అరణ్యం -2 – ముళ్ళపూలు – వీణావాణి దేవనపల్లి
ఉదయం బయటికి వెళ్లివచ్చేటప్పటికి చలిపెరుగుతున్నట్టు తెలుస్తుంది కానీ మరీభరించలేనంత చలేమీ లేనట్టే అనిపిస్తోంది. అడవిలో వణికిపోయేంత చలి ఉంటుందని అనుకుంటారు కానీ అలా ఏమీఅనిపించలేదు.గత రెండుమూడు రోజులుగా కార్యాలయ పరిమితిలోనే ఉండిపోయాను.పొద్దున బయటికి వెళ్ళినప్పుడు రోడ్డుపక్కగా కూర్చొని అడవినుంచి సేకరించిన చిన్నఉసిరికాయల్ని వాటికొమ్మలతో సహాతెంపి అమ్మచూపుతున్నారు. అభయారణ్యంలో ఎటువంటి ఫలసాయాన్నయినా సేకరించడం,అమ్మడం నేరం. కొన్నిరకాలైన అటవీఉత్పత్తులకు మాత్రమే అనుమతి,అదీ గిరిజన సహకార సంఘాల ద్వారా అమ్మగలిగేవాటిని అనుమతిస్తారు. సాధారణంగా ఆదివాసీలజీవనానికి కావాల్సిన ఫలసాయసేకరణ ఎప్పడూ అడ్డుకోబడదు. అయినప్పటికీ ఇలాగ మార్కెట్ చేయడానికిమాత్రం ఖచ్చితంగా ఆపవల్సిందే. ఇంతకుముందు చెట్టుపైకి ఎక్కడమో లేకపోతే ఇతర సాధనాలద్వారా కావలసినవి తీసుకోవడంవంటివి చేసేవారు. విషాదం ఏమిటంటే ఫలసాయం ఏదైనాఉంటే ఈ మధ్యకాలంలో తెంపడంలేదు, మొత్తంగా కొమ్మల్ని నరికి అలాగే పట్టుకువచ్చేస్తున్నారు. ఈ ఏడాదికి కాయలు అమ్ముకుంటారు. మరోయేటికి కాయడానికి కొమ్మే ఉండదన్న స్పృహే లేదు. చివరికి రెండుమూడేళ్లలో చెట్టంతా పనికిరానిదిగా తయారైపోతుంది.ఇది చూసిన మనవాళ్లు అలా కొమ్మలు కొట్టకూడదని చెప్పి పంపంచివేయడం జరిగింది.
నిన్నటిమొన్నటి చల్లనిసాయంకాలాలు సచ్చిదానందన్ కవిత్వంతో వెచ్చబడ్డాయి. అవి మలయాళంనుంచి అనువదింపబడివైనా వాడి,వన్నె తగ్గని కవితలు. సచ్చిదానందన్ ముళ్ళపొదతో నా భాషే ముళ్ళు అనిపించారు. ముళ్లపొద తన చుట్టూ ఉన్నజీవసముదాయంతో తన ముళ్ళభాషలోనే సంభాషిస్తుంది. ఆ భాష అర్థం చేసుకున్నాయి కనుకనే పక్షులు ముళ్ళచెట్టు వెతుక్కొనిమరీ గూళ్ళు కడతాయి. ముళ్ళభాషలో ఆ ముళ్ళ పొదలుచెప్పే మరో మాట, తమ వద్ద కాపాడుకోవాల్సింది, అతి సున్నితమైనదేదో ఉన్నదని. సచ్చిదానందన్ చైతన్యుడు కుక్క అనే మరో కవితలో పాతిపెట్టిన వారి కోరికలు తమ వేళ్ళతో తెలుసుకునే స్మశానంలోని వృక్షంలా తడియారని మట్టిలో చేరావు నువ్వు అంటారు. శ్మశానంలోనే కాదు వృక్షపు వేర్లు ఎక్కడ ఉన్నా తడి ఉంటుంది.భూమిలో వేరు,తడి తగిలేదాకా వెళుతుంది,వంగుతుంది, విస్తరిస్తుంది., వేర్లు వూణుకున్నాయంటే తడి తగిలిందనే అర్థం. కవి తనకవిత్వంతో తడి వెతుకుతుంటాడు,తడి తావును కనిపెడతాడు, మాటల్లో కలబోస్తాడు, కదిలిస్తాడు, కళ్ళను తడిచేస్తాడు.లోచూపునిచ్చే ఒక్క కవిత చాలునని అనిపించిన ఎన్నో సంధర్భాలు ఎన్నోఉన్నాయి. కవితల్లోభావాల్ని మాటలుచేసి సంభాషించవచ్చు,దాన్ని అన్వయించుకోవచ్చు, ఊహను విస్తరించుకోవచ్చు. ఊహ తాత్వికతకు దారిస్తుంది, ఊహను కల్పించేటువంటి మాటలో శబ్దమో సంగీతమో అది ఎటువంటి కళ ఏదైనా అది చాలా గొప్ప విషయం అని నాకు అనిపిస్తుంది. అది అక్కడినుంచి మనల్ని ఎంతదూరమైనా తీసుకెళ్లవచ్చు. అది ముళ్ళపొద లాగా మూగగా కనిపిస్తూనే సంభాషించవచ్చని తెలియజేయడంలాంటిదే.
అటవీశాఖ తన రిజర్వ్డ్అటవీప్రాంతాల రక్షణకోసం గతకొంత కాలంనుంచి సరిహద్దుల చుట్టూ కందకాలు తవ్వుతున్నది. తవ్వినమట్టి కట్టమీద గచ్చకాయ,వెదురువంటి మొక్కలను నాటి మట్టికట్ట కొట్టుకుపోకుండా చేస్తున్నది.నేనున్న విడదికి కొంచం దూరంలో అలాంటి కందకం ఉంటుంది. సరిహద్దులచుట్టూతానే కాకుండా ప్లాంటేషన్ల చుట్టూతాకూడా కందకాలు తీస్తారు. సరిహద్దు కందకాలకన్నా వీటి పరిమాణం తక్కువ.నిన్న సాయంత్రంపూట విడిదినుంచి బయటకువెళ్తే విడిదిపక్కగాఉన్న కందకం, పూడుకుపోతున్న కందకం, దానిని ఆనుకొని పెరుగుతున్నగుల్మాలు కనిపించాయి. జిమ్మని శబ్దం చేసే కీటకాలు, అటునుంచి ఇటు కలపడిపోలోని పెద్ద పెద్ద చెట్లు, గంభీరంగా కనిపిస్తుంటుంది. కందకం మీద ఒకదంతిచెట్టు (Maytinus emarginatus) పెరుగుతున్నది. దంతిచెట్టుకి ఇప్పుడే పూతకాలం మొదలవుతుంది. ఇంతకుముందు చెట్టు తెలుసు గానీ పూలను గమనించలేదు. ఇప్పుడు దగ్గరగా వెళ్ళి పూలను చూసి ఉప్పొంగిపోయానంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అది మామూలు పూలు కావు ముళ్లమీద వికసించే పూలు. అవును ముళ్ళు కూడా పూలు పూస్తాయి. నమ్మకపోతే ఈ సారి చూడండి. శాఖలు పెరుగుతున్నప్పుడే వాడి ముళ్ళు పొడుకువస్తూ పెరిగి, కాలం గడుస్తుతున్నకొద్దీ ముళ్ళ మీద చిన్ని చిన్ని పూలబంతులు తయారవుతాయి. చూడడానికి అదొక గొప్పవిశేషం. సాధారణంగా ముళ్ళుగల చెట్లు శాఖలమీద ముళ్లను కలిగి తననుతాను రక్షించుకోవడం, ఎగబాకడానికి తోడ్పడటం వంటివి చేస్తాయి. ముళ్లకు ఇంకే బాధ్యతఉండదు. అయితే దంతిచెట్టు తన ముళ్లకు పూలను పూచే మోసే బాధ్యతనూ ఇచ్చింది. మీరు ఆ చిన్ని తెలుపు ఆకుపచ్చ పూలను తెంపుకోవాలంటే ముళ్లును తెంపుకోవాలి.వాటిని చూస్తే విషాదం వద్దు మిత్రమా ముళ్లను పూలు చేసుకోవడమూ సాధ్యమే అని ఎవరో చెప్పిపోయినట్టు అనిపించింది. ఆ పూల చిత్రాలను భద్రపరుచుకున్నాను. ఇది కదా చెట్టు చేయగల మహత్యం. ఇవి కదా కవననదులకు ఊటలు.ఇక్కడ సచ్చిదానందన్ ముళ్ళపొద మరో పరిమళంగా భాసిల్లి చూపించింది.
విశ్వకవి ఠాగోర్ కి, జగదీశ్చంద్ర బోస్ కి ఉన్న అనుభంధం చాలా గౌరవప్రదమైంది. శాంతినికేతన్లో మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఆయన వృక్ష వందనం (Briksha Bandana-1926) అని ఒక కవిత రాశాడు. ఆ కవితను బనోబణి (Bano Bani) తన కవితాసంకలనంలో చేర్చి ఆ సంకలనాన్ని జగదీశ్చంద్ర బోస్ కే అంకితమిచ్చాడు. వృక్షానికి వందనం సమర్పిస్తూ మెల్లిగా కదిలే పత్రాల కదలికలో వేణుగానాన్ని విన్నానని, వృక్ష ఛాయలో శాంతిని అభ్యసించగలమని, మానవునికి స్నేహితుడివైన ఓ వృక్షరాజమా నీకు వందనం అంటాడు. ఈమధ్య కాలంలో ప్రజలకు ముఖ్యంగా పిల్లలకు మొక్కల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి ప్రారంభించిన కార్యక్రమాలలో వృక్షబంధన్ ఒకటి. రక్షాబంధన్లాగా ఒక సూత్రాన్ని తయారుచేసి వృక్షాలకు అలంకరించడం వాటి పట్ల మనం చూపించవల్సిన బాధ్యతను తెలపడం. ఈ ఒరవడికి ఠాగోర్ కవిత ప్రత్యక్ష హేతువు కాకపోయినా ఖచ్చితంగా ప్రేరణగా మాత్రం నిలబడుతుంది. కవి దర్శనాలు అలాంటివే, తమ కాలంలోనూ , తర్వాతనూ ప్రభావితం చేయగలరు.
ఎక్కడో ఏ దూర తీరాననో,కాలం మడతల్లో దాగిన కవిత్వం అప్పుడప్పుడు వెలికివచ్చి ఊహలకు వేళ్ళిచ్చి అల్లుకుపోతుంటుంది. చలిలో వెచ్చదనం, వేడిమిలో చల్లదనం ఆ కవిత్వం మనసుకు కలిగించే ఒరిపిడి. అదో అంతఃకరణపు సుగంధం. ఇక్కడ సువాసన భరితమైనటువంటి వృక్షాలు ఏవీ ఆవరణలో లేకపోయినా,కాగితాల్లో దాచిపెట్టిన మాటలు జీవనసుంగధాన్ని పరిమళిస్తాయి. అయితే ఇంతలోనే సువాసనను మోసుకొచ్చే వార్త ఒకటి వచ్చింది. ఇంతకుముందు బహుమతిగా పొందిన కొన్ని పారిజాత మొక్కలు ఈ రెండేళ్లలో కొన్ని కొన్ని పువ్వులు పూస్తున్నాయని చెప్పారు దాన్ని అందుకున్నవారు. ఇది ఎంతో ఆనందించదగ్గ విషయం. పారిజాతం మొక్కల్ని నేను ఒకసారి ఒక సభలో బహుమతిగా ఇచ్చాను. చాలామంది కొనుక్కోవాలి అని అనుకొని కూడా వారు కొనుక్కోలేక పోతారు. ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం ఎంతో బాగుంటుంది.అది బొకేలు ఇవ్వడం కన్నా చాలా మంచి అలవాటుగా భావిస్తాను. కొన్నాళ్ళయినా ఆమొక్క వారి కళ్ళముందు ఉంటుంది వారికి కనువిందు చేస్తుంది.ఇంకా ఓపిగ్గా సాకగలిగితే కొన్ని సంవత్సరాలపాటు వారికి జ్ఞాపకంగానూ ఆనందంగానూ మిగిలిపోతుందని. ఈ వార్త చేరవేసిన వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ప్రేమతో దాన్ని సాకి ఉంటారు. అందుకే అది ఇంత త్వరగా పుష్పాలనిస్తోంది.ఇది ఆనందించదగ్గ విషయమే కదా. ఆపారిజాత పరిమళాల సుగంధం గదంతా వ్యాపించినట్టు అనిపించింది. గదిలోఉన్న లైట్లు చాలాతక్కువ కాంతితో వెలుగుతుంటాయి. సరైన వెలుతురు రాదు, దోమలబాధకి, చిన్నచిన్న కీటకాలబాధలకి కిటికీలుకూడా తెరిచే పరిస్థితి లేదు.అందులోనూ తలుపులమెదనో వెనుకనో పెద్దపెద్ద బల్లులు తిరుగుతూ ఉంటాయి. ఏబల్లి ఎప్పుడుమీద పడుతుందో తెలియదు. అలాంటి తక్కువకాంతి ఉన్నటువంటి వెలుగులో ఒకసారి కళ్ళ ముందు పారిజాత చెట్టు దాని నిండా పువ్వులు ఎంతో ఉల్లాసమైనటువంటి ఊహ.
సతత సత్ఫల పోషిత దేవ జాతమున్
దరుణ పలాశ పుష్ప సముదాయ సమేతము బారిజాతమున్
(Pg no. 169 ఛిత్రభారతం- చరిగొండ ధర్మన్న)
సత్యభామ పారిజాతాలు అడిగితే మానవకాంతవు అని శచీదేవి ఇవ్వలేదట. కృష్ణుడు, సత్యభామా శచీదేవి నిన్ను అలా అవమానించిందా, ఉండు ఆ పారిజాతాన్నేనీ ఉద్యానవనంలో ఉంచుతానని చెప్పి పారిజాతాన్ని పెకలించి తెచ్చినప్పుడు పారిజాతవృక్షంతోపాటు పలాసవృక్షంకూడాఉందట, అంటే స్వర్గంలో పారిజాతంతోపాటు పలాశవృక్షంకూడా పెంచబడినదన్నమాట. పలాశవృక్షం అంటే మోదుగ చెట్టు. కవి అరుణపలాశ అన్నాడు,అంటే ఎరుపునారింజ మిళితమైన అరుణవర్ణ పూలనిచ్చే పలాశ వృక్షం అని అర్థం. మోదుగలో తెల్లవి, పసుపువీ పూలనిచ్చే రకాలూ ఉంటాయి. ఇక్కడ అరుణ పలాశంఅంటే ఎరుపు మోదుగనే. చాలావరకు వృక్షాల నామీకరణ సంస్కృతంలో సులభంగా ఒక్కపదంతోనే ఉన్నాయి.పదాల కోమలత్వం, ఆయా మొక్కల ఏదో ఒక స్వభావాన్నో,లక్షణాన్నో,ఆవాసాన్నో తెలియజేసేలాగా పరిపరివిధాలుగా పిలుచుకొనే సంప్రదాయం సాహిత్యంలో కనబడుతుంది. ఈ పేర్లను ప్రతిపాదించడం ఎంత పురాతనమో అనిపిస్తుంది.ఇలా చేయాలంటే అప్పటికే అనేక వృక్షస్వభావాలు తెలిసిఉండాలి. మానవుని ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలకు లంకె కుదర్చడమూ గమనిస్తే ఆయా జాతుల అన్వయం మీద ఎంత లోతైన పరిశోధనా జరిగి ఉండాలని తోస్తుంది.
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ ।
తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥
ప్రియంగుకలికాశ్యామంరూపేణాప్రతిమంబుధమ్।
సౌమ్యం సౌమ్య (సత్వ) గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥
హిమకుందమృణాళాభందైత్యానంపరమంగురుమ్।
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥
పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ ।
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ॥
వేదవ్యాసుడు అందించిన ఈనవగ్రహ స్తోత్రాలలో నాలుగింటిలో సూర్యన్ని,బుధున్ని,శుక్రున్ని,కేతవుని స్తుతించే స్తోత్రాలలో సూర్యుణ్ణి మందారంతోనూ,బుధున్ని ప్రియాంగు అంటే మృదువైన, గాఢమైన ఊదారంగుతోనూ,శుక్రున్ని, మల్లె పూవుతోనూ, కేతువుని పలాశ అంటే మోదుగ పువ్వుతోనూ పోలుస్తూ స్తుతించాడు. ఖగోళశాస్త్ర పరిశోధనలను ప్రకృతితో ముడిపెట్టి జ్ఞప్తిలో ఉంచాడు. పలాశవృక్షం పోలికకు నేనేక్కువ ఆనందించాను. కృష్ణుడు ఎప్పటివాడు, పారిజాతం ఎప్పటిది, పలాశం ఎప్పటిది, వేదవ్యాసుడు ఎప్పటివాడు,అసలు ఎవరు ఆయన, వారు వనాల్లో ఆయా చెట్లను పెంచడమూ,వాటిని నిత్య జీవన మార్గంలో నిలుపుకోవడం ఎంత గొప్ప విషయం! అందునా ఆ పోలికలూ.
ప్రపంచం థియోఫ్రాస్టస్ను వృక్షశాస్త పితామహుడుగా గుర్తిస్తుంది.ఆయన క్రీ.పూ మూడవ శతాబ్దంనాటి వాడు. గ్రీకుకు చెందినవాడు, అరిస్టాటిల్ శిష్యుడు. ఆయన వృక్షాలమీద The History of Plants, The Causes of Plants అనే పుస్తకాలు రాశాడు.ఆధునిక వృక్ష వర్గీకరణకు ఆద్యుడుగా గుర్తిస్తారు. మనదేశపు మనువు, వేదాలు ,చరకుడు, శుశ్రుతుడు, ధన్వంతరి వంటివారు ఎన్నోమొక్కల గురించివాటి ఉపయోగాల గురించి చాలా వివరంగా రాశారు. ఇవన్నీ క్రీస్తుకు పూర్వం చాలాకాలం క్రిందటవి. ఆయుర్వేదం మనదేశంలో ఇప్పటికీ అమల్లో ఉన్న విశిష్ట వైధ్య విధానం. చెప్పాలంటే భారతీయులకు చెందిన శాస్త్రీయఅవగాహనకు సరయైనస్థానం ఇవ్వడంలో వెనుకబడ్డామని అనికుంటాను. మనువు కాలం క్రీ. పూ. 2వ -3వ శతాబ్దంగా చెప్తారు. మనుస్మృతిలో ప్రథమ అధ్యాయంలోనే మనువు, వృక్షాల వర్గీకరణను వివరిస్తాడు.
అపుష్పా : ఫలవన్తో యే తే వనస్పతయ : స్మృతా: I
పుష్పి ణ : ఫలిన శ్చయివ వృక్షాస్తూ భయత: స్మృతా II (1-27)
గుచ్చ గుల్మంతు వివిధం తథైవ తృణ జాతయ : I
బీజకాండ రు హా ణ్యే వ ప్రతానా వల్య ఏవ చ II(1-28)
మనువు చెప్పిన పై రెండు శ్లోకాలలో, ఆయన ఇచ్చిన వర్గీకరణలో గుచ్చ(వేళ్ళ నుంచి పొదగా ఎదిగేవి ), గుల్మ(ఒక మూలం నుంచి పొదగా ఎదిగేవి ), తృణ(గడ్డి ), వల్య /వల్లీ (తీగలు), ప్రతాన ( పాకుతూ వ్యాపించేవి), వనస్పతి (పుష్పాలు లేకుండా ఫలాలు ఇచ్చేవి), వృక్షం(ఫల పుష్పాలతో అలరారేవి)ల గురించి చెప్పాడు.మనువుకు ముందు ఋగ్వేదంలోనూ , చరక సంహితలోనూ సుశ్రుత సంహితలోనూ మొక్కలవర్గీకరణ కనిపిస్తుంది.ప్రపంచం ఆరిస్టాటిల్ను, థియోఫ్రాస్టస్ను గుర్తించే కాలానికి మన పురా గ్రంథాలు గుర్తింపుకు రాకుండకపోవచ్చునేమో.ఇంకా వేదాలు అపురుషేయాలు కనుక దానిని ఎవరికీ ఆపాదించలేము కూడా.అయితే కనీసం భారతీయులైనా భారతీయ వృక్షపితామహుడు అంటే విలియం రాక్స్ బర్గ్ అని కాకుండా మన ప్రాచీనశాస్త్రవేత్తలను గుర్తిస్తే బాగుంటుంది. ఈమధ్య మనప్రాచీన గ్రంథాలనుంచి వివిధ వృక్షజాతులను పేర్కొంటూ పరిశోధనలు చేయడం మొదలయింది. రామాయణ, మహా భారతాల్లోని లోని వృక్ష వైవిధ్యం మీద ఇప్పటికే పుస్తకాలు వెలువడ్డాయి.ఇది మంచి పరిణామం. అడవుల్లోని మానవ సమాజాల వృక్ష వినియోగం మీద ఇప్పటికే చాలా పరిశోధన పత్రాలు వెలువడ్డాయి. ఎటొచ్చీ వాటిని మన భవిష్యత్ తరాలకు వివరంగా చెప్పడం ముఖ్యమైందైంది.
చెట్లకుపేర్లు పెట్టడమూ పెద్ద విషయమే. దేశాలు వారి వారి భాషలకు అనుగుణంగా మొక్కలకు పేర్లు పెట్టుకున్నాయి. అయితే ఒక మొక్కను ప్రపంచం మొత్తం అదే మొక్కగా గుర్తించాలంటే ఒకశాస్త్రీయమైన పేరు ఉండాలని భావించిన ఆధునిక వృక్షశాస్త్రవేత్తలు ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.అంటేపేరులో రెండు పదాలు ఉంటాయన్నమాట. అంతకుముందు బహునామీకరణ, లాటిన్ పేర్లూ ఉండి మొక్కను గుర్తించడం అటుంచి గుర్తుంచుకోవడమే కష్టం అయ్యేది. ద్వినామీకరణను లిన్నేయస్ అనే ఆయన ప్రతిపాదించాడు. ఇప్పుడు మొక్కలను,జంతువులకు ఆయన ప్రతి పాదించినట్లుగానే రెండు పదాలున్న పేర్లు పెడతారు. ఉదాహరణకు మందార మొక్కపేరు హైబిస్కస్ రోసాసైనన్స్. ఇందులో మొదటి పదం జాతిని, రెండవ పదం ప్రజాతిని సూచిస్తుంది. జాతుల్ని కొన్ని కుటుంబాలుగానూ ఆపై స్థాయిల్లోనూ వర్గీకరిస్తూ పోతారు. అలాగా మొత్తం వృక్ష సామ్రాజ్యాన్నంతటినీ గుర్తించారు. ఇప్పటికీ ఇంకా గుర్తిస్తూనే ఉన్నారు. మనంకూడా ఏదైనా ఇంతకుముందు గుర్తించబడని మొక్క ఉందని భావిస్తే ఆ మొక్క వివరాలతోపాటు ప్రకటించవచ్చు. శాస్త్రీయసంఘాలు అది నిజంగా ఇంతకుముందు గుర్తించబడని మొక్క అని గుర్తిస్తే దానిని తగిన వృక్షకుటుంబంలో ఉంచి పేరును సూచిస్తారు. నిత్యం అడవులలో తిరుగుతుండే వాళ్ళకి ఎన్నో మొక్కలు కనిపిస్తుంటాయి. అవి ఇంతకుముందు గుర్తించబడినవో ,కాదో తెలిసే అవకాశం వారికి ఉండదు. అలాగే పరిశోధన నిమిత్తం వచ్చే వారికి ఆయా మొక్కల ఆవాసవివరాలు తెలియకపోవచ్చు. అయితే అటవీఅధికారలకు తగిన సమయం, పరిజ్ఞానం, వివిధ సంస్థలతో అనుసంధానం గనక అందుబాటులో ఉంచగలిగితే ఇంకా ఎన్నో వృక్షవిశేషాలను గుర్తించవచ్చు. ఇది సాధించడం కష్టమేమో కానీ అసాధ్యం అయితే కాదు. అటవీశాఖలో పరిశోధక విభాగంకూడా ఉంటుంది. ఇది ఆయా భౌగొళిక ప్రాంతాల్లో పెంచే మొక్కలను పరిశీలించి సలహాలనిస్తుంది, వాటి సరైన విత్తనాలను సేకరించడం, పెంచడంలో సాంకేతిక సూచనలు చేయడం చేస్తుంది. వవిధ ప్రక్రియలను ప్రయోగాత్మకంగా పరిశీలించి దృవపరుస్తుంది. ఏదేమైనా అటవీశాఖలో కేవలం పనిచేయడం ఒక్కటే కాకుండా మరెన్నో శాస్త్రీయ విలువల్ని జోడించే అవకాశం కల్పిస్తుంది.
ఏటూరునాగారం విషయానికి వస్తే ఇదిఒక లివింగ్ లాబరేటరీ అంటాను. ఆరేడు విభాగాల్లో అపూర్వమైన పరిశోదనలు చేయవచ్చు. మానవ సమాజ శాస్త్రంలో, వన్యప్రాణి విభాగంలో , ప్రాచీన వృక్ష వైద్యంలో , ఆవరణ శాస్త్ర విభాగంలో ఒక్కటేమిటి ఎలా అయినా యే కొసనుంచి మొదలుపెట్టినా ఎన్నో కొత్త అంశాలు వెలికితీయవచ్చు. కొనకంచి లక్ష్మీ నరసింహారావు గారని ఒక కవి ఉండేవారు.అప్పటికి మూడేళ్ళ క్రితం పరిచయం అయ్యారు. మంత్రలిపి , మీరొకప్పుడు బతికి ఉండేవారు వంటి ఉన్నతమైన కవిత్వ సంపుటాలు రాశారు. ఒకసారి(అదే చివరిసారి కూడా)మాటల సందర్భంలో అనారోగ్యంతో ఉన్నానని, ఏటూరునాగరంలో ఉన్నానని చెప్పారు. వివరాలు కలిసినప్పుడు చెప్తానని అన్నారు. ఏటూరునాగరంలో చెట్లమందులు వాడుతున్నానని, అందుకోసం వచ్చానని అన్నారు. అప్పుడు వరంగల్‌లో పనిచేస్తున్నాను. కొన్నిపుస్తకాలు వారికి ఏటూరునాగారం అందేలా ఏర్పాటుచేయగలనని చెప్పాను. చేసాను కూడా. అయితే అవి అందేలోగా వారు మనకు అందకుండా పోయారు. బాధ పడ్డాను. అయితే వారు మరికొన్ని వివరాలు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆ చెట్లమందులు ఇచ్చిన వారిని కలుసుకొని ఉందును. ఆ సమస్య ఏమిటో అది ఎలా నయంకాగలదని చెట్లమందులు తీసుకోవడానికి నిశ్చయించుకున్నారో తెలుసుకొని ఉంటే మరెవరికైనా ఉపయోగపడునేమో అనుకుంటాను. ఇప్పుడు తెలుసుకునే అవకాశం తక్కువ. గదిలో ఉన్న కవిత్వం కనిపించినప్పుడు అప్రయత్నంగా ఆ కవిగారూ గుర్తొస్తారు.కాలం చేతుల్లోంచి జారిపోయిన కవి కనిపిస్తారు.
క్రిమికీటకాదులు,వాటి విసర్జకాల ఘాటువాసన ఎంత శుభ్రం చేశినా గదిని పట్టుకొనే ఉంటుంది.మొన్నటి వానాకాలానికి చెమ్మదేరిన గోడలు, అరకొరకాంతీ, ఎగిరినట్టు, దుముకినట్టు అర్థరాత్రుళ్లు అప్పుడప్పుడు వినవచ్చే శబ్దాలు, ఊగీ ఊగీ ఆగిపోయే శాఖల నీడలు, ఎవరూ ఉండని పరిసరాలు వాటి గాంభీర్యం తెరిస్తే మూసుకొని, మూస్తే తెరుచుకొని తలుపులు ఇన్నింటిమధ్య కవిత్వం కాకుండా ఇంకేదీ మరో స్థరంలోకి(plane)తీసుకెళ్ళదు. కొన్నికవిత్వాలు సంగీతాలౌతాయి. అదింకా దివ్యమైన స్థరం. ఆయాస్థరాలను అందుకున్నవాళ్ళని అందుకునే ప్రయత్నం చేస్తూ చుట్టూ ఉన్న గాంభీర్యాన్ని అధిగమించడం అసాధ్యం కాదని తెలుసుకున్నాను.బూర్గుల రామకృష్ణారావు తాను చదువుకునే రోజుల్లో The Forest Night అనీ ఇంగ్లీష్‌లోనే కవిత రాశాడు. అది 1920 ల నాటి సంగతి.ఆయన తర్వాత రోజుల్లో హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. కవి,రచయిత, బహుభాషా కోవిదుడు. ఆయన తదనంతరం ఎన్నో ఏళ్ళకు బయటపడ్డ ఇంగ్లీష్ కవితల్ని వారి వారసులు వారి సమగ్ర సాహిత్యంలో ముద్రించారు. మనకు రవీంద్రుని The baniyan tree నే ఎక్కువగా కనిపించే చెట్లగురించిన కవిత. రవీంద్రుడు తనసాహిత్యాన్ని ముందు బెంగాలీలోవ్రాసి తర్వాత ఇంగ్లీష్‌లోకి తానే అనువదించుకునేవాడు. ఇంకా ఆంగ్ల సాహిత్యంలో ప్రత్యక్షంగా వ్రాసినవి తక్కువ. చెట్లగురించి యూరోపియన్లు రాసిన కవితలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.ఆంగ్లభాషకున్న సౌలభ్యం అటువంటిది. ఆయా భాషలలో గొప్పకవిత్వం తప్పక ఉండే ఉంటుంది అయినా అది మనకు అందే అవక్షం తక్కువ. అటువంటిది వందేళ్లనాటి బూర్గుల వారి ఆంగ్లకవిత అదీ అదవీగురించి అంటే ఆశ్చర్యపడడం వింతేమీ కాదు. వారు తన The Forest Night లో ఇలా రాశారు.
అయ్యో
సంతోషకరమైన వసంతపు అలలిప్పుడు గతం
ఇక మన సుమధుర పుష్పోదయాలు లేనట్టే
రాత్రి ఛాయలు త్వరగానే చీకటిలో కలిసిపోయాయి
పిడచగట్టిన రుధిరస్రవాలను పాలిస్తున్న మరణమూ , ఘాడ నిశ్శబ్దమూ
భయంకరమైన అరణ్యం మధ్యన అతనున్నాడు
నిశ్శబ్ద శబ్ధాల మధ్య అతని దారి తడబడుతున్నది
చిక్కుబడ్డ చెట్లూ, కొండల ఎత్తువంపులూ
భీతిగొల్పే క్రూర మృగాల గర్జనలనుంచి సహాయం కొరవడుతున్నది
దూరాన
నిశాచర యాత్రికునికి మార్గం చూపుతూ
టేకుచెట్ల మీదుగా దీపస్తంభమై ప్రకాశిస్తున్నది అగ్నిశిఖ
అతని వక్షస్థలం ఇప్పుడు దేనికోసం ఎగిసిపడుతున్నది ?
ఆశ , దివ్యమైన ఆశ
విషాదమరణపు నిరాశ నుంచి రక్షిస్తుంది
అది మరణించనున్న మనిషి తుదిశ్వాసను శుద్ది చేస్తుంది
కనుక ఆశ పురిగొల్పగా అతను తిరిగి పుంజుకున్నాడు
భయంకరమైన చీకటిలో తడబడుతున్న అడుగులతో
అరణ్యపు అగ్నిశిఖవైపు కొనసాగాడు
భారీవృక్షాలు వాటి ఘనమైన శక్తితో తనదారికి
అడ్డుపడుతున్నా, అతను నిర్భయంగా వెళ్ళాడు
అది అత్యంత సమీపాన ఉన్నట్లు తోచినా
అతి దూరాన ఉన్నట్లు తెలుసుకున్నాడు
శ్వాస ఆడలేదు, భీతితో బిగుసుకు పోయాడు
అంతా చీకటిగా ఉన్నచోట మళ్ళా వెలుగు రేఖ
“ ఇది మృగతృష్ణ !” స్పృహ కలిగిన అతను బిగ్గరగా ఏడ్చాడు
అతను తీవ్ర నిరాశతో దుఖించాడు అయితే అతని దుఖం కొనసాగలేదు
పక్షుల కలకూజితాల మధ్య
తూర్పుగర్భంనుంచి ప్రకాశవంతమైన సూర్యుడు ఉదయించాడు
ఇక అంతా కాంతివంతమే- చీకటి జాడలేదు
పగటి వెలుగులో అతనికి ప్రపంచమంతా స్పష్టంగా ఉంది,
అదృశ్యమా !
ఓ ఆనందమా !
దృష్ట్యానుగ్రహంతో
అతను ఇప్పుడు సరిగ్గా చూడగలడు
చూస్తాడు, ఆనందిస్తాడు అందుకు దీవించబడ్డాడు..
( ది ఫారెస్ట్ నైట్ కవితకు నా స్వేచ్ఛానువాదం)
ఈ కవిత ఎంత లోతైనది. నిజంగా అడవిలో చిక్కుబడ్డవారికే తెలిసే విషయం. ఆ భయం అట్లాంటిది. కవితలోని సందర్భాన్ని, ఆందోళనను ఎదుర్కొన్నాము గనుక ఆ పరిస్థితిని అర్థం చేసుకోగలను. అయితే విద్యార్ధిగా ఉండగా వ్రాసినప్పటికీ వారు కవితను స్వీయ అనుభవంలేకుండా రాశారని అనుకోను. వారు వర్ణించిన వివరాలు అటువంటివి. పొద్దుపొడిచేదాక ఆ భయం తాలూకు చిత్తవృత్తులకు ఎదురొడ్డడం మామూలు విషయం కాదు.
కవితలో చెప్పిన పరిస్థితులు మా సిబ్బందికూడా చెప్పారు.వారి సర్వీసు కొత్తల్లో అడవిలో తప్పిపోయిందీ ,ఎలా భయపడ్డది, అడవిలో మంటలవెనుక పరుగెత్తింది, కళ్ళకు కట్టినట్టు చెప్పారు. గతంలో వెహికల్స్ వినియోగం తక్కువ, చీకటిలో భీకరంగా కనిపించే అడవిలో భయపడకుండా ఉండడం కేవలం అనుభవంతో మాత్రమే వస్తుంది. అయినా అప్పటి సిబ్బంది తమ అనుభవంతో కలివిడితనంతో నిశబ్ధ నిశీధులను అధిగమించి పనిచేశారు.మరో రకంగా గంభీరమైన అడవుల చీకటిని అధిగమించడం మనల్ని మనం అంతకుమించిన పరిస్థితులకు అవతల ప్రతిక్షేపించగలిగితే వస్తుంది. అందుకు నాకు కవిత్వం చాలా సహాయం చేసింది. ఇప్పుడ ఈ గదిల కూడా అలాంటి ప్రతిక్షేపమే నేను పొందుతున్నది. ముళ్లను పూలుగా చేసుకోగల విద్యను నేర్చుకుంటున్నది.
దేవనపల్లి వీణావాణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
అరణ్యం -2 – ముళ్ళపూలు – వీణావాణి దేవనపల్లి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>