మూడో పాదం (కవిత)-నేలపూరి రత్నాజీ

నా స్టీలు కంచపు ఆకాశంలో
మల్లెపువ్వుల్లా ఉడికిన
అన్నం లోకి
కారం చల్లి కలిపిచుట్టిన
నాగొంతులో
ఎర్రటి సూరీడు ముద్ద
నేనప్పుడు
రుద్రప్రళయ గరళ నీలకంఠుణ్ణి
పళ్లెం వార చుట్టూ
నావేళ్ళ కొమ్మలనుంచి వొలికిన
తెల్లని ఎర్రటి మెతుకులు
కొన్ని నక్షత్రాలు..గ్రహ గోళాలు కొన్ని
నా అడుగుల కింద
భువన బోనంతరాలు
నాలో అంతర్లోకాలు నిక్షిప్తం చేసిన వాణ్ణి
పాలపుంతల పాల బంతులు
నా కాలి బొటనవేలి కింద
తొక్కిపట్టి బంతాడతాను
ఒక్కొక్క ముద్దను భూగోళం లా చుట్టి
నోటికందించిన అరచేతి గుప్పిలిప్పి చూస్తే
ఎర్రటి ఎండలో శిలువెక్కిన
రక్తమయాల క్రీస్తు గాయపు హస్తాల్ని
క్షమను మాత్రమే ఇవ్వను గాయాన్ని కూడా చేస్తాను
నేను ఊరి చివర గుడిసె ముందర
లక్ష్మణ రేఖల్ని తొక్కుకుంటూ
మీ హస్త సాముద్రిక గీతల
చెరుకు గడను కణుపులు కణుపులు గా
నరుకుతూ వస్తున్నాను..మీమధ్యలోకి
చండాల పాదుకలు తొడుక్కుని..
భూమికి ఆకాశానికి చెరో పాదం నిలిపి
ఈ వామనుల నెత్తిమీద
నా అంటరాని మూడో పాదం మోపుతాను
-నేలపూరి రత్నాజీ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
మూడో పాదం (కవిత)-నేలపూరి రత్నాజీ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>