అరణ్యం 2 – కొండమల్లెలు – వీణావాణి దేవనపల్లి
నేనున్నది చాలా చిన్న గది కనుక , ఎండవేడి భరించరానిదై పోయింది.నీళ్లకు కష్టం లేదు కానీ మంచి నీళ్లకు కష్టం. గోదావరి ఇప్పుడు వట్టి పిల్ల కాలువ. చిన్న చిన్న వాగులు ఇప్పటికే ఎండిపోయాయి. మరో వారంలో వర్షాలు రావచ్చు. కానీ వారం గడవడం కష్టం.ఇవ్వాళ కొండాయి వెళ్ళాలి, సాయంత్రమే వెళ్ళడం. అక్కడ నాలుగేళ్ల క్రితం అడవిలో వాచ్ టవర్ కట్టారు. అక్కడ ప్రవహించే వాగు వంపుతిరిగి ఉంటుంది. కొండాయి గుట్టమీదనుంచి దిగువన వాగు, గుట్టవద్ద ఉన్న వాచ్ టవర్‌నుంచి చూస్తే విస్తారమైన అడవీ కనిపించి కన్నులవిందు చేస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఆయి అనేది గ్రామం. కొండల మధ్య వెలసిన గ్రామం.అటువెళ్ళేటప్పుడే ఈమధ్యే పర్యాటకులకోసం ఏర్పాటుచేసిన బ్లాక్ బెర్రీ ఐలాండ్ చూడాలనుకున్నాం.తాడ్వాయి పరిధిలోఉండే బ్లాక్ బెర్రీ ఐలాండ్ చిన్న వాగుపాయలమధ్య ఇసుకదిబ్బ. స్థలం చిన్నదేకానీ ప్రశాంతమైన ప్రాంతం. అక్కడ మొన్నీ మధ్యే పులి ఆనవాళ్ళు కనిపించాయి. పులిసంచారం ఏటూరునాగారంలో గత పదిహేనేళ్లుగా రికార్డు కాలేదు.ఇన్నాళ్ళ తర్వాత పులి ఆనవాళ్ళు తెలిశాక కొత్త ఉత్సాహం, పనీ. ఏటూరు నాగారంతో కలిసిఉన్న కవ్వాల, ఛత్తీస్గడ్ ప్రాంత అధికారులతో సమన్వయం కొనసాగిస్తూ దొరికిన పులి అడుగుల గుర్తులను ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో అచ్చు తీసి ఉంచారు. పులుల సంచారాన్ని పరోక్షంగా గణించడంలోనూ, పులియొక్క వయసు, జెండర్ నిర్ణయించంలోనూ ఈఅచ్చులు ఉపయోగపడతాయి. ఏటూరునాగారంలో గుర్తించిన వివరాల ప్రకారం మగపులి, పెద్దది వచ్చింది. కాలిగుర్తుల ఆనవాళ్ళతో దాని ప్రయాణాన్ని గుర్తించి రికార్డు చేసి ఉంచాము. మరలా ఎక్కడైనా ఎప్పుడైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పులి కనిపించిన ఆనవాళ్ళు దొరికితే ఇప్పుడు రికార్డు చేసిన దానితో సరిచేసి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పులులు ఒకదాని ఆవాసంలో మరొకటి ఉండవు. పిల్లలు కొంచం పెద్దవయ్యాక తనకంటూ ఒక స్థావరాన్ని ఏర్పరచుకుంటాయి. మరొకటి అటువైపు రాకుండా గుర్తులు కూడా పెడతాయి।
ఏటూరునాగారం అభయారణ్యం కనుక ఇక్కడ జంతువుల లెక్కింపు ప్రతీ నాలుగేళ్లకొకసారి జరుగుతుంది. లెక్కింపులో జంతువులసంఖ్య పునరావృతంకాకుండా దేశవ్యాప్తంగా ఒకేసారి జరుగుతుంది. అప్పుడు శాఖాహార జంతువులు, మాంసాహార జంతువులు అన్నీ లెక్కింపబడతాయి.దానికొరకు ప్రతి అటవీఅధికారి ప్రత్యేకంగా శిక్షణ పొందుతాడు.మనం జనాభాలెక్కలకు వెళ్ళినప్పుడు జంతువులు మనకు ప్రత్యక్షంగా కనబడవు కదా,కనుక పరోక్షంగా ఆయా జంతువుల పెంటికలు,పాదముద్రలు, ఇతర ప్రత్యేక అలవాట్లువంటివాటిని దృష్టిలో పెట్టుకొని వన్యప్రాణుల జనగణన చేస్తారు. ఇందులోనూ జనగణనచేసే జంతువులనుబట్టి రకరకాల పద్దతులుంటాయి. పూర్తిగా శాస్త్రీయంగా చేసేపని. ఇది కాకుండా వివిద జంతువుల మధ్య వైవిధ్య అధ్యయన విధులుంటాయి. ఉదాహరణకు వివిధరకాల కీటకాలను అధ్యయనం చేయాలని అనుకుంటే ఒక నిర్ధిష్ట స్థలంలో చిన్న గొయ్యి లాంటిది తీసి దానిలో పడిన కీటకాలను బట్టి వైవిద్యాన్ని అంచనా వేయడం, పక్షులను వలవేసి పట్టుకొని దాని వివరాలు నమోదు చేయడం వంటివి ఆయా రంగాల శాస్త్రవేత్తలు చేసే పనులు.పక్షుల విషయంలో అయితే ఒకప్పుడు ఇలా వలవేసి పట్టుకొని , వాటి చర్మాన్ని ఒలిచి లోన దూదిని కూరి వాటి నమోనాలను భద్రపరచేవారు.ఈ పనిని టాక్సీడెర్మీ అనేవారు. హైదరాబాద్ స్టేట్ అంటే నిజాం పరిపాలన ఉన్నకాలంలో మొట్టమొదటిసారి 1931-32 లోనే ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ పక్షుల మీద పరిశోధన చేసి ఇన్వెంటరీ చేసారు, వారు ఇప్పటి మన్ననూరు . అమ్రాబాద్ , ఫారహాబాద్ ఇంకా ఉట్నూర్ ప్రాంతాల్లో ఐదునెలలపాటు యే సౌకర్యాలు లేని ఆకాలంలో పర్యటించి పక్షిజాతుల వివరాలు సేకరించారు. అప్పటి కాలంలో టాక్సీడెర్మీ ప్రధానంగా ఉండేది.ఇప్పుడైతే అలాంటిది చట్టవిరుద్ధం.చాలా సులభంగా ఫోటోలుతీసి భద్రపరచుకునే అవకాశం మనకుంది. ఏటూరునాగారం అభయారణ్యంలో ఇప్పుడున్న అడవి మిశ్రమజాతులతోనూ అనేక నీటితావులతోనూ ఉంది కనుక పక్షుల వైవిధ్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే పక్షుల ప్రత్యేక పరిశోధన అయితే జరుగలేదు కానీ జరగితే మాత్రం అరుదైన జాతులు కనిపించే అవకాశం ఉంది.
అనుకున్నట్లుగానే ముందు కొండాయి వైపు వెళ్ళాము. ఇంకా బ్లాక్ బెర్రీ ఐలాండ్ కూడా చూసి వెళ్ళాము. ఎండాకాలం సాయంత్రం కనుక పెద్దగా ఇబ్బంది లేదు. చెట్లుమాత్రం చేతులెత్తినట్టు లేతచిగుర్లు తొడిగి ఉన్నాయి. ఎండిన కొమ్మలు,రాలిన ఆకులు,మధ్యలో చిగిరించి, గున్నగా ఉన్న చెట్లు,అన్నింటికీ మించి బ్లాక్ బెరీ ఐ లాండ్లో ఇసుక దిబ్బ మీద ఉన్న ఒకేఒక నీరుమద్ది చెట్టు, కొండాయి వాచ్ టవర్ దారిలో వంపుల వద్ద నిండా పూసిన కొండమల్లెల చెట్లు చూడడం మర్చిపోయిన ఎన్నో సాయంత్రాలకు ఒక్క మేలిమి క్షణం. కొండాయి దారుల్లో కొండ మల్లెలు నింపిన తీపివాసన ఆజన్మాంతం ఘ్రాణశక్తిని రంజింపజేస్తూనే ఉంటుంది. ఉండబట్టలేక తెంపుకున్న కొనమొగ్గల కొమ్మపూలు ఉండీ లేని జడలో పెట్టుకునేదాకా వదలలేదు. ఇనుపచువ్వలతో కట్టిన వాచ్ టవర్ మీదకెక్కి కిందకు దిగనున్న సూర్యుణ్ణి,ఆవెలుగులో రూపుకడుతున్న మబ్బులని,కురవని రంగరంగుల మేఘాలని నిర్జనారణ్యంలో మాట్లాడితే గర్జించే కొండ వంపుల్లో ఎండిన వాగు బాహుమూలాల్లో చిన్నగానూ స్పష్టంగానూ వినవస్తున్న పక్షుల కూతలతోనూ ఫోటోలకు ఎత్తడానికన్నా చూసి తరించడానికే సమయం సరిపోయింది. అక్కడనుంచి నేరుగా బ్లాక్ బెర్రీ ఐలాండ్ కు వెళ్ళాము. ఐలాండ్ లో ప్రవహించే వాగుకు ఒకపక్క వాచ్ టవర్ మరో పక్క ఇసుక దిబ్బ. అదే ఐలాండ్.
ఐ లాండ్ ఇసుక దిబ్బ అంచులమీద పారుతున్న వాగుపీలిక నీటిని తడుపుతూ గూడుకట్టుకొని ఇంకా నా రక్తంలో జీవించి ఉన్న నా ఆదిమ అలవాటును మళ్ళీ చూసుకుంటున్నట్టు అనిపించింది. ఎందుకని ఇసుక చూడగానే గూడు కట్టుకోవాలని అనిపిస్తుంది?ఎందుకని పసిపిల్లవాడినుంచి పండుముసలివరకు వాగుపక్కన ఇసుకచూస్తే అప్రయత్నంగా, అసంకల్పితంగా గూడే కడతారు ?తాను ఉండాలని కట్టుకునేది కాకపోయినా అంతే శ్రద్దగా కడతారు, మురిసిపోతారు , అలంకరిస్తారు.ఇసుకగూడు కట్టుకోవడం కేవలం ఆట కాకపోవచ్చు, ఇంకా మన రక్తధారల్లో జీవించి ఉన్న మన పురాజ్ఞాపకం కావచ్చు. మానవ జీవనప్రస్థానంలో ఎన్నిపురోగమన అలవాట్లు వచ్చి చేరినా ఇంకా మిగిలి ఉన్న అనాది అలవాటు కావచ్చు. పసిపిల్లవాడు కలం , కాగితం ఇస్తే తాను చూడని కొండలు, సూర్యుడు, పొద్దు తిరుగుడు పూలు గీసినట్టు మనం ఇసుక గూడు కట్టుకుని చూసుకొని సంజె చీకటిని గూటినిండా నింపి అలసి విశ్రమించనున్నట్టు తలపోస్తాం.ఈ మధ్య ఓ చిన్నపాప ముక్కుపక్కు తిన్నానని తనకు తెలియకుండా చేశానని అన్నప్పుడు , తనను తాను శుభ్రం చేసుకునే జంతువులకు మల్లే ఆదిమమానవుడు అలా చేసి ఉన్నాడేమో ఆ పురా అలవాటు పసిపిల్లల్లో వ్యక్తమైనట్టు, ఇసుకగూడు కట్టుకోవడంకూడా ఇన్ని పరివ్యాప్త అలవాట్ల మధ్య ఇంకా మిగిలిన ఉన్న ప్రకృతి జ్ఞానం కావచ్చు. నేనట్లా సాయంత్రం అంతా ఇసుక దిబ్బమీద గూళ్ళు కట్టుకొని , కూలదోసి మళ్ళీ కట్టి ఆ చీకటి ముసురుకున్న అడవిలో చుక్కలు పొడిచేదాకా ఉండిపోయాను. ఇరవై రోజులకింద ఇక్కడిక్కడే పులి నడిచి వెళ్ళింది. ఇసుక దిబ్బ తలాపున ఇంకా చిక్కబడ్డ అడవి మూలలో వెదురు పొదలు విస్తారంగా ఉన్నాయి. అక్కడ ఇంతకు ముందు అరుదైన Phallus పుట్టగొడుగు చూశాను. వెదురు పొదలు అడవిదున్నల మంచి ఆవాసం. నీటి తావు కనుక వచ్చే అవకాశమూ ఉంది. ఒకవేళ వస్తే మనం ఎదుర్కొనే పరిస్థితి ఉండదు కనుక అక్కడ నుంచి వెళ్లిపోవలసి వచ్చింది. ఇసుకరవ్వలు పేర్చిన ఇండ్లు , మూటగట్టుకున్న సువాసనాలతో ఇంటికి వచ్చే వేళకి పూర్తిగా చీకటి పడిపోయింది.
రాత్రి వేళకి సమాచారాలకి ఎక్కడివారు అక్కడ వారి వారి విధుల్లోకి వెళ్లిపోయారు. రేపు పొద్దున ఆక్రమణకు గురైన ప్రాంతానికి వెళ్ళవలసి ఉంది. అక్కడ మొన్నీ మధ్యనే దాదాపు వంద ఎకరాల అటవీ స్థలం ఆక్రమణకు గురైంది. నాలుగేళ్ల క్రితం మూడు గుడిసెలతో మొదలై ఇప్పుడు ఇరవై గుడిసెలయ్యాయి. మంచి లోమ్ నేల. రోడ్డుకు అరకిలోమీటరు దూరం, కిందుగా పారే ఒక వాగు. ఎంత మంచి ఆవాసమో. అయితే అది అటవీ ప్రాంతం. మానవ ఆవాసప్రాంతం కాదు. అక్కడ ఇంతకు ముందు మానవసంచారం లేదు. అయితే గుడిసెలు మొదలయ్యాక చెట్లన్నీ మాయమయ్యి చిన్నగా పప్పు ధాన్యాలు వేయడం జరుగుతున్నది. దాన్ని అదుపు చేయడం తలనొప్పిగా మారింది. ఇంతకుముందు ఇటువంటి వాటిని ఎదుర్కోగలిగినా అనేకసార్లు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆక్రమణదారుల్ని అక్కడినుంచి తరలించాలనే పని సఫలం కాలేదు.ఈ వానాకాలంలో ఆక్రమితభూమిని తిరిగి స్వాధీనం చేసుకొని ప్లాంటేషన్ పెంచే పనిలో భాగంగా ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి చూడవల్సి ఉంది.రికార్డులు తిరగేస్తే ఎంతో బాధ కలిగింది. వరంగల్,ఖమ్మం ప్రాంతాల్లో ప్రతి వానాకాలం అటవీశాఖ అధికారులకు చెమట పట్టే కాలం. ఒక తరం వీపులు పగలని క్షేత్రస్థాయి అధికారులు లేరని అంటే నమ్మాలి. చనిపోయినవారు పదుల సంఖ్యలో ఉన్నారు. ముందు జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం పనిచేస్తే కొంత సులభంగా వచ్చే వానాకాలం వెల్లదీయవచ్చుననే ఆలోచననే అందరిదీ. ఇప్పటికీ అంతో ఇంతో సహాజరూపాన అడవి మిగిలిన ప్రాంతాలివి,అందునా ఇతర రాష్ట్రాల సరిహద్దును కలిగిఉన్నది, గిరిజన ఆధిపత్యం కలిగినదీ కనుక ఆక్రమణల ఒత్తిడి ఇంకా ఎక్కువ. ప్రభావితం చేసే కోర్టు కేసులు, ప్రచార,రాజకీయాలవంటి వాటి ఇతర అంశాలూ ఎక్కువే.ఋతువు మారినంత సులువుగా పరిస్థితులు మారవు కదా, ఆక్రమణల తలనొప్పి ఏళ్ళకు ఏళ్ళకు కొనసాగి కాగితాల్లో మురిగిపోతుంది. క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులకు కాగితాల మీద ఉన్న విషయాలకు పొంతన సాధించడం కష్టమైన పని.
అటవీభూముల ఆక్రమణల ప్రయత్నం, ప్రభావం ఇంతకుముందు ఉన్నా గత పాతికేళ్లుగా అందునా మరీ ముఖ్యంగా అటవీహక్కుల చట్టం -2006 తర్వాత ఉన్నంతంగా లేదు. పూర్వపు అటవీఆక్రమణలు ఇంతకుముందు అటవీ అధికారులు చూసీ చూడని పరిస్థితీ ఉంది. ఎక్కడో యే గిరిజనుడో ఇంత పంట వేసుకుంటే బతుకుదెరువుకు ఎకరం,అరా వదిలేసిన చరిత్ర నిజాం ప్రభుత్వ కాలంనుంచీ ఉంది. అందుకు బదులుగా కొంత ధాన్యమూ, కోళ్ళు,మేకలు ఫారెస్ట్ గార్డుకు ముట్టచెప్పినట్టు సాహిత్య అధరాలూ ఉన్నాయి. భారత పూర్వ ప్రధాని పీవీ నరసింహా రావు తన లోపలి మనిషి పుస్తకంలో గ్రామంలో ఫారెస్టు గార్డుకు ఎక్కువ భయపడేవారని రాశారు. అతను ఊర్లోకి వస్తే ఏదైనా సమర్పించుకునే వారనీ రాశారు. కారణం అటవీ భూముల్లో చిన్న చితకా చేసుకునే సాగే. అయితే ఆనాటి భూముల విలువ,పంట,స్థానిక అవసరాలు నేటితో పోలవు. కుమరం భీమ్ చరిత్ర, అమృత సంతానం వంటి వాటిల్లో అటవీ అధికారుల పాత్రను చెడ్డదిగానే చూపారుగానీ అది అంతటా లేదు. బతుకుతెరువుతప్ప ఆక్రమణదారులకు దురుద్దేశ్యం లేదు. అప్పుడు సాగుకన్నా ఎక్కువ అటవీవనరులైన కలప మీదనే ఎక్కువ దృష్టి ఉండేది.కనుకనే 1994లో అప్పటి ప్రభుత్వం ఉమ్మడి అటవీ యాజమాన్యం మొదలు పెట్టినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వనిర్ణయాన్ని గౌరవించి వన సంరక్షణ సమితులను ఏర్పాటుచేయడానికి ముందుకువచ్చారు. ప్రపంచబ్యాంక్ సహకారంతో ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో చేపట్టిన నాలుగు బృహత్ కార్యక్రమాలలో వేల వన సంరక్షణ సమితులు ఏర్పాటుచేసి వేల ఎకరాల అటవీభూమిలో అడవులను స్థానిక ప్రజల సహకారంతో పెంచగలిగాము. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. భూమి ధరలు పెరగడం,భూమిని కలిగి ఉండడంలోని భద్రత,అందుబాటులో ఉన్న అవకాశాలు చూసుకొని మరీ అటవీ భూములు ఆక్రమించుకోవడం వంటివి సమస్య పరిధిని పెంచాయి.
అటవీ ఆక్రమణలకు సంబంధించి సర్వీసులో చేరినప్పటినుంచి నేను చేసిన అధ్యయనం ప్రకారం సంప్రదాయ ఆక్రమణలు, ఉద్ధేశ్యపూర్వక ఆక్రమణలుగా విభజించి చూశాను. సంప్రదాయ ఆక్రమణలు అంటే అత్యంత సాధారణంగా అటవీభూమిని సరిహద్దును కలిగి ఉన్న వారు మెల్ల మెల్లగా అటవీ భూమిలోకి చొచ్చుకొని రావడం ఉంటుంది. హద్ధుల కోసం ఏర్పాటుచేసిన బౌండరీ పిల్లర్లను, కందకాలను పక్కకు జరుపుతారు. గమనించకపోతే హద్ధుల స్వరూపం మారిపోతుంది. అటవీ సరిహద్దులను మార్చడం అటవీచట్టరీత్యా నేరం. ఆక్రమణలకున్న శిక్షకన్నా సరిహద్దులను మార్చడం ఎక్కువ శిక్షతో కూడినది. ప్రతీ నిత్యం దీన్ని పరిశీలించడం అటవీ అధికారుల తప్పనిసరి విధి.ఇవి గుర్తించినప్పుడు వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
అటవీ భూములను ఉద్ధేశ్యపూర్వకంగా ఆక్రమణచేయడం కొంత సంక్లిష్టంగా ఉంటుంది. అదుపు చేయడంకూడా కష్టం. మంచినేలలు నీటివసతీ ఉన్న చోట కొంతమంది కలిసి స్థానిక నాయకుల అండదండలతోనో, వారికి వారుగానో అడవిని నరికి వానాకాలం రాగానే విత్తులు చల్లుతారు. వెంటనే తెలిసందా కేసు అవుతుంది. కాస్త ఆలస్యం అయిందా , ఆక్రమించబడిన స్థలంలో పంట ఉంటుంది. తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో అటవీ అధికారులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల పంటను నాశనం చేశారని ప్రచారం చేసి అందరూ ఒకటై ఘర్షణకు దిగుతారు. అటవీ అధికారి ఒంటరి అవుతాడు. ప్రజలూ , పత్రికలూ, నాయకులు ముప్పేట దాడికి దిగి ఏమీ చేయలేని పరిస్థితి కలిగిస్తారు. అప్పటికప్పుడు సమస్యను పక్కకు పెట్టడం, మళ్ళీ యేటికి మళ్ళీ మొదలవ్వడం ఇదే కథ పునరావృత్తం అవుతుంది. ప్రజల సమిష్టి ఆస్తులను పరిరక్షించే బాధ్యత రాజ్యాంగం ప్రకారం అందరికీ ఉంటుంది. కానీ అటవీ భూముల విషయంలో ఇది ఎక్కడా కనిపించదు. సమిష్టి ఆస్తులు వ్యష్టికి మార్పు చెందడం ముందు తరాలకు చేస్తున్న సామాజిక అన్యాయంగా భావించే సమాజం లేనంత వరకు అటవీశాఖ ఒంటరిదే. ఉద్యోగస్వామ్యంలో ఉండే అరిష్టాలు ఉండనే ఉంటాయి. నా సర్వీసులో నాకే సమస్య రాకూడదు అనే విధమైన ఒత్తిడికి గురైన మామూలు ఉద్యోగి ఏం చేయగలడు, ఎలాగూ అదుపు చేయలేను అనుకుంటే మిన్నకుండడం లేదా బదిలీ పై వెళ్లడం లేదా ఆక్రమణల విషయం బయటి రాకుండా తానే నిర్వహించడం , ఇదే జరగుతుంది. ఈ సమయంలో పై అధికారికి ఇన్ని కోణాల్లో ప్రతీ కేసు చూడడం తలనొప్పి కాకుండా ఎలా ఉండగలదు?
ఆక్రమణలపర్వం భిన్న రూపాలు. అటవీ గ్రామాలు ఏర్పడటం, వ్యవసాయ క్షేత్రాలు ఏర్పడటం వంటివి దగ్గర నుంచి గమనించిన అనుభవం ప్రకారం వివిధ సంధర్భాలను అనుసరించి వివరించే ప్రయత్నం చేస్తాను.
సంధర్భం ఒకటి : ఇప్పటికే ఉన్న గ్రామంలోని కొంతమంది కలిసి మంచిఅటవీభూమి చూసి తలా కొంతభూమిని అంటే మనిషికి ఐదేకరాలు, పదెకరాలు వచ్చేలాగా లెక్క వేసుకొని చెట్లను కొట్టేస్తారు.పెసలు,మొక్కజొన్నలువంటి త్వరగా పెరిగే విత్తనాలు చల్లుతారు. సాధారణంగా ఇందుకు ఎంచుకొనే అటవీభూమి పర్యవేక్షణకు దూరంగా ఉన్నదై ఉంటుంది,కనుక విషయం తెలిసే సరికె అక్కడ పంట ఉంటుంది. ఒకవేళ ఒక సీజన్ మొత్తం గడిచి పోతే పాత ఆక్రమణ అని, గత ముప్పై నలభై ఏళ్లుగా సాగులో ఉన్నదనీ అoదరూ ఒకేమాటమీదఉండి గొడవకు దిగుతారు. ఇట్లా అక్రమాలుచేసే చాలామందికి ఇంతకుముందే వేరేవేరేచోట్ల వ్యవసాయభూములు ఉంటాయి.ఇలా చేయడంవల్ల వస్తే మరికొంత భూమివస్తుంది, లేదా పంటైనా వస్తుంది.అయితే అటవీచట్టం ప్రకారం కేసు నమోదు అవుతుంది, కానీ భూమిఖాళీగా ఉంది కనుక మళ్ళీ మళ్ళీ ఆక్రమణ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి.
సంధర్భం రెండు: మొదటి సంధర్భంలోలాగానే జరుగుతుంది, అయితే స్థానిక నాయకుల ప్రోత్సాహంతో జరుగుతుంది. కర్త ,కర్మ,క్రియ అన్నీ తామై స్థానిక నాయకులు వ్యవహరిస్తారు. ఆక్రమణదారునికి భూమి వస్తుందన్న ఆశ ఉంటుంది. కొంత పంటను ఇచ్చినా ఆర్థిక లావాదేవీలూ జరుగుతాయి. విషయం తెగదు.
సంధర్భం మూడు: ఇక్కడకూడా మొదటి సంధర్భంలోలాగానే జరుగుతుంది.అయితే ఆక్రమణదారులుముందు ఆక్రమించి తర్వాత స్థానిక నాయకుల సహాయం కోరతారు. పరిస్థితులదృష్ట్యా నాయకులు ఆక్రమణదారులకు వంత పాడవలసి వస్తుంది. ప్రతీ ఆక్రమణదారునివద్దనుంచి కొంతడబ్బు తీసుకొని ప్రతీఏటా ఆక్రమితభూమిని అటవీశాఖ అధీనంలోకి రాకుండాచూస్తారు.
సంధర్భం నాలుగు : ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేసిన వెంటనే ఊరు ఊరంతా కదిలి చుట్టుపక్కల ఉన్న అడవి నరికి తమకి భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. అదుపు చేయడం కష్టం, స్ప్లాష్ వాన లాగా జనం అంతా నరకగలిగినంత అడవి నరుకుతారు.మళ్ళీ కొద్ది రోజులకు సద్దుమణుగుతుంది. భూమి ఖాళీ అవుతుంది కనుక సాగు చేయగలిగిన వారు సాగు చేస్తారు. మిగిలిన వాళ్ళది అలా పడావు పడుతుంది. అటవీ హక్కుల చట్టం వచ్చాక ఈ పరిస్థితి ఎక్కువైంది.
సంధర్భం ఐదు : ఏదైనా ప్లాంటేషన్ చేపట్టి అది దక్కక పోతే అక్కడా మెల్లిగా విత్తులు జల్లి ఆ స్థలం మాదే అని గొడవకు దిగుతారు. ప్లాంటేషన్ వివరాలు రికార్డుల్లో దొరికిందా సరి లేకపోతే అది ఆక్రమిత భూమిగానే కొనసాగుతుంది. ఇవి సమిష్టి ఆక్రమణలు , ఇవికాక వ్యక్తులు తమకుతాముగా ఆక్రమణ చేస్తుంటారు. దొరకితే కేసు లేకపోతే పంట. ఇంతే వారి ఉద్ధేశ్యం. ఇందాక చెప్పినట్టు సరిహద్ధులను జరిపి చేసే ఆక్రమణలకు భిన్నంగా ఈ ఆక్రమణలు ఉంటాయి.
అటవీగ్రామాలు ఏర్పడడంలో కూడా ఆక్రమణలే ప్రధాన పాత్ర. మొదటి సంధర్భంలో చెప్పినట్టు కొంతమంది కలిసి అడవినరికి మొదలుపంట వేస్తారు. తర్వాత మెల్లిగా గుడిసెలు వేస్తారు. ఒకరి తర్వాత ఒకరు జతపడి అది గ్రామం అవుతుంది. ఇది నెమ్మదిగా జరిగే పని. ఒక అధికారి సంభంధిత ప్రాంతంలో ఉద్యోగకాల పరిమితి మూడునాలుగేళ్ళు అనుకుంటే ఈ మార్పు గుర్తించే విధంగా ఉండదు. ఆక్రమణలు గుర్తించిన వెంటనే అక్కడ వెంటనే ప్లాంటేషన్ చేసే పరిస్థితికూడా ఉండదు. ఒకవేళ ఎక్కువ సంవత్సరాలు భూమి ఖాళీగా ఉంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఇంతకు ముందు ఒకసారి ఇన్స్పెక్షన్ అని వెళ్తే చిక్కటి అడవి మధ్యలో రెండువందల ఎకరాలు ఆక్రమించి పంటవేశారు. చుట్టూ చెట్లు ఉన్నాయి కనుక చాలా రోజులవరకు ఎవరికీ విషయం తెలియలేదు. డొంకదారి వెడల్పుగా చేయడంతో ఎడ్లబండి గుర్తులుపట్టుకొనిలోనకి వెళ్తే విషయం బయటపడింది. స్థానిక నాయకుడు వాళ్ళకు మంచి నీళ్ళను ట్రాక్టర్స్‌తో అందిస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయాము. గుడిసెల సంఖ్య పదికిపైగానే ఉంది.వాళ్ళలో ఎవరూ గిరిజనులు కాదు.వారిలో కొంతమంది ఇంతకుముందు కేసుల్లో ఉన్నారని మనవాళ్ళు చెప్పారు. ఆక్రమణవిధానాన్ని కాగితంమీద గీస్తే బట్టతలసిద్దాంతం అని పేరు పెట్టవచ్చునేమో అనిపించింది. ప్రస్తుతానికి బాల్డ్ హెడ్ థియరి అని అందంగా పిలుచుకుందాం. అడవి నడిమధ్యలో మొదలు పెట్టి ఏడాదికి ఇంత అని అడవి నరికి మెల్లమెల్లగా దగ్గరగాఉన్న రోడ్డుదాకా విస్తరిస్తారు. కొంత కాలానికి అది ఊరు అవుతుంది. బలపడతారు. ఎవరూ కదల్చలేని స్థితికి వస్తారు.ఇలా ఎన్నోగ్రామాలు ఏర్పడ్డాయి.కానీ ఇన్స్పెక్షన్ ద్వారా ఇక్కడి సంగతి మాకు తెలిసిపోయింది కనుక ఆతర్వాత కాలంలో అప్పటి అధికారులు అంతా స్వాదీనం చేసుకొని ప్లాంటేషన్ చేశారు. కేవలం పంట భూములకోసం ఆక్రమించడం కాకుండా ఇండ్లు కట్టుకోవడం, బావులు తవ్వడం, ఇతర నిర్మాణాలు చేపట్టడం వంటవీ ఆక్రమణలలో భాగంగా ఉన్నాయి.
అటవీ భూములకు సంబంధించి గిరిజనుల పరిస్థితి వేరు. అయితే రేపు చూడబోయే ఆక్రమిత ప్రాంతం కథ ఇంకా కొత్తరకం. అది ములుగు,భూపాలపల్లి, పూర్వపు ఖమ్మం జిల్లాలకు ప్రత్యేకమైనది. దీని నేపథ్యం ఛత్తీస్గడ్ రాష్ట్రంతో సరిహద్దు కలిగిఉన్న అన్ని అటవీ భూభాగాలదీ.కమ్యూనిస్టు ఉద్యమాల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు , సల్వాజుడుమ్ కావచ్చు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలైన మైనింగ్ వంటి పరిశ్రమల అనుమతికోసం అడ్డుగా ఉన్న గిరిజన గ్రామాల తరలింపు కావచ్చు మొత్తానికి దండకారణ్యంనుంచి గత కొంతకాలంగా వలస బాటపట్టిన మూలవాసులకథ అది. కొంతమంది గుంపుగా బయలుదేరి మన అడవులలోకి రావడం,రావడానికి ముందే రావలసిన స్థలం ఎంపిక చేసుకోనే ఉండడంవల్ల వెంటనే అక్కడ అందుబాటులో ఉన్న వనరులతో గుడిసెలు వేసుకోవడం,విత్తనాలు జల్లడం వారంలోపల జరుగుతుంది. ఈ దశలో గుర్తిస్తే వెంటనే వాళ్ళను అక్కడనుంచి తరలించి గిడిసెలు తీసివేసి మళ్ళీ మొక్కలు నాటుతారు. ఒకవేళ యే కారణం చేతనైనా ఈ సమయం దాటిపోతే గుడిసెల సంఖ్య పెరుగుతుంది. పంటస్థలం పెరుగుతుంది. ఆధార్ కార్డులు జారీ అవుతాయి, ఉపాధి హామీ కార్డులు జారీ అవుతాయి. ఇంకా విచిత్రంగా షెడ్యూల్డ్ ట్రైబ్ సర్టిఫికేట్ కూడా జారీ అవుతుంది. ఇంకా ముందుకువెళితే వారిని ఆప్రాంతంనుంచి కదల్చకుండా మానవహక్కులసంఘం ద్వారా స్టేఆర్డర్ వస్తుంది. కోర్టులో అటవీశాఖకూ వారికీ మధ్య కేసు నడుస్తుంటుంది. వారికి అండగా ఒక స్వచ్చందసంస్థ వెన్నుదన్నుగా ఉండి హరికేన్ లాంతర్లు, సోలార్లైట్లు, దుప్పట్లు, టీ షర్టులు అందిస్తుంది, అది చెప్పే బతుకు పాటాలు అదనం.ఆధార్ కార్డు, ఓటరు కార్డు ఉంటాయి కనుక స్థానిక నాయకులు తెలిసీ ఏమీ చేయలేరు. ఈ మొత్తం చట్రంలో మొదటి నుంచి చివరిదాకా ఒంటరివాడు అటవీశాఖ అధికారి మాత్రమే. జతగా విషయం లోతుల్లోకి వెళ్లని ప్రచారసాధనాలు, అధికారికతప్పిదాలు వెరసి మన కళ్ళముందే మన అటవీభూమి అన్యాక్రాంతం అవుతుంది. అధికారులు బదిలీ అవుతారు, నిజంగా పోయిన సమాచారం,తప్పించిన సమాచారం ఏదైతేనేమి మళ్ళీ కథ మొదటి వస్తుంది. ఇట్లా ములుగుజిల్లాపరిధిలో ఇప్పటికే కుదురుకున్న ఆవాసాల్లో, ఇప్పుడిప్పుడే కుదురుకోబోతున్న ఆవాసం చూడడానికి వెళ్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఆక్రమణప్రాంతాన్ని ఎలాగైనా స్వాధీనం చేయాలకునే ప్రయత్నం చేయబోతున్నాం.అది మా బాధ్యత.
ఆక్రమిత ప్రాంతం నిడివి వంద ఎకరాలు , గుడిసెలు ఇరవై మూడు, అందులో ఒక గుడిసెలో ఒక స్వచ్చంద సంస్థ ఇప్పటికే కార్యక్రమాలు మొదలుపెట్టింది. హైకోర్టు స్టే రాలేదు కానీ అదే పనిలో కాగితాల సమర్పణ అయిపోయింది. ఒక మూల, వారు ప్రార్ధన చేసే గుడిసె విడిగా ఉంది, మరొక గుడిసె మేకలకోసం కేటాయించబడినది. కొర్రలు , పెసలు కొంత జల్లి ఉంది. ఆక్రమణ వయసు నాలుగేళ్ళు,అప్పుడు ఇతరచోట్ల తీసుకున్నచర్యల్లో చెలరేగిన అలజడివల్ల యథాతథస్థితికి వదిలివేయబడింది. జనాభా పిల్లలు పెద్దలు కలిసి డెబ్బైవరకు. నాలుగేళ్లలో ఆధార్‌కార్డు , జాబ్‌కార్డు వచ్చి ఉన్నాయి. దగ్గరలో ఎన్నికలు లేవు కనుక ఓటరు కార్డు ఇంకా రాలేదు. అటవీశాఖ కేసు ఇదివరకే నమోదు అయినప్పటికీ ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు గుడిసెలు కాకుండా,మనుషుల జోలికి వెళ్ళకుండా కేవలం అటవీభూమిని స్వాదీనం చేసుకొని ప్లాంటేషన్ వేయాలన్నది ప్రణాళిక. ఆ గూడెం పెద్దలను ఈ మధ్యే పిలిపించి మాట్లాడారు. వీరంతా కూడా ఛత్తీస్గడ్ వారే కనుక తదుపరి పరిస్థితిని బట్టి జనాలను వారి స్వగ్రామాలకు తరలించాలి. సహజంగానే మా నిర్ణయానికి వ్యతిరేకత ఉంది. కానీ తప్పదు కదా. ఈ పరిస్థితులకు తోడు ఈ మధ్యనే ఐటిడిఏ వారు ఆవాసగ్రామం అని అక్కడ బోర్డు తగిలించారు. దానిని తొలగించాము గానీ సామాన్యునికి ఏదైనా ధృవీకరణ పత్రం పొందాలంటే అన్నిటికీ అడ్డుపడే నిరభ్యంత్రపత్రం,ఇంటినంబరువంటి ఇతర ఆధారాలు ఇక్కడి ఆక్రమణదారుల విషయంలో రెవెన్యూ యంత్రాంగంగానీ , సమగ్ర గిరిజిన అధికారులుగానీ అటవీశాఖ నుంచి ఎన్నడూ అడిగిన దాఖలాలు లేవు. ఇట్లా సరైన స్థానికవివరాలు లేకుండా ధృవపత్రాలు జారీ చేసన యే శాఖ అధికారి మీద ఒక్కటంటే ఒక్క చర్య నమోదు కాలేదు. తెలంగాణరాష్ట్రం ఏర్పడినాక అటవీరక్షణ కమిటీని జిల్లా కలెక్టరు ఛైర్మన్ గా ఏర్పాటు చేశారు గానీ ఈ ప్రాంతపు ప్రత్యేక పరిస్థితులమీద చేయవలసినంత పని జరగలేదు. ఇది అంతరాష్ట్ర సమస్య కనుక సమగ్ర అధ్యయనం చేయవలసి ఉంటుందని ప్రభుత్వం, ఇంకా అటవీ అధికారులకు తగిన చేయూతను ఇతర శాఖలు తప్పనిసరిగా అందించవలసి ఉంటుందని సంబంధిత శాఖలు, అటవీవనరులు ప్రజల ఉమ్మడి ఆస్తి అనే భావన ప్రజలకు రానంతవరకు అటవీ అధికారిది ఒంటరి పోరాటమే.దానిని అధిగమించే పని చేయాలనే ఈ తలంపు.
అడవులలో భూమిని ఆక్రమించడంకోసం చెట్లను నరకడమూ వివిధ పద్దతులను అనుసరించి చేసేదే. నమ్మరు గానీ అమాయకత్వంలోనూ అరాచకం ఉందని తెలుసుకున్నప్పుడు కలిగిన బాధ అంతాఇంతాకాదు. సంప్రదాయంగా మన్నికైన కలపకోసం మంచిచెట్టును,వడ్రంగిచూసి చెట్టుకిందుగా నేలనుంచి ఆరేడు అంగుళాలపైన చుట్టూతా, నడికట్టులాగా మూడునాలుగు అంగుళాలమేర బెరడును ఒలిచేవారు. దీన్ని గర్డిలింగ్ (Girdling)అంటారు, మనం నడికట్టు అంటాం. ఇలా చేయడం వల్ల చెట్టులో కిందనుంచిపైకి నీరు , పైనుంచి ఆహార పదార్థాలు కిందకూ సరఫరా నిలిచిపోయి చెట్టు చచ్చిపోతుంది. చెట్టులో దారు మధ్యభాగం ఉత్త చనిపోయిన భాగమే. చివరల ఉండే పచ్చి భాగమే జీవించి ఉన్న భాగం.నడికట్టు తొలవబడ్డ చెట్టు రెండు నెలల్లో చనిపోయి, ఉన్న చోటనే మాగుతుంది(seasoning). ఇలా అవసరానికి కావాల్సిన కలప సేకరించుకోవడం సంప్రదాయ అలవాటు. కలప పచ్చిదనం పోయి, బరువు కూడా తగ్గుతుంది. అడవి నుంచి తరలించడం సులువు. సేకరించిన వెంటనే వాడికోవచ్చు కూడా. ఇలాకాక ఒకటో అరో వ్యవసాయ పనిమొట్ల కోసం సేకరించుకునే కలప కోసం అందుబాటులో ఉన్న చెట్లను నరికి వాడుకోవడం ఉంది. అయితే ఆక్రమించే అడవులలో మాత్రం చిన్న పెద్ద చెట్లు తేడా లేకుండా నరికివేస్తారు, కావాల్సిన దుంగలు ఉంచుకొని మిగిలినవి కాల్చివేస్తారు. ఇవికాక ఏటూరునాగారం అడవిలో గుత్తికోయలు ఇంకో పద్దతిలోనూ చెట్లను మట్టు బెట్టడం చూశాను. ముఖ్యంగా పెద్ద పెద్ద నల్లమద్ది చెట్లు. నడికట్టు వలవడం,కొంతకాలానికి దాన్ని పడవేయడం, చిన్నచిన్న ముక్కలుగాగానో, ఉన్నదున్నట్టు గానో ఉంచి మంటపెట్టడంవల్ల పడ్డచోటనే మెల్లిగా కాలి బూడిద అవుతుంది. మిగిలిన మొట్టుమీద ఆవుపెండనో, బెల్లంతోకలిపో చల్లితే చెదలు పట్టి అక్కడ చెట్టు ఉన్న ఆనవాళ్ళు లేకుండా పోతుంది. అది కూడా ఎందుకు అనుకుంటే మిగిలి ఉన్న మొట్టును కూడా తగలబెడతారు. ఇక్కడ విశేషం చెట్టును చంపడం ఒక్కటే కాదు , తేపకు కొన్ని చంపడం ! ఉదాహరణకు వాళ్ళు దిగిన చోట వంద చెట్లు ఉన్నాయని అనుకోండి. మొదట కొన్ని చెట్లను తీసి వేస్తారు. మరి కొంత కాలానికి మరికొన్ని , ఇలా నాలుగైదేళ్లలో మొత్తం వంద చెట్లు మాయం అవుతాయి. ఎవరికీ అనుమానం రాదు. సహజంగా చెట్లు చనిపోయాయనే భావన కలుగుతుంది. బీటు అధికారి ఇన్స్పెక్షన్ లో చనిపోయిన చెట్ల వివరాలు కూడా రాయాల్సి ఉంటుంది.ఇక్కడ అసలు ఆధారమే ఉండదు కనుక రాయడానికి ఏమీ ఉండదు. ఈ నాలుగేళ్లలో ఆ అధికారి బదిలీ అయ్యి మరొకరు వస్తారు. ఎవరూ గుర్తించకుండా tree cleansing జరుగుతుంది. ఇలా సిద్దమైన కొత్త చోట మళ్లీ గుడిసెలు, పంటలూ ,కార్డులు.. అంతా పునరావృత్తం అవుతుంది. ఇట్లా ఏర్పడినవే ఏటూరునాగారం అభయారణ్యంలో ఏర్పడిన కాలనీలన్నీ. ఓటువల్ల రాజకీయహక్కులు, స్థానిక గిరిజనులతో ముఖ్యంగా కోయలతో వివాహ సంబంధాలు సమస్యను సంక్లిష్టం చేస్తున్నాయి.
ఒక సంధర్భంలో స్థానిక గిరిజన నాయకులు, షెడ్యూల్డ్ కులాల నాయకులు కలిసినప్పుడు ఈ భూఆక్రమణల గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ముఖ్యంగా సమగ్ర గిరిజన అభివృద్ది సంస్థల పరిధిలో షెడ్యూల్డ్ కులాల తమకు ఉద్యోగ కల్పనలోనూ, భూమి సంబంధలావాదేవీల్లోనూ అన్యాయం జరుగుతున్నదని వాపోయారు.మా తరం ఇక్కడే పుట్టి పెరిగం కనుక ఉండిపోయామనీ మా పిల్లల భవిష్యత్తుకు భరోసా ఏమీ లేదని అందుకే వలసపోయారని అన్నారు. తాము ఎన్నో ఏళ్లుగా ఇదే ప్రాంతంలో స్థానికులుగా ఉన్నప్పటికీ, నిన్నమొన్న చేరిన ఆక్రమణదారులకు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని,వారికి భూమిని అటవీహక్కు చట్టం ప్రకారం అందించడానికి అంతా సిద్దపడుతున్నారని ఇది అన్యాయమని అన్నారు. అలాగే గిరిజన యువకులు మాట్లాడినప్పుడు ఇన్నాళ్ళూ ఎక్కడి వారైనా గిరిజనులు అంతా ఒక్కటే అనుకున్నామని కానీ ఇప్పుడిప్పుడు అడవిని ఆక్రమించినవారికి భూమిని కేటాయించడం ఎంత వరకు సబబని , ఇన్నాళ్ళు ఇక్కడే ఉండి చట్టాలకు అనుగుణంగా నడుచుకోవడం వల్ల తమకు ఒరిగిందేమీ లేదనీ మేమూ ఆక్రమణ మొదలుపెట్టి ఉంటే మాకూ భూమి వచ్చేదేమో అన్నారు. అన్నీ విని అర్థం చేసుకుంటే ఒక చట్టాన్ని , అమలు చేసే యంత్రంగాన్ని , పర్యవేక్షణను సరైన దిశలో తీసుకెళ్లకపోతే ఎన్ని సామాజిక అనర్దాలు జరుగుతాయో అవన్నీ అటవీ ఆక్రమణల నియత్రంణలోనూ,నిబంధనలు అమలు చేయడంలోనూ జరిగాయని అనిపించింది. అన్నిటికీ మించి అడవులు సమాజ ఆస్థి అని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అర్థం చేయించడంలో వెనుకబడ్డామని అనిపించింది. ఇవన్నీ ఇలా ఉంటే రేపు వెళ్ళేచోట ఏమి జరగనుందో అని లోలోపల భయమూ ఉన్నా ఇందాకే కట్టుకున్న ఇసుకగూడు, పైన విస్తరించిన ఆకాశాన్ని గుర్తుచేసుకొని కొండమల్లెల తెల్లని పూరెక్కల చిత్రంమీద కళ్ళనునిలిపి నిద్రపోయే ప్రయత్నం చేసాను. ఎండిన నల్లమద్దిమానుమీద కొండమల్లెలు విచ్చుకున్నట్టు చిన్న కలలాంటి మెలకువ. దోసిటితో విత్తనాలు చల్లిన అవ్వ , నవ్వుతూ మాయమైనట్టు కల.
– దేవనపల్లి వీణావాణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
అరణ్యం 2 – కొండమల్లెలు – వీణావాణి దేవనపల్లి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>