సంఘ సేవా ధురీణ –శ్రీమతి తలారి చంద్రమతీ దేవి – మహిళా మణులు – గబ్బిట దుర్గా ప్రసాద్
శ్రీమతి చంద్రమతీ దేవి 6-6-1903 న శ్రీ తాడి చంచయ్య నాయుడు ,శ్రీమతి వెంకమాంబ దంపతులకు చిన్న కూతురుగా పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించింది .ఆరవ ఏటనే వివాహం జరిగి ,,ఆరునెలలకే వైధవ్యం పొందిన దురదృష్ట వంతురాలు .అలాంటి స్థితి తమ చిన్న కూతురికి జరగటం జీర్ణించు కోలేక పోయిన తలిదండ్రులు ,ఆమె వైపు కన్నెత్తి చూడటానికే భయపడ్డారు .అప్పుడు ఆపసి పిల్ల దైన్య స్థితి చూసి ,రెండేళ్ళ వయసునుంచి ఆమెను తమ చేతులలో పెంచిన అక్కా బావలు శ్రీమతి మహాలక్ష్మమ్మ ,శ్రీ తలారి వేంకట గోపాలరావు లు చంద్రమతికి తమ హృదయాలలో స్థానమిచ్చి నిలబడి కన్నకూతురులాగా చూసుకొన్నారు .అందువల్ల పుట్టింటి ఇంటిపేరు తాడి ,మెట్టింటి ఇంటిపేరు చిక్కం అటకెక్కి శ్రీమతి తలారి చంద్రమతీ దేవిగా లోకానికి పరిచయమయింది .
గోపాలరావు నాయుడు రావు సాహెబ్ ,కలెక్టర్ బిరుదాంకితుడు ,కలెక్టర్ .అయన నిఘంటువులో హరిజన పదమే లేదు .పెద్ద పెద్ద విందులూ వినోదాలు జరిపినప్పుడు హరిజనులనూ పిలిచి కాస్మాపాలిటన్ డిన్నర్లు ఇచ్చి సమాజంలో గొప్ప గౌరవం పొందాడు .బావులలో నీరు తోడుకోవటానికి హరిజనులకు అవకాశం కల్పించాడు .హరిజనోద్ధరణకోసం ఎన్నో మహా సభలు జరిపాడు .ప్రభుత్వ సాయంతో హరిజనులకు ఎన్నో కొ ఆపరేటివ్ బాంకులు ,రాత్రి పాఠశాలలు స్థాపించాడు .భార్య మహాలక్ష్మమ్మ కూడా ఆయనతో పాటు హరిజన సేవలో పూర్తిగా సహకరించేది .హరిజనుల ఇళ్లకు వెళ్ళి పిల్లలకు స్నానాలు చేయించేది .ఇవన్నీ చూసి నాయుడు గార్ని ‘’మాలకలక్టర్’’అనే వారు జనం.ఇలాంటి వాతావరణం లో పసితనం నుంచి పెరిగిన చంద్రమతీ దేవికి అదే చదువుల బడి అయింది .మానవ సేవే పరమార్ధం అయింది .చెప్పటం కాక చేసి చూపించింది .
అక్కా బావలతో పొరుగూరు కాంప్ లకు వెడుతూ పళ్ళు ,చిరు తిళ్ళు తన వెంట తీసుకొని వెళ్ళి ,బీదలను ఇంటికి పిలిచి పెట్టేది .. స్త్రీలకు పళ్ళు, పసుపు బొట్టు అందజేసి సంతృప్తి చెందేది .వారికి పరిశుభ్రత ,దైవ భక్తీ బోధించి జీవితాలు బాగుపడటానికి సహకరించింది .1920 లో గాంధీజీ హరిజనాభ్యుదయం కోసం ప్రాయోప వేశం చేసినప్పుడు చంద్రమతి వయసు కేవలం 17. అప్పుడే స్వయంగా వచ్చి హరిజన సేవలో పాల్గొన్నది .పశ్చిమ గోదావరిజిల్లా యానాలపల్లి లో ఉన్న పాత దేవాలయం మరమ్మతు చేయించి ,హరిజనులకు ప్రవేశం కల్పించింది .వారందరికి నచ్చ జెప్పిఎన్నో ఏళ్లుగా సాంప్రదాయంగా వస్తున్న జంతు బలిని ఆపు చేయి౦చగలిగింది .ధవళేశ్వరం లోని ముత్యాలమ్మ గుడిలో కూడా జంతు బలిని వ్యతిరేకించి నిరోధించగలిగింది.మరెన్నో దేవాలయాలో ,అక్కడి వారిని మెత్తని మాటలతో మనసులు మార్చి జంతు బలి నిషేధం అమలు జరిపిన ధీర వనిత చంద్రమతి .
వీధి సమావేశాలలో పాల్గొని అనుభవం సంపాదించిన ఆమె పిఠాపురం లో జరిగిన హరిజన మహాసభలో మొదటి సారిగా ప్రేరణాత్మక ప్రసంగం చేసి అందరి మెప్పు పొందింది .అప్పటికి ఆమె వయసు 20 లోపు మాత్రమె.అప్పటినుంచి ఆమె భారీసభలలో పాల్గొని ఉపన్యాసాలుఇవ్వటం ప్రారంభించింది .ప్రఖ్యాత దేశ సేవిక శ్రీమతి దేవులపల్లి సరస్వతమ్మ స్థాపించిన ‘’శ్రీ బాలసరస్వతీ స్త్రీ సేవా సమాజం ‘’ను చంద్రమతీదీవి ప్రారంభించింది .ఆ సంస్థ ఇప్పటికీ చక్కగా నడుస్తోంది . ఆరోజుల్లో స్త్రీలకు విజ్ఞాన వికాసాలు పెంపొందించిన వారిలో శ్రీమతి బత్తుల కామాక్షమ్మ అందరికి పెద్ద దిక్కు .ఆమె స్పూర్తితో చంద్రమతీ దేవి చాలా పకడ్బందీగా ,కట్టు దిట్టంగా ఎన్నో మహాసభలు నిర్వహించింది ,ద్రోణుడు లాంటి కామాక్షమ్మకు అర్జునుడు లాంటి శిష్యురాలు చంద్రమతి .రెడ్ క్రాస్ సమావేశాలు, అఖిలభారత మహిళా సమావేశాలు ,పండుగలు ,పూజలు ,ధార్మిక ఉపన్యాసాలు ,క్షామ నివారణ ,తుఫాను బాధితుల సహాయం వంటి ఎన్నెన్నో సభలను దక్షతగా నిర్వహించినా ,తెరమరుగునే ఉండి పోయేది చంద్రమతి .ఆమెకు తన వ్యక్తిగత పబ్లిసిటి పై ఆసక్తి తక్కువ .
బంగారురంగు దేహఛాయతో చెదరని చిరునవ్వుతో చంద్రమతీ దేవి అందర్నీ మర్యాదగా ఆప్యాయంగా,సాత్వికంగా పలకరించేది .భేషజం లేని స్త్రీ .అమెమాటలోని నిజాయితీ అందర్నీ ఆకర్షించేది .తన సామర్ధ్యాన్ని మానవ సేవకే అంకితం చేసిన మహా మహిళ చంద్రమతి . ఏవూరు వెళ్ళినా ముందుగా పేదల బస్తీలకు,మురికి వాడలకు ,హరిజన వాడలకు ముందు వెళ్ళి ,అక్కడి వారి ఆరోగ్యం పారిశుధ్యం గురించి శ్రద్ధ తీసుకొని రోగులకు బాధితులకు మందులు సమకూర్చేది .బట్టలు లేని వారికి వస్త్రాలు సమకూర్చేది .నలుగుర్ని పోగేసి పలకా బలపాలిచ్చి చదువుకోమని హితవు చెప్పేది .అలాగే కుట్లు ,కత్తిరింపులు నేర్చుకోమని బట్టలు సూదులు దారాలు సప్లై చేసేది .ఆమెనుండి సాయం కోసం రకరకాల ఆర్తులు వస్తారు అందరికి వీలైనంత సాయం చేసి వారి సంతృప్తి చూసి ఆనందించేది .ఆమె ఉత్సాహం చూసి సాటిమహిళలూ ముందుకు వచ్చి ఇతోధిక సేవలో పాల్గొనే వారు .వెంటనే ఒక మహిళా సమాజం రూపు దాలుస్తు౦ది అక్కడ .దానికి అధ్యక్ష కార్యదర్శి కార్యనిర్వాహక వర్గం స్థానికులతో ఏర్పరుస్తుంది .స్వయంగా వారు నిర్వహించ లేకపోతె తానె వారికి విరాళాలు అందించి ప్రోత్సహించి నిర్వహింప జేసేది .అలాంటి మహిళా సమాజాలలో హైదరాబాద్ లోని తార్నాక మహిళాసమాజం ఒకటి .మలక్ పేట ఆంధ్రా కాలనిలో ఒక సమాజం నెలకొల్పింది .ఇక్కడ కుట్లు అల్లికలు టైలరింగ్ క్లాసులు నడుస్తున్నాయి సమర్దులనే నియమించి అభివృద్ధిలోకి తీసుకు రావటం ఆమె దక్షతకు నిదర్శనం .గుంటూరులో పట్టాభిపురంలో నెలకొల్పిన మహిళా సమాజం ఇప్పటికీ నిర్వహింప బడుతోంది .
తనను పెంచి పెద్దదాన్ని చేసిన తండ్రిలాంటి బావగారు శ్రీ తలారి వేంకట గోపాలరావు నాయుడు గారి స్మారక మందిరాన్ని చంద్రమతీ దేవి రాజమండ్రి లో నిర్మించింది .ఇందులో హరిజన బాలబాలికలకు ఇండష్ట్రియల్ ట్రెయినింగ్ క్లాసులు,హరిజన బాలికల స్కూలు ,హాస్టల్ నిర్వహించింది .ఇవన్నీకాక రెడ్ క్రాస్ సంస్థ కార్యక్రమాలెన్నో నిర్వహించి సమాజానికి సేవ లందించింది .రెడ్ క్రాస్ వర్క్ పార్టీ కి ఆమె జీవిత సభ్యురాలు .ఆమెసేవలకు వారు స్వర్ణపతకం అందించారు .అఖిల భారత శారదా దేవి సంఘానికి అధ్యక్షురాలై ,హైదరాబాద్ లో ఒక శాఖ నెలకొల్పి నిర్వహించింది .ఈ సంఘం తరఫున శ్రీరాం నగర్ పేదల బస్తీలో ఒక ‘’క్రెష్ ‘’నడుపు తున్నది.బాలానంద శాఖ ఉన్నది . తనను పెంచి పోషించిన అక్క పేరిట ‘’శ్రీ మహాలక్ష్మీ బాల సంరక్షణ సంఘం ‘’స్థాపించి రోజూ పిల్లలకు ఉచితం గా పాలు పోయిస్తోంది .వైద్యసదుపాయం కల్పించింది .1975 ప్రపంచ స్త్రీసంవత్సరం సందర్భంగా హైదరాబాద్ లోని పేద బస్తీల స్త్రీలను సమీకరించి మహాసభ జరిపింది .కుష్టు రోగులకు, కలరాబాదితులకు ఆమె ఎలాంటి సంకోచం లేకుండా అపారమైన సేవలు అందించింది .ఆంధ్ర మహిళాసభకు ఆమె జీవిత సభ్యురాలు .ఆ సభ విద్యాలయానికి అయిదువేలరూపాయల విరాళం ఇచ్చింది .1971లో అక్కడ ఒక బ్లాక్ ప్రారంభించింది .ఆంధ్రయువతీ మండలి జీవిత సభ్యురాలు .వర్కింగ్ విమెన్ హాస్టల్ నిర్మాణ కన్వీనర్ . సేవలోనేకాక రచనలోనూ మేటి .వైకు౦ఠ మహాలక్ష్మీ కొలువుకూటం, చింపిరి గుడ్డల శివా లక్ష్మి,నిస్వార్ధ సేవకు నివాళి ,బుద్ధి కుశలత ఉంటే భుక్తికి లోపం లేదు,గర్వానికి పతనం ,బదులు కోరని సేవకు బహుమతులు వంటి పుస్తకాలు విజ్ఞానం విద్యాగంధం లేని వారి కోసం రాసింది . ఆంధ్రప్రదేశ్ లోని వివిధ మహిళా సంఘాలు కలిసి బత్తుల కామాక్షమ్మ గారి అధ్యక్షతన 1965లో ఆమెకు ‘’సంఘ సేవా ధురీణ ‘’బిరుదునిచ్చి సత్కరించారు .1975లో ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రభుత్వం ఆమెను సత్కరించింది .1977 దివి సీమతుఫాను బాధితులకు ఆమె 76ఏళ్ళ వయసులో చిరస్మరణీయ సేవలు అందించింది .
మహాత్మా గాంధీ శత జయంతి ఉత్సవాలలో చంద్రమతీ దేవి భగవద్గీత రెండవ అధ్యాయం లో ‘’స్థితప్రజ్ఞ లక్షణాలు’’ పుస్తకాన్ని మహర్షి సద్గురు శ్రీ మలయాళస్వామి వారి ప్రక్కన కూర్చున్న మహాత్మా గాంధీ ఫోటో మొదటిపేజీలో వేయించి ‘’వెయ్యికాపీలు ముద్రించి ఉచితంగా పంచి పెట్టిన నిజమైన స్థిత ప్రజ్నురాలు ,అందరికి’’ ఆంటీ ‘’శ్రీమతి తలారి చంద్రమతీ దేవి .
– గబ్బిట దుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
సంఘ సేవా ధురీణ –శ్రీమతి తలారి చంద్రమతీ దేవి – మహిళా మణులు – గబ్బిట దుర్గా ప్రసాద్ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>