హోరు (కవిత) -గిరి ప్రసాద్ చెలమల్లు

పడమట సంధ్య కుంగింది
పక్షులు గూటికి చేరుతున్నాయి
చందమామ వెన్నెలను ఆరబోస్తుంది
ఆరుబయట వాల్చిన మంచంపై నేను ఆస్వాదిస్తూ…
ఆమె చడీచప్పుడు లేకుండా వస్తుంది
చెవుల్లో మృదువుగా తాకుతుంది
చెక్కిలిని నిమురుతుంది
అరచేతుల్లోకి తీసుకుని
ఆమె నాచెంత వుందని
నాకు మాత్రమే తెలుసు
నాకు తెలియకుండానే నా చేతులు
నా చుట్టూ పెనవేసుకున్నాయి బిడియంత
ఆమె అంటే భయం
ఆమె నన్ను చేరుతుందంటే
ఒళ్ళంతా వణుకు
ఆమె నా అణువణువూ
తన ఆధీనంలోకి తీసుకుంటుంటే
వదిలించుకునే ప్రయత్నంలో
పరిగిడి తలుపులు బిగించుకుంటా
ఆమె తలుపులు బద్దలు
కొట్టలేదనే భ్రాంతిలో నేను
ఆమె సనసన్నగా నాజూకుగా
గదిలోకి సైతం జొరబడింది
ఎలాగా వచ్చిందనే ఆలోచన
మదిలో మసలుతుండగానే
నన్నాక్రమించుకుంటుంది
ఎంత తాపత్రయ పడినా
ఆమె ను దూరం పెట్టాలనే
దృఢ సంకల్పం తో నేను
ఇక ఆమె తో పడలేనని
నిద్రపోతున్న నా చెలిని లేపాను
ఆమె తో పోరులో చెలి దే
పైచేయి అయ్యింది ఈ రేయి
ఆమె పలాయనం చిత్తగించింది
తెల్లారాక బిగి కౌగిలి నుండి వీడుతూ
కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పా చెలికి
పిరికివాడా అని గోముగా అంది
ఆమెవరనేగా!! ఆమె చలి!!
చలి చెలి యుద్ధంలో రేయి గడిచింది!!
విజయగర్వం తో చెలి!!
-గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
హోరు (కవిత) -గిరి ప్రసాద్ చెలమల్లు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>