” కన్నపేగు” (కథ) – డా.మజ్జి భారతి
డాడీ ఇచ్చిన కాగితాన్ని చింపి పారేద్దామనుకునేలోగా కావ్య, పెద్ద బిజినెస్ మాగ్నెట్ కూతురు, అన్నీ కుదిరితే నా కాబోయే భార్య, వస్తే ఆ కాగితాన్ని టేబుల్ సొరుగులో పెట్టేసి బయటికెళ్లిపోయాను. కాని డాడీ చెప్పిన మాటలే చెవిలో గింగురుమంటున్నాయి. బిజినెస్సులో అవాంతరాలు వచ్చినట్టే జీవితంలో కూడా ఒక్కోసారి అనుకోనివి తారసపడుతుంటాయి. అంతమాత్రాన మనం తలకిందులైపోనవసరం లేదు. ఇన్నాళ్లూ నీకు చెప్పని ఒక విషయాన్ని యిప్పుడు చెప్పాలనిపించిందని డాడీ చెప్పిందేమంటే పెళ్లై పదేళ్లుగా పిల్లలు లేని మా మమ్మీడాడీలు, నన్ను దత్తత తీసుకున్నారని, నాకు జన్మనిచ్చిన తల్లిని ఈ మధ్యనే చూశానని, ఆమెను చూడాలనుకుంటే అడ్రస్ యిదని, నా చేతిలో పెట్టిన కాగితమది.
డాడీ చెప్పగానే ముందు కోపమొచ్చింది. నేను యెవరికో కన్నబిడ్డనైనందుకు కాదు. అంత పెంచలేనివాళ్లు పిల్లల్నెందుకు కనాలని? నేను చాలా ప్రాక్టికల్ లెండి! కన్నవాళ్లు, పేగుబంధం యిటువంటి సెంటిమెంట్లు నాకేమీ లేవు. పాతికేళ్ల తర్వాత, నన్ను పుట్టించినవాళ్లు యెలా వుంటారో చూడాలన్నంత ఇంట్రెస్ట్ కూడా లేదు. కాని డాడీ నాకా యెడ్రస్ ఎందుకిచ్చారన్నదే నన్ను తొలిచేస్తున్న ప్రశ్న. ప్రాక్టికల్ గా ఆలోచించడంలో, ఆయనే నాకాదర్శం. బంధాలన్నీ ఆర్థిక లావాదేవీలతోనే ముడిపడి వుంటాయని మా అభిప్రాయం. ఈ విషయంలో డాడీ జీన్సే నాకొచ్చాయని అందరితో పాటు నేనుకూడా నమ్మేవాడిని. డాడీ జీన్స్ నాకు రాలేదనిప్పుడు తెలిసింది, కాబట్టి జీన్స్ అనకుండా డాడీ బుద్ధులు నాకొచ్చాయని అనుకుంటే సరిపోతుంది.
అటువంటి డాడీ నాకా యెడ్రస్ యెందుకిచ్చారు? ఇన్నాళ్లూ నన్నరచేతిలో పెట్టుకుని అపురూపంగా పెంచుకున్న డాడీ, యీ యెడ్రస్ యివ్వడంలో ఆయన వుద్దేశ్యమేమిటి? ఒకవేళ వాళ్ళేమైనా డాడీని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? డాడీ అటువంటి వాటికి లొంగే మనిషి కాదు. బిజినెస్సులో యెన్ని ఢక్కామొక్కీలు తినుంటారు? సెంటిమెంటుకూ పడే మనిషి కాదు. మరేమిటి? సరిగ్గా నా పెళ్లి మాటలు జరుగుతున్న సమయంలో ఈ విషయం తెలియడంలో వేరే కోణమేమైనా వుందా? బిజినెస్ లో ప్రత్యర్ధుల పాత్ర యేమైనా వుందా? అదే పజిల్ గా మారి, నా బుర్రను తొలిచేస్తుంది.
ఇస్తే యిచ్చారులే! నన్నేమైనా వెళ్ళమని చెప్పలేదు కదా! ఆ యెడ్రస్ కాగితాన్ని చింపిపడేస్తే, ఈ విషయాన్నక్కడితే మర్చిపోవచ్చని చింపబోతుంటే వచ్చింది కావ్య. చింపి పడేస్తే పోయేది కదా! దానిని సొరుగులో భద్రంగా యెందుకు పెట్టాను? సరేలే! యేదో కాకతాళీయంగా పెట్టాననుకుంటే, చింపి పడేద్దామనుకునేసరికి యెవరో ఒకరు గదిలోకి రావడం… దానిని మరల సొరుగులో పెట్టడం… ఇక యిలా కాదని, దీని సంగతేమిటో చూడాలని ఆ అడ్రస్ కు బయలుదేరాను. నా మీద యేవైనా ఆశలు పెట్టుకుంటే అవి కుదరవని, పేగుబంధం, కన్నప్రేమ… యిటువంటి సెంటిమెంట్లు నా దగ్గర పని చెయ్యవని… వాటికెప్పుడో కాలం చెల్లిపోయిందని… అటువంటివేమైనా వుంటే వదులుకోమని… ఒకవేళ యింకెవరైనా వాళ్లను యీ విషయంలో ప్రేరేపించివుంటే, వాళ్ల సంగతి నేను చూసుకోగలనని చెప్పడానికే నిర్ణయించుకుని బయలుదేరాను.
***
తలుపు తీసి నన్ను చూసినతను షాక్కొట్టినట్టు నిలబడిపోయాడు. నాకన్నా కొంచెం పెద్దుంటాడేమో! నన్నే చూస్తూ… కలగంటున్నానా అన్నట్టు… నన్ను చూసంత ఆశ్చర్యమెందుకు? అంతకు ముందు నన్నెక్కడైనా చూశాడా? నేనెవరో అతనికి తెలుసా? నేనెప్పుడూ అతనిని చూడలేదు. చుట్టూ చూశాను. మధ్యతరగతి కుటుంబ వాతావరణం. నా నుండి యేమైనా ఆశిస్తున్నాడా? అదే నిజమైతే నా నుండి వాళ్లకు పైసా దక్కదు. ఈ ఇంట్లో నన్ను కన్నవాళ్లున్నారనే నిజమే నాకు చేదుగా ఉంది. నా నుండి వాళ్లేమైనా ఆశిస్తే వాళ్లకు ఆశాభంగం తప్పదు.
ఇంతలో “ఎవరొచ్చారురా!” అనుకుంటూ వచ్చిందామె. ఆ ముఖం పొద్దుగుంకిన సూర్యబింబంలా… యేదో వేదన మోమంతా పరుచుకున్నట్టు… నన్ను చూసి, అతనిలాగే ఆమె కూడా షాక్కొట్టినట్టు… చూస్తున్నది కలా! నిజమా! అన్న సంభ్రమం… ఈ జీవితంలో మనకందదనుకున్నది అందినప్పుడు కలిగే ఆనందం… తప్పు చేశానన్న భావం… అన్ని భావాలూ కలగలసిపోయి… ఆ కళ్ళు వేటినీ దాచుకోలేవా! చూస్తుండగానే వర్షించడానికి సిద్ధంగా వున్న శ్రావణ మేఘాల్లా మారిపోయాయా కన్నులు… ఉద్వేగాన్ని ఆపుకోలేక గిర్రున వెనుతిరిగి లోపలికెళ్లిపోయింది. “అమ్మా” అంటూ ఆమె వెనకాలే అతనుకూడా… దుఃఖాన్ని బలవంతంగా అణిచిపెడితే వచ్చే వెక్కిళ్లు, లోపలి నుండి… యేమి జరుగుతుందిక్కడ?
నీకెలా అనిపిస్తే అలా… జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ పని చెయ్యకుండా పొరపాటు చేశానని నేననుకోకుండా వుండడానికే… నీ నిర్ణయమేదైనా దానికి నా మద్దతుంటుంది… అని కదా డాడీ యెడ్రస్ నా చేతిలో పెట్టారు. పాతికేళ్ల తర్వాత నేనెవరన్న నిజం నాకు చెప్పకుండా వుండడమే పొరపాటైతే… యిప్పుడు నేనే నిర్ణయం తీసుకోవాలి? ఆ కళ్ళల్లో కనిపించిన మిశ్రమ భావాలు నన్ను నిరుత్తరున్ని చేస్తున్నాయి. ఆ కళ్ళు…
***
నేనెప్పటిలా లేనని, యేమైందని మమ్మీ అడుగుతుంది. డాడీకర్థమైంది, నేనక్కడికి వెళ్లానని. ఐనా నన్నేమీ అడగలేదు. మా యిద్దరి మధ్య తండ్రి కొడుకులకు మించిన బంధమేదో వుంది. అందుకే చెప్పాలనుకుంటే నేనే చెప్తానన్న ధైర్యం ఆయనది.
నేననుమానించినట్టు నా గతాన్ని గుర్తుచేస్తూ నన్నెవరూ కలవలేదు. నిజానికి అక్కడితో నేనా విషయం మర్చిపోవాలి. కాని, నిల్చున్నా, కూర్చున్నా, యే పని చేస్తున్నా ఆ కళ్ళు నన్ను వెంటాడుతూనే వున్నాయి. నన్ను నేను అద్దంలో చూసుకున్న ప్రతిసారీ, ఆ కళ్ళు నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నాయి. నా మూలాలను గుర్తు చేస్తున్నాయి.
యింకోసారి ఆ యింటికెళ్లాను. వెళ్లి యేమి చెయ్యాలో తెలిసి మాత్రం కాదు. మొదటిసారిగా నాలో జరుగుతున్న ఈ సంఘర్షణను భరించలేక. ఈసారి తలుపు తీసింది అతనూ కాదు, ఆమే కాదు. ఇంకొకామె… నన్ను చూసామె కూడా స్థానువే ఐపోయింది. నన్ను చూడగానే వాళ్ళ ప్రవర్తనకు అర్థం నాకు తెలుసు.
“ఎవరే అక్కా” అంటూ వచ్చిన ఇంకొకమ్మాయి… ఈసారి షాక్ నాక్కొట్టింది. నా పోలికలు ఆమెలో. మేమిద్దరం కవల పిల్లలమా! ఇద్దరిని భరించలేక, నన్నమ్ముకున్నారా? ఈ ఆలోచనతో నా కళ్ళెర్ర బడుతున్నాయి, నన్నే ఎందుకమ్మాలని? వీళ్ళతో నాకేమీ సంబంధం లేదని నా మనసును నచ్చ చెప్పుకుంటున్న నాకు, వాళ్ళ మీద కోపమెందుకు వస్తోందో నాకే అర్థం కావడం లేదు. మా మమ్మీ డాడీలు నన్ను పెంచుకోబట్టే కదా, నేనింత దర్జాగా బ్రతుకుతున్నాను. అటువంటప్పుడు నేనామెకు కృతజ్ఞత చెప్పుకోవాలి. అయినా నాకు కోపమెందుకు వస్తుంది? ఆ యింట్లో, వాళ్లతో పాటు నన్ను పెంచలేదనా! నాకే అర్థం కావడం లేదు.
“ఎవరమ్మా” లోపలనుండి హీనంగా ఆమె స్వరం. మొదటిసారి విన్న ఆ స్వరానికి, ఇప్పటి స్వరానికీ ఎంత తేడా? ఆమెకు ఒంట్లో బాగుండలేదా? అది నా నుండేనా? నాలో ఏవో ప్రకంపనలు.
“చిన్న పనిమీద నా ఫ్రెండొచ్చాడమ్మా! నీకిష్టమైనవి చెయ్యమ్మా! గంటలో భోజనానికొస్తామని”, నా పోలిక నన్ను బయటికి లాక్కెళ్లిపోయింది.
***
“ఆ ఇంట్లోనే ఉంటే ప్రాణాలతో నిన్ను దక్కించుకోలేనని నిన్ను దూరం చేసుకుందిగాని, నిన్ను దూరం చేసుకున్న నుండీ నిన్ను తలవని క్షణం లేదు. నీకు పాలిచ్చి సాకలేని తన దౌర్భాగ్యాన్ని, ప్రతి నిమిషం గుర్తు చేసుకునేది. మా ముగ్గురం కళ్ళెదురుగా తిరుగుతుంటే, బయటకు చెప్పకపోయినా, యెక్కడ వున్నావో తెలియని నిన్ను తలుచుకుని కుమిలిపోయేది. నువ్వెప్పుడు కనిపిస్తావా, అమ్మ మనోవేదన తీరుతుందా అని మా ముగ్గురం ఎదురు చూసేవాళ్ళం. కాని నిన్ను చూశాక, నిన్ను దూరం చేసుకున్న తన నిస్సహాయతను తలచుకొని అమ్మ మరింత కృంగిపోతుందని, యెప్పుడూ ఊహించలేదు” నన్నదే పనిగా చూస్తూ, మధ్య మధ్యలో ఏడుస్తూ… నవ్వుతూ… నీళ్లు నిండిన ఆ కళ్ళల్లోనే నన్ను నింపుకుంటూ… ఆమె చెప్పిన విషయాలు.
వాళ్ళమ్మ… అదే… నా కన్నతల్లి, బట్టలు కుడితే వచ్చిన సంపాదనను కూడా తాగుడుకే ఖర్చుపెట్టి, సంసారాన్ని గుల్లచేస్తూ, ప్రతి సంవత్సరం సంసారాన్ని పెంచడం తప్ప, యింకేమీ చెయ్యని తాగుబోతు, నా కన్నతండ్రట… నాలుగో సంతానమైన నేను ఈ భూమ్మీద పడితే, ఒంట్లో పాలులేక… కొనడానికి యింట్లో డబ్బుల్లేక… నేను అనారోగ్యం పాలైతే… నన్ను బ్రతికించుకోవడానికి అమ్మ నానా యాతన పడేదట. ఆఖరికి తన తాగుడికోసం నా కన్నతండ్రి నన్నెవరికో అమ్మెయ్యబోతే, అడ్డుకుని… సంతానభాగ్యం లేని నా మమ్మీ,డాడీలకు అప్పచెప్పిందట. తాగుబోతు భర్త అర్ధాంతరంగా చచ్చిపోతే… పిల్లలను కష్టపడి పెంచి ఒక స్థాయికి చేర్చిందట. కష్టాలలో వున్నప్పుడు, నాలుగో బిడ్డైనా యెక్కడో క్షేమంగా వున్నాడని అనుకునే అమ్మ, జీవితంలో కుదుటపడేసరికి బిడ్డను దూరం చేసుకున్నానని కుమిలిపోయేదట… కొన్నాళ్లు ఓపిక పట్టి ఉంటే నాలుగోబిడ్డ కూడా కళ్ళెదురుగా వుండేవాడు కదా! యిప్పుడెలా వున్నాడో! దత్తత యిచ్చి, వాడికి కన్నప్రేమను దూరం చేశానని యెప్పుడూ బాధపడేదట… వెక్కిళ్ల మధ్య ఈ అమ్మాయి నాకు చెప్పిన నా కధ… నా కన్నతల్లి కన్నీటి వ్యధ…
కవల చెల్లి అనుకున్నాను… కాదట.. నాకు అక్కట… యిదో కొత్త అనుభవం నాకు… ఇటువంటి పరిస్థితులలో నేనెప్పుడైనా వుంటానని కలలో కూడా ఊహించలేదు. ఊహించనిదే జీవితమేమో! నన్ను పట్టుకుని అలా ఎంతసేపు కూర్చుందో… ఫోను మోగితే యీ లోకంలోకొచ్చింది.
***
“సారీ! నీకేమిష్టమో తెలియదు. అందుకే అమ్మకిష్టమైనవి చెయ్యమన్నానంటూ, నా చిన్నక్క, నా చెయ్యి పట్టుకునే డైనింగ్ టేబుల్ మీదున్న గిన్నెలమీద మూతలు తీసి చూస్తుంది, అమ్మ యేమి వండిందా అని! టమాటా పప్పు, దోసకాయ పచ్చడి, ములక్కాడ కూర, బెండకాయ వేపుడు… అన్నీ నాకిష్టమైనవి. ఇదెలా సాధ్యం? మేమొచ్చామని బయటకొచ్చిన ఆమె… నన్ను చూడగానే శ్రావణ మేఘాలను తలపిస్తూ ఆమె కళ్ళు. ఆమె వెనుదిరిగి వెళ్లిపోబోయేంతలో… ఆమె చెయ్యి పట్టుకున్నాను. ఆమె…నా కన్నతల్లి ముఖంలో అపరాధ భావం, ఆశ్చర్యం, ఆనందం. నన్ను పట్టుకొని నిలువెల్లా తడుముతూ… అలా ఎంతసేపున్నామో! మా చుట్టూ నా తోడబుట్టినవాళ్లు…
రక్తసంబంధంలో యింతానందముంటుందా! అందుకేనా బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటరని అంటారు. తొలిసారి అనుభవిస్తున్నాను. ఒక్కమాట కూడా బయటకు రాకుండా మా మనసులు ఎన్ని మాట్లాడుకుంటున్నాయో! అమ్మ నన్ను హత్తుకునే విధములోనే తెలుస్తోంది, ఆమె ఈ పాతికేళ్లలో నన్నెంత మిస్సైందో! ఎవరైనా చెప్తే యిదంతా ట్రాష్ అనేవాడిని. కాని యిక్కడ జరుగుతున్నది వేరు. అందులో ప్రధాన పాత్రధారిని నేనే. అమ్మానాన్నల ప్రేమ తప్పించి, మిగిలిన బంధాలన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి అనుకునే నేను, ఆఖరికి నా కాబోయే భార్య, కావ్యకు నాకు మధ్య ఉన్న బంధం కూడా డబ్బుతోనే ముడిపడి ఉందనుకునే నేను, తొలిసారిగా తెలుసుకుంటున్నాను బంధాల విలువేమిటో!
నెల రోజులుగా ఎంత దృఢంగా వీళ్లను ఎవాయిడ్ చేద్దామనుకున్నానో… వద్దనుకున్నానో… అంతకన్నా గట్టిగా నా మనసు వాళ్ల చుట్టూనే తిరిగేది. అది భరించలేకే కదా మరలా యిక్కడికి వచ్చాను.దేనికీ స్పందించని నా మనసు, వీళ్లను చూస్తుంటే యేదో ఐపోతుంది. ఆ విషయం నాకే తెలుస్తుంది. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ పని చెయ్యకుండా పొరపాటు చేశానని నేననుకోకుండా వుండడానికే… అని డాడీ అన్న మాటలకర్థమిప్పుడు తెలుస్తుంది. డాడీ నాకీ అడ్రస్ యిచ్చుండకపోతే జీవితంలో యెంత విలువైనదానిని మిస్సయ్యే వాడినో! చిన్నప్పటినుండి భోగభాగ్యాల మధ్య అల్లారుముద్దుగా పెరిగినా, కలగని ఆనందమేదో అనుభవిస్తున్నానిప్పుడు. రక్తసంబంధంలోని మమకారాన్ని ఆస్వాదిస్తున్నాను. నన్ను పెంచుకునే కాదు, నాకీ యడ్రస్ యిచ్చి కూడా నా జీవితానికి వెలుగుబాట వేశారు డాడీ.
అన్ని బాగానే వున్నాయి. కాని నాలో చిన్న సందేహం వుండిపోయింది. అదే… భోజనం విషయంలో మా ఇద్దరి యిష్టాలు. కొంత చనువు వచ్చాక అమ్మ నడిగితే, “ఏమీ లేదురా కన్నా! నువ్వు కడుపులో వున్నప్పుడు, వేరే కాయగూరలు కొనడానికి డబ్బుల్లేక, పెరట్లో పెంచుకున్న నాకిష్టమైన ఆ నాలుగు కూరలనే తినేదాన్నని చిక్కుముడి విప్పేసింది. కన్నపేగంటే అర్థమయింది నాకు. ఆ పేగే కదా తొమ్మిది నెలలూ, తల్లినీ బిడ్డనీ కలిపి వుంచుతుంది. ఆ పేగు ద్వారానే అమ్మ యిష్టాలు నాకు వచ్చి వుంటాయి. అమ్మ యిష్టాలు, కళ్లే కాదు, ముమ్ముూర్తులా నేను అమ్మ పోలికే. అందుకే మొదటిసారే నన్ను చూసినా, నేనెవరో వీళ్ళందరూ గుర్తుపట్టేశారు. కలలో కూడా ఊహించిన ఆ సన్నివేశానికి ఉక్కిరి బిక్కిరైపోయారు.
ఆ కన్నపేగే కదా బంధాలకు విలువనివ్వని నన్నిక్కడి వరకు లాక్కొచ్చింది. కన్నతల్లి, తోబుట్టువుల మమకారాన్ని చవిచూపింది.
-డా.మజ్జి భారతి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
నమస్తే భారతి గారు. కథ చాలా బాగుంది.