వండిన ఉప్పును గోరంత పొట్లాలు కట్టి అమ్మి కాంగ్రెస్ నిధులు సేకరించి ,క్షమా భిక్ష కోరకుండామూడు సార్లు జైలు పాలైన ధీర వనిత –శ్రీమతి కొండా అలివేలు మంగ సత్యవతమ్మ – మహిళా మణులు – గబ్బిట దుర్గాప్రసాద్
6-10—1931న గుంటూరు జిల్లా నరసరావు పేట తాలూకా రూపెన గుంట్ల గ్రామం లో రూపెనగుంట్ల సీతారామయ్య ,సరస్వతమ్మ దంపతులకు రెండవ కుమార్తె గా అలివేలు మంగ సత్యవతమ్మ జన్మించింది .8వ ఏట వివాహం ,12వ ఏట వైధవ్య౦ .కుటుంబ వాతావరణం పరిసరాల ప్రభావం వలన చక్కగా వ్రాసే ,అనర్గళంగా మాట్లాడే శక్తి ఆమెకు లభించాయి . ఈమె కన్నా పదేళ్లు పెద్దదైన అక్క కనుపర్తి హనుమాయమ్మ కూ వైధవ్యం ప్రాప్తించింది .రెండేళ్ళ తర్వాత తలిదంద్రులిద్దరూ చనిపోయి పూర్తి అనాధలయ్యారు అక్కా చెల్లెలు .
అక్క చెల్లెళ్లిద్దరూ గుంటూరు చేరి ,జాతీయోద్యమం లో పాల్గొని పేరుపొందిన ఆత్మీయులైన శ్రీ దేశిరాజు సాంబశివ రావు గారింటికి చేరగా ,ఆయనే వీరికి తల్లీ తండ్రీ గురువు మార్గదర్శి యై తీర్చి దిద్దారు .వీరింటికి దేశభక్త కొండా వెంకటప్పయ్య ,గొల్లపూడి సీతారామ, శాస్త్రి టంగుటూరు ప్రకాశం పంతులు వంటి జాతీయోద్యమ నాయాకులు వచ్చి సంప్రదింపులు గోష్టులు జరిపేవారు .ఉద్యమానికి తగిన ధనసాయం సాంబశివరావు గారు చేసేవారు .వీటిని అక్క చెల్లెళ్ళు చాలా శ్రద్ధగా గమనించి ,1930లో గాంధీ ఇచ్చిన స్వాతంత్ర్య శంఖారావం విని అలివేలు మంగలో జాతీయ చైతన్యం కలిగింది .అప్పటిదాకా పోలీసుల్ని చూస్తె భయపడి పారిపోయే ఆమె అక్కను చూసి ధైర్యంతో దేశసేవ చేయాలనీ ,అవసరమైతే ప్రాణాలైనా సమర్పణ చేయాలని పూర్తిగా నిశ్చయించింది .
కొండా వారు ఆంధ్రరాష్ట్ర నియంతగా ,ఉన్నవ లక్ష్మీ బాయమ్మ ఆధ్వర్యంలో గుంటూరులో ఉప్పు వండారు .గోరంత ఉప్పు పొట్లాలు కట్టి ,విక్రయించి వందలాది రూపాయలను కాంగ్రెస్ నిధికి సేకరి౦చిసమర్పించారు ఈ అక్కా చెల్లెళ్ళు .క్షణం తీరిక ఉండేదికాదు వీరికి .ఈపోట్లాలకోసం చుట్టుప్రక్కగ్రామాలనుంచి తిరునాళ గా ప్రజలు వచ్చి ఉప్పు పొట్లాలు కొని ఉడతాభక్తి గా దేశ సేవలో పాల్గొన్నారు .
రాష్ట్రం లో అనేక చోట్ల కాంగ్రెస్ శిబిరాలు వెలిశాయి .వాలంటీర్లకు శిక్షణ నిచ్చి ప్రోత్సాహం కల్గించేవారు .గుంటూరులో కొత్తపేటలో యడవల్లి వారి సత్రం లో ఒక శిబిరం ఏర్పరచి ఉన్నవ దంపతులు ,కొండావారు, నడింపల్లి నరసింహారావు ,మొదలైన ప్రముఖులు పర్యవేక్షించేవారు .నగర సంకీర్తనలు, జండా వందనాలు ,జాతీయ గీతాలాపన ,ఊరేగి౦పు సభలు సమావేశాలతో అంతటాదద్దరిల్లేది ..నిస్వార్ధ సేవతో సేవా శిబిరం ఒకఋషి వాటిక గా పరమ పవిత్రంగా ఉండేది .ఒక రోజు రెండు వందలమందికి భోజనాలు సిద్ధం చేసి విస్తళ్ళు వేసి ,వడ్డన సగభాగంలో ఉండగా ,రెండు వందలమంది పోలీసులు వచ్చి ,దొరికినవారిని దొరికినట్లు లాఠీలతో చావబాది,వడ్డించిన విస్తళ్ళ ను కాళ్ళ తో మట్టగించి నానా భీభత్సం చేశారు .అనేక మంది వాలం టీర్లు స్పృహ తప్పి పడిపోయారు.రోడ్డుపై పోలీసులు కవాతు చేసి ప్రజల్లో భయోత్పాతం కల్గించారు .కనిపించినవారి నెల్లా క్రూరంగా హింసించారు .ఆ దారుణ మానవ హింసా కాండ చూడలేక పౌరులు ఇళ్ళ తలుపులు మూసేసి జాలిగా , బాధగా, మౌనంగా రోదించారు . శాంతి భటులు నెమ్మదిగా తేరుకొని ,దగ్గరఉన్న దేశి రాజు వారింటికి చేరుకొన్నారు .ఆ రోజుల్లో వాలంటీర్లకు ఆశ్రయం కలిగించినా, భోజనాలు పెట్టినా తీవ్ర శిక్షకు గురి చేసేవారు.దేశిరాజు వారు అదేమీ లేక్కచేయకండా వాలంటీర్లందరికి ఆశ్రయం భోజన సౌకర్యం కలిపించి వారం రోజులు ఆదుకొన్నారు .కుమార్తెగా అలివేలు మంగ సత్యవతమ్మ వాళ్ళందరికీ ఆదర ఆప్యాయతల తో సేవలందించి అందరి మన్ననలు పొందింది . వారం తర్వాత పరిస్థితి చక్కబడి ,మళ్లీ సభలు సమావేశాలతో,కల్లు దుకాణాల వద్ద పికెటి౦గు లతో ఊరు దద్దరిల్లింది .సత్యవతమ్మ ను అరెస్ట్ చేసి గుంటూరు సబ్ జైలులో 21రోజులు ఉంచి వదిలిపెట్టారు .అప్పటికి ఆమె వయసు 18 మాత్రమె .
ఈ మొదటి జైలు శిక్షతో జంకు పోయి ,మరింత ఉత్సాహం కలిగి పాదుర్తి సుందరమ్మ తో కలిసి సత్యవతమ్మ కల్లు దుకాణాలు ,విదేశీ వస్త్ర దుకాణాల వద్ద పికెటింగ్ లు చేసింది .కాలేజీలకు వెళ్ళి ‘’బ్రిటీష గుమాస్తాలుగా పనికొచ్చే ఈ చదువులు వదిలేసి బయటికి రండి .దేశమాతః దాస్య శ్రుంఖ లాలు తెగగొట్టండి తమ్ముళ్ళూ ‘’అని ఉద్బోధన శంఖారావం పూరించింది .సుందరమ్మతో పటు సత్యవతమ్మనూ పోలీసులు అరెస్ట్ చేసి కారులో ఎక్కించుకొని పేరే చర్ల రైలు స్టేషన్ వద్ద సత్యవతమ్మ ను వదిలేస్తూ చేతిలో కొంత డబ్బు పెట్టి ‘’కాసేపట్లో రైలు వస్తుంది .ఎక్కి నరసరావు పేట లో దిగి మీ గుంటూరు వెళ్ళు .మళ్లీ ఉద్యమం చెయ్యకు .బుద్ధిగా ఇంట్లో ఉండు ‘’అని హెచ్చరించి వెళ్ళిపోయారు .అక్కడ ఆ గ్రామస్తులు కనిపించగానే వారితో కలిసి ఊరిలోకి వెళ్ళి సమయం చూసి సభ జరిపి ‘’శ్రీ గా౦ధీనామము మరువాం మరువాం –సిద్ధము యమునికి వెరువాం వెరువాం ‘’అని పాడుతూ ప్రజలను ఉత్సాహ పరచింది .అక్కడినుంచి గుంటూరు చేరగా పోలీసులు 20-8-1930 న అరెస్ట్ చేసి ,విచారించి ,నేరం ఒప్పుకొంటే శిక్ష ఉండదు అని చెప్పగా సత్యవతమ్మ ధైర్యంగా ‘’నేను నేరం చేయలేదు .నాదేశానికి సేవ చేశాను అంతే .’’అనగా ఆరునెలలు సి క్లాస్ జైలు శిక్ష ,50రూపాయల జరిమానా విధించి ,’’ఇప్పటికైనా మించిపోలేదు క్షమాపణ చెబితే అన్నీ రద్దు చేస్తాం ‘’అనగా చిరునవ్వు నవ్వి ‘’వందేమాతరం ‘’అంటూ ఆనందంగా శిక్షనే స్వీకరించింది ఆ ధీర వనితా శిరో రత్నం .ఆగస్ట్ 20 న రాయవెల్లూరు జైలుకు ఆమెను తరలించారు .
జైలు లోకి ప్రవేశించగానే సత్యవతమ్మ ఉన్ననాలుగు నవర్సుల మురుగులను కత్తిరించి జైలు అధికారులు జరిమానా కింద జమ కట్టుకొన్నారు .జైలు లోపలి ప్రవేశించగానే ఆమెకు దుర్గాబాయమ్మ ,సుందరమ్మ, ఆచంట రుక్మిణీ దేవి ,ద్రోణం రాజు లక్ష్మీ బాయమ్మ కనిపించగా స్వంత ఇంట్లో పండుగ వాతావరణం గా అనిపించింది .సిక్లాస్ ఖైదీలకు మజ్జిగ కూడా ఇచ్చేవారు కాదు . రుక్మిణీ దేవి తన స్వంత ఖర్చులతో వారందరికి మజ్జిగ ఇప్పించే ఏర్పాటు చేస్తాను అని అడగగా ఒప్పుకోక తెప్పించిన మజ్జిగ అంతా నేలపాలు చేశారు అధికారులు .ప్రశాంతంగా మాట్లాడి అధికారులను ఒప్పించి సి క్లాస్ వారందారికీ మజ్జిగ ఇచ్చే ఏర్పాటు చేసింది రుక్మిణీ దేవి .
గాంధీ –ఇర్విన్ ఒడంబడిక ప్రకారం రాజకీయ ఖైదీలను విడుదల చేశారు .ఇర్విన్ తర్వాత వచ్చిన విల్లింగ్టన్ ప్రజా ప్రాతినిధ్యాన్ని ఒప్పుకోక నిరంకుశంగా ఉంటే గాంధీ సహనం నశించి విరక్తి విసుగు కలిగి 1931లో శాసన ధిక్కారం ప్రకటించాడు .రాష్ట్ర స్థాయిలో ఆతీర్మానాన్ని ఆమోదించి ప్రజలు సభలు సమావేశాలు పెద్ద ఎత్తున జరిపారు.లక్షలాది ప్రలను ప్రభుత్వం అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టింది .గుంటూరులో నల్ల చెరువు గట్టున 1932 లో ఒక రోజు తెల్ల వారుజామున వేదాంతం కమలాదేవి తో పాటు సత్యవతమ్మ కూడా సభ నిర్వహించి ఊరేగింపు జరుపుతుంటే ,ప్రధాన పాత్ర వహించినందుకు సత్యవతమ్మను మూడవ సారి అరెస్ట్ చేసి నాలుగు నెలల సిక్లాస్ శిక్ష విధించి రాయవెల్లూరు జైలుకు పంపారు .ఆక్కడ టైఫాయిడ్ జ్వరం తో బాధ పడుతుంటే కనికరం లేని లేడీ డాక్టర్ ప్రవర్తన చూసి కమలాదేవి గారు సత్యవతమ్మకు సకలోపచారాలు చేశారు .
మూడవ సారి జైలు నుంచి విడుదల అయిన సత్యవతమ్మ నిర్మాణాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టింది .పత్తి కొని ఏకులు చేయించి ,వడికించి ,నేయించి స్వయంగా ఖాదీ అమ్మకం ప్రారంభించింది .గాంధీగారి వార్ధా ఆశ్రమం లో చాలా కాలం ఉండి వచ్చిన అక్క కనుపర్తి హనుమాయమ్మ కూడా ఆమెకు చాలా తోడ్పడింది .ఒక పేదబాలికను పెంచుకొని విద్యాబుద్ధులు నేర్పించి జాతీయ భావాలు నేర్పి 1942 వ్యక్తి సత్యాగ్రహం లో పాల్గోనేట్లు చేసింది .చివరిదాకా ఆదర్శ జీవితం గడిపి జీవితాన్ని దేశసేవలో చరితార్ధం చేసుకొన్నది ఆదర్శ మహిళ,నిస్వార్ధ సేవకురాలు శ్రీమతి కొండా అలివేలు మంగ సత్యవతమ్మ .
-గబ్బిట దుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
వండిన ఉప్పును గోరంత పొట్లాలు కట్టి అమ్మి కాంగ్రెస్ నిధులు సేకరించి ,క్షమా భిక్ష కోరకుండామూడు సార్లు జైలు పాలైన ధీర వనిత –శ్రీమతి కొండా అలివేలు మంగ సత్యవతమ్మ – మహిళా మణులు – గబ్బిట దుర్గాప్రసాద్ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>