అంతర్వీక్షణం-7 (ఆత్మకథ ) – విజయభాను కోటే
తిక్క అనే లక్షణం అందరిలోనూ ఉంటుంది. మనుషులం కదా! ఆ తిక్క నా విషయంలో ఎప్పుడూ మంచినే చేసింది.
చిన్నప్పుడు నాకు నచ్చితేనే ఏ పని అయినా చెయ్యడం అలవాటు అయింది. నాకు నచ్చితేనే ఆడడం, నాకు నచ్చితేనే చదవడం, నచ్చితేనే ఎవరితోనైనా మాట్లాడడం, నచ్చితేనే ఏ పనికైనా పూనుకోవడం, అది పూర్తయ్యే వరకూ రాక్షసిలా నిద్రాహారాలు వదిలి పని చెయ్యడం.
చిన్నప్పుడు ఒకసారి అమ్మమ్మ ఏదో పని చెప్పిందంట. నాకు ఆ పని చెయ్యడం ఇష్టం లేదేమో, చెయ్యను అని చెప్పానట. ఎన్ని సార్లు, ఎన్ని విధాలుగా చేయించజూసినా చేయించలేకపోయిందట అమ్మమ్మ. ఎప్పుడూ ఆ విషయం చెప్తూనే ఉండేది.
ప్రైమరీ స్కూల్ చదివే సమయంలో రోజూ స్కూల్ కి వెళ్ళడం దినచర్య. అలా అలవాటు చేసింది మమ్మీ. స్కూల్ ఎంత బావుండేది అంటే ఒక్క రోజు కూడా స్కూల్ మానాలి అనిపించేది కాదు. సెయింట్ జాన్స్ పారిష్ స్కూల్. ఎంత పెద్ద స్కూల్ అని! ఎన్ని చెట్లని! దానికి తోడు ప్రిన్సిపల్ గారి భార్య నన్ను మహా ముద్దు చేసేవారు. ఆమె పేరు కానీ, ప్రిన్సిపల్ గారి పేరు గానీ గుర్తు లేవు కానీ, ఇప్పటికీ ఆమె నన్ను తన దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం తినిపించడం గుర్తు. అక్కడ ఇందిర ఉండేది. బిందు తన చెల్లి. ఇందిర ఎప్పుడూ బాధగా మాట్లాడేది. తనకు సవతి తల్లి అని, బాగా చూడదని చెప్పేది. నాతో ఉన్నపుడు మాత్రం పిచ్చి అల్లరి చేసేది. ఎందుకో ఇందిర అంటే జాలితో కూడిన ఇష్టం అప్పట్లో. తను బాధగా ఉంటే ఎక్కువ అల్లరి చేసేదాన్ని. తను కూడా నాతో కలిసి అల్లరి చేసేది. బిందు అల్లరి గురించి చెప్తే ఇంట్లో దెబ్బలు పడేవంట. అయినా మా గోల మాదే. ఒకరోజు ఇందిరను, బిందును మా ఇంటికి తీసుకువెళ్ళాను. మమ్మీ అప్పట్లో టీచర్ గా పని చేసేది. తను ఇంకా స్కూల్ నుండి రాలేదు. మా చెల్లి బయట ఎక్కడో ఆడుకుంటున్నట్లు ఉంది. తను మాతో లేదు. మా బెడ్ రూమ్ లో ఒక డబుల్ కాట్ ఉండేది. దాని క్రిందికి వెళ్ళేలా ఒక సక్కీ మంచం ఉండేది. అందరం పడుకునేపపుడు ఆ సక్కీ మంచం బయటికి లాగి పడుకునేవాళ్ళం. లేదంటే అది డబుల్ కాట్ క్రిందికి తోసి ఉండేది. ఆ రోజు ఆ అరేంజ్మెంట్ చూపించగానే ఇందిర ఒక ఆట ఆడదాం అంది. నేను సరే అన్నాను. బిందు రూమ్ లో ఉన్న ఒక కుర్చీలో కూర్చుని ఉండి. తను ఆడడానికి ఇష్టపడలేదు. ఇందిర, నేను డబుల్ కాట్ మీద నుండి సక్కీ మంచం పైకి దూకాలి. ఎవరు ముందు దూకుతారో వాళ్ళు గెలిచినట్టు. ఇద్దరం బాగానే గెంతాము కాసేపు. ఆట స్పీడ్ పెరిగింది. ఎలా జరిగిందో తెలీదు, ఇద్దరం ఒకేసారి దూకాము. సక్కీ మంచం మీద పడి నేను నేల మీద పడ్డాను. ఇందిర నా మీద పడింది. ఎడమ చెయ్యి నేల ఇద్దరి భారం పడింది. బెణికినట్టు అనిపించింది. కానీ వెంటనే లేచిపోయాము ఇద్దరం. చెయ్యి విదిలిస్తూ ఉంటే ఇందిర భయపడింది. దెబ్బ తగిలిందా అని అడిగింది. నేను ఏమీ లేదు అన్నాను. అప్పటికే బిందు లేచి, ఇంటికి వెళ్దాం, నీ పని అమ్మతో చెప్తాను అంటోంది. కాసేపటికి ఇద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. నాకు తగిలిన దెబ్బ కన్నా ఇందిరకు వాళ్ళ అమ్మతో పడబోయే దెబ్బల గురించి బాధ కలిగింది. చెప్పొద్దని బిందుని బ్రతిమాలి పంపాను. కానీ బిందు వినదని నాకు తెలుసు. ఆ సాయంత్రం మమ్మీ ఇంటికి వచ్చాక కూడా నేను చెయ్యి విషయం చెప్పలేదు. మర్నాడు ఉదయానికి చెయ్యి కదిలే పరిస్థితి లేదు. బాగా వాచిపోయింది. మమ్మీతో బోలెడన్ని చీవాట్లు తింటూ ఉంటే, డాడీ మమ్మీని ఆపి, హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. ఫలితం, చేతికి కట్టు. కొన్ని రోజులు బడికి సెలవు పెట్టాల్సి వచ్చింది. స్కూల్ కి వెళ్ళిన వెంటనే నేను ఇందిరని వాళ్ళ అమ్మ కొట్టిందా అని అడిగాను. అది నా చేతి కట్టును పట్టుకుని ఉండిపోయింది.
అలా నా జీవితంలో మొదటి చిక్కటి నేస్తం ఇందిర. చాలా చిన్న వయసు అపుడు. నిజానికి ఇవి గుర్తు ఉండే వయసు కూడా కాదు. ఇంట్లో ఎప్పుడూ చిన్నప్పటి సంగతుల గురించి మాట్లాడుకుంటూ ఉండడం వల్ల అనుకుంటా చిన్నప్పటి విషయాలు కొన్ని అలా గుర్తు ఉండిపోయాయి. ఆ తర్వాతి సంవత్సరం ఇందిర. బిందు ఇద్దరూ వేరే స్కూల్ కి వెళ్లిపోయారు. స్కూల్ కి రాలేదంటే అదే కదా అర్థం! ఇందిర ఎన్నో సార్లు గుర్తుకు వచ్చేది కానీ ఆ వయసుకు తనను ఎలా వెతకాలో తెలియలేదేమో! ఇపుడు ఇందిర ఎలా ఉండి ఉంటుందో కదా!!
తర్వాత రెండు మూడేళ్లు అక్కడే చదివాక, ఐదో తరగతికి నన్ను, చెల్లిని సెవెన్త్ డే స్కూల్లో వేశారు మమ్మీ, డాడీ. అంత పెద్ద స్కూల్, అన్ని చెట్లు, అంత పెద్ద ఆట స్థలం వదిలి, ఇరుకుగా ఉన్న స్కూల్ లో కుదురుకోవడానికి నాకు చాలా సమయం పట్టి ఉండేది రాణి లేకపోతే!
ఐదో తరగతి. అటొక బిల్డింగ్, ఇటొక బిల్డింగ్, మధ్యలో పొడవాటి సిమెంట్ చేసిన స్థలం, ఆ స్థలం చివర ఒక చర్చ్. ఇదే సెవెన్త్ డే స్కూల్. మొదటి బిల్డింగ్ లో మా క్లాసెస్ ఉండేవి. రెండో బిల్డింగ్ కడుతూ ఉన్నారు. నాకు స్కూల్ అసలు నచ్చలేదు. క్లాస్ రూమ్స్ దగ్గరికి ఆపుడపుడూ కోతులు వస్తూ ఉండేవి. వాటిని చూసి భయం. ప్రిన్సిపల్, టీచర్స్ అందరూ బానే ఉండేవారు. నాకే మొదటి స్కూల్ మరుపుకి వచ్చేది కాదు. పై పెచ్చు ఇక్కడ నాకు తెలియని సబ్జెక్టు ఒకటి క్రొత్తది ఉంది. పాత స్కూల్ లో స్పెషల్ ఇంగ్లీష్ ఎంచుకున్నాను (డాడీ నో, మమ్మీ నో చెప్పి ఉంటారు ఎంచుకోమని, లేదా నేనే ఎంచుకున్నానో గుర్తు లేదు) ఇక్కడ హిందీ తప్పనిసరి సబ్జెక్ట్. అక్కడే తిక్క మరోసారి మొదలైంది. ఐదో తరగతిలో అందరూ హిందీ పాఠాలు చదివేస్తూ ఉన్నారు. నాకు ఏడుపు వచ్చేసేది. నాకు చూస్తే హిందీ అక్షరాలు కూడా రావు. ఈ కథ మొదటి ఎపిసోడ్స్ లో రాసినట్టు గుర్తు. మా మమ్మీ, మా హిందీ టీచర్ శోభ సాయంతో, ఇంట్లోకి క్రొత్తగా వచ్చిన టీవీ సాయంతో హిందీపై పట్టు సాధించేశాను. కానీ మొదట్లో నన్ను తన ప్రక్కన కూర్చోబెట్టుకుని, ఏమీ పర్లేదు, హిందీ వచ్చేస్తుంది అని ముద్దుగా చెప్పిన ఆ బొద్దు పిల్ల మాత్రం మంచి నేస్తం అయిపోయింది నాకు. ఐదో తరగతి అంతా రాణి మా ఇంటికి, నేను వాళ్ళింటికి తిరుగుతూనే గడిపాము. తర్వాతి సంవత్సరం రాణి వాళ్ళు కాకినాడ వెళ్లిపోయారు. రాణి నా మీద చూపిన ఆ ఆప్యాయత నేను మర్చిపోలేదు. దాని హ్యాండ్ రైటింగ్ ఈ రోజుకీ నాకు గుర్తే!
ఆరవ తరగతి. రాణి లేదు. మిగిలిన పిల్లలతో కబుర్లు ఆడేదాన్ని. బానే ఉండేది. కానీ రాణి లేని లోటు తెలిసేది. మొదటి నేస్తం ఒక ఏడాది స్నేహం తర్వాత వెళ్ళిపోయింది, రెండో నేస్తం కూడా ఒక ఏడాది స్నేహం తర్వాత వెళ్ళిపోయింది. ఆ వయసులో ఇంకో నేస్తం అంటే వద్దు అనిపించింది. అందరితో కలిసి ఉండడం, స్కూల్ అయ్యాక ఇంటికి వెళితే చెల్లితో, తమ్ముడితో ఆడుకోవడం. చిక్కటి నేస్తం అంటే వదిలి పోతారని అనిపించేది. ఇక ఎవ్వరితోనూ గాఢమైన స్నేహం (ఆ కాలంలో బెస్ట్ ఫ్రెండ్) వద్దని నిర్ణయించుకున్నాను. ఆ క్రమంలోనే బాగా మొండిగా, తిక్కగా తయారయ్యాను. టీచర్స్ కి బాగా దగ్గర అయ్యాను.
నేను మహా పొడగరిని కదా… అందుకే నేను ఎప్పుడూ మొదటి బెంచ్ లోనే కూర్చునేదాన్ని. అసెంబ్లీలోనూ లైన్లో మొదట నేనే నిలబడేది. వెనుక బెంచ్ వాళ్ళతో మాట్లాడాలంటే వెనక్కి తిరగాలి. మొదటి బెంచ్ లో ఉండేవాళ్ళతోనే ఎక్కువ కబుర్లు ఉండేవి. ఆ సమయం వరకూ నేను క్లాస్ ఎలా వినేదాన్నో గుర్తు లేదు. ఆరవ తరగతి నుండి మాత్రం నాలో చాలా మార్పు వచ్చింది. కారణం తెలియదు. అసెంబ్లీ నుండి క్లాస్ కి వచ్చాక మొదటి పీరియడ్ మొదలు అయ్యేలోపు ఎంత అల్లరి చేసేదాన్నో, క్లాస్ మొదలు అయ్యాక అంత సైలెంట్ అయిపోయేదాన్ని. ప్రక్కన ఉన్న వాళ్ళు క్లాస్ జరుగుతున్న సమయంలో మాట్లాడితే ఒప్పుకునేదాన్ని కాదు. అంత ఏకాగ్రత ఎలా అబ్బిందో తెలీదు. క్లాస్ లో చెప్పేది మొత్తం ఎక్కడా పొల్లు పోకుండా వినేదాన్ని. కొన్నాళ్ళకు ఏ టీచర్ అలవాటు చేశారో గుర్తు లేదు కానీ రన్నింగ్ నోట్స్ రాయడం అలవాటు అయింది. ఇప్పటికీ టీచర్ ఒరియెంటేషన్ ప్రోగ్రామ్స్ లో టీచర్స్ అందరూ నన్ను చూసి నవ్వుతారు. ఒక్క మాట పొల్లు పోకుండా రన్నింగ్ నోట్స్ రాస్తాను. ఇంటికి వెళ్ళాక నేను హై స్కూల్ కి వచ్చానని, చదువు మీద ఫోకస్ చేయాలని మమ్మీ రోజూ పోరేది. నాకు ఇంట్లో పుస్తకాలు తియ్యడం ఇష్టం ఉండదు. స్కూల్ లో విన్నాను కదా, చాలదా అనేదాన్ని. కొన్ని రోజులు నా పద్ధతి చూసి, చూసి మమ్మీ విసిగిపోయింది. డాడీకి రోజూ ఆఫీస్ నుండి వచ్చాక నా గురించి చెప్పేది. డాడీ ఏమీ అనేవారు కాదు. పరీక్షల్లో మార్కులు చూద్దాం లే అనేవారు. మొదటి యూనిట్ టెస్ట్ లో మార్క్స్ చక్కగా వచ్చాయి. చదవకుండానే ఇంత మంచి మార్క్స్ వస్తే, చదివితే క్లాస్ టాపర్ అవుతావు అనేది. క్లాస్ లో విన్నాక మళ్ళీ చదివేది ఎందుకు అనేదాన్ని నేను. కొన్నాళ్ళకు మమ్మీ చెప్పడం మానుకుంది. ఇంట్లో పుస్తకాలు తీసే పని నచ్చదు, చదువు రాకుండా ఉండకూడదు. రెండూ కుదరాలి అంటే నేను చేసే పనే కరెక్ట్ కదా! క్లాస్ లో ఏకాగ్రతతో వినడం, అర్థం చేసుకోవడం, ఆకళింపు చేసుకోవడం, మెదడులో భద్రపరచుకోవడం. ఇక ఇంటికి వచ్చి చదివే పనేముంది?
ఇంటికి వచ్చాక స్టూడెంట్ అవతారం చాలించి, టీచర్ అవతారం ఎత్తేదాన్ని. ఎవరికి టీచర్? చెల్లికి, తమ్ముడికి!!!
ఆరవ తరగతి మొదట్లోనే నేను వద్దు వద్దు అనుకున్నది జరిగింది!
(ఇంకా ఉంది )
-– విజయభాను కోటే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
అంతర్వీక్షణం-7 (ఆత్మకథ ) – విజయభాను కోటే — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>