“పువ్వుల్ని పుష్పించనీ…”(కవిత)- బాలాజీ పోతుల

అస్పృశ్యమైన వాడల్లో పుట్టి
పూసిన పూలన్నీ
పూజకి పనికొస్తాయా?
ఎందుకో ఈరోజు పూలు,
నిన్నటి కంటే ఎక్కువే పుష్పించాయి
యేసుకి పూలొద్దు,
వాటిని తుంచటమే అయిష్టం తనకి!
ఎక్కడ బోయీ
ఈ ముప్పై మూడు కోట్ల దేవతలకేనా ఈ పుష్పాలన్నీ?
రోజూ వికసిస్తూ ఉండాల్సిన పూలు,
ఇలా ఏ దైవ సన్నిధిలోనైనా
మరుసటి రోజుకి
ఇంకొన్ని పూలొచ్చి
ఆ చోటుకి చేరేలోపే
ముందున్న పూలన్నీ
ఆ ఒక్క రోజుకే వాడిపోతాయి!
తుంచమనీ ఏ దేవుడూ చెప్పలేదు,
దేవుడి పాదాల చేరని పుష్పాల
జన్మ విఫలమని గగ్గోలు పెట్టిందెవ్వరు?
వాడ్ని తెగ్గొయ్యండి
వాడ్ని అర్పించండి ఆ దేవుడి పాదాలకి!
పుష్పాలు కిలకిల నవ్వే ఆనందభాష్పాలు,
తనకి తానుగా నేలరాలనివ్వండి
మధ్యలోనే తుంచి హత్యాపాతకాన్ని చుట్టుకోవద్దు చెప్తున్నా!
అంతా ఆ ప్రకృతే చూసుకుంటుంది,
ఏ పువ్వుని ఎక్కడికి చేర్చాలో
ఏ ముల్లును ఎక్కడ పెట్టాలో
మనమెంత ఆ ప్రకృతి దేవత ముందు!
— బాలాజీ పోతుల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
“పువ్వుల్ని పుష్పించనీ…”(కవిత)- బాలాజీ పోతుల — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>