కవయిత్రి ,హిందీ ఉపాధ్యాయురాలు ,బొంబాయిలో స్త్రీ సమాజ శిక్షణ పొందిన జాతీయోద్యమ నేత –శ్రీమతి దేవులపల్లి సత్యవతమ్మ – మహిళా మణులు – గబ్బిట దుర్గా ప్రసాద్
పశ్చిమ గోదావరిజిల్లా తణుకు తాలూకా అత్తిలి గ్రామం లో శ్రీ వంగల వాసుదేవుడు ,శ్రీమతి సుబ్బమ్మ దంపతులకు సత్యవతమ్మ 15-6-1893న అయిదుగురు సోదరుల తర్వాత జన్మించింది .గారాబంగా పెరిగింది.చిన్నతనంలోనే పెళ్ళి, వెంటనే వైధవ్యం జరిగిపోయాయి .రాజమండ్రిలో మాధ్యమిక విద్య మాత్రమె చదివి స్కూల్ మానేసింది .తల్లి అన్నీ తానె అయి ,ఉత్తమ సాహిత్యం నేర్పి కూతుర్ని తీర్చిదిద్దింది .అన్న వంగల దీక్షితుల సహాయంతో వందే మాతరం ఉద్యమం లో చేరి జాతీయాభిమానం పెంచుకోన్నది .పదకొండేళ్ళ వయసులో రాజమండ్రిలో బిపిన్ చంద్ర పాల్ ఉత్తేజపూర్వక ఉపన్యాసాలు విని ప్రేరణ పొందింది.దేశభక్తి పొంగిప్రవహించి ,విదేశీ వస్త్ర బహిష్కరణలో చురుగ్గా పాల్గొన్నది .1920అఖిలభారత సంఘంలో చేరి మహాత్ముని ఆదేశానుసారం రాట్నం పై నూలు వడకటం నేర్చి, జీవితాంతం నేతబట్టలే కట్టుకోవటం కొనసాగించింది.
1923లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సభలలో దుర్గాబాయమ్మ తో మంచి పరిచయమేర్పడి ,1929-30ఉప్పు సత్యాగ్రహం లో అందర్నీ ప్రేరేపించి పాల్గొన్నది .ప్రతిఫలంగా లాఠీ చార్జీలు ,హింసా బాగా అనుభవించింది.నిర్భయంగా శాసనోల్లంఘనం చేసింది .విపరీతంగా లాఠీ దెబ్బలు తిన్నది .నర్సాపురం తాలూకా లింగనబోయి చర్ల ఉప్పు సత్యాగ్రహం లో అత్యంత దీక్షగా పాల్గొన్నది .శ్రీమతి శృంగారకవి లక్ష్మీ నరసమ్మ ,శ్రీమతి తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ లతో కలిసి ‘’మీరాబాయి చరఖా పాఠశాల’’లో దూదియేకి ,ఏకులు చేయటం నేర్చింది. తణుకులో హిందీ తరగతులు నిర్వహించింది .చాలా బహిరంగ సభలకు అధ్యక్షత వహించింది .సమావేశాలలో దేశభక్తి గీతాలు రాసి, పాడి ఉత్తేజ౦ కల్పించేది . .
రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు గాంధీ ఇంగ్లాండ్ వెళ్ళి నప్పుడు ,,1931డిసెంబర్ లో బొంబాయిలో ఏర్పాటైన ‘’ ‘’అఖిలభారత స్త్రీ సేవాదళ శిబిరం’’లో నెలరోజులు సత్యవతమ్మ శిక్షణ పొంది డ్రిల్లు ,మార్చింగ్ ,కర్రసాము ,రాత్రి గస్తీ మొదలైనవి నేర్చింది .శ్రీమతి దుర్గాబాయి ,కమలాదేవి చటోపాధ్యాయ .సరోజినీ నాయుడు వంటి జాతీయ నాయకుల ఉపన్యాసాలు వింటూ ,ఆశయాలను ఆకళింపు చేసుకొన్నది .మూడువేలమంది ఉన్న ఆ శిబిరంలో ఆమె అనుభవం చిరస్మరణీయం . .డిసెంబర్ 18న గాంధీ ఇంగ్లాండ్ నుంచి బొంబాయి తిరిగి వచ్చినపుడు హార్బర్ అంతా జాతీయ పతాకాలతో ,భారతమాత పటాలతో అలంకరించారు .స్త్రీసేవాదళం మూడువేల మందితెల్లని ఖాదీ చీరలు,పచ్చ జాకెట్లు ధరించి మహాత్మునికి అభివాదం చేయటం చారిత్రాత్మక సంఘటనగా నిలిచిపోయింది .పూలమాలలు గుట్టలు గుట్టలుగా పడి హరివిల్లు నేల వ్రాలిందా అనిపించింది . ఆదృశ్య౦ అందరికీ పరవశం కలిగించింది .భారతీయుల హృదయాధి నేత మహాత్మా గాంధీ కి మనస్పూర్తిగా నమస్కరించి , సత్యవతమ్మ ఆయన ఆజ్ఞను శిరవహించాలని మరోమారు నిశ్చయించుకొన్నది .
చర్చలు విఫలమై ,శాసనోల్లంఘనం తప్పదని తేలగా పోలీసులు శిబిరం స్వాధీనం చేసుకొని మూసేశారు .సత్యవతమ్మ ఇల్లు చేరి౦ది.144 సెక్షన్ విధించినా లెక్క చేయకుండా ,పట్టుదలతో పికెటి౦గులు చేసి ,తణుకు లో అరెస్ట్ అయి ,ఆరు నెలలు శిక్షపడి రాయవెల్లూరు జైలులో సి క్లాస్ కఠిన శిక్ష అనుభవించింది .జరిమానా రెండు వందలు కట్టటానికి నిరాకరిస్తే ,ఆమె గాజులు ,రాట్నం జప్తు చేశారు .అక్కడే దుర్గాబాయమ్మ తనకు ఏ క్లాస్ ఉన్నా, సిక్లాస్ లో శిక్ష అనుభవిస్తూ ,రాజకీయ బందీలైన స్త్రీలు సాధారణ నేరస్తులు కాదని వాదించి ,జైలు బట్టలు కట్టుకోము అని పోరాటం చేశారు .ప్రభుత్వం లొంగి సాధారణ దుస్తులకు అనుమతించింది .సాధారణ దుస్తులతోనే ఆరు నెలలు శిక్ష అనుభవించి సత్యవతమ్మ ఇంటికి చేరింది .
1932లో జాతీయోద్యమ ఉధృతి తగ్గినా ,స్త్రీలలోకలిగిన చైతన్యం మిగిలే ఉంది . ప్రగతి సాధించాలన్న తపన పెరిగింది .నిర్మాణాత్మక కార్యక్రమం చేబట్టారు .ప్రభుత్వ అధికారుల వైఖరీ మారి దేశ సేవకులపట్ల ఆదరణ అభిమానాలు పెరిగాయి .సత్యవతమ్మ స్త్రీ విద్యా వ్యాప్తికి ఒక సంస్థ నెలకొల్పాలని భావించగా ,ప్రభుత్వం స్థలం మంజూరు చేసి సహకరించింది .ఒక తాసీల్దార్ అకాల మరణం చెందిన తన కుమార్తె పేర భవన నిర్మాణానికి ధన సహాయం చేయగా తణుకులో ‘’శ్రీ బాలసరస్వతీ స్త్రీ సమాజం ‘’1932లో ఏర్పాటైంది .గ్రంథాలయం నిర్మించారు .వేల్పూరు రోడ్డుకు తూర్పున మంజూరైన స్థలం లో దాతల సాయంతో సంస్కృత పాఠశాల స్థాపించి స్వంత భవనాలు నిర్మించింది. స్త్రీలకు చేతిపనులు, టైపు నేర్పిస్తూ,పరీక్షలకు పంపుతూ జీవనోపాధి కల్పించింది .తన చదువు ఎనిమిదవ క్లాసుతోనే ఆగిపోయిన సత్యవతమ్మ ,అనేకమంది పేద స్త్రీలకూ, వితంతువులకు,అసంఖ్యాక బాలబాలికలకు జ్ఞాన భిక్ష పెట్టి,విద్యాధనం పెంచింది ,పంచింది .
హృదయ స్పందన కలిగే చక్కని కవితలు రాసి అందరికి ప్రేరణ కలిగించింది సత్యవతమ్మ .’’మన భాష ,మనజాతి ,మన దేశమభి వృద్ధి – .నెనయు మార్గముల నూహించరమ్మ’’అనేది అలాంటి వాటిలో ఒకకవిత .పదవీ వ్యామోహం గౌరవం పొందాలన్న కోరికలేని సాధుశీల ,సేవానిరతిగల కర్మయోగిని సత్యవతమ్మ .’’ఎక్కడి యా౦గ్లదేశ మిది ,ఎక్కడి భారత దేశమద్దిరా –ఇక్కడికేగుదేంచి ,యిటు లెంతయు దీక్షను మాదు ముక్తికై-తక్కక రాత్రియుం బవలు తల్లిరో ! స్లేడురో ‘’అని స్లేడు కన్య త్యాగనిరతిని శ్లాఘించింది .
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం తాలూకా నల్లజర్ల పంచాయితీలో వేలాది జన సమక్షం లో 30-9-19 75 న సత్యవతమ్మకు ఘన సన్మానం చేసి ఆమె సేవలకు నీరాజనాలు అందించారు .తర్వాత గణపవరం లో .ఘన సన్మానం చేశారు .ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఓబులరెడ్డి గారి అధ్యక్షతన సత్యవతమ్మను కవయిత్రిగా ,దేశ సేవికగా గొప్పగా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవించి సత్కరించారు .24-3-1974 ఉగాది పండుగనాడు ప్రభుత్వం తామ్రపత్రం అందించింది . 15-8-1976 నస్వాతంత్ర్య దినోత్సవం నాడు రాజమండ్రి ఇన్నర్ వీలర్ క్లబ్ వారు సత్యవతమ్మను త్యాగశీలిగా సన్మానించారు .
-గబ్బిట దుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
కవయిత్రి ,హిందీ ఉపాధ్యాయురాలు ,బొంబాయిలో స్త్రీ సమాజ శిక్షణ పొందిన జాతీయోద్యమ నేత –శ్రీమతి దేవులపల్లి సత్యవతమ్మ – మహిళా మణులు – గబ్బిట దుర్గా ప్రసాద్ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>