నా కథ-8– మా చెల్లి పెళ్ళి(కథ)— డా.బోంద్యాలు బానోత్(భరత్)

….ఎన్ని కష్టాలొచ్చినా, బీరం మల్లారెడ్డి జీతం రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేశాను. ఎప్పుడో, 7-8సంవత్సరాల క్రిందట చదివి, మరిచిపోయిన చదువు, మళ్ళీ బీరం మల్లయ్య దగ్గిర జీతమున్నప్పుడూ, రాత్రి బడిలో చిగురించింది. అది నన్ను మళ్ళీ బడికి పోయి చదువుకోవాలనే కోరికను కలిగించింది. కాని ఆ సంవత్సరం సాద్యం కాలేదు. ఎందుకంటే!? మా నాన్న, మా చెల్లి పెళ్ళి పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో పేదోడి ఇంట్లో పెళైన ఒక పది వేలైన ఉండవలసిందే. ఐతే,మా నాన్న మా చెల్లి పెళ్ళికి ఎనిమిది (8000) వేల రూపాయల కట్నం ఒప్పుకున్నాడు. నేను జీతముండకుంటే, అన్ని రూపాయలు సమకూర్చడం చాలా కష్టం. పెళ్లి ఆగి పోయే ప్రమాదముంది. ఇదంతా ఆలోచించి, ఆ సంవత్సరం, బడికి పోవాలనే ఆలోచనను, వచ్చే సంవత్సరానికీ వాయిదా వేశాను. మా పెదనాన్న కొడుకు, జగన వద్ద, గొర్లకాడా జీతానికి ఒప్పుకున్నాను.
ఐతే, ఇక్కడా, మనకు ఇష్టమున్న, ఇష్టం లేకపొయినా, కొద్దిగంత ‘జగనా’ గురించి చెప్పుకోక తప్పదూ. ఈ ‘జగనా’ ఎవరోకాదు! ఆయనా మా పెదనాన్న కొడుకే!. ఐతే, ఎంత పెదనాన్న కొడుకైన అందరం ఒకే విధంగా ఉండలేము కదా!?. ఆయనకు 30-40 జీవాలు న్నాయి. ఆయన తన పొలంలో కష్టపడి పనిచేసే వాడు. కష్టబోతు మనిషి.తనకు సంతానంగా, ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. తన భార్యతో పాటు, వాళ్ళ పిల్లలందరూ, శుభ్రతను పాటించేవారు కాదు. వాళ్ళందరు పెద్దగా తెలివి-తేటలున్న కుటుంబం కూడా కాదు. కాని ‘అనేక విధాలుగా ఆలోచించే నేను, అంతో-ఇంతో చదవగలిగే నేను, ఈ మూర్ఖుడి కీ జీతం వుండటమేమీ!?’ అని ఆలోచించే వాడిని. ఎందుకంటే!? అతని వద్దా 30-40 గొర్లు వుండటమే, అవ్వే అతనికి ఆదాయం కావచ్చు. అతనిలా, గొర్లు మాకు లేకపోవుటనే, నా ధుస్థితికీ కారణం కావచ్చు, అని, అప్పుడప్పుడు నా అద్రుష్టం, కర్మా, తల రాత.. అనుకొని, పరీస్థితులకు అనుగుణంగా మారిపోవడమే నా పనయిందీ.
ఐతే, ఎదావిధిగా, ఇంతకుముందు ఊళ్ళో భూస్వాములకు పశువుల కాపరిగా జీతం ఉండేవాడిని. కాని ఈసంవత్సరం, మా తండాలో నే, మాకైనవాడికే, మా పెదనాన్న కొడుకు వద్దనే, గొర్ల కాపరిగా, జీవితం ఉండటం జరిగింది.
మా తండాకు పడమరన తాటి బొత్తాలు న్నాయి. మా ఊరినుండి కల్లు కొరకు కొందరు తరుచుగా కల్లు మండువా వద్దకు వచ్చి, పుర్సత్గా కల్లూ తాగి, బాతాకహానీలు చేసి, చీకటి పడుతుండగా నెమ్మదిగా లేచి, తిరిగి ఇంటి మెఖానా పోతుంటారు.
ఐతే, నేను ఒక రోజు పొద్దంతా గొర్లను మేపుకోని, సాయంత్రానికి వాటిని తోలుకొని, బొత్తల్లోని కల్లు మండువా పక్కెమ్మటినుండి ఇంటికి పోతున్నాను. నా గొర్లు, కల్లు మండువా దాటి పోతుండగా.. ” ఓ రాములు!” అని చిన్నపాటి కూత వినపడింది. ఈ కల్లు మండువా నుండి నన్ను పిలిచేవారు, ఎవరై ఉంటారు!?, అని అనుకోని, అటువైపు చూడగా, అతను ఎవరో కాదు, మా సారు, నాకు ఊళ్లో రాత్రి పూట చదువు చెప్పిన సార్. నేను అతన్ని చూసి కొద్దిగా భావోద్వేగానికి గురయ్యాను. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అది చూసి మా సారు నన్ను ఓదార్చాడు. “నీకు కావాలంటే చెప్పు, నేను రోజు ఇక్కడికి వస్తుంటాను, ఇక్కడే ఓ అరగంట వుండి, నీకు చదువు చెప్పే వెళ్ళిపోతాను, సరేనా?” అని అన్నాడు. అది విని నేను చాలా సంతోష పడ్డాను. ఇంటికి పోయి నా తోటి వాళ్ళతో ఆ విషయం చెప్పాను. వాళ్ళందరినీ పోగు చేసి, బానోత్ నరసిహ్మా ఇంటిముందు, రాత్రి పూట బడి ప్రారంభించాము. పదీ-పదిహేను మందీ రాత్రి బడికి రావడం మొదలు పెట్టారు. అది ఎండాకాలం, కావడంతో రాత్రి పూట బడి సాఫిగానే సాగింది. ఒక్కోక్కరికీ పది రూపాయల ‘ఫీ’ ఇస్తామని, నిర్ణయించాము. కాని మా ‘సార్’ నెలరోజులు వచ్చాడు, అందరూ ‘వర్ణమాల’ నేర్చుకున్నారు. ఆ తర్వాత నుండి రావడమే మానేశాడు. మళ్ళీ అతను నాకు కలవలేదు.
ఐతే, యదావిధిగా నేను నా పని చేసుకోని, పొద్దంతా గొర్లను మేపుకోని, సాయంత్రానికి వాటిని ఇంటికి తోలుకొని రావడం చేసేవాణ్ణి. ఐతే, మేము ఈ జీవాలను ఎక్కువ శాతం గర్శలకుంట మడికట్లల్లో, మాటు(వాగు) వెంబడి, చినాల కాంతయ్య దుబ్బా(బీడు భూమి) ప్రాంతంలో మేపేవాళ్ళం. కేవలం మా గొర్లేకాకుండా, పశువులను కూడా మేపేవాళ్ళు. ఐతే, పానీష్ తండా వాసులు, వాళ్ళ పశువులను కూడా అక్కడే మేపేవాళ్ళూ. చాలామంది 7సం. చిన్నపిల్లల నుండీ 12సం. 15సం.20సం. 50సం. పెద్దవాళ్ళ వరకు తమ తమ పశువుల కాపరికీ వచ్చే వాళ్ళు. ఐతే, అందులో ‘భూలా’ అనే అమ్మాయి, వాళ్ళ నాన్న పేరు ‘ఝగరాం’ అనుకుంటా, చాలా అందంగా ఉండేది. ఆకర్షణీయంగా ఉండేది. ఆ అమ్మాయితో పాటు ఇద్దరో-ముగ్గురో అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఉండే వారు. వాళ్ళంతా సరదాగా ‘ఈల’ వేయడం పేర్చుకుంటూ, అభ్యాసం చేసేవాళ్ళు. ఆ గుంపులో ఈ ‘భూలా’ అనే అమ్మాయికీ ‘ఈల’ వేయడం వచ్చేసింది. ఇంకా కొంతమందికి ‘ఈల’ వేయడం రావడంతో, వాళ్ళందరు తమ తమ ‘ఈల’ వేసే సామర్ధ్యాన్ని, ‘ఈల’ ఎంతదూరం వరకూ వినిపించగలదు! అనే విషయం పై తమాషాలు, శరతులు.. మొదలగు ఆటలు ఆడుకునే వాళ్ళు. వాళ్ళను చూసి నేను కూడా ‘ఈల’ వేయడం నేర్చుకున్నాను. ముఖ్యంగా ‘భూలా’ అమ్మాయి ‘ఈల’ వేస్తే ఆ చప్పడూ (సవుండూ) చాలా దూరం వరకూ వినిపించేది. ఆమె నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఆమే పశువులు ఉన్న చోటికి, నేను నా గొర్లను తోలుకొని పోయే వాడిని. ఆమేనే చూస్తూ ఉండాలని అనిపించేది.
ఐతే, సాయంకాలం 5-6:గం. సమయంలో పశువులను, జీవాలను ఇంటికి తోలుకొని పోయే సమయం. శని, ఆది వారాల్లో, ఆ సమయంలోనే, ‘భరత్ భూషణ్ ‘ వయేజనవిద్య సుపర్వైజర్, తన హీరో హోండా బండిపై, ఘట్టికల్, ఊకల్ గ్రామాల్లో, వయేజనవిద్య సెంటర్ల తనిఖీ కోసం పోతుంటే గుర్తుపట్టి, ఆయనను, అందించుకొనుటకూ, పరుగెత్తే వాడిని. అలా పరుగెత్తి పరుగెత్తి, ఎంత పరుగెత్తినా కాని ఆ హీరో హోండా బండికి అడ్డంగా అంది పుచ్చుకోవడం సాద్యం కాకపోయేది. ఒక రోజు చాలా దూరం నుండి వస్తున్న ఆయన బండిని గమనించి, ఆ మడికట్లనుండి, ఆ సారు పోయే రోడ్డుకు అడ్డంగా, పరుగెత్తాను(ఉరికాను). ఎంత ప్రయత్నించినా అందుకోలేని పరీస్థితిలో, పరుగెత్తుకుంటూ ‘ఈల’ వేశాను. ఆ ‘ఈల’ చప్పుడు విని, బండి నడుపుకుంటూ, నా వైపు చూసి, నన్ను గుర్తు పట్టి, బండి ఆపాడు ‘భరత్ భూషణ్ సార్’. ” అరే నువ్వు ‘రాములు’వీ కదు!? ఊళ్ళో వరలక్ష్మీ మేడం వద్ద రాత్రి బడికి వచ్చే వాడివి. ఐతే, ఇప్పుడు ఇక్కడేంచేస్తున్నావు!?, మీ అమ్మ -నాన్నా.. అందరూ బాగున్నారా?, మరీ ఇప్పుడు రాత్రి బడికి పోతున్నావా, లేదా? ” అని మొదలగు విషయాలు అడిగాడు, మా సారు(వయేజనవిద్య సుపర్వైజర్). ఐతే, అయనను చూసి భావోద్వేగానికి లోనయ్యాను, నా కళ్ళల్లో నీళ్ళు చెమ్మగిల్లాయి. “ఏడవకు ‘రాము ‘ మన పరీస్థితులకు అనుగుణంగా మనము మారాలి. సాధ్యమైనంత వరకు, రాత్రి పూట బడిలో చదువుకో, దానితో తెలివి వస్తుంది. అది మన జీవితంలో మార్పుని తెస్తుంది.” అని హితబోధ చేశాడు మా సార్. “ఇక నేను వెళ్ళనా!?” అని అడుగగా “పోయి రండి సార్”, “కాని, నాకు మీ అడ్రస్ ఇవ్వండి. ఎప్పుడైనా వరంగల్ కు వస్తే మీ ఇంటికి రావచ్చు.” అని అడుగగా ఓ కాగితపు ముక్క పై తన అడ్రస్ రాసి ఇచ్చాడు. బండి స్టార్ట్ చేసి ఘట్టికల్ కు వెళ్ళి పోయాడు. ఆ అడ్రస్ కాగితపు ముక్కను చాలా జాగ్రత్తగా దాచి పెట్టాను.
అలా ప్రతి రోజు గొర్ల కాపరిగా,గొర్లును మేపేందుకు తండా చుట్టూరుగా, ఒక కిలోమీటరు నుండి ఒకటీన్నర కిలోమీటరు దూరము పరిదిలో మేపేవాళం. ఆ సంవత్సరం ‘చంద్రబాబు నాయుడు’ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ సంవత్సరం వర్షాలు కురువకపోవడం వలన, గర్శలకుంట పొలాల్లో వరిపంటా వేయకుండా, అందరూ ‘పచ్చజొన్నలు’ వేశారు. మడికట్లల్లో మొదటి సారి పచ్చజొన్నలు వేయటం వలన కావచ్చు!, విపరీతంగా పంటపండింది. జొన్న కంకులు ఎప్పుడూ లేనివిధంగా, ఇంతీంత లావు జొన్నగింజలు, పెద్దపేద్ద జల్లీ కంకులు.. నిండుగా పాలు పోసుకున్న కంకులు.. ఉన్నాయి. చినాలోల్ల దుబ్బ-బీడు భూమి, మాటు కట్టేమ్మడి, పచ్చటి గడ్డి, జొన్న చేను వెమ్మడి పచ్చటి గరకా వుండేది. అందులో గొర్లు కదలకుండా, మేత మేస్తూవుండేవీ. అప్పుడు నేను, నా మితృలతో కలిసి, పాల పజ్జొన్న కంకులు, విరిచీ, జొన్న గింజలను, తువ్వాలలో, దులిపి, తెల్లటివీ, గట్టివీ, పలుగు లేదా కంకర రాళ్ళను, ఏరుకొని, వాటిని శుభ్రం చేసి, పిడకల నిప్పుల్లో వేసి, బాగా వేడి చేసి, ఆ రాళ్ళను, తువ్వాలలో ఉన్న పాలజొన్నల్లో వేసి, వేంచి(కాల్చి) తినేవాళ్ళం. ఆ రుచ్చినీ ఇంకా ఏ ఇతర పదార్థాలతో పోల్చలేము.సాయంకాలం 5:30-6:గం.కు, జీవాలను తోలుకోని ఇంటికి పోయే వాణ్ణి.
ఐతే, వానాకాలం వరి కోతలు దాదాపు దగ్గిర పడినయి. అప్పటిదాక పరిమిత ప్రదేశంలో తిరిగి మేసిన జీవాలకు, ఇప్పుడు విశాలమైన మడికట్లూ, వాగులు, వంకలు, కుంటలు తిరిగి మేసే దానికి అవకాశం ఏర్పడింది. ఒక రోజు గర్శలకుంట మాటు (వాగు, మత్తడి), భూరెవాళో కూండ్ (మాటు కింది వాగు), వాటిలో ఇరువైపులా గుబురుగా చెట్లు, పొదలు ఉన్నాయి. ఆ వాగుకు రాగన్నా గూడెం వైపు, పెద్ద పెద్ద మర్రిచెట్లు, వాటిల్లో మద్ద్యలనండీ పొడుగాటి తాటి చెట్లు వుండేవి.
వరికోతలు అయి పోవడంతో, భూరెవాళో కూండ్ (వాగు) వెమ్మడి గొర్లను మేపుతున్నాము. ఐతే, రాగన్న గూడెం గొల్లోల్ల గొర్లు కూడా ఆ వాగేంమ్మడీ మేస్తూన్నాయి. మధ్యాహ్నం వాగులో నీళ్ళు తాగే చోట, వాళ్ళ జీవాలు, మా గొర్లు కలవడం వలన, గూడానికి చెందిన ఒక పిల్ల తల్లి గొర్రె, దానికి తోడుగా మరో గొర్రె, మొత్తం మూడు జీవాలు, మా మందలో కలిసిపోయి, మా ఇంటికి వచ్చినాయి. ఈ విషయం నాకు మరియు నా మిత్రుడు ‘నరసింహ్మా’ కు మాత్రమే తెలుసు. ఆ తర్వాత మా గొర్లు మేత కోసం, అటువైపుకు పోలేదు. రెండు రోజుల తర్వాత ‘రాగన్న గూడెం’ కు చెందిన గొల్లాయన మా గొర్ల మంద వద్దకు(తండా)కూ వచ్చాడు. అప్పుడు నేను గొర్ల ఎరువును కుప్పలు చేస్తున్నాను. “ఓ పిలగా, మొన్నా, మీ గొర్ల మంద, రాయపర్తి మాటు పొంటా, వాగు వెమ్మడి మేసినప్పుడు, మా గొర్ల, మీ మందలో కలిసినయా? ఒకటి పిల్లతల్లి గొర్రె, వాటికి తోడుగా ఇంకో గొర్రె, ఆ యెల్ల మొత్తం మూడు జీవాలు తప్పి పోయినయి. మీ మందలో కలిసినయా? లేదా ఎక్కడైనా కనిపించినా! కొదిగా ,చెప్పవా?.” అని అన్నాడు, ఒక్కింత బాదగా. ” అరే అన్నా!, మీ జీవాలు, మా జీవాలు అక్కడా, తరుచూగ కలుస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడూ మీ జీవాలు, మా మందలోకి, మా గొర్లు మీ మందలోకి, సహాజంగానే కలుస్తూంటాయి. మళ్ళీ మంద అటువైపుకు వచ్చినప్పుడు, వాటి వాటి మందల్లో కి వెళ్ళి పోతుంటాయి. కాని మొన్ననైతే మీ జీవాలు, తప్పిపోయి మా మందలోకైతే రాలేదు. కావాలంటే చూసుకో రాదు!?, నీ కేమైన అడ్డమా!?” అని నేను అన్నాను.
“ఏ..హె..అడ్డం-గిడ్డం కాదు కానీ, మన మందలో కలిసి వస్తే..ఎటుపోతయిగనీ.. అని అనుకుంటా.. ఆ వెదురు తడక మీద చేతులు వేసి, తలకాయ నిక్కపొడిచీ, లోపలికి, మంద లోపలికి, తొంగి నలువైపులా చూసి, లేవని వెళ్ళి పోయాడు. పోతూ పోతూ ” ఎక్కడైనా కనిపించినా, వెంటనే మాకు కబురు పంపూ…” అని అనుకుంటూ వెళ్ళి పోయాడు గొల్ల కొంరయ్య . ఆ తర్వాత తప్పిపోయి వచ్చిన, ఆ గొర్లు,రెండు మూడు రోజులు వరకు మా మందలోనే ఉన్నాయి. ఈ విషయం నాకు మరియు నా మిత్రుడు నరసిహ్మా కూ మాత్రమే తెలుసు.
ఐతే, వాటిని ఏంచేయాలి!? అని ఆలోచిస్తూన్నా క్రమంలో, మా ఇద్దరికీ ఒక ఉపాయం తోచింది. అదేమిటంటే!?, ‘గోపీచంద్’ కీ చెప్పీ వాటిని సులభంగా వాళ్ళ అత్తారింటికి, పంపీస్తే, ఎవరికీ అనుమానం కలుగదు. పైగా వాళ్ళకీ గొర్లు ఉన్నాయి. వాటిల్లో సులభంగా కలిసిపోతాయి. అని భావించి అతనికీ ఈ విషయం చెప్పాను. అతను మౌనంగానే ఒప్పుకున్నాడు. అతన్ని మధ్యాహ్నం వరకు ధర్మకంచా, సత్తడేర్ గడ్డా, భాటూర్ ఘరేసామ్( భట్టోల్ల ఇంటివైపు)కూ రమ్మని చెప్పి, మేము మా గొర్లమందని, భట్టోళ్ళ తండా వైపుకు మేపేందుకు తోలుకొని పోయాము. చెప్పిన విధంగానే, గోపీచంద్ గారి అత్తవారి గొర్ల మంద, అటువైపు వచ్చి, ఆ తప్పిపోయి వచ్చిన మూడు జీవాలను, వాళ్ళ మందలో కలిపేసి, మా మందును , నెమ్మదిగా వెనక్కు మళ్ళించీ, మేపుకుంటూ, సాయంత్రానికి ఇంటికి తోలుకొని వచ్చినాము.
ఒక రోజు నా మిత్రుడు ‘యాక్యా’ మరియు నేను, బిళ్ళోల్ల మొదుగులు, బళిజోళ్ళ బీడు , మద్యలో ఊకల్ రోడ్డేమ్మటీ గొర్లను మేపుతున్నాము, . ఆ రోడ్డేమ్మటీ, ఎడతెరుపు లేకుండా, ట్రాక్టర్ లు, డీసీయంలు, లారీలు, కార్లు.., మూడు రంగుల జెండాలు , బ్యానర్లు, చేతి గుర్తు జెండాలు..కట్టుకొని, మైలారం వైపుకూ వెళ్ళుతున్నాయి. “రాజీవ్ గాంధీ జిందాబాద్!,రాజీవ్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి!, కాంగ్రెస్ జిందాబాద్!, రాజీవ్ గాంధీ మీటింగునీ జయప్రదం చేయండి! రండి రండి, హన్మకొండాకు కదిలి రండి!” అంటూ నినాదాలు ఇస్తూ పోతున్నారు. వాళ్ళను చూసి నాకు కూడా వాళ్ళతో పాటు మీటింగ్ కీ పోవాలనిపించిందీ. రాజీవ్ గాంధీని దగ్గరినుండి చూడాలనిపించింది. కాని, నా గొర్ల సంగతి ఏం కావాలి? అని ఆలోచనలో పడ్డాను. సడన్గా ఒక ఉపాయం తట్టింది. జేబులో చూడంగా, నా వద్దా పది రూపాయలు ఉన్నాయి. అందులో నుండి ఐదు రూపాయలు నా మిత్రుడికిచ్చీ, గొర్లను ఇంటికి తోలుకొపొమ్మని, ఆ గొర్రెలను అతనికి అప్పజెప్పాను.
ఎలాగో-ఒలాగా ధైర్యం చేసి, ఆ మీటింగుకూ పోతున్న, ఒక ట్రాక్టర్ ఎక్కాను. కాని , లోపల భయం మొదలైంది. నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అప్పటి వరకు నేనెప్పుడూ మా ఊరు దాటి బయటకు పోలేదు. పైగా వరంగల్ -హన్మకొండ, చాలా పెద్ద పేరుపోయిన నగరాలు. పోతుంటే ‘శంభుని పేట’, ఎప్పుడూ-ఎక్కడ వస్తూందా! అని చూసుకొంటూ పోయాను. ఎందుకంటే మా వయేజనవిద్య సుపర్వైజర్ ‘భరత్ భూషణ్ సార్’ వాళ్ళది అదేవురు. కాని, ఆ జనం తొక్కీసులాటలో , అది ఎక్కడ-ఎప్పుడూ తప్పిపోయిందో అర్థం కాలేదు.
మా వెనకాల వస్తున్నా ట్రాక్టర్, నేను కూర్చున్న ట్రాక్టర్ ను దాటేసీ, దూసుకెళ్ళి పోతుంది. ఎవరైవుంటాడు!? అని చూడగా, అది బీరమొల్ల ట్రాక్టర్, తోలేటివాడు బీరమొల్ల ట్రాక్టర్ డ్రైవర్. ఆయనను నేను గుర్తు పట్టాను. నన్ను చూస్తే అతను కూడా గుర్తు పడుతడు. దానిమీద బీరం వీరారెడ్డి (ఈరన్న) కూడా కూర్చోని ఉన్నాడు. వాళ్ళు కూడా రాజీవ్ గాంధీ మీటింగుకే పోతున్నారు. వాళ్ళను చూసి, నాకు ధైర్యం వచ్చింది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ ట్రాక్టర్ మీద కూర్చొని రావచ్చు, అని అనుకున్నాను.
వేకిల్స్ విపరీతంగా రావడం వలన, కిలోమీటర్ దూరం నుండే జామైనయి. అందరూ తమ తమ వాహనాలు దిగీ, నడిచి మరీ వెళ్ళుతున్నారు. నేను ఉన్న ట్రాక్టర్ మీద వచ్చిన వాళ్ళు కూడా, ట్రాక్టర్ దిగీ, పరుగెత్తుతున్నారు. నేన కూడా దిగీ పరుగెత్త్యాను. సందుల్లో-బొందుల్లో పడి, రాజీవ్ గాంధీ కి దగ్గిరలో పోయాను. అంతకంటే ముందుకు పోవడానికి లేదు. అక్కడా పోలీసులు కాపలా కాస్తున్నారు. అంతకంటే ముందుకు పోనివ్వడంలేదు. రాజీవ్ గాంధీని చూడగానే, నాకు ఏదో సాధించినట్టూ అనిపించింది. ఆయన ప్రసంగం మేము చేరుకునే ముందే మొదలైంది. మేము చేరుకున్న తర్వాత 10-15 నిమిషాలు కొనసాగింది.”..ఇంతటితో ఈ సభ ముగిసింది, దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు, జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని కోరుతున్నాను..” అని అనటంతో మళ్ళీ తిరిగి ట్రాక్టర్ వద్దకు వెళ్ళుతుండగా, వీరారెడ్డి (ఈరన్న) కలిశాడు. అతనితో వాళ్ళ ట్రాక్టర్ మీద కూర్చొని ఇంటికి పోయే సరికి రాత్రి 11గం. అయిందీ. అప్పటికే మా నాన్న, అన్నం కూడా తినకుండా, నా గురించి బెంగ పడుతూ, ఎదురు చూస్తున్నారు.
మేమందరం బిళ్ళోళ్ళ మెదుగుల్లో జీవాలను మేపుతున్నం. ఎండాకాలం కావడంతో మర్రి చెట్టు నీడకు కూర్చున్నాము. మాటెనకమాట మా గుంపులో ఎవరో “ఈ రోజున మనమందరం ఈ చెట్టు కింద కూర్చుని, కబుర్లు చెప్పుకుంటూ, నువ్వుకుంటూ, మాట్లాడుకుంటూ, ఆటలాడుకుంటూ.. ఆనందంగా ఉన్నాము. ఇంకో నెల రోజుల తర్వాత ఎవ్వరెక్కడుంటరో, ఎవ్వడెటుపోతడో ఎవరికి తెలుసు!?”అని అన్నాడు. “ఎందుకు? నెలరోజుల్లోనే ప్రళయం వస్తుందా!?” అని నేను అన్నాను. అరే ప్రళయం ఏంటిది!? అరే! నెలైతే ‘ఉగాది’ వస్తనే వుండే! . ఉగాదికి పాతజీతగాళ్ళు పోతరు, కొత్తజీతగాళ్ళు వస్తారు. అందుకనే ఎవ్వడెటుపోతడో ఎవరికి తెలుసు!? అని అంటున్నా. ” నేనైతే ఈసారి ‘ఆరు నూరైనా నూరు ఆరైన సరే” జీతమైతే ఉండును. ఎట్లైన చేసి బడికి పోవాలి. బడిలో చేరాలే!. అని అన్నాను. అన్నట్టుగానే ఉగాదికి ఇంకో మూడు రోజులు ఉందనగా, జీతమొదిలేసీ, నా మిత్రుడు లింగ్యాతో, హన్మాకొండాకూ వెళ్ళిపోయాను. 1990 వ.సం.సంకేళ్ళు తెగిన పక్షినయ్యాను…
— డా.బోంద్యాలు బానోత్(భరత్)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
నా కథ-8– మా చెల్లి పెళ్ళి(కథ)— డా.బోంద్యాలు బానోత్(భరత్) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>