జ్ఞాపకాలు(కథ)- మజ్జి భారతి

“పోనీ నన్ను రమ్మంటావా?” తండ్రి కరుణాకర్ అడిగాడు పెద్దకొడుకు వరప్రసాదును.
వరప్రసాదేమీ సమాధానం చెప్పకముందే “వాడిని నేనే అరణ్యానికో, అంతరిక్షానికో పంపిస్తున్నట్టు, ఏంటండి మీరిద్దరూ? వాడిని వాళ్లూరే కదా పంపిస్తున్నానంది” తల్లి సుమలత. “ఆ రెండింటిలోనూ మనుషులుండరు. అక్కడికి పంపించినా నయమే” గొణుక్కున్నాడు చిన్నకొడుకు భానుప్రసాద్.
భర్త, కొడుకులిద్దరి దగ్గర అలా అందిగాని సుమలతకూ మనసు పీకుతోంది. అక్కడికెళ్లాక ఎలా ఉంటుందో, ఏంటోనని! అందుకని “నన్ను రమ్మంటావేమిటిరా! పోనీ వెళ్లడం మానేస్తావా! ఏం పర్వాలేదు. నీకు వెళ్లాలనిపిస్తేనే వెళ్ళు. లేకపోతే వద్దు. ఏదో నా భ్రమకొద్దీ చెప్పాను గాని, మనసులో అది పెట్టుకోకు” ఎవరూ లేకుండా చూసి, వరప్రసాదుతో అంది సుమలత.
“మమ్మీ! నీ కొడుకింకా ఐదేళ్ల పసిపిల్లవాడు అనుకుంటున్నావా? పాతికేళ్ళొచ్చి రెండేళ్లనుండి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. నువ్వేం కంగారుపడకు” అమ్మకు ధైర్యం చెప్పాడు వరప్రసాద్.
“అదికాదురా! అక్కడికి వెళ్లాక, నీకు నచ్చకపోతే వెంటనే వచ్చేసెయ్. ఏ విషయమైనా ఫోన్ చెయ్యడం మర్చిపోకు. నిన్ను పంపిస్తున్నానే గాని, నా మనసంతా నీ దగ్గరే ఉంటుంది” జాగ్రత్తలు చెప్పింది సుమలత.
ఇంతకీ విషయమేమిటంటే వరప్రసాద్ పుట్టి, ఐదేళ్లవరకు పెరిగిన వూరికి యిప్పుడు వెళ్లబోతున్నాడు. వరప్రసాద్ వూరికేమిటి? అని మీకు సందేహం వస్తుంది కదా! అవును. వరప్రసాద్ వూరే. ఎందుకంటే వరప్రసాదు తల్లితండ్రులు చిన్నప్పుడే వరదల్లో చనిపోతే, సుమలత, కరుణాకర్ దంపతులు వరప్రసాదుని పెంచుకున్నారు. ఆ తర్వాత ఐదేళ్లకు వాళ్లకు భానుప్రసాద్ పుట్టాడు. అయితే మాత్రం వరప్రసాద్ పుట్టిన వూరికెందుకు వెళ్లడం అనుకుంటున్నారా?
ఎక్కడ పెరిగినా, తమ మూలాలను మర్చిపోకూడదని, సుమలత ఉద్దేశం. తమింట్లో తమ బిడ్డగా పెరిగినంత మాత్రాన వరప్రసాద్ తన స్వంత తల్లితండ్రులను, తన ఇంటి పేరును, తన వూరుని మర్చిపోకూడదని ఆమె అనుకుంటుంది. అన్నీ అర్ధం చేసుకునే వయసు వచ్చేటప్పటికి, వరప్రసాద్ మనసుకు నొప్పి తెలియకుండా ఈ విషయాలన్నీ చెప్పింది. ఇలా చెప్పడం కరుణాకర్ కేమాత్రం ఇష్టంలేదు. “మనం పెంచుకున్నాక వాడు మన బిడ్డే. చనిపోయిన తల్లిదండ్రులను గుర్తుచేసి వాడిని బాధపెట్టడమెందుకని?” అంటాడు.
“ఎప్పుడో అనుకోని పరిస్థితులలో ఈ నిజం తెలిస్తే అప్పుడు వాడేమైపోతాడు? దాని బదులు ముందు మనమే చెప్పడం మంచిదంటుంది” సుమలత.
“అలాంటి పరిస్థితులు ఏముంటాయంటాడు?” కరుణాకర్. గాని అనుకోకుండా ఒకసారి కరుణాకర్ కి ఆక్సిడెంటై, రక్తం ఎక్కించాల్సి వచ్చేసరికి, ఆరోగ్యంగా వున్న యిరవైఏళ్ళ కొడుకు రక్తం యెక్కించవచ్చని డాక్టర్లన్నప్పుడు “నేను సొంతబిడ్డను కాదని” చెప్పగలిగాడు వరప్రసాద్.
“వాళ్ల రక్తం పంచుకు పుట్టనందుకు ఈరోజు చాలా బాధపడ్డాను. నాన్నకు యాక్సిడెంటై బ్లడ్ అవసరమైతే, ఇవ్వలేకపోయాను. అదే సొంత కొడుకునై ఉంటే నా రక్తమే ఎక్కించేవాళ్ళు కదా! ఎంత దౌర్భాగ్యుడిని. వాళ్ల ఋణం తీర్చుకోలేక పోతున్నాను.” ఆ రాత్రి వరప్రసాద్ డైరీలో యీ మాటలు చదివి ఆనందంతోనూ, కడుపున కననందుకు దుఃఖంతోనూ కన్నీళ్లు కార్చింది సుమలత.
***
ఊరు బయలుదేరే ముందు అమ్మ ఇచ్చిన అడ్రస్, పాతఫోటోలు మరొక్కసారి చూసుకున్నాడు. “నీ కన్నవాళ్లు కూలీ చేసుకు బ్రతికేవారట. నువ్వు, ఒక చెల్లి. పొలం పనులకు వెళ్లేటప్పుడు చిన్నదని చెల్లిని వెంట తీసుకెళ్లారట. నువ్వు మిగిలిన పిల్లలతో కలిసి గుట్టమీదకు వెళ్ళావట. ఎగువ కురిసిన వర్షాల ఉధృతికి మీ ఊరిపక్కనే వున్న రిజర్వాయరుకు గండిపడి, దిగువ పొలాలలో పని చేసేవాళ్ళు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారట. అందులో మీ అమ్మ, నాన్న, చెల్లి కూడా ఉన్నారట. నువ్వు పుట్టినప్పుడు నీకు జాతకం రాసిన పంతులుగారు, నువ్వు పెద్దైతే ఉన్నత శిఖరాలకు చేరుకుంటావని నీకు వరప్రసాదని పేరు పెట్టారట. అందుకని ఆ పంతులుగారుంటే ముందు అక్కడకు వెళ్ళు. ఆ తర్వాత ఏంచెయ్యాలో, పరిస్థితిని బట్టి చూసుకో. గాని అక్కడేమైనా, నీ మనసుకు బాధ కలిగినట్టనిపిస్తే మాత్రం వెంటనే వెనక్కి వచ్చేసెయ్. అమ్మ నీ కోసం ఎదురు చూస్తుందని మర్చిపోకని” చెప్పి మా ఊరి ఫోటోలు, చిన్నప్పుడు మా ఇంట్లో దొరికిన తమ నలుగురి ఫోటో, పూజారిగారి పేరు యిచ్చిందమ్మ.
“అమ్మా,నాన్న, చెల్లి వున్న ఫోటో చూసినా తన మనసేమీ చలించలేదు. అమ్మ,నాన్న అంటే తన మనసులో మమ్మీ, డాడీలే. వీరితో పాటు తమ్ముడు. ఇదే తన కుటుంబం. నిజానికి తనకా వూరు వెళ్ళడం పెద్దగా ఇష్టంలేదు. “నాది అన్నది ఇచ్చినంత తృప్తి ఏదీ ఇవ్వదు. ఆ వూరిలో నీవి అన్న జ్ఞాపకాలేవైనా దొరికితే, అవి నీ జీవితాన్నెంత ఆనందమయం చేస్తాయో అనుభవిస్తేగాని నీకు తెలియదు. ఒకసారి వెళ్లిరా” వెన్నుతట్టి చెప్పిందమ్మ. అమ్మ మాట కొట్టెయ్యలేక బయలుదేరాడు.
అమ్మ.. ఆ మాట గుర్తుకొస్తే తనకు కడుపు నిండిపోతుంది. ఎవరైనా పిల్లలను పెంచుకుంటే, ఆ విషయం బయటకు తెలియడానికి ఇష్టపడరు. గాని అమ్మేమిటో చిత్రంగా “వీడు నా దత్తపుత్రుడని” గర్వంగా చెబుతుంది. తన కన్నవాళ్లు పెట్టిన పేరునే ఉంచింది.
అమ్మ తనను ముద్దు చేస్తుందని తమ్ముడెప్పుడైనా కోపంగా మాట్లాడితే, “అవున్రా! వీడంటేనే నాకెక్కువ ఇష్టం. ఎందుకంటే కష్టపడి తొమ్మిది నెలలు మోసి, పురిటినొప్పులు పడి, వీడిని కనలేదు. ఆ బాధలేవీ లేకుండా ‘హాయ్! మమ్మీ నేనొచ్చేసా!’ అని నా ఒడిలోకొచ్చేసాడు. ఎంత బుద్ధిమంతుడో నా కొడుకు” అంటుంది. పెంచుకోవడానికి కొత్త నిర్వచనం చెబుతుంది. అమ్మ చెప్పే విధానం చూసి తమ్ముడికి కూడా నవ్వొచ్చేసేది. “ఫో మమ్మీ! నువ్వెప్పుడూ ఇంతే!” అంటూ అమ్మ ఒడిలో చేరిపోయేవాడు.
ఆఖరికి అమ్మ మనసులో తన స్థానం ఎంతంటే, సొంత అన్నయ్యకన్నా తనే ఎక్కువ. అదెలాగంటే, అయిదేళ్ళ వయసులో వీరి కౌగిలి చేరినా, వాళ్ల ప్రేమాభిమానాలతో పెంపుడు కొడుకుననే విషయం పూర్తిగా మర్చిపోయాడు తను. మరో ఐదేళ్లకు తమ్ముడు పుట్టాడు. అమ్మ అన్నయ్య, శశిధర్ అంకుల్ కూతురు రవళి అంటే తనకు చాలా ఇష్టం. యెదుగుతున్న వయసు. అప్పుడే ఇంటర్ ఫస్టియరులో జాయినయ్యాడు. రవళి కూడా బావనని కూడా, కూడా తిరిగేది. రవళి తల్లి, మీనాక్షి ఆంటీ “వాడితో నీకు మాటలేమిటి? వాడి కులము, గోత్రము తెలియదు. దూరంగా ఉండన్న” మాటలు పక్కగదిలో ఉన్న నేనే కాదు, ఇంకొక గదిలో ఉన్న అమ్మ కూడా విని, ఆరోజు నుండి వారింటికి వెళ్లడం కూడా మానుకుంది. ఇప్పుడు తనకుద్యోగం వచ్చాక రవళిని చేసుకోమని అడిగినా, కాదని చెప్పేసింది. అమ్మకి తన తర్వాతే ఎవరైనా. అందుకే అమ్మమాట జవదాటడు.
అమ్మ ఎంత ధైర్యం చెప్పి పంపించినా, మనసులో ఎన్నో ఆలోచనలు. పుట్టి, ఐదేళ్లక్కడే పెరిగిన వూరు. తనకిప్పుడు ఏమీ గుర్తులేదు. కొత్త జీవితంలో పడి పాతజ్ఞాపకాలు పూర్తిగా మరుగున పడిపోయాయి. ఆ వూరు వెళితే ఇప్పుడేమైనా పాతజ్ఞాపకాలు బయటకొస్తాయా? అవి తీపి జ్ఞాపకాలా! చేదు జ్ఞాపకాలా! ఆ జ్ఞాపకాలతో తన మనస్సు ప్రఫుల్లమవుతుందా! లేకపోతే ప్రశాంతంగా ఉన్న సెలయేరులో రాయి విసిరినట్లు అల్లకల్లోలమవుతుందా!
***
భయం, భయంగానే ఆ వూరు వెళ్ళాడు వరప్రసాద్. “ఇక్కడ గుట్టమీద కోవెలకెలా వెళ్లాలి?” బస్సు దిగి అడిగాడు. “కుడివైపు తిరిగి, కొంచెం ముందుకెళ్తే మెట్లు కనిపిస్తాయి. తిన్నగా వెళ్లిపోవడమే” చెప్పాడతను.
ఇరవైఏళ్ళ క్రితం విడిచిపెట్టిన ఊరి మట్టిమీద మరల అడుగు పడుతుంటే, మనసంతా ఉద్వేగభరితమయింది వరప్రసాదుకు. తన పుట్టుక యీ నేలతోనే ముడిపడి ఉంది. ఈ నేలలోనే తన తల్లిదండ్రుల, చెల్లి అస్తికలు ఎక్కడో ఉండుంటాయి. ఇంత దూరం వచ్చినందుకు ఏమన్నా జ్ఞాపకాలు గుర్తుకొస్తాయా! లేక ఈ మట్టిని విడిచిపెట్టిన యిరవైఏళ్ల జీవితంలో మరుగున పడిపోయి, యీ ఊరితో సంబంధం పూర్తిగా తెగిపోతుందా? ఆలోచించుకుంటూ మెట్లన్నీ యెక్కేసి, గుట్టమీదకు చేరుకున్నాడు. ఈ గుట్టే తన ప్రాణాలు కాపాడిందట
ఒంగుని నేలను ముద్దుపెట్టుకున్నాడు. ఎదురుగా సీతారామస్వామి ఆలయం. ఈ ఆలయంతో యెన్ని జ్ఞాపకాలు ముడిపడి వున్నాయో! దర్శనం చేసుకుని బయటకొచ్చాడు. కాళ్లెటు దారి తీస్తే అటు నడుస్తున్నాడు. ప్రక్కనెవరైనా ఉంటే బాగుండుననిపించింది. గాని “మనం వాడికూడా ఉంటే, వాడికా జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తు రావు. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు రావాలంటే వాడొక్కడే వెళ్లి వెతుక్కోవాలి” రాత్రి అమ్మ, నాన్నతో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి
రాళ్ల మధ్య చిన్న నీటిచెలమ. ఇక్కడికొచ్చి ఆడుకుని ఉంటామా! ఎవరో ఆ నీటిలో రాయి విసిరారు. వెనక్కి తిరిగి చూస్తే పిల్లలు. ఒకడు రాయి విసరగానే, ఒకడి తర్వాతొకడు రాళ్లు విసురుతున్నారు. అంతవరకూ ప్రశాంతంగా ఉన్న కొలనులో రాళ్ళు పడగానే వృత్తాకారంగా అలలు లేస్తున్నాయి. జ్ఞాపకాల అలలను లేపుతున్నాయి. జ్ఞాపకాల దొంతరలలో… జారిపోతున్న లాగును పైకిలాక్కుంటూ ఆ నీటిలో దూకుతున్న, ఓ బాలుడి రూపం అస్పష్టంగా, గతానికి వర్తమానానికి వంతెన వేస్తున్నట్టు… మనసులో ఏవేవో రూపాలు కదలాడుతూ… జ్ఞాపకాల వెల్లువకు తలుపులు తెరిచినట్లయింది. అవునూ! ఇక్కడొక పెద్ద మర్రిచెట్టుండాలి. ఆ చెట్టు వూడలు పట్టుకుని ఎవరెక్కువ దూరం వూగుతారోనని… పోటీపడటం కళ్లముందు కనిపిస్తుంది.
ఇక్కడో పెద్ద బండరాయి ఉండాలి. ఆ బండరాయి మీద ఒకమ్మాయి, ఒకబ్బాయి… లక్కపిడతలతో అమ్మానాన్నలాట ఆడుతున్నారు. కోవెలలో పూజారిగారిచ్చిన వడపప్పును అన్నమని వడ్డిస్తుంది ఆ అమ్మాయి. ఇవన్నీ గుర్తుకు రాగానే మనసులో యేదో తెలియని సంచలనం. ఆనందంతో ఒడలు పులకిస్తున్నాయి. అలా ఎంతసేపున్నాడో!
“ఎవరు బాబూ నువ్వు? చాలాసేపటినుండి ఇక్కడే వున్నావు. ఎవరబ్బాయివి?” పూజారిగారి మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు వరప్రసాద్. ఎవరినని చెప్పుకోవాలో అర్థం కాలేదు. “నేను… నేను” అంటున్నాడు.
“నీ పేరేమిటి బాబు?” పరీక్షగా చూస్తూ అన్నారు పూజారిగారు. “నేను… వరప్రసాద్..” తటపటాయిస్తూ చెప్పాడు. “మీ అమ్మానాన్నల పేరు?” మరింత ఆసక్తిగా అడిగారు పూజారిగారు. ఏ అమ్మానాన్న పేరు చెప్పాలో అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాడు.
తనడిగిన ప్రశ్నకు సమాధానం రాకపోయేసరికి “మరేమనుకోకు బాబు. పాతికేళ్ళక్రితం ఒకబ్బాయికి నీ పేరే పెట్టాను. ఆ అబ్బాయేమోనని ఆశ పడ్డానంతే” లేచి వెళ్ళిపోబోయారు పూజారిగారు. “రామస్వామి శాస్త్రిగారు… ” అనుమాన పడుతూ అన్నాడు వరప్రసాద్. “నా పేరు నీకెలా తెలుసు?” ఆశ్చర్యంగా అడిగారాయన.
తనకీ ఒక గతం ఉంది. ఆ గతంలో తనను గుర్తించిన వాళ్ళున్నారన్న భావం మదిలో మెదిలేసరికి వెతుకుతున్న దైవం కళ్ళముందు కనిపించినట్లయింది వరప్రసాదుకు. కళ్ళనుండి నీళ్ళు జలజలా కారిపోతుంటే, “మీరనుకుంటున్న వరప్రసాదును నేనేనంటూ” ఆయన కాళ్లమీద పడిపోయాడు.
“సీతారామా! నీ కృప అపారం. నా బొందిలో ప్రాణముండగానే ఈ వరప్రసాదుని నా కళ్ళముందు నిలబెట్టావు. ధన్యుడిని స్వామి” అని సీతారాముల వేపు తిరిగి, నమస్కారం పెట్టుకుంటూ “చాలా సంతోషం నాయనా! మరలా నిన్ను చూస్తాననుకోలేదు. ఆ రోజు మీ అమ్మగారిని చూశాను. మంచి మనసున్న తల్లి. నిన్ను మరలా నీ పుట్టినవూరు పంపించింది. ఎంత అదృష్టవంతుడివో! కలకాలం చల్లగా ఉండు” దీవించారు.
గుట్ట దిగి వూరిలో తన ఇంటికి తీసుకొనిపోయి, చిన్నప్పుడే పెంపకానికి వెళ్ళిన శంకరం, గంగమ్మల కొడుకు వరప్రసాద్ వచ్చాడని, చిన్నప్పుడు తనతో కలిసి ఆడుకుని, ప్రస్తుతం వూరిలో ఉంటున్న ఇద్దరు, ముగ్గురిని పిలిపించారు.
అందులో రమేష్, చక్రీ వచ్చారు. తనెవరో తెలుసుకొని వాళ్ళెంతో సంతోషించారు. ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. వాళ్లెవరో వెంటనే గుర్తుకు రాకపోయినా, తన చిన్ననాటి సంగతులు వాళ్ళు చెప్తుంటే… గుట్ట మీదకెళ్లి ఆడడం, నీటిగుంటలో మునకవేసి, తడిబట్టలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యడం, పూజారిగారిచ్చిన ప్రసాదం తిని మర్రిచెట్టు క్రింద ఆడడం… వాళ్లు చెప్తూ ఉంటే ముందు గుర్తురాని చిన్ననాటి ముచ్చట్లు గుర్తుకొస్తున్నాయి. ఇక్కడ తన బాల్యం యింత ఆనందంగా గడిచిందా! అమ్మ నన్ను పెంచుకునేకాదు, మరల యీ వూరు పంపించికూడా తనకు పునర్జీవితాన్ని ఇచ్చింది. ఈ వూరు వెళ్ళమని అమ్మ చెప్పకపోయుంటే, యెన్ని జ్ఞాపకాలను కోల్పోయే వాడినో! పూజారిగారన్నట్టు అమ్మదెంత మంచి మనసో!
***
ఇది జరిగిన వారం రోజులకు తెలియని నెంబర్ నుండి వాట్సాపుకి ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో ఐదేళ్ల అమ్మాయి, అబ్బాయి. అబ్బాయి తనేనని గుర్తుపట్టాడు వరప్రసాద్. ఆ అమ్మాయి.. తనతో అమ్మానాన్నలాట ఆడినమ్మాయి. పేరు… పేరు… ఫోటోనే చూస్తూ జ్ఞాపకాలలో వెతుకుతున్నాడు పేరు కోసం.
“ఏమండీ! అన్నం తినండి.” లక్కపిడత అందిస్తూ అందా అమ్మాయి. “కూరేది లక్ష్మి?” హఠాత్తుగా గుర్తొచ్చింది. ఆ అమ్మాయి పేరు లక్ష్మి.
ఫోటోలోనే కాదు. ఆ అమ్మాయి జ్ఞాపకాలలో కూడా తనున్నాడా? మనసు ఆనందంతో తడిసి ముద్దవుతుంది. ఆ ఆనందం ముఖమంతా కమ్ముకుంటోంది. చిన్ననాటి జ్ఞాపకాలు ఎంత మధురమైనవో తెలియవస్తోంది. అందుకేనా, అమ్మంత పట్టుపట్టి తననీ వూరు పంపించింది.
“ఒకమ్మాయి తన చిన్ననాటి జ్ఞాపకాలను ఇంతగా పదిలపరుచుకుని, చిన్ననాటి స్నేహితునికి పంపించింది” అనుకుంటేనే మనసు ఆనందంతో తేలిపోతోంది. లక్ష్మికి ఫోన్ చేద్దామని నంబర్ డయల్ చేస్తే, ట్రూ కాలర్ ఐడీలో సౌజన్యని కనిపించింది. గాలిలో తేలిపోతున్న మనసు, గాలి తీసిన బుడగలా అయిపోయింది ఒక్కసారిగా.
ఈ వారం రోజులనుండి ఒక పదిమంది దాకా ఫోన్ చేశారు చిన్ననాటి స్నేహితులమంటూ. వాళ్లతో మాట్లాడినప్పుడు కలగని ఏదో ప్రత్యేకభావం, ఈ ఫోటో చూడగానే కలిగింది. ఆ అమ్మాయి పేరు గుర్తురాగానే అది ద్విగుణీకృతమైంది. ఆ అమ్మాయి ఇప్పుడే పరిస్థితులలో ఉన్నా, ఆమెతో మాట్లాడాలనుకుంటేనే మనసు గాలిలో తేలిపోతుంది. బాల్యస్నేహం యింత మధురంగా ఉంటుందా? ఫోటో పంపించినామె, లక్ష్మీ కాదని తెలియగానే, మనసు దిగులు పడిపోయింది. ఏమిటో ఇదంతా! తన ఆలోచనలు తనకే అర్థం కావడంలేదు వరప్రసాదుకి. “ఫోటో పంపించినందుకు చాలా కృతజ్ఞతలు. దయచేసి లక్ష్మి నెంబరు పంపించగలరు” అని మెసేజ్ పెట్టాడు.
ప్రతిగా “పెసాదూ! బాగున్నావా!” ఫోను తీసి, హలో అని అనకముందే, అవతలనుండి పలకరింపుగా మాటలు. లక్ష్మికి ‘ర’ కారం పలికేది కాదు. అంటే ఫోనులో లక్ష్మి… లక్ష్మి మాటలు. “లక్ష్మీ!” ఆనందంతో మాట బొంగురు పోయింది వరప్రసాదుకి.
***
ఇది జరిగిన సంవత్సరానికి, ఎదురుచూడని ఆనందమేదో ఎదలో తాండవిస్తుంటే, లక్ష్మీసౌజన్య, వరప్రసాదుల పెళ్లి సీతారామస్వామి కోవెలలో వైభవంగా జరిగింది.
-మజ్జి భారతి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
జ్ఞాపకాలు(కథ)- మజ్జి భారతి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>