ఆమె(కవిత) -తోకల రాజేశం
ఆమె
తల్లితనాన్ని అపురూపంగా
కడుపులో మోయక పోయి ఉంటే
నువ్వయినా నేనయినా
ఈ భూమ్మీద మొలిచే వాళ్ళమే కాదు
ఆమె
అక్కగా చెల్లెగా
మనబతుకు మట్టి మీద అనుబంధాల
బొమ్మరిల్లు కట్టకపోయి ఉంటే
నువ్వయినా నేనయినా ఎర్రటి ఎండ చెట్టు మీది
ఒంటరి పక్షులమయ్యేవాళ్ళం
ఆమె
మన అడుగులో అడుగు వేస్తూ
సహచరిగా
ఇంటిలోపలి బరువునూ,
పరవునూ నిట్టాడులా
ఎదగదిలో దాచుకోకపోయి ఉంటే
నువ్వయినా నేనయినా
నడిబజారు మీద
ఎగిరే జెండాలమై
తలయెత్తి తిరిగేవాళ్ళమే కాదు
అసలు ఆమే లేకపోతే
లోకమెప్పుడో”మగబారి”
ఎడారిగా మారిపోయేది
నీ కోసం నా కోసం
కేవలం మనకోసమే
ఆమె ఎన్ని పాత్రల్లో జీవించిందో
ఏనాడైనా ఆలోచించావా?
ఒరేయ్ నీతి తప్పిన వాడా!
ఆమె మనల్ని బతికిస్తున్న
ఆక్సిజన్ లాంటిది రా
బందించాలని చూస్తే
చచ్చేది నువ్వే
ఆకాశం మీద ఉమ్మేస్తే
నీ మోహమే”నల్లమొక”మవుతుంది.
–తోకల రాజేశం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

Comments
ఆమె(కవిత) -తోకల రాజేశం — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>