జ్ఞాపకం – 107 – అంగులూరి అంజనీదేవి
“ఏమే లేఖా! మీ నాన్నకి సమాధి ఎందుకు కట్టిస్తున్నావే?”
“ఎందుకంటే నేను ఈ మధ్య చదివిన యండమూరి యుగాంతం, మయన్ క్యాలండర్ ‘డూమ్స్ డే‘ కి సంబంధించిన పుస్తకాల ప్రభావం వల్ల కట్టిస్తున్నాను”
“వెటకారమా? పుస్తకాల ప్రభావం అంటున్నావ్?”
“అలాంటిదేం లేదు అత్తయ్యా! అవి చదివాక 2012లో యుగాంతమని తెలిసింది. ఎలాగూ అంతమై పోతున్నాం కాబట్టి నాకు నచ్చిన పని చేద్దామనుకున్నాను”
“ఎంత యుగాంతం అయితే మాత్రం ఇలాంటి పనా?” అంటూ చెయ్యరాని పని చేస్తున్నట్లు మాట్లాడింది.
వినీల కూడా మొదట్లో ఇలాగే ‘ధూంధాం‘ అంటూ ఎగిరింది. ఆ తర్వాత ఎవరో ‘నీకెందుకే వినీ! నీ సొమ్మేం కాదుగా! రాజారాంకి వచ్చే డబ్బుల్ని పైసా పక్కకి పోకుండా దాచుకుంటే సరి‘ అని అన్నారని ఆగిపోయింది.
శ్రీలతమ్మ మాటలకి ఎక్కువసేపు సమాధానం ఇవ్వకుండా ఆగితే ఆమెకి బి.పి. పెరుగుతుందని “నేను చేసేది మంచిపనే అని చాలామంది అంటున్నారు అత్తయ్యా! అందుకే మార్బుల్స్ కూడా వేయిస్తున్నాను” అంది వీలైనంత గట్టిగా.
ఎంత గట్టిగా అంటే అవతల వైపున వున్నది చెవిటి మనిషి అన్నంత గట్టిగా. సంలేఖ గొంతు పక్కనే వున్న జయంత్ కి విన్పిస్తోంది. అతనిలో ఉక్రోషం, ఉద్రేకం పెరుగుతోంది. దగ్గరుంటే కొట్టేవాడే!
శ్రీలతమ్మ బావురుకప్పలా నోరుతెరిచి గుండెలు కొట్టుకుంటూ “మార్బుల్స్ వేయిస్తున్నావా?” అంది.
“ఆ…” అంది మరింత పెద్ద గొంతుతో సంలేఖ..
“అసలు మీ నాన్నకి సమాధి కట్టించటమే దండగ. పైగా మార్బులా? ఏమిచ్చి చచ్చాడే నీకు? మా నాన్న నాకు ఈ ఇల్లు ఇచ్చాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడు. బోలెడు బంగారం ఇచ్చాడు. అయినా నేను మా నాన్నకే కట్టించలేదు. మీ నాన్నకెందుకే?” అంది.
“మీ నాన్నకి మీరు పుట్టారు గనక కట్టించలేదు. అదే నేను పుట్టివుంటే కట్టించేదాన్నేమో. చూడండి! అత్తయ్యా! ఎవరు ఎవరికి ఏమిచ్చారన్నది కాదు. మనం ఇతరులకి ఏమిచ్చామన్నది ముఖ్యం. మీ నాన్న మీకు ఇల్లు ఇచ్చారని గర్వంగా చెబుతున్నారే కనీసం మీరు ఆ కృతజ్ఞత కోసమైనా మీ నాన్నగారి పేరును ఆ గేటు పక్కన ఆయన పేరును రాయించారా? లేదు. మీ పేరును రాయించుకున్నారు. మీరు వెళ్లిపోయాక..” అంటూ ఇంకా ఏమో మాట్లాడబోతుంటే మధ్యలో అందుకొని “ఏంటి! నేను వెళ్లిపోతానా?” కొట్టేదానిలా అరిచింది శ్రీలతమ్మ.
“ఆహా… మీరెళ్లి పోరు. ఎప్పటికీ ఇక్కడే వుంటారు. కానీ ఒకవేళ పొరపాటున మీరెళ్లిపోతే మీ కొడుకు మీ పేరు వుంచుతాడా? వుంచడు. ఆయన పేరు రాయించుకుంటాడు. ఒక్కపేరు చెరిపి, పేరు చెక్కించుకోలేనిది ఎక్కడో తెలుసా అత్తయ్యా? సమాధి మీదనే! పలానా పేరు గల మనిషి ఒకప్పుడు ఈ భూమ్మీద తిరిగాడని తెలిసేది కూడా సమాధి వల్లనే! అందుకే ‘ఈ సమాధి గల వ్యక్తి పుట్టింది, మరణించింది ఈ తారీఖున‘ అంటూ సమాధి మీద స్పష్టంగా రాస్తుంటారు. ఇల్లుల మీద, బంగారం మీద, కార్ల మీద, అకౌంట్ పుస్తకాల మీద, ఆధార కార్డు మీద చివరికి ఓటరయిడీ మీద వుండే పేరు కూడా ఆ మనిషి జీవించి వున్నంత వరకే వర్తిస్తుంది. ఆ తర్వాత అనుకునేవాళ్లే వుండరు. ఇదీ మన జీవితం!” అంది.
“ఉన్న డబ్బులు తగలేసింది చాలక జీవితం గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుందా నీకు?” అంటూ గట్టిగట్టిగా అరిచింది శ్రీలతమ్మ.
సంలేఖకి వెచ్చటి నెత్తురు ముఖంలోకి తన్నుకొచ్చినట్లయింది. “అత్తయ్యా! నేనెవరి డబ్బులో తగలెయ్యలేదు. మాట్లాడే ముందు సంస్కారం అనే పదాన్ని గుర్తు చేసుకొని మాట్లాడితే బావుంటుంది” అంటూ కాల్ కట్ చేసింది.
అప్పటికే ఉగ్రరూపం దాల్చివున్న జయంత్ “దాని పొగరు అణిగే రోజులు దగ్గర పడ్డాయి. తొందరెందుకమ్మా!” అన్నాడు.
చాలాసేపటి వరకు జయంత్ భార్య మీద కోపంతో రొప్పుతూనే వున్నాడు. అలసట అన్పించినప్పుడు అక్కున చేర్చుకునే వాళ్లు లేక, తల పెట్టుకునే ఒడిలేక నరాలు పగిలే బాధను ఎప్పటికప్పుడు భరించక తప్పటం లేదు అతనికి.
-– అంగులూరి అంజనీదేవి
~“~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
జ్ఞాపకం – 107 – అంగులూరి అంజనీదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>