నా కథ-1 – అమ్మ కథ- డా.బోంద్యాలు బానోత్(భరత్)
మా నాన్న, నాతో చెపుతుండేవాడు “అనేక మొక్కుల ఫలితంగా నువ్వు బతికీ బట్ట కట్టినావనీ. అందుకే నరులదిష్ఠీ తలగొద్దనీ, నీ పేరు ‘బొంద్యాలు’ అని పెట్టిన” అని. ఐతే,ఈ ‘బొంద్యాలు’ తండ్రి పేరు బాణోత్ భీలు నాయక్, ఈ బాణోత్ భీలు నాయక్ తండ్రి పేరు బాణోత్ చీమా నాయక్, ఈ బాణోత్ చీమా నాయక్ తండ్రి పేరు బాణోత్ హనుమా నాయక్…
ఐతే, ఈ బాణోత్ చీమా నాయక్ దీ పెద్ద కుటుంబంకావడంవల్లా, ఆయన వరకు చేతినిండా వున్నా భూమి , తన కొడుకులు తమ తమ వాటా పంచుకొనేసరికీ, తలసరి వాటాకొచ్చిన భూమి తగ్గుతూ వచ్చిందట. ఆ విధంగా మా నాన్న ‘బాణోత్ భీలు నాయక్ ‘ గారికి పరంపరగా సంక్రమించిన భూమి నాలుగు ఎకరాలట.
ఐతే మా నాన్న ‘భీలు’, మా తాతగారి రెండవభార్యకు పుట్టిన సంతానం కావడంతో , మొదటిభార్యకు పుట్టిన సంతానంవాళ్ళు కుట్రపన్నీ , మా నాన్న ‘భీలు’కొచ్చిన వాటా భూమి నుండీ, అప్పుడింత-ఇప్పుండింత, బలవంతంగా, తమ-తమ వాటాల్లోకి కల్పేసుకొనేవారట. ఆ విధంగా చెప్పుకోవడానికీ నాలుగు ఎకరాల భూమి వున్నా, నీటి సౌకర్యం లేకపోవడంతో, అందులో పంటలు అంతగా పండేవి కాదట, కేవలం వర్షాధార పంటలు మాత్రమే పండేవట, లేకపోతే బావులద్వార నీటి సౌకర్యం వుండేదట, కానీ మా భూమిలో బావి తవ్వించినా నీళ్ళ ఊట లేకపోవడంతో, వర్షాధారపు పంటలు మాత్రమే పండేవట, అది తమ కుటుంబ పోషణకు కష్టంగానే సరిపోయేవట. ఐనా,ఆ మట్టినే నమ్ముకోని, తమ కుటుంబం బతుకు సాగిస్తూండేనట..
ఐతే,అంతో-ఇంతో అన్నీ బాగున్నప్పటికీ, ‘భీలు-సీత’ దంపతులకు సంతానం కలుగుతుండేనట, కానీ కలిగిన సంతానం కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు లేదా సంవత్సరం.. తర్వాత, మరణించడం జరుగుతుండేనట. ఆవిధంగా అప్పటికే ఆరుగురు సంతానం పుట్టడం-చనిపోవడం జరిగీందట. దానితో బాగా కలతచేందిన మా అమ్మ..’గార్లా గ్రామం, సీతంపేట తండాలోని మా మేనత్తావాళ్ళ ద్వారా, కొరవీ వీరభద్రస్వామి మాహాత్యం తెలుసుకోని, కలిగిన సంతానం బ్రతకాలని, అలా బతికినట్లైతే, సంవత్సరానికొకసారి, ఎడ్ల బండితో వచ్చి మ్యాకపోతునుబలిచ్చి,మొక్కుతీర్చుకుంటానని..’ మొక్కుకున్నదట. అంతే కాదు,తండాకొచ్చే-పోయే సాధువులను, జాతకాలుచెప్పేవాళ్ళను, తలరాతలు చెప్పేవాళ్ళును, చేతులు చూసి జాతకం చప్పే వాళ్ళ ను కూడా, తమకు కలిగిన సంతానం బ్రతుకకపోవడానికి కారణాలు అడిగీ, తన అదృష్టాన్ని పరీక్షించుకొనేదట.
ఐతే, పుడుతూ -చస్తూ , పుడుతూ -చస్తూ… దక్కిన ఏడవ సంతానం కావడంతో, నన్నూ అల్లారు ముద్దుగా చూసుకొనేవారట. మా అమ్మ పేరు ‘సీత’. పేరుకు దగ్గా కష్టాలు వస్తూండేనట. కాని ఎన్ని కష్టాలు వచ్చినా, వాటిని ఎదిరించి నిలబడేదట. లేక లేక దక్కిన, ‘నన్ను’ ప్రాణప్రదంగా పెంచిందట. తను మట్టిలో పనిచేసినా, నన్ను మాత్రం,మట్టంటకుండా చూసుకొందట. పనికెక్కడికెళ్ళినా తన ప్రాణం నా మీదనే ఉండేదట.ఎక్కడికెళ్ళినా, నన్ను కూడా తనెంటే తీసుకెళ్ళేదట. ఉన్న దాంట్లోనే ముందుగా నాకు పెట్టీ, మిగులుతే తను తినేదట, లేకపోతే అర్ధాకలితోనే పడుకునేదట.
ఐతే,తమది వ్యవసాయ కుటుంబం కావడంతో, భూమిని దున్నడం, విత్తనాలువేడం, పండిన పంటను కోయడం..మెదలగు పనులు ప్రధానంగా చేస్తూండేవారట. ఐతే , ఒక రోజు మా చెలకలో విత్తనాలేసేటప్పుడూ, నన్ను తనవెంటే ఎత్తకోని పోయి, మర్రి చెట్టు ఊడలకు, తాడుతో ఉయ్యాల కట్టీ, అందులో నన్ను పడుకో బెట్టీ, జోలపాటలు పాడీ, ఆ చెట్టు కిందున్నా మైసమ్మ తల్లిని, ‘నా కొడుకును పురుగు -బుశి నుండి రక్షించు తల్లి, సల్లంగ సూడు తల్లి, విత్తనాలన్నీ మెలకెత్తేటట్లు చూడు తల్లి, వచ్చే దసర పండుగకు నీకో యాటపోతును కోస్తాను తల్లి ,’ అని మొక్కుకోని విత్తనాలేడం మెదలు పెట్టేదట. సహాజంగానే, మా అమ్మ ‘సీత’ చేతి విత్తనాలు మొక్కపోకుండా మెలుస్తాయట. మా అమ్మ విత్తనాలేసినా, కలుపు కలిచిన, నాటు వేసినా భూతల్లి మెచ్చుకొని, సంతోషపడేవిదంగా వుండేదట. అదేవిధంగా,మా నాన్న దుక్కి దున్నుతే, దుక్కీ కుంకుమలా ఉండేదట. అటువంటీ నీతి -నిజాయితీపరులైన, కష్టజీవులైన ‘భీలు-సీతా’లకు దక్కకా- దక్కకా, దక్కిన సంతానం కావడంతో , అనేక కష్ట-నష్టాలను అనుభవిస్తూ కూడా, నన్ను కంటికీ రెప్పలా చూసుకొనేవారంట. ఆ రోజుల్లో వైద్యసౌకర్యాలు అంతగా లేవట. ఐతే, అనుకోకుండా, ఒక రోజు నాకు జ్వరం రావడంతో, మా అమ్మ, తనకు తెలిసిన వైద్యం చేసిందట. ఐనా తగ్గినట్టే తగ్గీ, అర్దరాత్రి వరకు ఆ జ్వరం మరింత్తెక్వైందట. అదే అర్దరాత్రి, మా అమ్మా -నాన్న , నన్ను ఎత్తకోని, తండానుండీ మూడు కిలో మీటర్లు నడిచీ, ఊళ్ళోకెళ్ళి, డాక్టర్. ‘ఈరయ్య’ వాళ్ళ తలుపును తిట్టి లేపి, బ్రతిమిలాడి,’ నా కోడుకును బాగుచెయ్యమని’, వేడూకొనగా, ఆ డాక్టర్, నా చెయ్యీ చూసి, జ్వరం వందకు పైగా వుందని, గమనించి,గొట్టం- గోలి(ట్యాబ్ లేట్) , గొంతులో వేసి, బలవంతంగా మింగించి, నీళ్ళు తాపీ, కాసేపు కూర్చోబెట్టి, తర్వాత ధైర్యం చెప్పగా , ఆ రాత్రి తిరిగి ఇంటికి వచ్చేసరికి కోడి కూసేరాత్రైందట.
ఆ గోలి(ట్యాబ్లేట్) వేసుకున్న తర్వాత కొన్ని రోజులవరకు బాగానే వుండటం చూసి..,మా ‘అమ్మ’ చాలా సంతోషంగా వుందట, కానీ ఆ తర్వాత, నేను రోజురోజుకు బక్క-చిక్కి పోతున్నానట, అన్నం సరిగ్గా తింటలేనట, చలాకీతనం రోజు -రోజుకు తగ్గుతుంటే, అది చూసి మా అమ్మకు ఏంచేయ్యాలో తోచటం లేదట. ఈ విషయం మా పెద్దమ్మతో చెప్పగా, ఆమె ” గార్ల గ్రామం, సీతంపేట తండాలోని’నాజీ ‘ బాయి, దగ్గరకి తీసుకొపో, ఆమె డోర్నకల్ లోని భూత వైద్యుని దగ్గరికి తీసుకుని పోయి బాగు చేయించుతదీ. ” అని సలహా ఇవ్వగా, మా అమ్మా-నాన్న, నన్ను ఎత్తుకోని, 60-70 కీ.మీ.దూరం, నడుచుకుంటూ, మా మేనత్తైన ‘నాజీ ‘ వాళ్ళ ఊరికి తీసుకోని పోయారట. అదేవిధంగా మా మేనత్తైన ‘నాజీ’, నన్ను డోర్నకల్ లోని భూత వైద్యుని వద్దకు తీసుకోని పోయి, నా మెడకో ‘బిళ్ళ’ కట్టించిందట. ఆ ‘బిళ్ళ’ కట్టించుకోని రెండు రోజుల తర్వాత తిరిగి ‘నన్ను’ ఎత్తుకోని 60-70 కీ.మీ.దూరం నడిచి ఇంటికి వచ్చారట.
నా మెడలో ‘బిళ్ళా’ వుండేది, అది నాకు ఇప్పటికీ గుర్తుకుంది.. ఆ తర్వాత కొన్ని నెలలు బాగానే ఉన్నానట, “ఇక నా కొడుక్కు తిరుగు లేదు” అని అనుకోని కాస్త నిమ్మలమై ఆరునెలలు దాటకముందే మల్లా మునుపటి లాగానే, కాళ్ళు- చేతులు గుంజడం, జ్వరం.. అది తట్టుకోలేక నేను బాగా ఏడవటం, అది చూసి మా అమ్మా -నాన్నలు కూడా ఏడవటం..జరుగుతుండేనట.
ఐతే “ఇప్పటికీ అనేక ప్రయత్నాలు చేస్తిమీ, దవాఖానకు తీసుకోపోతినీ, దైయ్యము, దీష్ఠీ అంటే డోర్నకల్ కు తీసుకొని పోయి బాగు చేయించీ తీసుకోని వస్తిని, ఇవ్వేకాకుండా చిన్నా-చిత్కా…ఎన్నో , వాటి లెక్కేలేదు, ప్రతిచోట పైసలే-పైసలు ఖర్చైనయి, అప్పులైనయి కాని ‘నాకొడుకు’ మాత్రం బాగైతలేడు,ఇంతకంటే ఎక్కువా నేనేంచెయ్యాలో, తోచని పరీస్థితిలో కొట్టూ-మిట్టాడూతున్నా” అని కంటతడి పెడుతూ.., పక్కింటీ ‘అంబ్బాలీ’తో చెప్పిందట, మా అమ్మ .
ఐనా, అప్పట్లో సరైన వైద్య-విధానం అందుబాటులో లేవట. 90శాతం గ్రామీణ ప్రజలు మూడనమ్మకాలైన, చేతబడి, చెట్లమందులు, బాణామతి, మంత్ర-తంత్రాలు, బాబాలు, భకత్, దైయ్యాలు, భూతాలను నమ్మెవాళ్ళట. మనుషులకు జరమేచ్చిన, నొప్పొచ్చిన వాళ్ళనే ఆశ్రయించే వాళ్ళట.
ఐతే అప్పటికే విసికి-వేసారిన, మా అమ్మా -నాన్న , చివరి ప్రయత్నంగా, బాగా పేరున్న భక్త/బాబా అయినా ‘ఎంకటియ భకత్’ దగ్గరికి తీసుకుని పోయి, బాగుచేయించారట. ఐతే, అప్పుడప్పుడే నాకు నాలుగు ఏండ్లు ఎల్లీ, ఐదవ సంవత్సరంలోకి అడుగు పెట్టానట. ఐతే చాలా మంది, అంతో-ఇంతో చదువు జ్ఞానం, లోకజ్ఞానం వున్నోళ్ళు ” చిన్న పిల్లలకు ఐదు సంవత్సరాలు వచ్చినయంటే ఇక చావు వుండదు” అని అనేవాళ్ళట, అది వినీ, ఇక నా కొడుకుకూ, కూడా ఏమి కాదనీ భావించి, మా అమ్మా -నాన్న, చాలా సంతోష పడేవారట.
ఐతే అప్పుడప్పుడే తండాకు ‘బడి’ మంజూరైంది. ఆ విషయం తండాలో అందరూ మాట్లాడుకోవడం వినీ, మా అమ్మ, అందరితో పాటు నన్ను కూడా ‘బడి’కి పంపాలని అనుకున్నదట. ఐతే,నాకు అప్పుడప్పుడే అన్నీ విషయాలు అర్థమవుతున్నాయి. ‘వచ్చే సోమవారం నుండి తండాకో బడి పంతులోస్తాడనీ, తండా పిల్లలందరూ, బడికి పోతారనీ, నేటి సమాజానికి చదువు చాలా అవసరమని, గమనించిన మా ‘అమ్మ ‘, నన్ను కూడా మా తండా బడిలో జయిన్ చేసింది..
(ఇంకా ఉంది )
– డా.బోంద్యాలు బానోత్(భరత్)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
నా కథ-1 – అమ్మ కథ- డా.బోంద్యాలు బానోత్(భరత్) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>