సాహితీ ప్రియుల గుండెల్లో, అజరామరమై నిలిచిపోయే సెలయేటి కవితాక్షరాలు ఈ ‘హేమంతం'(పుస్తక సమీక్ష )- వెంకట్ కట్టూరి
జీవితంలో తమతో అనుబంధం ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా మృత్యువుపేరుతో మాయమైపోతే,ఆ వ్యక్తికి కలిగే దుఃఖం అనిర్వచనీయమైన సన్నివేశం.చనిపోయినవారితో తమకున్న అనుబంధం, గాఢతనుబట్టి అనుభవించే దుఃఖం తీవ్రత ఎంతో ఎక్కువ ఉంటుంది. ఈ అనుబంధాలు రకరకాలుగా ఉంటాయి. స్నేహసంబంధాలే కాక రక్తసంబంధాలు మానవుణ్ని విశిష్టమైన ఆర్ధభావనకు గురిచేస్తాయి. స్మృతికావ్యాల్లో మృతులజ్ఞాపకాలతో, తమకున్న అనుబంధం ఎదుటిగుండెల్ని వువ్వెత్తున స్పృశిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘ఎలిజీ’ శోకపూరిత స్మృతిగీతం లేదా స్మృతిభరిత శోకగీతం.హృదయాన్ని పట్టుకునేలా రాసే స్మృతి వచన కవిత్వం తెలుగులో అమ్యూలమైన కళా రూపం.
ప్రపంచంలోఎక్కడైనా,ఎప్పుడైనా ప్రేమించుకోవడం చూసేవుంటాం,వింటూనే ఉంటాము.కానీ ఇదో గమ్మత్తైన ప్రేమ కథ. ఒక మనిషి చేతిరాతను చూసి ఇష్టపడే ప్రేమ ఎక్కడైనా ఉంటుందా? ఉత్తర, ప్రత్యుత్తరాల్తో మొదలైన ఆ ప్రేమ కథను ఇలా జ్ఞాపకాల దొంతరలో పదిల పరచిన నిఘంటువులోకి తొంగి చూద్దామా…
అటు నెల్లూరు నుండి హైదరాబాద్ గల్లీకి ముడి పడింది చక్కటి దస్తూరి తో…కథకు,కవిత్వానికి మూడు ముళ్ళతో ఏకం చేశారు RRK మూర్తి గారు.కథ,కవిత్వం ‘స్పందన’ యై మానసాంతరంగ మనోఙ్ఞ మై విరాజిల్లి,అనుంగు శిష్య బృందాన్ని ఆలంబనగా అనుసంధానం చేసి, మాయమైన ఆమేఘనాధుని జ్ఞాపకాల చెలమలో హేమాంతరంగ సుధాకరుడి స్మృతి కవితా ఝరిలో మరొక్క పేజీని తిరగేసి చూద్దామా…
సుధాకర్ గారి స్మృతి కవిత్వం లో మెల్లగా గుణగణాల్ని వర్ణించడం మొదలు పెట్టి తరువాత ఉధృతమైన స్వరంతో,సహచరి గురించి తనకున్న జ్ఞాపకాల సారాంశాన్ని చెప్పి పాఠకుడిని తనతో తీసుకుపోతాడు.
‘మా అమ్మ జన్మనిచ్చింది నువ్వు గొప్ప జీవితాన్ని ప్రసాదించావు’.ఇంతకన్నా ఇంకేమి చెప్పాలి భార్యపై ఆయనకి ఎంత ప్రేమ ఉందొ చెప్పడానికి…హేమంతం పేరుతో సుధాకర్ గారు 29 స్మృతి కవితలు రాశారు.
హేమలత గారు చనిపోయిన వారంలోనే వచ్చిన ప్రేమికులదినం నుంచి తరువాత ప్రతి పండగ, వారి పెళ్లి రోజు, వారి పుట్టిన రోజులు, ఇతర ముఖ్యమైన సందర్భాలను అనుసరించి ఈ కవితలను రాశారు సుధాకర్.ఇక చివరి కవిత ఆయన చనిపోయే కొద్ది రోజుల ముందు వచ్చిన క్రిస్మస్ పండుగ.వారి చివరి స్మృతి కవిత ‘తారాన్వేషణ’ రాశారు.
ఆచార్య. బెల్లంకొండ.రాజశేఖర్ గారన్నట్లు ప్రతి తేదీ ఒక అణువుగా పేలి మళ్లీ మళ్లీ అదే జ్ఞాపకాన్ని తిరిగి తెస్తుంది. పిల్లలు ‘అమ్మెక్కడుంది?’ అనే ప్రశ్న దగ్గర సుధాకర్ గారి గుండె పూర్తిగా దగ్ధమవుతుంది. అక్కడ కవిత ‘శోకం’ నుంచి ‘శూన్యం’ వైపు వెళ్తుంది. అయినా, అదే పిల్లలలో ‘హేమ ప్రతిరూపం’ కనిపించడంతో దుఃఖంలోనే ఒక చిన్న దీపం వెలుగుతుంది. ఈ సంపుటి అంతా ఆ దీపం చుట్టూ తిరిగే రాత్రుల కథలే.
ఇంటి గుమ్మం ముందు నిలిచిన జీవితం, ఇప్పుడు గగన మండలంలో వెతకాల్సిన చిరునామా అయింది.
“నా కలత నిద్రలో
నా గుండె పక్కన పడుకుంటావు
నేను కళ్ళు తెరిచినప్పుడు
వేకువ రాగంలా మేలుకొంటావు
నిజానికి నువ్వు నాలోనే ఉన్నావు”అంటూ బరువెక్కిన హృదయంతో హృద్యంగా రాశారు.అద్దేపల్లి ప్రభుగాన్నట్టు ‘కవితలో లాగా కేవలం ఎమోషన్స్‌కే పరిమితం కాకుండా వచన రచనలో ఎమోషన్స్ తో పాటు జీవిత రేఖాచిత్రణ కూడా కనిపిస్తుంది. ఒక సాహిత్య కళా రూపంగా స్మృతి వచనం ఒక విలక్షణ రూపాన్ని సంతరించుకుందనడంలో సందేహం లేదు’.
వెన్నెల కేకు కవితలో కుమార్తె పై ప్రేమ ,హేమలత గారు లేరన్న బాధ,నిర్వేదం నిండిన ఆర్ధ్ర హృదయంతో…
“అమ్మను చూడాలనుందా? ఆకాశంకేసి చూడు నీ కోసం వెన్నెల కేకుతో చుక్కల కొవ్వొత్తుల మధ్యన ఎదురుచూస్తూ”…ఉంటుందని
మనో ధైర్యాన్నిచ్చారు.
చరమ కోరిక కవితలో
‘ఏ దేవుడైనా
నిన్నొకసారి చూపించగలిగితే
నా ప్రాణాలు రాసిస్తాను
ఆయన చిటికెన వేలు పట్టుకొని
నీతో పాటు నేనూ వస్తాను’.అంటూ హేమాన్వేషణలో కొత్త గబ్బిలం ఎగిరిపోయింది.
హేమలత గారిని ఇష్టపడే వాళ్ళు ముద్దుగా టెక్ సేవి అని పిలుస్తారు.విశాఖపట్నం లో ‘ప్రరవే’ సభ వీరికి చివరిది.ఆ సభలో,మహిళా రచయితలతో,ప్రరవే సభ్యులతో కోలాహలంగా గడిపారు.అదే చివరి సభ.ఇక హేమలత గారు సాహితీలోకాన్ని విడిచి ‘విహంగ’మై వెళ్లిపోయారు.
ఒక జ్ఞాపిక కవితలో
“ఉత్తమోపాధ్యాయినీ
ఓ అంతర్జాల కళాలోచనీ
నువ్వు బతికిన క్షణాలు
చరిత్రలో చిరస్మరణీయ దినాలు”.ఇంకొంత కాలం నీవు బ్రతికి ఉంటే ఈ ప్రపంచానికి నిరక్షరాస్యత స్త్రీ లోకానికి మరింత బలం చేకూరేది.హేమాలత గారికి కంప్యూటర్ పరిజ్ఞానం ఎక్కువ.ఎప్పుడూ కంప్యూటర్ ముందు కూర్చొని అంతర్జాలంలో వెతుకుతూనే ఉండేవారు.అంత గొప్ప వ్యక్తి అర్దాంతరంగా లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అత్యంత బాధాకరం.తొలికేక పెట్టిన క్షణం కవితలో,ఈ లోకంలో
ఏ భార్యకూ ,ఏ భర్తా ఇవ్వనటువంటి గొప్ప స్థాయిని ,స్థానాన్ని ఇచ్చారు సుధాకర్.
‘ప్రతి పుట్టిన రోజుకీ
నీ పాదాలకు నమస్కరించడమే తప్ప
ఏ గొప్ప కానుక నీకివ్వలేదు
నా నిమ్న స్థాయికి నిచ్చెన వేసి
మబ్బుల మహల్లో
నన్ను మహారాజును చేశావు
మా అమ్మ జన్మనిచ్చింది
నువ్వు గొప్ప జీవితాన్ని ప్రసాదించావు’.
ఈ నాలుగు వాక్యాలు చాలు సుధాకర్ జరిగి హేమలత గారిపై ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి.
స్మృతి కవిత్వంలో పేరెన్నిక గన్న తుమ్మల సీతారామ మూర్తి,కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి,కుందుర్తి,డా.సినారె,డా.ఎన్ గోపి ఎంతో మంది కవుల సరసన ఎండ్లూరి సుధాకర్ స్మృతి కవిత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది.యువ కథా రచయిత, మానస ఎండ్లూరి చెప్పినట్లు ‘ఇవి సతీ వియోగంలో ఒక జీవిత సహచరుడు రాసిన స్మతి కవితలే అయినా విద్యార్థులకు వ్యాకరణ పాఠాలు, భాషా ప్రేమికులకి తియ్యని మిఠాయిలు, కవితాభిమానులకి మనసుతో పఠించే మరిచిపోలేని అనుభూతులు’.అవును ఇవి కవితలు కాదు జీవితానుభవ పాఠాలు.తెలుగు కవితా సీమలో,సాహితీ ప్రియుల గుండెల్లో, అజరామరమై నిలిచిపోయే సెలయేటి కవితాక్షరాలు ఈ హేమంతం కవితాక్షరాలు…
-వెంకటేశ్వరరావు కట్టూరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

Comments
సాహితీ ప్రియుల గుండెల్లో, అజరామరమై నిలిచిపోయే సెలయేటి కవితాక్షరాలు ఈ ‘హేమంతం'(పుస్తక సమీక్ష )- వెంకట్ కట్టూరి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>