నా కథ : 16 (ఇంటర్మీడియట్) — డా.బోంద్యాలు బానోత్(భరత్)

నేను, తొర్రూరు మండల ‘ఎస్ ఎఫ్ ఐ’ ఇంచార్జీగా బాధ్యతలు తీసుకున్నాను. వెంటనే తొర్రూరు పట్టణంలోని విద్యాసంస్థల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను. అదే విధంగా తొర్రూరు మండలంలోని విద్యాసంస్థలను అధ్యాయనం చేయడం మొదలు పెట్టాను. కాని తొర్రూరులో రూం తీసుకుని ఉండడానికి డబ్బులు లేకుండే. ఐతే, తొర్రూరు ఎస్ టీ హాస్టల్లో ఉంటూ ఆర్గనైజేషన్ చెయ్యాలని ప్లాన్ చేశాను. హాస్టల్ వార్డెన్ తో మాట్లాడాను.’ నాకేమి అభ్యంతరం లేదు, కాని మీరు ఈ పిల్లల మద్య ఉండగలరా? ఆలోచించుకోండి..’ అని అన్నాడు. వార్డెన్ చెప్పినట్టే, రెండు – మూడు రోజులు మాత్రమే ఆ హాస్టల్లో ఉండగలిగాను.
నేను, జిలుకర శ్రీను, మేమిద్దరం కలిసి శారదా స్కూల్లో విద్యావిధానం గురించి సెమినార్ ఇచ్చాము. ఐతే ,’ఎస్ ఎఫ్ ఐ’ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులు తెల్దారు పల్లీలో జరిగినాయి. ఆ తరగతులకు రాష్ట్ర వ్యాప్తంగా, హార్డ్ కోర్ ‘ఎస్ ఎఫ్ ఐ’ నాయకులు హాజరయ్యారు. అందులో నేనొక్కడిని. ఆ క్లాసులు చెప్పడానికి, చాలా పెద్ద వాళ్ళూ, ఎంపీలు, ఎం ఎల్ ఏ లూ, మేధావులు వచ్చారు. ” సామాజిక పరిణామక్రమం, గతితార్కిక భౌతికవాదం, మార్క్స్, లెనిన్, ఎంగెల్స్.. వారి జీవిత విశేషాలు, తర్వాత సమాజ మార్పులో విద్యార్థుల పాత్ర, భారత దేశ విద్యా విధానం, విద్యార్థులు తక్షణ కర్తవ్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు, కర్తవ్యాలు.. ఇలా అనేక విషయాలు బోధించారు. ఆ క్లాసులు నాపై చాలా ప్రభావం చూపాయి. సామాజిక మార్పుకోసం నా జీవితాన్ని త్యాగం చెయ్యాలి అని అనిపించింది. కాని, నేను చాలా కష్టపడి చదువుతున్నాను అంటే 9 సంవత్సరాలు పాలేరుగా పశువులను కాసాను, రాత్రి పూట బడికి పోయాను, తద్వారా నేరుగా ఏడవ తరగతిలో ప్రవేశం చేసి, చదువుకున్నాను. కాబట్టి, ఏది చేసినా చదువుతూ చెయ్యాలన్నదే నా ఉద్దేశం. అందుకే చదువుతూనే ఎస్ ఎఫ్ ఐ’ లో పని చేశాను.
ఆ తర్వాత పదిరోజులపాటు స్టడీ క్యాంప్ కు ప్లాన్ చేశారు. వరంగల్ జిల్లాలోని అన్ని డివిజన్లలో నీ, ముఖ్యమైన ‘ఎస్ ఎఫ్ ఐ’ నాయకుల కోసం పెట్టారు. ఈ స్టడీ క్యాంప్ ‘రాజోలు’ గ్రామంలో పెట్టారు. ఈ స్టడీ క్యాంప్ యెక్క ఉద్దేశ్యం, ‘పదిరోజులపాటు, ముఖ్యమైన పుస్తకాలు చదివి, వాటిపై చర్చ చెయ్యాలని. ఈ క్యాంప్ కు విచ్చిన వాళ్ళును, రోజుకు ఒక్కరిని లేదా ఇద్దరినీ ఒక ఇంటికి అటాచ్ చేశారు. ఎవరింటికైతే అటాచ్ చేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళు ఏది పెట్టినా తిని రావాలని, భోజనం విషయంలో, అది బాగా లేదు, ఇది బాగా లేదు.. మొదలగు కామెంట్లు చెయ్యకుడదు.’ అని ఆదేశించారు. మేము అలానే చేశాము. మేము 10-15 మందిమి. మేమందరం ఆ గ్రామంలో నీ పాఠశాలలో ఉన్నాము. మార్క్స్, లెనిన్, ఎంగెల్స్, అంబేద్కర్, గాంధీ, నెహ్రూ.. వారి జీవిత విశేషాలు.. చరిత్ర చదివి చర్చ చేసినం.
ఆ గ్రామం అంతా సీపీయం పార్టీ గ్రామం. ఆ గ్రామంలో ప్రతి కూడళీలో ఒక చిన్న పాంటీ స్తూపం వుండేది. ప్రతి ఇంట్లో ‘జ్యోతిబసు’, ఫోటో తో పాటూ, ‘తమ్మినేని వీరభద్రం’ ఫోటో ఉంది.అది చూసి నేను ప్రభావితుడినయ్యాను. దేశంలోని అన్ని గ్రామాలు ఇలా మారితే, దేశంలో సోషలిజం తప్పకుండా వచ్చి తీరుతుంది అని అనిపించింది. మాకు పర్యవేక్షకులుగా, పీ. నాగేశ్వరరావు, ఉప్పలయ్యా వ్యవహరించారు. ఈ స్టడీ క్యాంప్ ను చాలా విజయవంతంగా పూర్తి చేసుకోని వెళ్ళి పోయాము. ఆ రోజు మార్నింగ్ రాజోలు నుండి బయలు దేరి, ఎవరి డివిజన్ కూ వాళ్ళు వెళ్ళిపోయారు . మేము మానుకోట డివిజన్ ‘ఎస్ ఎఫ్ ఐ’ ఆఫీసు కొచ్చీ, అక్కడినుండి మా ఇంటికి పోయాను. వరుసగా పదిరోజులపాటు ఇంటికి రాకుండా, ఎలాంటి సమాచారం లేకుండా, ఎక్కడికి పోయావు? ఎక్కడుంటున్నావు!?, ఏంచేస్తూన్నావు!?, ఏంటిరా ఇదీ?’ అని మా నాన్న అడిగాడు. ఐతే, ఆయనకు ఏదో సమాధానం చెప్పీ, దాటవేశాను.
ఒక రోజు, జిల్లా కార్యదర్శి పిలుపు మేరకు తొర్రూరు నుండి వరంగల్ జిల్లా పార్టీ ఆఫీస్ కు, బస్సులో కూర్చుని వెళుతున్నాను. సీటు పై కూర్చుని నిద్రపోయాను. ఆ నిద్రలో సీపీఐ (ఎమ్) పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరూ ఏకమై ఉద్యమించీ, సోషలిజం తెచ్చకున్నట్లూ.. ప్రజల సమస్యలన్నీ తీర్చినట్లూ, కలకన్నాను. వరంగల్ రేల్వే అండర్ బ్రిడ్జి కాడికొచ్చినంకా నిద్ర లేచాను. ఆ బ్రిడ్జి పక్కన్నే సిపీఐ(ఎమ్) పార్టీ ఆఫీస్ ఉండేది. ఆ ఆఫీస్ లోనే చాలా మంది, వివిధ స్థాయిల్లో పనిచేసే నాయకులకు, రాజకీయ తరగతులు నిర్వహించారు. అందులో ‘రాములు’ గారు కాంగ్రెస్ పార్టీ చరిత్ర, దాని స్వభావం.. మొదలగు విషయాలు చెప్పారు. ‘నాగయ్య’ గారు పార్టీ నిర్మాణం పై క్లాస్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ తొర్రూరుకు వచ్చేశాను.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు అదే విధంగా పదవ తరగతి వార్షిక పరీక్షలు దగ్గరికొచ్చినాయి. విద్యార్థులందరూ పరీక్షల తయ్యరిలో తలమూనకలై ఉన్నారు. కాని కరంట్ రాకపోవడంతో పరీక్షల తయ్యారిలో ఆటంకంగా మారుతుంది. అప్పుడు ‘చంద్రబాబు నాయుడు’ గారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నవాళ్ళు కోపంతో మసులు తున్నారు. నేను అప్పుడే కొత్తగా తొర్రూరు మండల ‘ఎస్ ఎఫ్ ఐ’ ఇంచార్జీగా బాధ్యతలు స్వీకరించాను. కొత్తగా ఒక మండలానికి ‘ఎస్ ఎఫ్ ఐ’ నాయకత్వం వహించిన సందర్భంగా, వెంటనే ఒక కార్యక్రమం చేయాలని సంకల్పించాను.’ ఐతే, రెండు రోజులపాటు తొర్రూరులోని విద్యాసంస్థలను, విద్యార్థులను కలిసి ఈ కరెంట్ కొరత సమస్య పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులతో ఒక ర్యాలీ తియ్యాలని నిర్ణయించాను’. ఈ విషయం తొర్రూరులోని పార్టీ పెద్దలతో మాట్లాడి, వాళ్ళ సలహా మరియు అనుమతి తీసుకొని 700-1000 మంది విద్యార్థులతో , తొర్రూరు బస్టాండ్ నుండీ గుర్తూరు క్రాస్ రోడ్ వరకు, ఒక ర్యాలీ తియ్యాలని నిర్ణయించాను. ఈ విషయం పై నేను నా చేతులతో స్వంతంగా ఒక ‘పాంప్లెట్’ రాశాను. దాన్ని టైప్ చేపించీ 500-600 కాపీలు జిరాక్స్ తీపించీ అందరికీ పంచాను. ఈ కార్యక్రమం నా జీవితంలో, నాకు మరపురాని అనుభూతిని కలిగించింది. ఇక ర్యాలీ రోజు నేను మరియు జిలుకర శ్రీను, ఇద్దరం బస్ స్టాండ్ వద్ద జిలుకర శ్రీను మరియు ప్రభుత్వ పాఠశాల వద్ద నేను వుండీ, పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, ‘బాయ్ కాట్’ చేసి, విద్యార్థులను రోడ్డు పైకీ తీసుకుని వచ్చాము.
బస్టాండ్ నుండీ ప్రభుత్వ పాఠశాల, అన్నారం క్రాస్ రోడ్, పూసలెంకటయ్య ఇంటి ముందు సీపీఎం పార్టీ స్తూపం వరకు వుంది. ర్యాలీకీ ముందు నేను నడుస్తున్నాను, ర్యాలీ వెనుక జిలుకర శ్రీను నడుస్తున్నాడు. మధ్య మధ్యలో, విద్యార్థులు,నేను రాసిచ్చిన నినాదాలు చేస్తున్నారు. అందరికంటే ముందు నడుస్తూ నేను ‘ కరెంట్ ని కనీస అవసరాలకు అనుగుణంగా ఇవ్వాలని, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకూ కరెంట్ కొరత శాపంగా మారిందని, 24 గం. కరెంట్ ఇవ్వాలని, నినాదాలు చేస్తూ, ర్యాలీ ముందుకు కొనసాగుతున్న సమయంలో, ఇద్దరు పోలీసులు వచ్చి, మాతో ర్యాలీలో పాల్గొన్నారు, మాతో పాటుగా వాళ్ళు కూడా నడుస్తున్నారు. నేను మొదటి సారిగా ఇంత పెద్ద ర్యాలీ ‘ఎస్ ఎఫ్ ఐ’ పేరుమీద నా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టాను. ముందుకు పోతుంటే కొద్దిసేపటికి ఇంకో ఇద్దరు పోలీసులు వచ్చారు. నా కు ఇంతకు ముందు ఇలాంటి అనుభవం లేని కారణంగా కావచ్చూ, ఆ పోలీసులను చూసి నాలో నేను కొంచం భయపడ్డాను, కాని పైకి మాత్రం మ్యాకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాను. ర్యాలీ అంబేద్కర్ థియేటర్ దాటి, చౌరస్తాకు చేరుకుంది. అక్కడ సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రసంగించాను. ‘చివరగా ఈ ర్యాలీలో పాల్గొని, విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను.’ అని అంతటితో ఆ కార్యక్రమాన్ని ముగించాను.
ఎట్టకేలకు ర్యాలీ విజయవంతమైంది. చివరగా పోలిసులు ‘ మీరు ఒకసారి స్టేషన్ కు రావలసి వుంది, మా ‘ఎసై’ గారు కలవమన్నారు’ అని చెప్పారు. భయం కొంచెం పెరిగింది. ర్యాలీ అయితే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా పూర్తి చేసాము. అప్పుడు ‘ ఓకే సార్ మేమే వచ్చీ కలుస్తాము.’ అని చేప్పాను. పోలిసులు వెళ్ళి పోయారు.
తర్వాత రోజు నేను కాలేజీకీ వెళ్ళాను. ఇంగ్లీష్ సార్ క్లాస్ లో ఉన్నారు. నేను వరసగా చాలా రోజులు కాలేజీకి వెళ్ళలేదు (అబ్ సెంట్) అయ్యాను. వరుసగా చాలా రోజులు కాలేజీకి రాకపోవడానికి కారణాలు అడిగాడు. అప్పుడు నేను ‘సార్, ఈ పుస్తకంలో ఏముంది? సార్, బయటవుంది అసలు చదువు, అసలు ప్రపంచం సార్.’ అని అన్నాను. అప్పుడాయన ‘ఇదిగో నేనొక మాట చెప్పుతున్న గుర్తు పెట్టుకో! నీలాంటి వాడు నిలకడగా వుండి చదువుతే అద్భుతాలే చేస్తారు. కాని ఏదోరోజు తెలుసుకోని, మళ్ళీ నువ్వు ఇదే పుస్తకం చదువుతావు!. ఇంకో మార్గమే లేదు. ఈ నా మాటలు నీకు తర్వాత గుర్తుకు వాస్తాయి. తర్వాత నీ ఇష్టం.’ అన్నాడు. అయినా నేను ఆయన మాటలను, పెడచెవున పెట్టాను. ఇంతలోనే ఇంటర్ ఆనువెల్ పరీక్షల తేదీలు ఖరారు చేశారు. నేను ఈ సంవత్సరమంతా ‘ఎస్ ఎఫ్ ఐ’ కార్యక్రమాల్లో పాల్గొనడమే సరిపోయింది. పరీక్షలకు మానసికంగా సిద్ధంగా లేను. పరీక్షలు రాసి ఫేలవడంకంటే, రాయకుండా ఉండటమే మంచిదనిపించింది. మొత్తానికి పరీక్షలు రాయలేదు. అందరూ పరీక్షలు రాస్తున్నారు. కాని నాలో ఏదో అపరాధ భావన కలుగుతుంది. రెండు రోజులపాటు నిద్రపట్టలేదు. తెలందాకా ఆలోచనలే.. ఎంతో కష్టపడితే కాని బడిలో చేరలేదు. అట్లాంటిది ఈ సంవత్సరం అంతా ఊరకనే వేస్టైంది. సమయం అంతా వృధా అయింది. ఐతే ఆ రాత్రంతా ఆలోచించీ ఒక సంకల్పం తీసుకున్నాను, అది ‘ఎట్లాగైన’ అవకాశం ఉన్నంత వరకు పై చదువులు చదవాలని.
చూస్తుండగానే ‘ మే’ నెల అయి పోయింది. జూన్ నెల రాగానే మళ్లీ స్కూళ్ళు, కాలేజీలు మొదలైనాయి. 1997-1998 సంవత్సరంలో, మళ్ళీ కొత్తగా ఇంటర్ సీఈసీ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందాను. నా కంటే మూడు సంవత్సరాలు జూనియర్ పిల్లలతో, క్లాస్ లో కూర్చోవాల్సి వచ్చింది. చదవాలంటే తప్పదు! అనుకున్నాను. కాలేజీలో ప్రవేశం పొందగానే మొదటి రోజున, అందరితో పరిచయం చేసుకున్నాను.’ మాది మైలారం, రాయపర్తి మండలం, ఐతే, నేను రూం తీసుకుని ఉండాలనుకుంటున్నాను, ఇప్పటికే ఎవరైన రూం తీసుకుని ఉంటే, మీ రూం లో ఇంకోక్కరికీ ప్లేస్ ఉన్నట్లైతే, నేను చేరడానికి సిద్ధంగా ఉన్నాను, అని అన్నాను. సివిక్స్ క్లాస్ అయిపోయింది. సమయం 4.గం. అవుతుంది. విద్యార్థులు అందరు ఇంటికి వెళ్ళిపోతున్నారు. నేను తిరుమలగిరి ఊళ్ళోకెళ్ళి, రూం వెతకాలని ఆలోచిస్తూ, కాలేజీ నుండి బయటకి పోతుంటే, ఒక విద్యార్థి వచ్చి’ అన్న మేము ఒక చోట ఉంటున్నాము. అదికూడా ఉచితంగానే, కాకపోతే ఇంటి ఓనర్ కొన్ని నియమాలు చెప్పుతాడు, వాటిని పాటీస్తే సరిపోతుంది.’ అని అన్నాడు. ‘ ..

Comments
నా కథ : 16 (ఇంటర్మీడియట్) — డా.బోంద్యాలు బానోత్(భరత్) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>