తొలి మహిళా గూఢచారి (వ్యాసం ) – డా. శిరీష ఈడ్పుగంటి.

భారత స్వాతంత్ర్య సమర చరిత్ర పుటలను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే, అవి ప్రధానంగా రెండు భిన్నమైన సిరా చుక్కలతో లిఖించబడినట్లు కనిపిస్తాయి. ఒకటి శాంతి, అహింస అనే మృదువైన మార్గమైతే, రెండవది రక్తం, త్యాగం మరియు సాయుధ పోరాటం అనే విప్లవ మార్గం. గాంధేయవాద పద్ధతులు ప్రపంచానికి సత్యాగ్రహం అనే కొత్త అస్త్రాన్ని పరిచయం చేసినప్పటికీ, బ్రిటీష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచింది మాత్రం విప్లవ వీరుల బాంబుల మోతలు మరియు వారి నెత్తుటి త్యాగాలే అనడంలో అతిశయోక్తి లేదు. మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఆ సాయుధ పోరాట యోధుల చరిత్రలో, ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ఒక మహోజ్వల అధ్యాయం.
ఆజాద్ హింద్ ఫౌజ్
నేతాజీ సుభాష్ చంద్రబోస్ సారథ్యంలో 1940వ దశకంలో రూపుదిద్దుకున్న ‘ఆజాద్ హింద్ ఫౌజ్’, కేవలం ఒక సైనిక దళం మాత్రమే కాదు, అది బానిసత్వంలో మగ్గుతున్న భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక. “మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను” అనే నేతాజీ పిలుపు, అప్పటి వరకు నిద్రాణమై ఉన్న యువతలో అగ్నిపర్వతాన్ని రగిల్చింది. అయితే, ఈ సైన్యంలోని అత్యంత విశిష్టమైన, ప్రపంచ చరిత్రలోనే అరుదైన విషయం ఏమిటంటే ఇందులో మహిళల భాగస్వామ్యం కూడా ఉండటం. అప్పటి వరకు స్త్రీని కేవలం గృహిణిగా, అబలగా చూసే భారతీయ సమాజపు సంకెళ్లను తెంచుతూ, మహిళలు తుపాకులు పట్టి రణరంగంలోకి దూకడం ఒక సామాజిక విప్లవం. ఈ విప్లవానికి రూపమే ‘ఝాన్సీ రాణి రెజిమెంట్’.
ఝాన్సీ రాణి రెజిమెంట్
1857 సిపాయిల తిరుగుబాటులో వీరోచితంగా పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో ఏర్పాటు చేసిన ఈ దళం, ఆసియాలోనే మొట్టమొదటి మహిళా పదాతి దళంగా చరిత్రకెక్కింది. కెప్టెన్ లక్ష్మీ సహగల్ నేతృత్వంలో, వందలాది మంది భారతీయ మహిళలు సైనిక శిక్షణ పొంది, బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. వారు కేవలం సహాయక సిబ్బందిగా మాత్రమే పరిమితం కాలేదు. ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్నారు, గూఢచారులుగా మారారు, దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారు.
తొలి మహిళా గూఢచారి నీరా ఆర్య
అటువంటి అసంఖ్యాక వీరనారీమణులలో, చరిత్ర మరుగున పడిపోయిన, కానీ అత్యంత సాహసోపేతమైన జీవితాన్ని గడిపిన ధీరవనిత నీరా ఆర్య. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’లో ఆమె పోషించిన పాత్ర సాధారణ సైనికురాలిది కాదు. ఆమె భారతదేశపు ‘తొలి మహిళా గూఢచారి’. శత్రువుల కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, వారి రహస్యాలను చేధించి, నేతాజీకి చేరవేసిన ఆమె సాహసం అనిర్వచనీయం. ఒకవైపు దేశభక్తి, మరోవైపు బ్రిటీష్ ప్రభుత్వానికి పనిచేస్తున్న భర్త (సి.ఐ.డి ఆఫీసర్) – ఈ రెండింటి మధ్య నలిగిన ఆమె జీవితం ఒక మహా విషాద గాథ.
ఆమె రాసిన ఆత్మకథ ‘మేరా జీవన్ – మేరా సంఘర్ష్’ (నా జీవితం – నా పోరాటం) కేవలం ఒక పుస్తకం కాదు, అది బ్రిటీష్ జైళ్లలో ఆమె అనుభవించిన నరకయాతనకు, ముఖ్యంగా స్త్రీ అస్తిత్వంపై జరిగిన అమానుష దాడికి సాక్ష్యం. ఈ వ్యాసం, ఆమె ఆత్మకథ ఆధారంగా, ఒక మహిళగా, గూఢచారిగా, దేశభక్తురాలిగా ఆమె చేసిన అసమాన త్యాగాన్ని, సాహిత్య మరియు చారిత్రక కోణంలో విశ్లేషించే ప్రయత్నం ఈ వ్యాసంలో జరిగింది. చరిత్ర పుటలు విస్మరించిన ఒక ‘నిప్పు కణాన్ని’ వెలికి తీసి స్మరించుకోవాడమే ఈ వ్యాస ప్రధాన ఉద్దేశం.
మేరా జీవన్ – మేరా సంఘర్ష్
భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో అలుపెరుగని పోరాటం చేసి, ఆజాద్ హింద్ ఫౌజ్‌లో తొలి మహిళా గూఢచారిగా పేరుగాంచిన వీరనారి నీరా ఆర్య. ఆమె జీవితం ఒక గొప్ప సాహస గాథ. దేశం కోసం ఎన్నో సాహాసాలను చేసి, మరెన్నో కష్టాలను అనుభవించిన మనిషి. నీరా ఆర్య తన ఆత్మకథ ‘మేరా జీవన్ – మేరా సంఘర్ష్’ (నా జీవితం – నా పోరాటం) లో రాసుకున్న విషయాలు కేవలం ఒక వ్యక్తి అనుభవాలు మాత్రమే కాదు, అవి ఆనాటి అగ్నిధారలు.
1.బాల్యం: దేశభక్తికి అంకురార్పణ
దేశభక్తికి అంకురార్పణ మహా వృక్షంగా ఎదిగే విత్తనం, మట్టిలో పడినప్పుడే తన స్వభావాన్ని నిర్ణయించుకుంటుంది. అలాగే, నీరా ఆర్య అనే విప్లవ కెరటం పుట్టుకతోనే ధైర్యసాహసాలను పుణికిపుచ్చుకుంది. 1902 మార్చి 5న ఉత్తర ప్రదేశ్, బాగ్ పత్ జిల్లాలోని ఖేకడా అనే ప్రాంతంలో, సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త సేఠ్ చజ్జుమల్. ఆయన వ్యాపారాలు కలకత్తాలో విస్తరించి ఉండేవి. సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ, నీరా చిన్ననాటి నుంచే దేశభక్తి భావాలను ఒంటబట్టించుకున్నారు. ఆమె విద్యాభ్యాసం ప్రధానంగా కలకత్తాలో జరిగింది. ఆ రోజుల్లోనే ఆమెకు హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ భాషలలో మంచి పట్టు ఉంది. అప్పటి బెంగాల్ విప్లవకారులకు అడ్డా. నీరా ఆర్య పాఠశాల దశ నుంచే బ్రిటీష్ వారిని ద్వేషించడం మొదలుపెట్టింది. ఆమెకు ఆభరణాల మీద కాకుండా ఆయుధాల మీద ఆసక్తి ఎక్కువ. “నేను పుట్టింది బంగారు ఉయ్యాలలో కావచ్చు, కానీ నా దేశం ఇనుప సంకెళ్లలో ఉంది. నా ఊపిరిలో స్వేచ్ఛ లేదు, బానిసత్వపు వాసన ఉంది.” అని భావించేది. ఆమె బాల్యం సాఫీగా, సౌకర్యవంతంగా సాగినప్పటికీ, నాటి దేశ రాజకీయ పరిస్థితులు ఆమెపై తీవ్ర ప్రభావం చూపాయి.
అప్పటికే దేశంలో గాంధీజీ పిలుపు, భగత్ సింగ్ త్యాగం, చంద్రశేఖర్ ఆజాద్ సాహసాలు ప్రజల నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉన్నాయి. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమాలు, విప్లవకారుల త్యాగాలు ఆమె మనసుపై చెరగని ముద్ర వేశాయి. బ్రిటిష్ వారి అణిచివేతను కళ్లారా చూసిన నీరా, తన దేశం సంకెళ్లలో ఉండటాన్ని సహించలేకపోయేది. ఆమె తోటి విద్యార్థులతో కలిసి బ్రిటిష్ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొనడం, దేశభక్తి గీతాలు పాడటం ఆమెకు నిత్యకృత్యంగా మారింది. నీరా ఆర్య తండ్రి సంపన్నుడైనప్పటికీ, దేశం పట్ల గౌరవం ఉన్న కుటుంబం కావడంతో, ఆమెకు చిన్నతనం నుండే బ్రిటీష్ వారి దాస్య శృంఖలాల పట్ల అసహ్యం ఏర్పడింది. ఆమె రక్తంలోనే స్వేచ్ఛాకాంక్ష ప్రవహించేది. ఈ నేపథ్యంలోనే ఆమెకు సుభాష్ చంద్ర బోస్ (నేతాజీ) సిద్ధాంతాల పట్ల ఆకర్షణ ఏర్పడింది. కలకత్తాలో ఆమె విద్యాభ్యాసం సాగుతున్న సమయంలోనే ఆమెకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పట్ల ఆరాధన పెరిగింది. ఆయన ప్రసంగాలు, ఆయన నిప్పులు చెరిగే మాటలు ఆమె లేత మనసులో బలమైన ముద్ర వేశాయి. ఒక సాధారణ బాలికగా కాకుండా, దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఆమెలో అప్పుడే మొదలైంది. ఈ బాల్యపు పునాదులే భవిష్యత్తులో ఆమెను ఒక గొప్ప విప్లవకారిణిగా మలిచాయి.
2.వివాహం : రెండు భిన్న ధృవాల కలయిక
రెండు భిన్న ధృవాల కలయిక, విధి విచిత్రమైనది. అది ఎప్పుడూ ఊహించని మలుపులతో జీవితాన్ని పరీక్షిస్తుంది. నీరా ఆర్య జీవితంలో ఆ మలుపు వివాహం రూపంలో వచ్చింది. కుటుంబ పెద్దల నిర్ణయం మేరకు ఆమె శ్రీకాంత్ జైరంజన్ దాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడే ఆమె జీవితంలో అసలైన సంఘర్షణ ప్రారంభమైంది.
భర్త శ్రీకాంత్ జైరంజన్ దాస్… సామాన్యుడు కాదు. అతను బ్రిటీష్ ఇండియా ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన సి.ఐ.డి ఇన్స్పెక్టర్. బ్రిటీష్ రాణి పట్ల, బ్రిటీష్ ప్రభుత్వం పట్ల అచంచలమైన విశ్వాసం ఉన్న వ్యక్తి. అతనికి దేశభక్తులు అంటే ‘తిరుగుబాటుదారులు’, ‘తీవ్రవాదులు’ అనే అభిప్రాయం ఉండేది . బ్రిటీష్ చట్టాన్ని కాపాడటమే తన పరమ ధర్మంగా భావించే మనస్తత్వం అతనిది. ఆయన బ్రిటిష్ పాలకులకు అత్యంత నమ్మకస్థుడు.
మరోవైపు నీరా ఆర్య… నరనరాన దేశభక్తిని నింపుకున్న యువతి. ఆమెకు బ్రిటీష్ వారంటే ఆక్రమణదారులు, పరాన్నజీవులు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆమెకు దైవ సమానుడు. ఇలా పూర్తి భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన వీరిద్దరినీ ‘వివాహం’ అనే బంధం ఒకటి చేసింది. ఇది కేవలం భార్యాభర్తల మధ్య ఉండే సాధారణ భేదాభిప్రాయం కాదు, ఇది ఒక సైద్ధాంతిక యుద్ధం. ఒకే ఇంటి పైకప్పు కింద, ‘జై హింద్’ అనే నినాదం, ‘లాంగ్ లివ్ ది కింగ్’ అనే నినాదంతో సహజీవనం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆమె తన ఆత్మకథలో రాసినట్లు, ‘నా శరీరం అతనిది కావచ్చు, కానీ నా ఆత్మ దేశానిది.’
గృహమే కారాగారం: వ్యక్తిగత సంఘర్షణ
నీరా ఆర్య ఆత్మకథలో ఈ దశను అత్యంత క్లిష్టమైనదిగా వర్ణించారు. ఒక గూఢచారికి శత్రువు సరిహద్దు అవతల ఉంటాడు. కానీ నీరా ఆర్యకు శత్రువు తన పక్కనే, తన ఇంట్లోనే ఉన్నాడు. భర్తగా శ్రీకాంత్ ఆమెను ప్రేమించినప్పటికీ, ఆమెలోని దేశభక్తిని అతడు ఎప్పుడూ ఒక ‘పిచ్చి’గా లేదా ‘అనవసరమైన ఆవేశం’గా కొట్టిపారేసేవాడు. ఆమె ఆజాద్ హింద్ ఫౌజ్ కార్యకలాపాల పట్ల ఆకర్షితురాలవుతున్న సమయం అది. రహస్య సమావేశాలకు వెళ్లడం, కరపత్రాలు చదవడం వంటివి ఆమె భర్తకు తెలియకుండా చేయాల్సి వచ్చేది. భర్త ఆఫీసు నుండి ఇంటికి రాగానే, బ్రిటీష్ ప్రభుత్వం విప్లవకారులను ఎలా అణచివేస్తుందో గొప్పగా చెప్పేవాడు. ఆ మాటలు వింటున్నప్పుడు నీరా ఆర్య గుండె మండిపోయేది. తన సోదర సమానులైన దేశభక్తులను తన భర్త వేటాడుతుంటే, మౌనంగా భరించాల్సి రావడం ఆమెకు నరకప్రాయంగా అనిపించేది.
ఆమె ఆత్మకథలో ఒక సందర్భాన్ని చెబుతూ… తన భర్త విప్లవకారుల సమాచారాన్ని సేకరించడానికి వెళ్తున్నప్పుడు, ఆమె మనసులో ‘ఆయన విఫలం కావాలి’ అని కోరుకునేదట. ఒక భార్య తన భర్త విజయాన్ని కాంక్షిస్తుంది. కానీ నీరా ఆర్య తన భర్త ఓటమిని కాంక్షించింది. ఎందుకంటే, ఆమె భర్త గెలిస్తే, ఆమె దేశం ఓడిపోతుంది. ఈ మానసిక ఘర్షణ ఆమెను ప్రశాంతంగా నిద్రపోనిచ్చేది కాదు.
అంతర్యుద్ధం: ప్రేమ మరియు కర్తవ్యం
ఈ వైరుధ్యం కేవలం రాజకీయమైనది కాదు, ఇది ఆమె అస్తిత్వానికి సంబంధించినది. హిందూ సాంప్రదాయంలో భర్తను దైవంగా భావిస్తారు. కానీ ఆ దైవం, రాక్షస ప్రభుత్వానికి సేవకుడిగా మారితే ఏం చేయాలి? అనే ధర్మ సందేహం ఆమెను వేధించింది. శ్రీకాంత్ ఆమెను నియంత్రించడానికి ప్రయత్నించేవాడు. ‘నువ్వు ఒక ఆఫీసర్ భార్యవి, ఆ హోదాను కాపాడుకో,’ అని హెచ్చరించేవాడు. కానీ ఆమె, ‘నేను ఈ దేశపు కుమార్తెను, ఆ బాధ్యతను కాపాడుకుంటాను,’ అని తనలో తాను నిశ్చయించుకునేది. ఆమె సి.ఐ.డి ఆఫీసర్ భార్యగా ఉండటం వల్ల ఆమెకు కొంత సౌలభ్యం కూడా ఉండేది. ఆమె ఎక్కడికి వెళ్తున్నా పోలీసుల నిఘా ఉండేది కాదు. ఈ విషయాన్ని ఆమె తనకు అనుకూలంగా మలుచుకుంది. భర్త అధికార హోదానే ఆమె తన గూఢచారి కార్యకలాపాలకు కవచంగా వాడుకుంది. భర్తకు తెలియకుండానే, భర్త పేరును అడ్డం పెట్టుకుని ఆమె విప్లవకారులకు సమాచారం చేరవేయడం ప్రారంభించింది. ఇది అత్యంత ప్రమాదకరమైన క్రీడ. ఏమాత్రం అనుమానం వచ్చినా ఆమె జీవితం నాశనమైపోతుంది. అయినా ఆమె వెనుకాడలేదు. నీరా ఆర్య రహస్యంగా స్వాతంత్ర్య ఉద్యమకారులకు సహాయం చేయడం, సమావేశాలకు వెళ్లడం అతనికి నచ్చేది కాదు. అయినప్పటికీ, నీరా తన భర్త ఉద్యోగాన్ని, తన దేశభక్తిని వేరుగా చూసేది. కానీ విధి ఆమెను ఒక కఠినమైన పరీక్షకు సిద్ధం చేసింది.
వైరుధ్యం యొక్క పరాకాష్ట
శ్రీకాంత్ జైరంజన్ దాస్ బ్రిటీష్ పాలకుల దృష్టిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో ఉండేవాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను అంతం చేస్తే బ్రిటీష్ సామ్రాజ్యంలో తనకు అత్యున్నత పదవి దక్కుతుందని అతను ఆశపడేవాడు. ఈ విషయమే వారి మధ్య అగాధాన్ని పూడ్చలేనంతగా పెంచేసింది. ఆమె ఆత్మకథలో రాసుకున్నట్లుగా…“నా భర్త చేతులు నా దేశభక్తుల రక్తంతో తడిసి ఉన్నాయి. ఆ చేతులు నన్ను తాకినప్పుడల్లా, నాకు అసహ్యం వేసేది.” ఈ వాక్యం వారి దాంపత్య జీవితంలోని శూన్యాన్ని, ఆమెలోని నైతిక ఆగ్రహాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఆమె ప్రేమను, కర్తవ్యాన్ని తూకం వేసినప్పుడు, దేశం వైపే మొగ్గు చూపింది. భర్త అనే బంధం కన్నా, మాతృభూమి అనే బంధం బలీయమైనదని ఆమె విశ్వసించింది.
ఈ నేపథ్యమే ఆమెను తదుపరి దశలో ‘గూఢచారి’గా మారడానికి పురిగొల్పింది. తన భర్త చేసే పనులను అడ్డుకోవాలంటే, తను కూడా అదే రంగంలోకి దిగాలని, ఇంటి నుండే యుద్ధం ప్రారంభించాలని ఆమె నిర్ణయించుకుంది. అలా, ఒక గృహిణి, ఒక సి.ఐ.డి ఆఫీసర్ భార్య… ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క అత్యంత నమ్మకమైన గూఢచారిగా మారింది. ఈ పరిణామక్రమం ఆకస్మికంగా జరిగింది కాదు. ఇది సంవత్సరాల తరబడి సాగిన మానసిక సంఘర్షణకు, అవమానాలకు, అణచివేతకు ఆమె ఇచ్చిన విప్లవాత్మక సమాధానం.
3.గూఢచారిగా ప్రస్థానం: నీడలా కదిలిన ‘నాగిని’
ఆజాద్ హింద్ పిలుపు – ఆత్మపరివర్తన నీరా ఆర్య జీవితం రెండు విభిన్న ప్రపంచాల మధ్య ఊగిసలాడుతున్న సమయం అది. ఒక వైపు బ్రిటీష్ భోగభాగ్యాలతో కూడిన వైవాహిక జీవితం, మరోవైపు బానిస సంకెళ్ళలో మగ్గుతున్న మాతృభూమి ఆక్రందన. ఈ సందిగ్ధంలో ఆమెకు ఒక దిక్సూచిలా కనిపించింది – ఆజాద్ హింద్ ఫౌజ్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన ‘చలో ఢిల్లీ’ నినాదం ఆమె గుండెల్లో ప్రతిధ్వనించింది. ఆమె ఆత్మకథ ‘మేరా జీవన్ – మేరా సంఘర్ష్’ లో పేర్కొన్న ప్రకారం, ఆమె కేవలం ఆవేశంతో ఈ నిర్ణయం తీసుకోలేదు. ఒక ప్రణాళికతో అడుగులేసింది. అప్పటికే ఆగ్నేయాసియాలో, భారత సరిహద్దుల్లో INA ప్రభావం పెరుగుతోంది. ఝాన్సీ రాణి రెజిమెంట్ ఏర్పాటు వార్త ఆమెకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కెప్టెన్ లక్ష్మీ సహగల్ నాయకత్వంలో మహిళలు తుపాకులు పట్టి కవాతు చేస్తున్న దృశ్యాలు ఆమెను కదిలించాయి. ‘నేను కేవలం ఇంటిని చక్కదిద్దే గృహిణిని మాత్రమే కాదు, దేశాన్ని చక్కదిద్దే సైనికురాలిని కూడా,’ అని ఆమె గట్టిగా నమ్మింది. సాధారణ గృహిణి నుండి సైనికురాలిగా, అక్కడి నుండి గూఢచారిగా ఆమె పరిణామ క్రమం అద్భుతం. ఆమె శిక్షణలో నేర్చుకున్న విద్యలు- మారువేషాలు వేయడం, కోడ్ భాషలు డీకోడ్ చేయడం, ఆయుధాలు వాడటం – అన్నీ ఇక్కడ వివరించారు. “నేను నా స్త్రీ సహజమైన భయాన్ని చంపుకున్నాను” అని ఆమె రాశారు. సరస్వతీ, రాజమణి వంటి సహచరులతో కలిసి మగవారి వేషంలో బ్రిటిష్ క్యాంపుల్లోకి చొరబడి సమాచారం సేకరించిన సాహసాలు ఇందులో ప్రధానం. ఈ సంఘటనలు ఆమె ధైర్యానికి నిలువుటద్దం. అయితే, ఆమె నేరుగా యుద్ధరంగంలోకి వెళ్లడం కన్నా, గూఢచారిగా (Spy) మారితే దేశానికి ఎక్కువ ఉపయోగమని INA నాయకత్వం భావించింది. ఎందుకంటే, ఆమె ఒక సి.ఐ.డి ఆఫీసర్ భార్య. శత్రువు గుండెల్లో ఉంటూ సమాచారాన్ని సేకరించగలిగే అరుదైన అవకాశం ఆమెకు ఉంది. అలా ఆమె INA ఇంటెలిజెన్స్ వింగ్‌లో చేరారు.
గూఢచర్య వ్యూహాలు& శిక్షణ: గూఢచారిగా మారడం అంటే ఆత్మహత్యతో సమానమని ఆమెకు తెలుసు. ఏమాత్రం పట్టుబడ్డా మరణం లేదా చిత్రహింసలు తప్పవు. ఈ ప్రమాదకరమైన ప్రయాణానికి ఆమె కఠినమైన శిక్షణ తీసుకుంది.
మానసిక స్థైర్యం: భావోద్వేగాలను ముఖంలో కనిపించనివ్వకూడదు. భయం, ప్రేమ, జాలి – వేటినీ బయటపడనివ్వకూడదు.
కోడ్ భాషలు: సందేశాలను రహస్య సంకేతాల్లో పంపడం, పూల కుండీలు మార్చడం, కిటికీలపై రంగు బట్టలు ఆరేయడం వంటి సంకేతాలను వాడటం ఆమె నేర్చుకుంది.
ఆయుధ శిక్షణ: అవసరమైతే ఆత్మరక్షణ కోసం, లేదా శత్రువును మట్టుబెట్టడానికి చిన్న కత్తులు, పిస్టల్ వాడకంలో ఆమె నైపుణ్యం సంపాదించింది.
బహురూప ధారణ: వేష ధారణలు గూఢచారికి ‘బహురూపి’ కావడం అత్యవసరం. నీరా ఆర్య తన ఆత్మకథలో తాను ధరించిన వివిధ వేషధారణల గురించి ఆసక్తికరంగా రాసుకున్నారు. ఆమె ప్రధానంగా మూడు రకాల వేషధారణలను ఉపయోగించేవారు.
పిచ్చిది: ఇది అత్యంత సురక్షితమైన, అత్యంత కష్టమైన వేషం. చింపిరి జుట్టు, మురికి బట్టలు, పిచ్చి చూపులు, అస్తవ్యస్తమైన ప్రవర్తనతో ఆమె బ్రిటీష్ సైనిక శిబిరాల చుట్టూ తిరిగేది. ఒక పిచ్చిదాని మాటలను ఎవరూ పట్టించుకోరు కాబట్టి, ఆమె సైనికుల సంభాషణలను, ఆయుధాల తరలింపు వివరాలను సులభంగా వినగలిగేది. ఒక్కోసారి చెత్తబుట్టల్లో పడేసిన కాగితాలను ఏరుకుంటూ, అందులో ముఖ్యమైన సమాచారాన్ని సేకరించేది.
పని మనిషి/తోటమాలి: ఉన్నత బ్రిటీష్ అధికారుల ఇళ్లలో పనిమనిషిగా చేరి, వారి వ్యక్తిగత గదుల్లో ఉండే ఫైళ్ళను పరిశీలించేది. టీ, కాఫీలు అందిస్తూ, వారు మాట్లాడుకునే రహస్య యుద్ధ తంత్రాలను వినేది.
పూలమ్మే మహిళ: ఇది ఆమెకు బాగా ఇష్టమైన వేషం. బుట్టలో పూలు పెట్టుకుని, బజారులో తిరుగుతూ, విప్లవకారులకు రహస్య సందేశాలను చేరవేసేది. (విషాదం ఏమిటంటే, స్వాతంత్ర్యం వచ్చాక ఆమె బ్రతకడానికి నిజంగానే పూలు అమ్ముకోవాల్సి వచ్చింది).
శత్రువు గుహలో గూఢచారి: నీరా ఆర్య గూఢచర్యంలో అత్యంత కీలకమైన అంశం ఆమె భర్త, శ్రీకాంత్ జైరంజన్ దాస్. అతను బ్రిటీష్ నిఘా విభాగంలో ఉండటం ఆమెకు ఒక ‘బంగారు గని’లా మారింది.
ఇంటిని కార్యాలయంగా మార్చుకోవడం: భర్త ఆఫీసు నుండి తెచ్చిన ఫైళ్లు, మ్యాపులు ఇంట్లో ఉన్నప్పుడు, ఆమె రాత్రి వేళల్లో వాటిని రహస్యంగా చదివేది లేదా కాపీ చేసేది.
పార్టీలు & సాంఘిక సమావేశాలు: ఒక ఆఫీసర్ భార్యగా ఆమె బ్రిటీష్ పార్టీలకు హాజరయ్యేది. అక్కడ ఆమె అందంగా ముస్తాబై, ఆంగ్లేయ అధికారులతో చనువుగా మాట్లాడుతూ, మాటల మధ్యలో వారి తదుపరి చర్యల గురించి ఆరా తీసేది. వారు ‘మాకు విధేయుడైన ఆఫీసర్ భార్య’ అనుకుని చాలా విషయాలు ఆమె ముందు మాట్లాడేవారు. కానీ ఆ పట్టుచీర కట్టుకున్న మహిళ, లోపల ఒక విప్లవ సైనికురాలని వారికి తెలియదు.
సమాచార బదిలీ: సేకరించిన సమాచారాన్ని ఆమె తన నమ్మకస్తులైన INA కొరియర్లకు చేరవేసేది. దీనివల్ల అనేకసార్లు బ్రిటీష్ వారు పన్నిన వ్యూహాలను INA ముందుగానే పసిగట్టి తప్పించుకోగలిగింది.
నేతాజీతో అనుబంధం – ‘నాగిని’ బిరుదు: నీరా ఆర్యకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే కేవలం నాయకుడు మాత్రమే కాదు, ఒక దైవం. ఆయన రక్షణే ఆమె జీవిత ధ్యేయం. ఆమె ఆత్మకథలో నేతాజీతో జరిగిన ఒక సంఘటన ఆమెకు ‘నాగిని’ అనే పేరు రావడానికి కారణమైంది. ఒకానొక సందర్భంలో, నేతాజీ బహిరంగ సభలో మాట్లాడుతుండగా లేదా ప్రయాణిస్తుండగా ఆయనపై దాడి జరిగే అవకాశం ఉందని నీరా పసిగట్టింది. ఆమె వెంటనే అప్రమత్తమై, నీడలా కదిలి ఆ ప్రమాదాన్ని నివారించింది. ఆ సమయంలో ఆమె చూపిన చురుకుదనం, శత్రువును పసిగట్టిన తీరు చూసి, నేతాజీ ఆమెను “నువ్వు నాగిని లాంటి దానివి, శత్రువు కాటు వేయక ముందే పడగ విప్పి కాపాడగలవు”, అని ప్రశంసించారని కొన్ని కథనాలు మరియు ఆమె ఆత్మకథ సారాంశం చెబుతున్నాయి. ఈ ‘నాగిని’ అనే పేరు ఆమెకు గూఢచారి ప్రపంచంలో ఒక కోడ్ నేమ్‌గా మారింది. ఆమె నేతాజీకి ఎంత నమ్మకస్తురాలంటే, ఆయన వ్యక్తిగత రక్షణ బాధ్యతల్లో కూడా ఆమె పాలుపంచుకునేది. నేతాజీ ఎక్కడికి వెళ్లినా, ఆయనకు తెలియకుండానే ఒక రక్షణ కవచంలా ఆమె మరియు ఆమె బృందం పని చేసేవారు.
గూఢచారి జీవితంలోని ఒత్తిడి: ఈ జీవితం ఆమెపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగించింది. ఒకవైపు భర్తను మోసం చేస్తున్నాననే భావన దేశం కోసం అయినప్పటికీ, మరోవైపు ఎప్పుడు దొరికిపోతామో అనే భయం. నిద్రలో కూడా ఆమె కలవరించేది కాదు, ఎక్కడ నిజం బయటపడుతుందో అని. ఆమె ఆత్మకథలో రాసుకున్నట్లుగా… ‘నా జీవితం కత్తి మీద సాము లాంటిది. ఒక చిన్న పొరపాటు జరిగినా నా ప్రాణం పోతుంది, అంతకన్నా మిన్నగా నా దైవం (నేతాజీ) ప్రమాదంలో పడతారు.’ ఇది ఆమెలోని అద్భుతమైన ధైర్యాన్ని, మేధస్సును ఆవిష్కరిస్తుంది. ఆమె కేవలం తుపాకీ పట్టిన సైనికురాలు మాత్రమే కాదు, మేధస్సుతో యుద్ధం చేసిన వీరనారి.
4.చారిత్రక హత్య & త్యాగం: మాంగల్యం కన్నా మాతృభూమి మిన్న
విధి విసిరిన వల:
ప్రతి కథలోనూ క్లైమాక్స్ ఉంటుంది, కానీ నీరా ఆర్య జీవితంలో క్లైమాక్స్ రక్తంతో లిఖించబడింది. అది శత్రువు రక్తం కాదు, ఆమె భర్త రక్తం. ఒక భారతీయ స్త్రీకి, భర్త ప్రాణాలను తీయడం అనేది ఊహకందని విషయం. పురాణాల్లో సావిత్రి భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడింది. కానీ, ఆధునిక భారత చరిత్రలో నీరా ఆర్య, దేశం ప్రాణాల కోసం భర్తతోనే పోరాడింది, చివరకు భర్తనే బలి ఇచ్చింది. ‘మేరా జీవన్ – మేరా సంఘర్ష్’ ఆత్మకథలో ఈ సంఘటన చదువుతుంటే, పాఠకుడి గుండె బరువుక్కుతుంది. ఇది హత్య కాదు, ఇదొక యజ్ఞం. దేశ రక్షణ కోసం చేసిన ‘నరమేధ యజ్ఞం’.
కుట్ర: చీకటి గదిలో మరణ శాసనం :
‘ఆజాద్ హింద్ ఫౌజ్’ విజయపరంపరలతో ముందుకు సాగుతున్న సమయం అది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటీష్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ క్రమంలో బ్రిటీష్ ఇంటెలిజెన్స్ నేతాజీని ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఆ బాధ్యతను, అత్యంత నమ్మకస్తుడైన ఆఫీసర్ శ్రీకాంత్ జైరంజన్ దాస్‌కు (నీరా భర్తకు) అప్పగించింది.
ఆమె ఆత్మకథ ప్రకారం… ఆ రోజు ఇంటి వాతావరణం గంభీరంగా ఉంది. శ్రీకాంత్ ముఖంలో ఒక వింతైన క్రూరత్వం, గెలుపు ధీమా కనిపిస్తున్నాయి. అతను తన తుపాకీని శుభ్రం చేసుకుంటూ, తన పై అధికారులతో లేదా సహచరులతో సందర్భోచితంగా ఫోన్లోనో, నేరుగానో మాట్లాడిన మాటలు నీరా చెవిన పడ్డాయి. ‘ఈ రోజుతో ఆజాద్ హింద్ ఫౌజ్ కథ ముగుస్తుంది. ఆ బోస్ గాడి పీడ విరగడవుతుంది. రేపటి సూర్యోదయం చూసేందుకు అతను ఉండడు,’ అని శ్రీకాంత్ అన్న మాటలు నీరా గుండెలో పిడుగుల్లా పడ్డాయి.
తన భర్తకు నేతాజీ ఎక్కడ ఉన్నారో కచ్చితమైన సమాచారం తెలిసిందని, ఆయన్ని కాల్చడానికి సిద్ధమవుతున్నాడని ఆమె గ్రహించింది. అప్పటి వరకు ఆమె చేసిన గూఢచర్యం వేరు, ఇప్పుడు ఎదురైన పరిస్థితి వేరు. ఇక్కడ సమాచారం చేరవేయడానికి సమయం లేదు. చర్య ఒక్కటే మార్గం.
అంతర్మథనం: ధర్మ సంకటం:
ఇక్కడ ముందుగా ఆమె మానసిక స్థితిని విశ్లేషించాలి. ఆమె ముందు రెండు ధర్మాలు ఉన్నాయి.
- పతి ధర్మం: హిందూ సాంప్రదాయం ప్రకారం భర్తను కాపాడుకోవడం, అతనికి సహకరించడం.
- దేశ ధర్మం: దేశ విముక్తి కోసం పోరాడుతున్న నాయకుడిని రక్షించుకోవడం.
ఆమె మనసులో తుఫాను చెలరేగింది. ‘నేను నా భర్తను అడ్డుకుంటే, నేను విధవను అవుతాను. అడ్డుకోకపోతే, దేశం అనాధ అవుతుంది. నా నుదుట సింధూరం ఉండాలా? లేక నా దేశానికి స్వేచ్ఛ ఉండాలా?’ అని ఆమె తనను తాను ప్రశ్నించుకుంది. చివరకు, కోట్ల మంది భారతీయుల భవిష్యత్తు కోసం, తన ఒక్కదాని సౌభాగ్యాన్ని త్యాగం చేయాలని నిర్ణయించుకుంది. ఇది మహాభారతంలో కర్ణుడు తన కవచ కుండలాలను దానం చేసినంతటి గొప్ప త్యాగం. అక్కడ కర్ణుడు తన ప్రాణాన్ని పణంగా పెడితే, ఇక్కడ నీరా తన వైవాహిక జీవితాన్ని పణంగా పెట్టింది.
ఘర్షణ: మాటల యుద్ధం నుండి మరణం వైపు
శ్రీకాంత్ బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. నీరా అతన్ని అడ్డుకుంది. ఆమె ఆత్మకథలో ఈ సన్నివేశం చాలా నాటకీయంగా ఉంటుంది.
నీరా: ‘మీరు వెళ్తున్నది ఒక మనిషిని చంపడానికి కాదు, భారతదేశపు ఆత్మను చంపడానికి. దయచేసి వెళ్లకండి.’
శ్రీకాంత్: ‘అడ్డు తప్పుకో నీరా! అతను ఒక దేశద్రోహి. అతన్ని చంపితే నాకు ప్రమోషన్ వస్తుంది, మన జీవితం మారిపోతుంది.’
నీరా: ‘ఆయన దేశద్రోహి కాదు, మీరు బ్రిటీష్ వారి బానిసలు. ఆ రక్తపు కూడు మనకు వద్దు.’
మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. శ్రీకాంత్ ఆమెను పక్కకు నెట్టివేసి, నేతాజీని కాల్చడానికి, నేతాజీ ఉన్న వైపు వెళ్ళడానికి బయలుదేరాడు. ఆ క్షణంలో నీరాలోని ‘భార్య’ చనిపోయింది, ఆమెలోని ‘వీరనారి’ మేల్కొంది.
మాతృభూమి కోసం మాంగల్య దానం
శ్రీకాంత్ నేతాజీని లక్ష్యంగా చేసుకుని గురి పెట్టినప్పుడు లేదా దాడి చేయడానికి వెళ్తున్నప్పుడు, నీరా ఆర్య క్షణం కూడా ఆలోచించలేదు. ఆమె తన దగ్గర ఉన్న కత్తిని తీసుకుంది. ‘క్షమించండి నాథా! మీరు నా భర్త కావచ్చు, కానీ నా దేశానికి శత్రువు,’ అని నినదిస్తూ, ఆమె తన భర్త కడుపులో కత్తిని దించింది. (కొన్ని కథనాల ప్రకారం తుపాకీతో పేల్చినట్లుగా చె బుతారు) ఆ సన్నివేశాన్ని సాహిత్యపరంగా వర్ణించాలంటే… అది ఒక రౌద్ర ఘట్టం. ఆమె కాళికా దేవిలా మారింది. రక్తం చిమ్మి ఆమె చేతులపై, బట్టలపై పడింది. అది ఆమె భర్త రక్తం. కానీ ఆమె కళ్ళలో కన్నీళ్లు లేవు, ఒక రకమైన శూన్యత, అదే సమయంలో ఒక బాధ్యతను నెరవేర్చిన తృప్తి ఉన్నాయి. నేతాజీ ప్రాణాలను కాపాడటం కోసం, ఆమె తన చేతులతోనే తన మాంగల్యాన్ని తెంచుకుంది. ఆమె తన ఆత్మకథలో ఇలా రాశారు, “నా కళ్ళ ముందు నా సౌభాగ్యం (భర్త) ఉంది, నా దేశ భవిష్యత్తు (నేతాజీ) ఉంది. నేను నా సౌభాగ్యాన్ని బలి ఇచ్చి, దేశ భవిష్యత్తును కాపాడాను.” నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ సంఘటన గురించి తెలుసుకున్నప్పుడు చలించిపోయారు. ‘నీరా! నువ్వు నా కోసం ఎంత పెద్ద త్యాగం చేశావు? నువ్వు సాక్షాత్తు శక్తి స్వరూపిణివి,’ అని ఆయన అన్నట్లుగా చెబుతారు. (ఆమె ఆత్మకథలో ఈ భావోద్వేగాన్ని చాలా లోతుగా వర్ణించారు).
న్యాయస్థానం దృష్టిలో ఇది హత్య. కానీ చరిత్ర దృష్టిలో ఇది త్యాగం. ఎందుకంటే ఇందులో ఎటువంటి స్వార్థం లేదు. ఆమె భర్త ఆస్తి కోసమో, గొడవల వల్లనో చంపలేదు. కేవలం దేశనాయకుడిని రక్షించుకోవడం కోసమే చంపింది. పురాణాల్లో ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడిని ఎదిరించాడు, ఎందుకంటే తండ్రి అధర్మ మార్గంలో ఉన్నాడు కాబట్టి. విభీషణుడు తన సోదరుడు రావణుడిని వదిలేశాడు, రాముడిని ఆశ్రయించాడు. అలాగే నీరా ఆర్య కూడా ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే సూత్రాన్ని పాటించింది. దేశమే పరమ ధర్మం అని నమ్మింది. అందుకే ఈ హత్య ఒక పవిత్ర కార్యంగా, ఒక విప్లవ చర్యగా కీర్తించబడింది. భర్త మరణంతో ఆమె ‘వితంతువు’ కాలేదు, దేశానికి ‘వీరనారి’ అయ్యింది. కానీ ఈ చర్య ఆమెకు భవిష్యత్తులో నరకాన్ని చూపించబోతోంది. భర్తను చంపిన నేరానికి ఆమె అరెస్ట్ అయ్యింది. ఆమె జీవితంలోని అసలైన విషాదం, అండమాన్ జైలు గోడల మధ్య ఇక మొదలుకాబోతోంది. ఆమె చేతులకు పడిన సంకెళ్లు, ఆమె ఆత్మస్థైర్యాన్ని బంధించలేకపోయాయి.
5.కారాగార వాసం & చిత్రహింసలు: తెగనరక బడిన మాతృత్వం
విచారణ: న్యాయం పేరుతో జరిగిన ప్రహసనం
శ్రీకాంత్ జైరంజన్ దాస్ చనిపోయిన తర్వాత, నీరా ఆర్య బంధించబడ్డారు. బ్రిటీష్ కోర్టులో జరిగిన విచారణ ఒక నాటకం మాత్రమే. ఆమెను ఒక ‘స్వాతంత్ర్య సమరయోధురాలి’గా కాకుండా, ఒక ‘భర్తను చంపిన హంతకురాలు’గా, ‘రాజద్రోహి’గా చిత్రించారు. ఆమె తన ఆత్మకథలో రాసుకున్నట్లుగా… కోర్టులో ఆమె తలవంచుకోలేదు. న్యాయమూర్తి ‘నువ్వు నీ భర్తను ఎందుకు చంపావు?’ అని అడిగినప్పుడు, ఆమె ‘నేను నా భర్తను చంపలేదు, ఒక దేశద్రోహిని శిక్షించాను,’ అని సమాధానమిచ్చింది. ఈ సమాధానం బ్రిటీష్ వారి అహంకారాన్ని దెబ్బతీసింది. ఫలితంగా ఆమెకు అత్యంత కఠినమైన శిక్ష విధించబడింది ‘కాలాపానీ’. అంటే అండమాన్ సెల్యులార్ జైలుకు తరలింపు.
అండమాన్ జైలు: నరకానికి ప్రతిరూపం
అండమాన్ సెల్యులార్ జైలు అనేది భారతీయ విప్లవకారుల పాలిట మృత్యుకూపం. అక్కడి గోడలు ఎన్నో ఆక్రందనలను తమలో దాచుకున్నాయి. నీరా ఆర్యను అక్కడ ఒక చిన్న చీకటి గదిలో బంధించారు. వెలుతురు లేని గది. కలుషితమైన ఆహారం పెట్టేవారు. ఎడతెగని మానసిక వేదన. కానీ ఆమె శరీరానికి సంకెళ్లు వేయగలిగారు కానీ, ఆమె మనసులోని స్వేచ్ఛాకాంక్షను వారు బంధించలేకపోయారు. ఆమె జైలు గోడలపై బొగ్గుతో ‘జై హింద్’ అని రాసేవారని, తోటి ఖైదీలకు ధైర్యం చెప్పేవారని కొన్ని కథనాలు ఉన్నాయి.
చిత్రహింసల పర్వం: అసలైన పరీక్ష
బ్రిటీష్ అధికారులకు నీరా ఆర్య దగ్గర నుండి ఒకే ఒక విషయం కావాలి – ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నారు? ఆజాద్ హింద్ ఫౌజ్ తదుపరి ప్రణాళిక ఏమిటి?’. ఈ నిజం కక్కించడానికి వారు ప్రయోగించని అస్త్రం లేదు.
శారీరక హింస: కాళ్లకు, చేతులకు బరువైన ఇనుప గొలుసులు కట్టారు. ఆ గొలుసుల బరువు వల్ల ఆమె నిలబడలేకపోయేది, సరిగా కూర్చోలేకపోయేది. చేతులకున్న ఇనుప గొలుసులు తీస్తున్నాం అనే నెపంతో చర్మాన్ని కత్తిరించడం, కాళ్ళ కున్న ఇనుప గొలుసులు తీస్తున్నాం అనే నెపంతో కాలి వేళ్ళను సుత్తితో కొట్టడం చేసేవారు. అన్నింటినీ మౌనంగానే భరించారు. వెలుతురు లేని గదిలో, ఎలుకలు, పురుగుల మధ్య బ్రతకడం, కొరడాలతో కొట్టడం, నిద్రపోనివ్వకుండా చేయడం, ఆకలితో మాడ్చడం వంటివి నిత్యకృత్యం.
మానసిక హింస: ‘నేతాజీ చనిపోయారు,’ అని అబద్ధాలు చెప్పి ఆమె మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారు. కానీ ఆమె, ‘సూర్యుడు చనిపోవడం ఎంత అబద్ధమో, నేతాజీ మరణం కూడా అంతే అబద్ధం,’ అని తిప్పికొట్టింది.
వక్షోజాల ఖండన: అమానుషత్వానికి పరాకాష్ట
ఇది నీరా ఆర్య ఆత్మకథలో అత్యంత బాధాకరమైన పేజీ. ప్రపంచ చరిత్రలో ఒక మహిళా ఖైదీపై జరిగిన అత్యంత క్రూరమైన లైంగిక మరియు శారీరక దాడి ఇది.
ఒక రోజు జైలర్ విచారణ పేరుతో ఆమె గదిలోకి వచ్చాడు. వారి మధ్య జరిగిన సంభాషణ ఆమె మాటల్లోనే
జైలర్: ‘నీ గుండెలో ఉన్న రహస్యాన్ని (నేతాజీ ఆచూకీ) బయటకు చెప్పు.’
నీరా: ‘నా గుండెలో నేతాజీ ఉన్నారు. ఆయన ఆచూకీ నా ప్రాణం పోయినా చెప్పను.’
జైలర్ (కోపంతో): ‘ఓహో! నీ గుండెలో నేతాజీ ఉన్నాడా? అయితే నేను ఆ గుండెనే బయటకు తీస్తాను. చూద్దాం అందులో నేతాజీ ఎలా ఉంటాడో.’
ఈ మాట అంటూ, ఆ రాక్షసుడు అక్కడ ఉన్న కమ్మరిని పిలిచాడు. ఇనుమును కరిగించే లేదా పట్టుకునే పరికరాన్ని తీసుకు రమ్మన్నాడు. స్త్రీత్వానికి, మాతృత్వానికి ప్రతీక అయిన ఆమె వక్షోజాన్ని ఆ ఇనుప పరికరంతో ఒడిసిపట్టి, క్రూరంగా కోసివేయించాడు. (గట్టిగా నొక్కి వికృతం చేశాడు అని మరికొన్ని కథనాల్లో ఉంది.) ఆ సమయంలో ఆమె పడిన బాధను వర్ణించడానికి భాష చాలదు. రక్తం ధారలుగా కారుతున్నా, ఆమె స్పృహ కోల్పోతున్నా, ఆమె నోటి నుండి రహస్యం బయటకు రాలేదు. ఆమె పెదవి దాటిన ఏకైక మాట ‘జై హింద్’.
స్త్రీవాద విశ్లేషణ: శరీరంపై రాజకీయ దాడి
సాహిత్య మరియు స్త్రీవాద కోణంలో చూస్తే, ఈ ‘వక్షోజాల ఖండన’ కేవలం శారీరక హింస మాత్రమే కాదు. ఇది ఒక ‘జెండర్ బేస్డ్ వైలెన్స్’.
- మాతృత్వంపై దాడి: వక్షోజాలు పాలిచ్చి బిడ్డను పెంచే మాతృత్వానికి చిహ్నం. బ్రిటీష్ అధికారి ఆమె వక్షోజాలను లక్ష్యంగా చేసుకోవడం అంటే, ‘భారతీయ మాతృత్వాన్ని’ అవమానించడమే. ఒక తల్లిగా ఆమె భవిష్యత్తును నాశనం చేయాలనే కుట్ర ఇందులో దాగుంది.
- స్త్రీ అస్తిత్వాన్ని దెబ్బతీయడం: పురుష ఖైదీలను కొడతారు లేదా ఉరి తీస్తారు. కానీ మహిళా ఖైదీని ఇలాంటి అవయవ భంగం చేయడం ద్వారా, ఆమెను ఒక స్త్రీగా మానసికంగా చంపాలని ప్రయత్నించారు. ఇది పురుషాహంకారానికి మరియు వలసవాద అహంకారానికి నిదర్శనం.
- శరీరమే యుద్ధభూమి: స్త్రీవాద సాహిత్యంలో తరచుగా చెప్పే మాట ఇది. యుద్ధాల్లో స్త్రీ శరీరాన్ని శత్రువులు ఒక యుద్ధభూమిగా వాడుకుంటారు. నీరా ఆర్య విషయంలో అదే జరిగింది. ఆమె శరీరంపై అయిన గాయం, యావత్ భారత స్త్రీజాతికి జరిగిన అవమానం.
సాహిత్య విశ్లేషణ: అగ్నిపుష్పం నీరా ఆర్య
ఆత్మకథలోని ఈ ఘట్టాన్ని సాహిత్యపరంగా విశ్లేషిస్తే, ఆమె ఒక ‘అగ్నిపుష్పం’ లా కనిపిస్తుంది. ఆమె శరీరం నలిగిపోయింది, కానీ ఆమె ఆత్మ సౌందర్యం చెక్కుచెదరలేదు.
ప్రతీకాత్మకత:
జైలర్ గుండెను తీస్తానంటే, భౌతికమైన వక్షోజాన్ని హింసించాడు. ఇది బ్రిటీష్ వారి అవివేకాన్ని, వారు కేవలం శరీరాన్ని మాత్రమే జయించగలరని, ఆత్మను జయించలేరని నిరూపిస్తుంది.
తులనాత్మక పరిశీలన: పురాణాల్లో ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో అవమానించబడింది. కానీ నీరా ఆర్య, వస్త్రాపహరణం కంటే ఘోరమైన ‘అంగ విచ్ఛేదనాన్ని’ ఎదుర్కొంది. తన ధైర్యమే తన రక్షగా నిలబడింది. అండమాన్ జైలులో ఆమె చిందించిన రక్తం, భారతదేశ స్వాతంత్ర్య వృక్షానికి ఎరువుగా మారింది. వక్షోజాలు కోల్పోయిన ఆమె, లక్షలాది మంది భారతీయులకు ‘వీరమాత’గా మారింది. ఆ గాయం మానిపోయి ఉండవచ్చు, కానీ అది ఇచ్చిన నొప్పి, ఆమె రాసిన ‘మేరా జీవన్ – మేరా సంఘర్ష్’ పుస్తకంలోని ప్రతి అక్షరంలోనూ మనకు కనిపిస్తుంది. ఈ అధ్యాయం చదివిన తర్వాత, పాఠకుడికి స్వాతంత్ర్యం యొక్క నిజమైన విలువ – అది ఎంత ఖరీదైనదో – అర్థమవుతుంది.
6.స్వాతంత్ర్యం తరువాత విషాదం: పూల వాసనలో దాగివున్న కన్నీటి గాథ
స్వేచ్ఛా భారతం – ఆమెకు మిగిలిన శూన్యం
1947, ఆగస్టు 15న భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. కానీ, ఆ జెండా రంగుల వెనుక నీరా ఆర్య వంటి ఎందరో త్యాగధనుల రక్తపు మరకలు ఉన్నాయని లోకం మర్చిపోయింది. అండమాన్ జైలు నుండి విడుదలైన నీరా ఆర్యకు స్వాగతం పలికే నాధుడు లేడు. ఆమెకు ఇల్లు లేదు, భర్త లేడు, ఆమె చేతిలోనే మరణించాడు. ఆమె ఆరాధించిన నాయకుడు నేతాజీ లేడు. ఆమె శరీరంపై బ్రిటీష్ వారు చేసిన గాయాలు ఉన్నాయి, మనసు నిండా తీరని వేదన ఉంది. ఒక రకంగా చెప్పాలంటే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కానీ నీరా ఆర్యకు మాత్రం ‘ఒంటరితనం’ అనే కొత్త కారాగారం లభించింది.
హైదరాబాద్‌తో అనుబంధం – ఫలక్‌నుమాలో జీవితం
విధి ఆమెను హైదరాబాద్ నగరానికి చేర్చింది. దేశ విభజన, రాజకీయ పరిణామాల తర్వాత ఆమె తన శేష జీవితాన్ని గడపడానికి ఈ నగరాన్ని ఎంచుకున్నారు. కానీ ఆమె నివసించింది భవంతుల్లో కాదు, ప్యాలెస్‌లలో కాదు. ఫలక్‌నుమా ప్రాంతంలోని ఒక చిన్న రేకుల షెడ్డు లాంటి గుడిసెలో. ఆమె ఆత్మకథ ‘మేరా జీవన్ – మేరా సంఘర్ష్’ లోని చివరి పేజీలు చదువుతుంటే, ఒక రాణిలా బతకాల్సిన ఆమె, ఒక బిచ్చగత్తె కన్నా హీనంగా బతకాల్సి వచ్చిందే అని బాధ కలుగుతుంది. కానీ ఆమె ఆ దారిద్ర్యాన్ని కూడా ఒక యోగినిలా స్వీకరించారు.
పూలమ్మే పెద్దమ్మ: చేతిలో తుపాకీ నుండి పూలదండ వరకు
ఇది ఆమె జీవితంలోని అత్యంత వైరుధ్యభరితమైన కోణం. ఒకప్పుడు ఏ చేతులైతే తుపాకీ పట్టి శత్రువులను వేటాడాయో, ఏ చేతులైతే గూఢచారిగా రహస్య పత్రాలను రవాణా చేశాయో… అదే చేతులు బతకడం కోసం పూలదండలు కట్టాయి.
“చార్మినార్ సాక్షిగా, ఆమె చేతులు మల్లెపూలను దండగా కడుతుంటే, ఆమె కళ్లు మాత్రం ఎక్కడో సుదూర అండమాన్ తీరాలను వెతుకుతున్నాయి.” ఆమె హైదరాబాద్ వీధుల్లో పూలు అమ్ముతుంటే, అక్కడి జనం ఆమెను ‘పెద్దమ్మ’ అని ఆప్యాయంగా పిలిచేవారు. కానీ ఆ ముడతలు పడ్డ ముఖం వెనుక, ఒక అగ్నిపర్వతం దాగి ఉందని ఎవరికీ తెలియదు. ఆమె ఎవరికీ తన గతాన్ని చెప్పుకోలేదు. ‘నేను ఒక స్వాతంత్ర్య సమరయోధురాలిని’ అని డబ్బాలు కొట్టుకోలేదు. నిశబ్దంగా, అనామకంగా జీవించడానికే ఆమె ఇష్టపడ్డారు. పువ్వులు అమ్మగా వచ్చిన చిల్లర డబ్బులే ఆమెకు జీవనాధారం.
ఆత్మాభిమానం: ప్రభుత్వ సాయం తిరస్కరణ
నీరా ఆర్య దారిద్ర్యం గురించి తెలుసుకున్న కొందరు ప్రభుత్వ అధికారులు, స్వాతంత్ర్య సమరయోధుల కోటాలో ఆమెకు పెన్షన్ ఇస్తామని, ఇల్లు మంజూరు చేస్తామని ముందుకు వచ్చారు. ఆ సమయంలో ఆమె చూపిన తెగువ, ఆమె ఆత్మగౌరవానికి నిదర్శనం. ఆమె వారితో అన్న మాటలు చరిత్రలో లిఖించదగినవి. “నేను నా దేశం కోసం పోరాడాను, నా స్వార్థం కోసం కాదు. కన్నతల్లికి సేవ చేసినందుకు ఎవరైనా కూలీ డబ్బులు అడుగుతారా? స్వాతంత్ర్యం వ్యాపార వస్తువు కాదు. నాకు మీ పెన్షన్ వద్దు, మీ సానుభూతి వద్దు.” ఈ మాటలు నేటి సమాజానికి చెంపపెట్టు. పదవుల కోసం, పావలా ప్రయోజనాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టే వారికి, నీరా ఆర్య జీవితం ఒక పాఠం. ఆమె ఆకలితో అలమటించింది కానీ, ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేదు. చివరికి తన గుడిసెను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నప్పుడు కూడా (కొన్ని కథనాల ప్రకారం), ఆమె నిశబ్దంగా రోదిస్తూ ఉండిపోయిందే తప్ప, ‘నేను పలానా’ అని చెప్పి అధికారాన్ని అడ్డుపెట్టుకోలేదు.
నిజమైన సంఘర్షణ
ఆమె ఆత్మకథ నుండి పేదరికం గురించి ఆమె రాసుకున్న వాక్యాలు.. “నాకు ఆకలి వేసినప్పుడల్లా, జైలులో తిన్న మట్టి రొట్టెలే గుర్తుకొస్తాయి” ఆమె పోరాటం కేవలం బ్రిటీష్ వారిపై మాత్రమే కాదు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆకలితో, పేదరికంతో, వ్యవస్థ నిర్లక్ష్యంతో కూడా ఆమె పోరాడారు. బహుశా, బ్రిటీష్ వారితో చేసిన పోరాటం కంటే, ఈ మలి జీవిత పోరాటమే ఆమెకు ఎక్కువ కష్టంగా అనిపించి ఉండవచ్చు. ఫలక్‌నుమా వీధుల్లో ఆమె అమ్మిన పూలు వాడిపోయి ఉండవచ్చు. కానీ ఆమె జీవితం వెదజల్లిన త్యాగ పరిమళం ఎప్పటికీ వాడిపోదు. ఆమె ఒక నిశబ్ద విప్లవం. చరిత్ర విస్మరించిన ఒక అగ్ని కణం.
మూస ధోరణులను బద్దలు కొట్టిన స్త్రీ
సాహిత్య మరియు స్త్రీవాద కోణంలో చూస్తే, *నీరా ఆర్య ఒక ‘ఐకాన్’.*
* భర్త ఆదేశాలను కాదని దేశాన్ని ఎంచుకోవడం ద్వారా ఆమె పితృస్వామ్య వ్యవస్థను ధిక్కరించింది.
* శత్రువు గుండెల్లోకి చొరబడి గూఢచర్యం చేయడం ద్వారా ఆమె స్త్రీ అబల కాదు, సబల అని నిరూపించింది.
* వక్షోజాలు కోల్పోయినా కుంగిపోకుండా నిలబడటం ద్వారా ఆమె శారీరక సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యమే మిన్న అని చాటిచెప్పింది.
అంతిమ యాత్ర: అనాధలా నిష్క్రమణ
1998, జూలై 26న హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో ఆ వీరనారి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం ఒక సాధారణ పేద వృద్ధురాలి మరణంలా మిగిలిపోయింది. ప్రభుత్వ లాంఛనాలు లేవు. గన్ సెల్యూట్లు లేవు. జాతీయ జెండా కప్పడం లేదు. కేవలం కొంతమంది స్థానికులు, ఆమె గొప్పతనం తెలిసిన కొద్దిమంది మాత్రమే ఆమె అంతిమ యాత్రలో పాల్గొన్నారు. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఒక మహాసాధ్వి, అనాధలా లోకాన్ని విడిచి వెళ్ళింది. మనం స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాం కానీ, ఆ స్వాతంత్ర్యాన్ని సంపాదించడానికి కారణమైన వారిలో కొందరికి దక్కాల్సిన గౌరవ మర్యాదలు, ఆదరణ మాత్రం కరువైయ్యాయి.
ముగింపు: త్యాగానికి నిలువుటద్దం
నీరా ఆర్య ఆత్మచరిత్ర ‘మేరా జీవన్ – మేరా సంఘర్ష్’ కేవలం ఒక మహిళ కథ కాదు. అది భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలోని ఒక నిగూఢ అధ్యాయం. ఒక సంపన్న కుటుంబంలో పుట్టి, ఆజాద్ హింద్ ఫౌజ్ గూఢచారిగా మారి, దేశం కోసం భర్తనే హతమార్చి, వక్షోజాలను కోల్పోయి, చివరికి పేదరికంలో మరణించిన ఆమె ప్రస్థానం… ఒక విషాద కావ్యంతో సమానం. ఆమె జీవితం మనకు నేర్పే పాఠం ఒక్కటే – ‘స్వాతంత్ర్యం అనేది ఒక వరం కాదు, అది ఎందరో వీరుల రక్తతర్పణం.’
భవిష్యత్తుకు సందేశం
నీరా ఆర్య ఆత్మకథ మేరా జీవన్ – మేరా సంఘర్ష్ నేటి యువతకు ఒక దిక్సూచి. ఆమె ఒక పువ్వులా వాడిపోలేదు, ఒక విత్తనంలా నేలకొరిగింది. ఆ విత్తనం నుండే భవిష్యత్ తరాల దేశభక్తి మొలకెత్తాలి. దేశభక్తి అంటే కేవలం కొన్ని సందర్భాలలో జెండా ఊపడం మాత్రమే కాదు అవసరమైనప్పుడు దేశం కోసం నిలబడటం, త్యాగం చేయడం. ఆమె మరణించి ఉండవచ్చు, కానీ ఆమె స్ఫూర్తి ఆజాద్ హింద్ ఫౌజ్ నినాదం ‘కదమ్ కదమ్ బడాయే జా’ (ముందుకు సాగుతూనే ఉండు) రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటుంది. ఆమెను ‘తొలి మహిళా గూఢచారి’గా మాత్రమే కాకుండా, ఒక గొప్ప ‘త్యాగమూర్తి’గా గుర్తించి గౌరవించడమే మనం ఆమెకు అర్పించే నిజమైన నివాళి.
ఆధార గ్రంథాలు
- ఆర్య, నీరా. 2021. మేరా జీవన్ – మేరా సంఘర్ష్ (మధు ధామ, సం.) ఎంప్టీ కాన్వాస్ పబ్లిషర్స్. ఢిల్లీ.
- ఈనాడు తెలుగు దినపత్రిక: ‘నీరా ఆర్య: ది ఫర్గాటెన్ స్పై’. ఫీచర్ ఆర్టికల్ ఆర్కైవ్స్ (8, మార్చి, 2025.)
- సాక్షి తెలుగు దినపత్రిక: ‘మణిపూసలు – నీరా ఆర్య’ – ఫ్యామిలీ సెక్షన్ ఫీచర్. (29, August, 2025.)
– డా. శిరీష ఈడ్పుగంటి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
తొలి మహిళా గూఢచారి (వ్యాసం ) – డా. శిరీష ఈడ్పుగంటి. — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>