ప్రశాంత భారతం సంకల్పంగా…- (కవిత )-ముక్కమల్ల ధరిత్రీ దేవి
రక్తసిక్తమై రుధిరధారలతో
నేల తడిసి..
పడతుల పసుపు
కుంకుమలతో
కలిసి ప్రవాహాలుగా
మారిన ఆ క్షణం..
మనిషన్నవాడు ఎన్నటికీ
మరువలేని దుర్దినం..!
మతం అడిగి మరీ
మట్టుబెట్టిన
ఆ మారణహోమం..
చరిత్ర పుటలు
ఎరుగని
మాసిపోని మరకల
అధ్యాయం..!!
మధురస్మృతులు గాదు..
జీవితకాల వేదనలు
పర్యాటకులకు
మూటగట్టి ఇచ్చిన
పెహల్గామ్ నరమేధమిది !!
ఉగ్రవాదాన్ని
మూలంలోనే గురి చూసి
కొట్టిన ‘ఆపరేషన్ సింధూర్’
వ్యూహం హర్షణీయం !!
అది యుద్ధం కాదు..
ఆత్మ రక్షణ..బాధ్యత..!
శాంతిని కోరుకోవడం అంటే..
హింసను మౌనంగా
భరించడం కాదు..
బదులు తీర్చుకుంటున్న
దేశాన్ని కాదు..
ప్రశ్నించాల్సింది..
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న
హింసావాదుల్ని..!
దేహమే అశాశ్వతం..
హద్దులు..సరిహద్దులు
శాశ్వతమా! నింగికీ నేలకు..
నదికీ..గాలికీ..
సృష్టిలో ఏ జీవజాలానికి లేని అంతరాలు..
అంటరానితనాలు
మనిషికే ఎందుకు?!
దేశరక్షణకై పోరాడుతున్న
జవాన్ల కులమేది?
ఆ దేశభక్తికి కొలమానమేది?
కులమతాలు..
ప్రాంతీయ తత్వాలు
వదిలేద్దాం..
ఉగ్రవాదాన్ని మొగ్గలోనే
చిదిమేద్దాం..
భీతావహభారతం కాదు..
ప్రశాంతభారతం
సంకల్పంగా సాగుదాం…
-ముక్కమల్ల ధరిత్రీ దేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
ప్రశాంత భారతం సంకల్పంగా…- (కవిత )-ముక్కమల్ల ధరిత్రీ దేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>