మా ఒదిన
సెల్లెతోడ ముగ్గురము శ్రీరాముని తమ్ములము
ఆంజనేయుడు వీడు నమ్మిన బంటుగా ఉంటాడు (వేమిరెడ్డి విజయలక్ష్మి, వయస్సు 43 సం॥లు కుర్నవల్లి గ్రామం, తల్లాడ (మం)).
అన్నమాట జవదాటనివారం మేము…. అంటూ తమ కుటుంబ సభ్యులతో కలిపి లెక్కవేసుకుంటూ పాడే విధానం జానపదుల నిష్కల్మషభక్తికి నిదర్శనాలుగా కన్పిస్తుంటాయి.
(ivi) దేశభక్తి గేయాలు :-
కోలాటం పాటలో దేశభక్తి గేయాలకు కూడా స్థానం ఉన్నది.
‘‘భారత దేవిరో దేశమంతా అదిగో బారతి
అదిగో అల్లదిగో ఆనందంతో ఆడుతుంటే ( ఎస్.కె.సైదులు, వయస్సు 49 సం॥లు, దాచాపురం గ్రామం, వైరా (మం)).
అనే పాటలో భారత మాత స్తుతి ఉంది.
(v) వలపు పాటలు (శృంగార రస ప్రాధాన్యంగలవి) :-
కోలాటం పాటలు చాలా మట్టుకు వలపు పాటలే. ఇవి శృంగార రసప్రధానాలు. కోలాటం పాటల్లో భక్తిగేయాలతో పాటు ఇవి ఎక్కువ ప్రాధాన్యాన్ని కల్గి ఉంటాయి. అందుకు కారణం శృంగార గేయాల్లో ఉండే శృంగార పదాలు, శృంగార భావాలు జానపదులకు ఉత్సాహాన్ని ఆనందాన్ని కల్గిస్తాయి. కోలాటం కళాకారులకు కూడా మంచి ఊపును తెస్తాయి.
సంవాదరూపంలో సాగే ఈ క్రింది వలపు పాటలో ఒక సెంచిత పగలంతా పనిచేసి చీకటి పడిన తర్వాత తన పల్లెకు వెళ్ళే క్రమంలో ఒక అడవిని దాటాల్సి ఉండగా చీకట్లో దారికోసం వెతుకుతున్నప్పుడు ఒక సరసుడు కన్పిస్తాడు. వారిద్దరి మధ్య జరిగిన సరస సంభాషణను పాట రూపంలో చూడవచ్చు.
‘‘పొద్దుసేలో పోయే పోవాలి పల్లెలకు
దారిసూపు మిత్రమా సామి గోడుగోడున సీకటి
అని సెంచిత అడిగితే దానికి సరసుడు
సన్నబియ్యమిస్త ఈ పార్వతడవిలో
వుండరాదా సెంచితా నీవు
నిలువలేవా సెంచితా
దానికి సెంచిత సమాధానం ఇలా చెప్తుంది
బొంగు బియ్యం తినే మా సెంచువారలము
సన్నబియ్యమబ్బునా సామి
గోడుగోడున సీకటి… (బొల్లినేని వెంకటేశ్వర్లు, వయస్సు 55 సం॥లు, సిరిపురం గ్రామం, వైరా (మం)). అని సమాధానమిస్తూ లౌక్యంగా ఆ సరసుడి బారినుండి తప్పించుకునే విధానాన్ని ఈ గేయంలో చూడవచ్చు.
(vi) కన్నీటి పాటలు (కరుణరసగేయాలు) :-
కన్నీటి పాటలను కరుణరసగేయాలు అని కూడా అంటారు. కరుణరసగేయాలు ప్రపంచమంతా ఉంటాయి. కాని జానపదుల హృదయ ఆవేదనను ఆవిష్కరించడంలో వారిది హృద్యమైన విధానం. దానిని పాట రూపంలో ఆవిష్కరించడంలో వారిది అందెవేసిన చెయ్యి.
జీవులు చనిపోతే వాటి ప్రాణం, ఆత్మ, పంచభూతాల్లో కలిసిపోతాయి అనేది జానపదుల నమ్మకం వ్యవసాయం చేసే రైతు వ్యవసాయ పనుల్లో ప్రమాదవశాత్తు చనిపోయిన రైతు ఆత్మకు, వ్యవసాయ భూమికి మధ్య అవినాభావ సంబంధాన్ని ఆపాదిస్తూ సాగే ఈ క్రింది కరుణరస గేయాన్ని మనం గమనించవచ్చు.
దున్నేటి దుక్కుల్లో వలలో
దుక్కైయున్నావా వలలో
సల్లేటి యిత్తుల్లో వలలో
యిత్తైయున్నావా వలలో
మొలిసేటి మొక్కల్లో వలలో
మొక్కైయున్నావా వలలో… (కె. వెంకటేశ్వర్లు, వయస్సు 51 సం॥లు, కుర్నవల్లి గ్రామం, తల్లాడ (మం)).
అంటూ సాగే ఈ పాటలను తల్లాడమండలం, కుర్నవల్లి గ్రామంలో 1990వ దశకంలో పొలం దున్నుతూ ట్రాక్టరు ప్రమాదంలో చనిపోయిన మహ్మద్ హుస్సేన్ అనే రైతును స్మరించుకుంటూ పాడే పాట ఆ ఊరులోని అందరి హృదయాలలో తిష్టవేసింది.
(vii) శ్రామిక గేయాలు :-
శ్రామిక గేయాలను సందర్భాన్నిబట్టి శ్రమచేస్తూ పాడేపాటలుగా విభజించడం కద్దు. కాని కోలాటం పాటల్లో కూడా శ్రామిక గేయాలు ఉన్నాయి. పగలంతా పనిచేసిన పల్లీయులు రాత్రి వేళల్లో శ్రమోపశమనం కోసం వేసే కోలాటంలో తాము అనునిత్యం పడే శ్రమను పాటల్లో ఆవిష్కరింపచేసే భావుకత జానపదుల సొంతం కాబట్టి వస్తువు దృష్ట్యా ఈ విభజన సాధ్యమైనది.
కుప్పనూర్చేనాడమ్మా సందామామా రైతు
అప్పుతీర్చీనాడమ్మా సందామామా రైతు
చేను దున్నీనాడమ్మా సందామామా రైతు
నారుపోసీనాడమ్మ సందామామా రైతు… అనే పాట ( గూడూరు వెంకటేశ్వర రెడ్డి, వయస్సు 58 సం॥లు, కుర్నవల్లి గ్రామం, తల్లాడ (మం)).
(6) కోలాటం పాటలు- సామాజిక పరిస్థితులు :-
కోలాటం పాటలు అనేవి జానపదుల హృదయానుభూతుల నుండి అనుభవాలనుండి వచ్చినవి ప్రకృతితో భగవంతునితో, తోటి జానపద సమాజంతో, నగర సమాజంతో వారికి ఉన్న అనుబంధాలను అనుబంధాలను పాటల రూపంలో వ్యక్తీకరించగలరు. వారి పాటల్లో సామాజిక, చారిత్రక అంశాలు ప్రతిబింబిస్తాయి.
(7) కోలాటం పాటలు – భాషా విశేషాలు :-
జానపద గేయాలైన కోలాటం పాటలు మౌఖిక రూపంలో ఉంటాయి. జానపదుల ఉచ్ఛారణ, పదప్రయోగములు శిష్టోచ్చారణ, పదప్రయోగాలకంటే భిన్నంగా ఉంటాయి. సంధులలోను, సమాసరూపాలలో, వాక్యనిర్మాణ, అలంకార విధానాలో వింత విధానాలు, వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలు మనకు కోలాటం పాటల్లో కన్పిస్తాయి. జానపదుల ఉచ్ఛారణ, పదప్రయోగరీతులను శిష్టోచ్చారణ పదప్రయోగరీతులతో పోల్చి ప్రామాణికంగా జానపదుల గేయాలలోని కొన్ని పదాలను కాని అక్షరాలను కాని లయ కుదరడం కోసం సాగదీయడం చేస్తారు లేదా దీర్ఘాలను హ్రస్వాలుగా చేయడం జరుగుతుంది. అలాగే కోలాటం పాటల్లో కూడా తాళానికో లయకో సరిపెట్టేందుకు అవసరమైన ఉచ్చారణా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇలా ఉచ్ఛారణకు సంబంధించిన హ్రస్వ, దీర్ఘ భేదాలు ప్రతిగేయంలోనూ కన్పిస్తాయి.
(1) హ్రస్వాలు – దీర్ఘాలుగా మారడం :
కుప్పనూర్చీనాడమ్మ సందామామా రైతు
అనే గేయంలో హ్రస్వాలను దీర్ఘాలుగా మార్చిన తీరు గమనించవచ్చు.
(2) మహాప్రాణాలకు బదులు అల్ప ప్రాణాలను పలకడం
ఉదా : బద్రాసెల స్రీరాములాకు వందనం
భ < బ
(8) కోలాటం పాటలు- మాండలిక పదాలు :-
ఖమ్మం జిల్లా అనేది నైసర్గికంగా ఎక్కువశాతం, తూర్పుప్రాంతం, ఆంధ్రాప్రాంతపు సరిహద్దులో ఉంది. వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, పాల్వంచ, భద్రాచలం మొదలగు ప్రాంతాలలో ఆంధ్రా సంస్కృతి, సంప్రదాయాలు అనాదికాలం నుండి ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల మాండలికాలు ప్రజల భాషలో, జానపదగేయాలలో కూడా మనకు కన్పిస్తాయి.
ఉదా : ‘‘ఎవ్వరికీ చెప్పకుండ గోంగూరకు
మా అత్తకైనా సెప్పకుండ గోంగూరకు…. (బొల్లినేని వెంకటేశ్వర్లు, వయస్సు 55, సిరిపురం గ్రామం, వైరా (మం)).
అనే పాటలో
తెలంగాణా పదమైన ‘పుంటికూర’కు గోంగూర అనే ఆంధ్రా మాండలిక పదం ప్రయోగించబడిరది. ఇటువంటి అనేక మాండలిక, అన్యదేశ్య పదాలు ఖమ్మం జిల్లా జానపద గేయాలలో ఎక్కువగానే ఉండవచ్చు.
ముగింపు:-
భిన్నసంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలం ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా తెలంగాణా ప్రాంతములోని సరిహద్దు జిల్లా. ఇది కొంత భాగం ఆంధ్రప్రదేశ్ నుండి, మరికొంత భాగం తెలంగాణా ప్రాంతం నుండి కలిసి ఏర్పడిన జిల్లా. భౌగోళికంగానే కాదు సాంస్కృతికంగా ఇది ఆంధ్ర తెలంగాణా సంస్కృతుల సమ్మేళనమే. కాబట్టి ఈ ప్రాంతంలోని జానపద గేయాలను పరిశీలించుట ద్వారా గేయాలలో ప్రతిబింబించే ఖమ్మం జిల్లా చారిత్రక, సాంస్కృతిక, సామాజిక, భాషా, సాహిత్య విశేషాలను ఎన్నో బయటి ప్రపంచానికి తెలియజెప్పవచ్చుననే ప్రయత్నమే నా ఈ పరిశోధన పత్ర ముఖ్యోద్దేశ్యం.
ఉపయుక్త గ్రంథాలు:
1. చక్రధర రావు, లంకపాటి, తెలుగు వ్యుత్పత్తి పదకోశం
2. మోహన్ జి.యస్. ‘‘జానపద విజ్ఞాన వ్యాసావళి’’
3. రంగాచార్యులు, చెలమచర్ల ‘‘ఆంధ్రశబ్ధ రత్నాకరం’’
4. రాధాకృష్ణమూర్తి మిక్కిలినేని ‘‘తెలుగువారి జానపద కళారూపాలు’’
5. రామయ్య పంతులు, జయంతి ‘‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’’
6. వెంకటేశ్వర్లు, బిట్టు, పల్నాటి సీమలో కోలాటం
7. సుందరం, ఆర్.వి.ఎస్. ఆంధ్రుల జానపద విజ్ఞానం.
– చల్లా మాలతీ దేవి
తెలుగు ఉపన్యాసకురాలు
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
ఏటూరునాగారం,
ములుగు జిల్లా
చరవాణి:9705580549
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
‘‘ఖమ్మం జిల్లా కోలాటం పాటలు ` విశేషాలు’’ ( పరిశోధనాత్మక వ్యాసం ) – చల్లా మాలతీ దేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>