*పరిష్కారం*(కథ)- శశికళ
రావటంతోనే తల పట్టుకుని సోఫాలో కూలబడ్డ భర్త అచ్యుత్ ను చూసి ,గబగబా దగ్గరికి వచ్చి”ఏమైందండీ? ఎందుకలా ఉన్నారు?”అంటూ ప్రశ్నించింది భార్గవి.
తలఎత్తి భార్య వైపు విరక్తిగా ఒక చూపు చూసి,”అంతా మన కర్మ, రెక్కలు ముక్కలు చేసుకుని ,పిల్లల్ని గారాబంగా పెంచుకుంటున్నాం. మనం అనుభవించిన ఇబ్బందులు మధ్యతరగతి బ్రతుకు వాళ్లకి ఉండకూడదని ,వాళ్ళు అడిగినవన్నీ, కొనిపెడుతూ, వాళ్ళ అవసరాలు, ఇష్టాలు, తెలుసుకొని ,సర్ప్రైజ్ లిస్తూ, వాళ్ళు ఇంట్లో పెంకిగా ఉంటే, మన పిల్లలే కదా అని, సర్దుకుపోయాము తప్ప, వాళ్ళని కేకలేయటమో, ఖండించడమో ఎప్పుడూ చేయలేదు. ఆ తప్పే ఇప్పుడు ఇంతవరకు తెచ్చింది .మన కొంపలు ముంచింది.”అన్నాడు అచ్యుత్.
“ఏం జరిగిందండి? పిల్లలు ఏంటి? అసలు ఏమైందో చెప్పండి? నాకు కంగారుగా ఉంది”అంది భార్గవి వణికే స్వరంతో.
“కాలేజీ నుండి ఫోన్ వస్తే వెళ్ళాను .మన పెద్దోడు నీలేష్ ఫ్రెండ్స్ తో కలిసి, అమ్మాయిలని ఏడిపిస్తున్నాడట. క్లాసులకు వెళ్లకుండా బయటబయటే తిరుగుతూ ఉంటాడట. ఒకవేళ క్లాస్ కి వెళ్లినా, లెక్చరర్స్ ని కామెంట్ చేయడం ,వెనక కూర్చుని గోల చేస్తూ, క్లాసులు జరగనివ్వకపోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటాడట. అంతేకాదు డ్రగ్స్ కి కూడా అలవాటు పడ్డాడట. అందరూ కంప్లైంట్ చేస్తే, ప్రిన్సిపాల్ గారు మన వాణ్ని, ఇంకో ముగ్గురిని నెలరోజుల పాటు సస్పెండ్ చేసి, విషయం నాకు తెలియజేయాలని పిలిపించారు”అన్నాడు అచ్యుత్ తల పట్టుకుంటూ.
కన్నీళ్లు తుడుచుకుంటూ”లేదండి మన పిల్లలు బంగారాలు. పెద్దాడు నీలేష్ కొంచెం పెంకిగా ఉంటాడు కానీ, చెడ్డవాడు కాదు. ప్రిన్సిపాల్ గారు బహుశా ,అపార్థం చేసుకుని ఉంటారు. ఇంకెవరో ఇవన్నీ చేస్తే, మనవాడని అనుకుంటున్నారేమో. వాడితో నేను మాట్లాడి విషయం కనుక్కుంటా. మనిద్దరం రేపు కాలేజీకి వెళ్లి, ప్రిన్సిపల్ గారికి విషయం చెప్పి, సస్పెండ్ రద్దు చేయమని అడుగుదాం’ అంది భార్గవి.
“లేదు భార్గవి వాళ్ళు చెప్పినవన్నీ నిజాలే .వాళ్లు మనవాడి ముందే అన్ని చెప్పారు .నేను నిజమేనా? అని మనవాడిని అడిగితే ,వాడు ఒప్పుకున్నాడు కూడా. కోపం ఆపుకోలేక అక్కడే వాడి మీద చెయ్యి చేసుకున్న , లెక్చరర్స్ బలవంతంగా ఆపారు. నాతో విడిగా చాలా సేపు మాట్లాడారు.
ఏవో రికార్డులు, ఎస్సైన్మెంట్లు సబ్మిట్ చేయించుకుని పంపుతామన్నారు .వాడు కాసేపట్లో వస్తాడు.
నేను చాలా ఆలోచించాను. వాడి మీద ,లేక వాడి ఫ్రెండ్స్ మీద, కోపం తెచ్చుకొని, ప్రయోజనం లేదు. మనం చూపించే కోపంలో కూడా, వాడికి మన ప్రేమ అర్థం అవ్వాలి .అర్థమయ్యేలా చెయ్యాలి”వాళ్ళ లెక్చరర్స్, ప్రిన్సిపాల్ కూడా అదే చెప్పారు. అని భార్యకు చెప్పి,
ఫోన్ తీసుకుని, నీలేష్ ఫ్రెండ్స్ పేరెంట్స్ కి ఫోన్ చేసాడు.
వాళ్ల ద్వారా మరిన్ని విషయాలు తెలిసాయి.
‘వీళ్లంతా నైట్ అవుట్ చేసి, చదువుకుంటామని చెప్పి, ఫ్రెండ్స్ రూమ్ లో వేసే పిచ్చి వేషాలు అన్నీ తెలుసాయి.’
బండి సౌండ్ వినపడటంతో, హాల్లో సోఫాలో కూర్చున్న అచ్యుత్ తల ఎత్తి, పైకి చూసాడు. ఎదురుగా బండి పార్క్ చేసి తలవంచుకొని వస్తున్న నీలేష్ కనిపించాడు.
అతని మొహాన్ని బాగా పరిశీలించి చూసాడు అచ్యుత్. తప్పు చేశానన్న భావం కనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
నీలిష్ ను తన పక్కన కూర్చోబెట్టుకుని”నాన్న నీలి నాకు, అమ్మకు మీరిద్దరే. మీరంటే ప్రాణం అని నీకు తెలుసు కదా! మీ సంతోషం కోసమే మేమిద్దరం ఎప్పుడు తపన పడుతూ ఉంటాం. నువ్వు చదువుకునే వాడివి. మంచి చెడు అన్ని తెలుసు. ఒక్క చీడపురుగు, పంట అంతా ఎలా నాశనం చేస్తుందో? అలాగే ఒక్క చెడ్డవాడు చేరితే ,సమాజం అంతా దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు అలా చెడ్డ పేరు తెచ్చుకొని మాకు తల వంపులు తేవద్దు రా. మనకు తాతలు కూడపెట్టిన ఆస్తిపాస్తులు ఏం లేవు. నేను, మీ అమ్మ కష్టపడి ఇల్లు కట్టాం. మీకు ఆస్తులు ఇవ్వడం కన్నా చదువులు ఇస్తే గౌరవంగా బతుకుతారని, మంచి స్కూళ్లలో కాలేజీలో చదివిస్తున్న నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే జీవితాంతం హాయిగా బతకచ్చు. చదువుని పాడు చేసుకుంటే జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది”అంటూ ఇంకా కొన్ని మంచి మాటలు చెప్పాడు.
రెండు నెలల తర్వాత
అచ్యుత్ ఆఫీస్ నుండి వస్తూ ఉంటే నీలేష్ తో పాటు సస్పెండ్ అయిన భవిష్ వాళ్ళ నాన్నగారు సంపత్ ఏదో సంచి పట్టుకుని నడుస్తూ కనిపించాడు. బండి ఆపి ,ఆయన పలకరించాడు. సంపత్ పిల్లల గురించి ఏమో మాట్లాడబోతూ ఉంటే ఇక్కడ కాదు బండి ఎక్కండి అని సంపత్ని, బండి ఎక్కించుకుని పక్కనే ఉన్న పార్కుకి తీసుకువెళ్లాడు. అక్కడ పెద్దగా జనాలు లేని ప్రదేశంలో ఉన్న ఒక బెంచి మీద ఇద్దరు కూర్చున్నారు.
సంపత్;”ఏం పిల్లలు? ఏం లోకమో ?అండి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మా భవిష్ కి బతిమాలి చెప్పాను. బయటికి వెళ్లకుండా చేసాం. ఏం చేసినా ఏదో రకంగా డ్రగ్స్ తప్పించేసుకుంటున్నాడు. అదేమని గట్టిగా అడిగితే, పెంకిగా నా ఇష్టం అని సమాధానం చెబుతున్నాడు. చుట్టాలలో ఫ్రెండ్స్ లో కూడా విషయం తెలిసిపోయి తలెత్తుకోలేకపోతున్నాం. మీ అబ్బాయి ఇలాగే ఉన్నాడాఏమైనా మారాడా?”
అచ్యుత్:”లేదండి మా అబ్బాయి చాలా మారాడు. డ్రగ్స్ జోలికి వెళ్ళటం లేదు. ఇంట్లోకి కావలసిన సరుకులు కూరలు వాడే తెస్తున్నాడు. వాళ్ళమ్మ గుడికి వెళ్తా అంటే, పొద్దుటే లేచి తీసుకువెళ్తున్నాడు. శ్రద్ధగా చదువుకుంటున్నాడు. కాలేజీలో జరిగిన విషయాలన్నీ ,వాళ్ళ అమ్మకి, నాకు చెప్తున్నాడు. ముఖ్యంగా కాలేజీకి బండి వద్దని ,తన పాత సైకిల్ తీసి, బాగు చేయించుకుని, దానిమీద వెళ్తున్నాడు”.అని చెప్పాడు.
ఆ మాటలకి సంపత్ ఆశ్చర్యపోతూ”ఎలా మారాడండి ?డ్రగ్స్ అలవాటు ఎలా మార్చారు? మీరు”అని అడిగాడు.
అచ్యుత్:”పిల్లల ప్రవర్తన వాళ్ళ స్వభావం బట్టి ,చుట్టూ ఉండే పరిస్థితులు ,తల్లిదండ్రుల పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. ఈ కాలం తల్లిదండ్రులు డబ్బు సంపాదన మీద వ్యామోహం లో పడి, పిల్లలతో సమయం గడపడం లేదు .పిల్లలకి చేతినిండా అడిగినప్పుడల్లా డబ్బు, పూర్తి స్వేచ్ఛ, అవసరం ఉన్నా లేకపోయినా, అడిగిన వస్తువులు, అడగనివి అన్ని వాళ్ళకి ఇచ్చేసి అదే ప్రేమ చూపించడం గా భావిస్తున్నారు తల్లిదండ్రులు. అదుపు అజమాయిషి లేకపోవడంతో, సమాజంలోని చెడుకి తేలిగ్గా ఆకర్షితులవుతున్నారు పిల్లలు. పిల్లలు అలా తయారయ్యారంటే, అది పూర్తిగా తల్లిదండ్రుల పెంపక లోపమే. విషయం తెలిసిన వెంటనే మేము కూడా చాలా బాధపడ్డాం కృంగిపోయాం. తర్వాత నిదానంగా ఆలోచించి ,ముందు వాడితో మంచిగా మాట్లాడి, నచ్చచెప్పి, రెహబిలేషన్ సెంటర్ లో చేర్చాము.వాడు అక్కడ ఉన్న వారం రోజులు, మేము వాడు చుట్టూనే తిరిగాం. వాడు బయటికి రాగానే ఫ్యామిలీ టూర్ ఒక పది రోజులు ప్లాన్ చేసాం .ఆ పది రోజులు పిల్లలు ఇద్దరినీ కూడా ఒక్క క్షణం కూడా వదలకుండా ప్రేమగా చూసుకున్నాం .నలుగురం కలిసి ఆటలు ఆడాం ,పాటలు పాడాము. టూర్ అయ్యాక వాడి సస్పెండ్ సమయం ముగిసే వరకు కూడా నేను, నా భార్య వీలును బట్టి ,సెలవు పెట్టి, ఎవరో ఒకరం ఇంట్లో ఉండేలా ప్లాన్ చేశాం. సాయంత్రం పూట పిల్లలు ఇద్దరినీ కూర్చోబెట్టి నీతి కథలు చెప్పటం. గొప్ప గొప్ప మహానుభావుల జీవిత చరిత్రలు పిల్లల్లో ఎవరో ఒకరి చేత చదివించేవాళ్ళం. వాళ్ళ అమ్మ నేను పోటీలు పడి పిల్లలకి గోరుముద్దలు తినిపించేవాళ్ళం.
నీలేష్ డ్రగ్స్ ముట్టుకోవటం మానేశాడు .స్వభావం కూడా మారినట్లు అనిపించింది. సస్పెండ్ సమయం పూర్తయిన తర్వాత ,కాలేజీకి పంపాలంటే భయం వేసింది. నేను ఆఫీస్ కి వెళ్లేటప్పుడు వాడిని దింపి వచ్చేటప్పుడు తీసుకువచ్చేవాడిని. ఒక వారం అయ్యాక నీలేష్ నా దగ్గరికి వచ్చి”నాన్నగారు మీ ఆఫీస్ వేరే రూట్ ,నా కాలేజీ వేరే రూటు .మీరు నా కోసం శ్రమ పడుతున్నారు రేపటినుండి నేనే కాలేజీ కి వెళ్తా బండి వద్దు ఇంటర్లో నేను వాడిన సైకిల్ మీద వెళ్తా” అన్నాడు భయపడుతూనే ఒప్పుకున్నాం.
నెమ్మదిగా కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఇంట్లో కి కావాల్సిన సరుకులు తీసుకురావడం , మొక్కలకు నీళ్లు పోయటం ,వాళ్ళ అమ్మకి సహాయం చేయడం, ఇల్లు నీటుగా పెట్టడం ,వంటి పనులు చేయడం మొదలుపెట్టాడు. పిల్లలు ఇంట్లో ఉన్న సమయం అంతా నలుగురం కలిసి సరదాగానే ఉంటున్నాం అని చెప్పాడు”
అచ్యుత్ చేతులు పట్టుకుంటూ”సమస్య వస్తే కృంగిపోవటం అందరూ చేసే పని .కానీ నిలబడి దాన్ని పరిష్కరించుకోవటం గొప్ప వాళ్ళు చేసే పని”అన్నాడు.
ఆ మాటలు విని నొచ్చుకుంటూ అచ్యుత్”నా ఇంటిని నేను బాగుచేసుకున్నా, ఇందులో గొప్పతనం ఏముంది”అన్నాడు.
ఈలోగా ఫోన్ మోగితే జేబులో నుంచి ఫోన్ తీశాడు. ఫోన్లో కొడుకు పేరు చూసి సంపత్ వైపు చూసి”మా అబ్బాయి”అని చెప్పి ఫోన్ ఎత్తాడు.
“నాన్నగారు ఎక్కడున్నారు త్వరగా రండి అమ్మ పకోడీలు చేసింది చల్లారిపోతాయి. నేను, తమ్ముడు ,అమ్మ ,మీ కోసం ఎదురు చూస్తున్నాం .మీరు వస్తే నలుగురం కబుర్లు చెప్పుకుంటూ తిందాం”అన్నాడు ఫోన్లో నీలేష్.
“అలాగే నాన్న వస్తున్న”అని అచ్యుత్ సమాధానం చెప్పి, సంపత్ వైపు తిరిగి”వస్తా అండి “అంటూ బండి వైపు నడిచారు.
వెళ్తున్న అచ్యుతవైపు ఆనందభాష్పాలతో చూస్తూ సస్పెండ్ అయిన మిగిలిన పిల్లల తండ్రులకి కూడా విషయం చెప్పేందుకు ఫోన్ తీసాడు సంపత్.
– శశికళ ,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
*పరిష్కారం*(కథ)- శశికళ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>