పులకరిస్తున్న ‘అమరావతి’ కవిత్వం (పుస్తక సమీక్ష) – ఆర్. శ్రీనివాసరావు,

నవ్యాoధ్ర భవిష్యక్షేత్రం అమరావతి. ఆంధ్ర శాతవాహనుల అపురూప రాజధాని. నాగార్జునుడిని అచార్య పీఠం అధిరోహించిన ప్రదేశం. ఆంధ్రుల ఆశాకిరణం రాజధాని “అమరావతి ప్రాంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నూతన రాజధానిగా అమరావతి అవిర్భవించింది. ఆ అనుభూతులతో కవులు, రచయితలు కూడా అమరావతి వైభవాన్ని గురించి కవిత్వం, కథలు, గేయాలు రాశారు.
తెలుగుసాహిత్యంలో అమరావతి అనగానే సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలు స్ఫురణకు వస్తాయి. ఇప్పుడు నూతనంగా ఆచార్య నందిపాటి సుబ్బారావుగారు ‘అమరావతి’ పేరుతో కవితల సంపుటాన్ని వెలువరించారు. అందులో 37 కవితలు ఉన్నాయి. మొదటి కవిత అక్షరమాల కవితతో ప్రారంభమై వినండి….వినండి అనే కవితతో ముగుస్తుంది.
అక్షరమాల కవితలో
తేనె లొలికే తెలుగు భాషకు
అక్షరాలు ఏబది ఆరు!……..
తెలుగింటి మేలుకొలుపులా…ఆ ఆ ఇ ఈ ఉ ఊ లు
తొలకరి మేఘంలా……..ఋ ౠ ఌ ఌ ఏ ఏ ఐలు
పెరట్లో తులసి మందిరంలా……ఒ ఓ ఔ అం అః లు
మహిళలు తిలకించే మంగళహారతిలా……..క ఖ గ ఘ ఙ లు
దేశ భాషలందు లెస్స
మణి మకుటమైన భాష
కృష్ణరాయల కీర్తి తేజం
ప్రసాదించిన భాష
దాని పేరే తెలుగు భాష!
అమరావతి వైభవం కవితలో
ఒకనాటి ధరణికోట తేజం – అలనాటి ధాన్యకటక ప్రాభవం
ఈనాటి అమరావతి వైభవం – తెలుగుజాతి ఘనకీర్తి,…………

బౌద్ధమత గుబాళింపులకు
జైనమత సుగంధాలను
శైవమత సౌరభాలకు
సర్వమత సమ్మేళనాలకు
నెలవైన భూమి ఈ అమరావతి !—–
సాటిలేని మేటిగా రాజధాని
నేటి మేటి రోజున.. అంటూ అమరావతి గత వైభవాన్నీ సుబ్బారావుగారు తెలిపారు. ఇంకా పులకిస్తున్న అమరావతి, రసధుని-రాజధాని పేరుతో మరో రెండు కవితలు రాశారు.
మార్గత్రయం-ఒకటి పేరుతో హిందూ ధర్మాన్ని
మార్గత్రయం – రెండు పేరుతో క్రైస్తవం మతంలోని సేవను,
మార్గత్రయం – మూడు పేరుతో ముస్లిం మతపండగ రంజాన్ గొప్పతనాన్నిరచయిత అచార్య సుబ్బారావు తెలియజేశారు.
సామాజిక స్పృహ కలిగిన కవిగా ఆచార్య నందిపాటి సుబ్బారావుగారు భూపర్యావరణ శాస్త్రవేత్తగా పర్యావరణ హితమైన కవితలు రాసారు.
నేను వృక్షాన్ని-నీప్రాణభిక్షాన్ని, దాహం! దాహం! దాహం!, నీటి కురుక్షేత్రాలు, ప్రాణధార పేరుతో నీటిని కాపాడుకుందాం భవిష్యత్ తరాలకు అందించాలనే ఆశాభావం వ్యక్తమవుతుంది.
నీటికున్న విలువ….
నీరు వృథా చేయటం.
నేడు ఎరిగినంతగా
నాడు తెలియదాయే
………………………..
కొండలన్నీ ఆక్రమించే
అరణ్యాలు మాయమాయే
వానబోట్టు కరువాయే.
ఆచార్య నందికొండ సుబ్బారావుగారు ఆంధ్రవిశ్వవిద్యాలయంలో భూవిజ్ఞాన శాస్త్ర విభాగంలో ఉపన్యాసకులు. బోధన, పరిశోధన రంగాన్ని ఇష్టంగా ఎంచుకున్న ఆచార్యులు. జలవనరుల పరిరక్షణ కై శాస్త్ర సమాచార వ్యాసాలు రాసిన శాస్త్రవేత్త. శాస్త్ర సంబంధిత విషయాలను సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా కవితలు రాస్తున్న రచయిత.
సమాజంలో జరుగుత్ను వాస్తవాలని కళ్లకు కట్టినట్లుగా చంధోబద్దంగా కవితలు, పద్యాలు రాయడం నందిపాటి వారి ప్రత్యేకతగా చెప్పవచ్చు. ‘అమరావతి’పై, అమరావతి పేరుతో వెలువడిన ఈ వచన కవితల సంపుటిని వెలువరిచిన ఆచార్య నందిపాటి సుబ్బారావుగారు అభినందనీయులు.
– ఆర్. శ్రీనివాసరావు,
తెలుగు అధ్యాపకులు, మారీస్ స్టెల్లా కళాశాల,
విజయవాడ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

శ్రీనివాసరావు గారు
నమస్తే.
నా పుస్తకం మీద మీరు వ్రాసిన సమీక్షను చూసాను.
చాలా బాగుంది.
ధన్యవాదాలు