మాటేరాని మౌనరాగమా…!(కవిత ) ముక్కమల్ల ధరిత్రీ దేవి
పలుకలేని పరిమళపుష్పమా…
ఎలా తెలిసిపోయె నీకు
వేసంగి వచ్చేస్తోందని..!
ఎవరు తట్టి లేపిరి..
నిద్రాణమైఉన్న నీ ఉనికిని !
కళ తప్పిన ఆ కొమ్మల రెమ్మలు
వాడి వడలిన ముదురాకులు…
ఒక్కసారిగా రెక్కలు విదిల్చి..
విహంగాలై..మా ఎదుట ప్రత్యక్షమై
అబ్బురపరుస్తున్నవే..ఏమిటీ మాయ..!
ఓ మల్లికా! స్వచ్ఛతకు మారుపేరు…
అందానికి అసలైన నిర్వచనం…
అన్నీ నీవే కదా! పెళ్ళీపేరంటాలలో
అగ్రతాంబూలం నీకే కదా…
వడగాడ్పులు తాళలేని
మనుషులకు మండువేసవిలో నీవు పంచే
మనుషులకు మండువేసవిలో నీవు పంచే
ఆహ్లాదాల మధురిమలు…
ఆ సుగంధపరిమళ పుష్పసోయగాలు..!
అద్భుతం..అనితరసాధ్యం…
పడతులకు నీ తలంపే పులకరింత !
నెలతల ఇష్టసఖీ! నెలల అనంతరం
నీ దర్శనభాగ్యం!అనిర్వచనీయ ఆనందం!
కనురెప్పపాటులో చిరుమొగ్గలతో
చెట్టంతా నిండిపోయి..పత్రాలతో
పోటీపడుతూ పచ్చని చీర పై
తెల్లని చుక్కలు పరుచుకున్నట్లు..!!
ఆ ముచ్చట చూసే కనులకు
విందులే విందులు..! సంధ్యాసమయాన..
పూజకు వేళాయె రారమ్మంటూ ఓ కొమ్మ..
నీ వాలుజడను సింగారించమంటూ మరో కొమ్మ..
అరవిచ్చిన తమ పూబాలల్ని ప్రదర్శిస్తూ
అరవిచ్చిన తమ పూబాలల్ని ప్రదర్శిస్తూ
ఇంటి ఇల్లాళ్ళను పిలుస్తూన్నట్లు…
ఆ అద్భుత దృశ్యం..వర్ణించడం కవుల
సృజనకు సైతం అందనిదంటే
అతిశయోక్తి కాదు సుమా !
అందుకే అంటున్నా…
మాటేరాని ఓ మౌనరాగమా..
పలుకలేని పరిమళపుష్పమా..!
ప్రకృతి తట్టి లేపి ప్రతీసారి నీ కర్తవ్యం
గుర్తుచేస్తుందిలే..ఏడాదికోసారి ఎదుటనిలిచి
ఎదనిండా సౌరభాలు గుప్పించి..మురిపించి..
మరపురాని అనుభూతులు మాకు వదిలి..
అంతలోనే మాయమైపోతూ…
మరుసటి వేసవికై ఎదురుచూడమంటావు…
ప్రకృతి మేల్కొల్పిన నీవు..ప్రకృతికే అందాలు
అద్ది..ప్రకృతిలో మమేకమైతావు…
నీవు వదిలి వెళ్ళిన సుగంధపరిమళాలు..
మము వీడనివి..మరల నువు
పలకరించుదాక వాడిపోనివి…
అపూర్వ కానుకను సృష్టించి
మాకందించిన ప్రకృతిమాతా..
నీకు సదా వందనం…
~ముక్కమల్ల ధరిత్రీ దేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
మాటేరాని మౌనరాగమా…!(కవిత ) ముక్కమల్ల ధరిత్రీ దేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>