అరణ్యం 2 – చింతామణి – వీణావాణి దేవనపల్లి
పొద్దున గమనించినప్పుడు చిన్నపీటలాంటి మొట్టు ఒకటి బయట కనిపించింది.అడిగితే సర్వాయి సౌత్ బీటులో తెచ్చామని ,అలాంటివి అక్కడ ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. అది ఉత్తమొట్టు కాదు, శిలగామారిన మొట్టు. శిలాజంగా మారిన మొట్టు. అది యేచెట్టుదో మనం గుర్తించలేము.వాటిని పరిశోధించడానికి ప్రత్యేక సంస్థలున్నాయి. అయితే నాకు తెలిసి వీటిమీద పరిశోధనైతే జరగలేదు.ఔత్సాహికులద్వారా తెలిసిన విషయాలే.ఈశిలాజాలు 250మిలియన్ల సంవత్సరాలకు చెందినవని మాట.గోదావరి పరీవాహకప్రాంతం అంతాకూడా విస్తారమైన ఖనిజవనరులు,శిలాజాలువంటివి కనిపించడం మామూలే.పూర్వపు గోండ్వానాప్రాంతమే ఇదంతా.అయితే సర్వాయిలో ఎటువంటి తవ్వకాలు జరపకున్న బయటకే కనిపిస్తుంటాయట. ఇవ్వాళ అయితే మల్లూరుకి వెళ్ళి అక్కడ నుంచి సర్వాయి వెళ్ళాలి అనేది ముందు అనుకున్న విషయం కనుక మల్లూరుతో మొదలయ్యాం.
పదిహేనేళ్ళక్రితం మల్లూరు హేమాచలనరసింహస్వామిక్షేత్రం సందర్శించినప్పుడు మొదటిసారి చింతామణి జలధార గురించి తెలిసింది. మల్లూరుగుట్ట అప్పుడు ఒకపురాతన మందిరంతో,చుట్టూ అడవితో,ఎక్కడో కథల్లో చెప్పుకున్నట్టుగా ఉండేది. చింతామణి మల్లూరుగుట్ట మీదనుంచికిందకుజారే సన్నని జలధార.ఎన్నో ఔషదీయవృక్షాల సత్తువ కలుపుకొని వస్తుందనీ, రోగాలు నయమవుతాయని నమ్మకంతో ఇక్కడికి వచ్చే ప్రతిఒక్కరూ ఈనీటిని తాగడమే కాకుండా తోచినన్ని నీళ్ళు తీసుకొనివెళ్తారు. చింతామణిఅన్న పేరు కాకతీయల పాలకురాలు రాణిరుద్రమ పెట్టారట. అక్కధార చెల్లెధార అని ఈ నీటి ధారలకున్న మరోపేరు. చింతామణిపేరుతో ఇతర రాష్ట్రాలలోకూడా జలపాతాలున్నాయి. చింతామణి అంటే నిజమైన అభరణపు రత్నమని కాదు, దానర్థం, చింతనకు అమూల్యమైనది అని, అంటే దేనిని అయితే ఆలోచించవలసి ఉందో అది అంతటి అమూల్యమైనది అని.బౌద్ధంలో భోధిసత్వుని కొన్నివిగ్రహాలచేతిలో ఉన్నది చింతామణి అంటారు కానీ దానర్థం నిజంగా భౌతికమైనది కాదు.చింతామణి, తత్వానికి చెందిన మాట.ఆదిశంకరుల వివేకచూడామణి అంటే వివేకులశిరోభూషణం వంటిదని ఎలా అర్థమో అలాగ.అది ఆధ్యాత్మిక పరుసవేది.కోరినది ఇచ్చేది.ఈ జలధారకు చింతామణి పేరు పెట్టడం,కోరిన ఆరోగ్యం ఇచ్చే అమూల్య జలమని భావన కావచ్చు.మల్లూరుగుట్ట కాకతీయుల సైనిక రక్షణ స్థావరం అని చరిత్ర చెబుతుంది. ఇప్పుడక్కడ అటువంటి ఆనవాళ్ళు కనిపించవు. మొత్తం రకరకాలైన మొక్కలతో ఉంటుంది. ఔషదీయ మొక్కలు ఎక్కువ. మల్లూరు గుట్టకు ప్రజలు వచ్చే కారణం దైవమూ, జలమూ.ఆనాడు మేము ఇక్కడికి ఔషద మొక్కల పరిరక్షణ ప్రాంతం (MPCA-Medicinal Plants Conservation Area)చూసేందుకు వచ్చాము.అది కొత్తగా మల్లూరుగుట్టను MPCAగా ప్రకటించిన తర్వాత ఎలా అభివృద్ధి చేశారో చూడాలని అనుకుని వచ్చింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపికచేసిన ఎనిమిది MPCAలలో ప్రస్తుత తెలంగాణకు చెందిన ఒకేఒక్కటి మల్లూరులో ఉంది, అది ప్రస్తుత ములుగుజిల్లాకు చెందినది.
ఔషదమొక్కల పరిరక్షణ ప్రాంతం (MPCA)లు, ఎక్కడికక్కడ ఔషద మొక్కలు సహజంగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసి వాటిని సంరక్షిస్తూనే వాటి ఉనికిని,వినియోగాన్ని రికార్డు చేయడం,ప్రజలలో అవగాహనను విస్తృతం చేయడంతో పాటు సహజ ఆవాసాలకు వెలుపల(ex-situ conservation)సంరక్షించేపద్దతులను పెంపొందించడంవంటి లక్ష్యాలతో ఏర్పాటుచేశారు. దీనికి బెంగళూరులో ఉన్న FRLHT నోడల్ సంస్థ.1993లో మొదలైన ఈసంస్థ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP)భాగస్వామ్యంలో దేశవ్యాప్తంగా 119MPCAలను ఏర్పాటుచేసింది.ఈసంధర్భంలో FRLHTగురించి కొంత చెప్పుకోవాలి. ఇంతకుముందు ఒకసారి బెంగుళూరులోని ఈకేంద్రాన్నిచూసే అవకాశం లభించింది.FRLHTఅంటే Foundation for Revitalization of Local Health Traditionsఅని వివరణ. అంటే స్థానిక ఆరోగ్య సంప్రదాయాలను పునరుజ్జీవనం చేసేందుకు మొదలైన సంస్థ. పద్మశ్రీ డా.దర్శన్ శంకర్, నాటి సాంకేతిక సలహాదారు శామ్ పిట్రోడాల ఆలోచనలోనుంచి పుట్టిన ఈసంస్థ మొదలుపెట్టిన కార్యక్రమాల్లో మొదటిది ఔషదమొక్కల పరిరక్షణనే.ప్రపంచవ్యాప్తంగా అత్యధికులకు చవకగా అందించగలిగిన సంప్రదాయ ఆరోగ్య పరిజ్ఞానాన్ని డాక్యుమెంటేషన్ చేసి ఎక్కువ మందికి ప్రయోజనాలు కల్పించడం ఈ ప్రణాళికాదార్శనికత. అటవీచట్టంప్రకారం నిర్వహించే జాతీయవనాలు, అభయారణ్యాలకు అదనంగా ఔషదమొక్కల పరిరక్షణకోసం చేయపట్టిన భారీ ఆవరాణంతర్గత సంరక్షణ కార్యక్రమం (in situ conservation programme)కూడా ఇదే.కనీసం రెండు వందలహెక్టార్లకు అంటే ఐదువందల ఎకరాలకు తగ్గకుండాఉండి స్థానికసమాజాలలో సంప్రదాయ ఆరోగ్యవిజ్ఞానం ఇంకా కొనసాగుతున్న ఔషదమొక్కల ప్రాంతాన్నిఈకార్యక్రమంకొరకు ఎంపికచేస్తారు.మల్లూరుMPCAను 197హెక్టార్ల విస్తీర్ణంతో 2000లో ప్రకటించారు.ఇలా ప్రకటించేవరకు ఇక్కడి వనరులకు ఇంత ప్రాచుర్యం లేదు.2009-2015వరకు చేసిన ఒకలెక్క ప్రకారం ఇక్కడ 95 కుటుంబాలకు చెందిన 470 వృక్షజాతులున్నాయని తేల్చారు. (Plant Wealth of a Sacred Grove: Mallur Gutta, Telanagana State, India : Sateesh sutharii et al).అయితే ఏటూరునాగారం పరిసర ప్రాంతాలలోని కోయలు, వారి జీవనంలో భాగమైన సంప్రదాయ ఔషదులు మల్లూరును MPCA గా ప్రకటికంచడాన్ని ప్రభావితం చేశాయని భావించవచ్చు. అయితే 2019లో ఈ MPCAల మీద జరిపిన సమీక్ష తర్వాత కొన్ని మినహాయింపులు వచ్చిచేరాయి. మల్లూరులో సదానందం అనేవ్యక్తి ఎన్నో ఔషదమొక్కలను గుర్తించగలడని,వాటి వినియోగం అతనికి తెలుసునని చెప్పారు కానీ నేనిప్పుడు వచ్చినకాలం కోవిడ్ కాలం. అందువల్ల స్థానికులనుంచి అనుకున్నంత సమాచారం సేకరించే అవకాశం లేకపోయింది.
FRLHTగురించి బాగా ప్రభావితమైన మరో అంశంఉంది.అది భారతదేశంలో లక్షవరకూ ఉన్నసంప్రదాయ వైద్య కృతులను(Traditional Medical Manuscripts)డిజిటలైస్ చేయడం. ఇప్పటికి దాదాపు 17000 మాన్యుస్క్రిప్ట్‌లను డీజిటలైస్ చేసినట్టు తెలుస్తున్నది.అంటే వైద్యవిజ్ఞానాన్ని తాళపత్రాలనుంచి డిజిటల్ రూపంలోకి మార్చడం అన్నమాట.ఇది ఎంత గొప్ప విషయంకదా. వైద్యకృతి అంటే మరేదో కాదు, మన ధన్వంతరి ఒక వైద్యకృతి,వృక్ష ఆయుర్వేదం ఒక వైద్యకృతి,ఇంకా యోగాలో చెప్పబడిన వివిధ భంగమలుకూడా దీనిలో భాగమే. మనకు తెలిసిన ఆయుర్వేదం, సిద్ద వైద్యం,జానపదుల వైద్యం,సంప్రదాయ వైద్యం, యునానీ, హోమియోపతి ఇంకా జనసమూహాలలో అలవాటులో ఉన్న అనేక విధాలైన వైద్యపరిజ్ఞానాన్ని ఆధునిక పరిశోధక వ్యాసాలకు ధీటుగా పరీక్షించడం,ప్రచురించడం,సమాచారం అందరికీ అందుబాటులో ఉండేవిధంగా చేయడంవంటివి. మనపెద్దలుచెప్పిన రాగిచెంబులో రాత్రి నీళ్ళుఉంచి ఉదయం తాగడంకూడా మన సంప్రదాయ వైద్యవిజ్ఞానంకిందకే వస్తుంది. ఒకసారి ఇటువంటివి సాంకేతికంగా భద్రపరచినాక వాటిని సమకాలీన పరిశోధనలతో పరీక్షించి అందించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా వైద్యకృతులను సేకరించడం, పరిరక్షించడం,అనైతిక వినియోగాన్ని, అనైతిక వ్యాపారాన్ని నియంత్రించడం వంటివి లక్ష్యాలు. FRLHT ఈపనిని 2006నుంచి ప్రారంభించింది.ఈ బృహత్ కార్యక్రమం పేరు National Mission for Medical Manuscripts. ఇంతకు ముందు భారత ప్రభుత్వం 2003లో భారతీయ కృతి సంపద – నమామి పేరుతో (National Mission for Manuscripts)మొదలు పెట్టింది. ఈ భారీ మిషన్‌ను చేపట్టడానికి పెద్ద కథే ఉంది.
మిసిసిపి మెడికల్ సెంటర్ అనే అమెరికా విశ్వవిధ్యాలయనికి చెందిన సోమన్ కె దాస్ , హరిహర్ కోహ్లీ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు,ఇద్దరూ భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలు,1993 డిసెంబర్28న యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ (USPTO)కార్యాలయానికి పొడిరూపంలో ఉన్న పసుపు పుండ్లను తగ్గించడంలో సహాయపడతుందని దీన్ని నోటిద్వారానూ ఇంకా పైపూత మందుగానూ వాడడం తాము కొత్తగా కనిపెట్టినవని చెప్తూ 6 పేటెంట్లను మంజూరు చేయవలసిందిగా దరఖాస్తు చేసుకున్నారు. పేటెంట్ అనేది ఒక కొత్త పరిశోధనకు ఆ పరిశోధన చేసిన వ్యక్తికి చెందిన ఆవిష్కరణగా గుర్తిస్తూ ఇచ్చే హక్కు. ఈ హక్కువల్ల ఆ పరిశోధనను ఇతరులు వ్యాపారంకోసంగానీ ఇతరత్రాగానీ ఆర్థిక ప్రయోజనాలు పొందకుండా,ఆ కొత్త ఆవిష్కరణ చేసిన వారికి ప్రయోజనం కలిగేలా చట్టపరమైన హక్కును కల్పిస్తుంది.ఇది కాపీరైట్ చట్టంలాంటిదే. కొంతకాలం తర్వాత పేటెంట్ గడువు తీరి ఎవరైనా ఆ ఆవిష్కరణను కొనసాగించే వీలుకలుగుతుంది. పసుపుకు చెందిన పేటెంట్ల విషయంలో ఇవి తమ కొత్త ఆవిష్కరణలని ఇద్దరు శాస్త్రవేత్తలు దరఖాస్తులో తెలిపారు.దీనికి స్పందిస్తూ యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ సంస్థ 1995లో వారు కోరినవిధంగా ఆరు పేటెంట్లను మజూరు చేసింది. ఈ విషయం బయటకు వచ్చినప్పుడు మన దేశంలో శాస్త్రీయ పరిశోధనలను నిర్వహించే ప్రధానసంస్థ సిఎస్ఐఆర్ అంటే శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధక మండలి, దీనిపై అభ్యంతరం తెలిపింది.పసుపుయొక్క వినియోగం భారతీయుల అనాది ఆచారమని,పసుపును ఆయుర్వేదంలో ఇతర సంప్రదాయ వైద్యవిధానాలలో వాడుకలో ఉన్నదేనని, పేటెంట్ లను మంజూరు చేయడం అనైతికమని తెలియజేశారు. అయితే దేనికైనా శాస్త్రీయమైన ఆధారాలు కావాలి. మన ఆయుర్వేదంలో పసుపు వాడకం గురించిఉంది కానీ దాని యొక్క సంశ్లేషణాలు, ప్రత్యేక పద్దతులు ఇతర సాంకేతిక వివరాలు ఆధునిక వివరాలకు తగినట్లుగా ఉండవు కదా, కనుక ఈ 6 పేటెంట్ అంశాలకు చెందిన శాస్త్రీయఆధారాలు సమర్పించవలసిన అగత్యం ఏర్పడింది. దీనికిగాను సిఎస్ఐఆర్ అప్పటి డైరెక్టర్ జనరల్ రగునాథ్ మషేల్కర్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలబృందం ఏర్పాటుచేయబడి,అప్పటివరకు సంస్కృతం, హిందీ,ఉర్దూవంటి వివిధభాషలలో ప్రచురించబడిన 32 పరిశోధకపత్రాలలోనూ 1953లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రచురించిన మరో పరిశోధకపత్రంలోనూ ఈ వివరాలను పరిశీలించి సమర్పించింది. వాటి ఆధారంగా పసుపును పుండ్లను తగ్గించడంకొరకు వాడటం విషయంలో కొత్తదనం ఏమీలేదని ఇది ఇంతకుముందే గుర్తించబడినదని కనుక 1995లో జారీ చేసిన పేటెంట్లను రద్దు చేయాలనీ కోరింది. దీనికోసం మనదేశం తరఫున వాదించడానికి న్యాయనిపుణులను ఏర్పాటు చేశారు. సాక్ష్యాలను పరిశీలించిన పేటెంట్ సంస్థ,తాము ఇదివరకు ప్రకటించిన ఆరు పేటెంట్లను ఉపసంహరించుకున్నట్టు ఆగస్టు13,1997న ప్రకటించింది.అయితే మన దేశం తరఫున వాదనలు వినిపించడానికి, సమాచారం సేకరించడానికి ఏడాదిపైగానే సమయం పట్టింది. భారతదేశం కేసు గెలిచినప్పటికీ ఈ పేటెంట్ ల విషయం మనదేశంలోనే కాదు అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న తృతీయ ప్రపంచదేశాల శాస్త్రీయ విజ్ఞానం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందో ఈ అంశం స్పష్టం చేసింది.
పసుపుమీదనే కాదు, బాస్మతిబియ్యం, క్రిమికీటకాలు రాకుండా వేపఆకుల్ని వాడటంవంటివికూడా పేటెంట్ కేసుల్లో ఉన్నాయి,అయితే పసుపువిషయంలో జరిగినట్టు వీటివిషయంలో జరగలేదు.వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సిఎస్ఐఆర్,మన సంప్రదాయంగావస్తున్న వైద్య,ఆరోగ్య,సాంకేతిక వైవిద్యాన్ని సంరక్షిస్తూ అనైతికవ్యాపారాన్ని,ఆయా అంశాలలో వాటిని కనిపెట్టిన వారికి సముచిత గౌరవాన్ని ఇవ్వడం కోసం జూన్, 2001లో ట్రెడిషనల్ నాలేడ్జ్ డిజిటల్ లైబ్రరిని (TKDC)ప్రారంభించింది. ఎంతోమంది జీవశాస్త్రజ్ఞులు,డిజిటల్ నిపుణులుకలిసి దీనిని నిర్వహిస్తున్నారు.దీనిని అంతర్జాతీయంగా పేటెంట్లను జారీ చేసే సంస్థలకు అనుసంధానం చేశారు. ఎవరైనా దరఖాస్తు చేసినప్పుడు ఈ ట్రెడిషనల్ నాలేడ్జ్ డిజిటల్ లైబ్రరిలో పరిశీలించి ముందుకు వెళ్ళవచ్చు. ఈ రకంగా మనవద్ద ఇప్పటికే నమోదైన సాంకేతికపరిజ్ఞానం సంరక్షించబడడమే కాకుండా విలువైన సమయం,వనరులు ఆదా అవుతాయి. ట్రెడిషనల్ నాలేడ్జ్ డిజిటల్ లైబ్రరిని ఆరోగ్య మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తుంది.అలాగే ఇతర సాంకృతిక అంశాలు,కళలు,ప్రత్యేక నైపుణ్యాలను,కృతులను పరిరక్షిస్తూ డిజిటలైస్ చేయడం కోసం నమామీ కార్యక్రమం,అలాగే వైద్య కృతుల పరరక్షణకు ఇందాక చెప్పినట్టు National Mission for Medical Manuscripts మొదలయ్యాయి. అంతేకాదు జీవ వైవిధ్య చట్టం -2002, భారతీయ పేటెంట్ చట్ట సవరణవంటి చర్యలు తీసుకున్నారు. ఇంకా స్థానికకళలకు,నైపుణ్యాలకు గుర్తింపును ఇస్తున్నారు.ఇవన్నీ మన సంప్రదాయవిజ్ఞానాన్ని కాపాడుకునేచర్యలే.ఇంతటి దూరదృష్టితో ఏర్పాటు చేయబడుతున్న ప్రణాళికలో మనం పనిచేసే ప్రాంతంఉండడం మరొక అదనపుబాధ్యతను గుర్తుచేస్తున్నట్టుగా ఉంది.మల్లూరులో అధికారికంగా కొత్తగా చేపట్టిన పనులైతే లేవు. MPCA అటవీశాఖ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబడినదే అయినప్పటికీ ఇంకా చేయవల్సింది ఎంతో మిగిలే ఉంది. తెలంగాణతో పోలిస్తే మిగిలిన రాష్ట్రాలలో ముఖ్యంగా కేరళ, ఒడిష, కర్ణాటకల్లో MPCAలను బాగా అభివృద్ధి చేశారు. వాటి సంఖ్యకూడా అక్కడ ఎక్కువ. ఒకవేళ మనరాష్ట్రంలో భవిష్యత్తులోనైనా MPCAలను విస్తరించగలిగితే అమ్రాబాద్ అడవుల్లోనూ, ఎలగందల్ గుట్టమీదనో, భద్రాచలం ఆడవుల్లోనూ చేయవచ్చునని నాకో అంచనా.
సంప్రదాయవిజ్ఞానమేకాదు ఇంకా అనేక సాంస్కృతిక అంశాల యొక్క ప్రాధాన్యతను,చరిత్రను, మానవ వికాసాన్ని ప్రభావితంచేసి ప్రపంచ మానవసమాజం స్మృతిలోఉన్న మహత్తరమైన అంశాలను సమస్త మానవాళికోసం జాగ్రత్తచేయాలని మెమరీ ఆఫ్ ద వరల్డ్ ప్రాజెక్టు పేరుతో ప్రపంచ స్మృతులను భద్రపరిచే కార్యక్రమం చేపట్టింది ఐక్య రాజ్య సమితికి చెందిన యునెస్కో సంస్థ. మనం నమామి కార్యక్రమం మొదలు పెట్టడానికి దశాబ్దం ముందే అంటే 1992 నుంచే మొదలైన ఈ కార్యక్రమం ఎన్నో చారిత్రక అంశాలను రికార్డు చేసింది. అంటే మానవత్వ వారసత్వం అన్నమాట. మనదేశపు పురాకృతి ఋగ్వేదాన్ని , భారతీయ కృతి కార్యక్రమం అదే నమామి మెమరీ ఆఫ్ ద వరల్డ్ ప్రాజెక్టులో నమోదు చేయడం కోసం అందజేస్తే యునెస్కో “వేద మంత్రోచ్ఛారణ సంప్రదాయాన్ని”2003 లో “ మానవత్వ వారసత్వం” గా గుర్తించింది. భారతదేశంనుంచి మొదటి మానవత్వవారసత్వంగా గుర్తింపు పొందింది ఇదే. ఏమైనా ప్రపంచం అంతా దేశాల మధ్య సంఘర్షణను వదిలి తమ ప్రయాణాన్ని,వారసత్వం తరచి చూసుకోవడం, భద్రపరచుకోవడం గొప్ప విషయం.ఇంకాకోల్పోయినవి మరుగునపడినవి, లిపి లేక, కొనసాగక అంతరించినవి, అంతరించడానికి అంచున ఉన్నవి ఎన్నో ఉన్నాయి. కొద్దిగా ప్రయత్నంచేసినా మనం వాటిని రక్షించి మానవత్వ సంపదను పరిపుష్టం చేయవచ్చు.
మల్లూరునుంచి సర్వాయి అనుకున్నాంగానీ చింతామణి వరకే వెళ్ళాం,కొన్ని నీళ్ళుతాగి,వెంటఉన్న సీసాలో నింపుకొని బయలుదేరాం. కొండపైకి వెళ్ళడం కుదరలేదు.ఎండబాగా పెరిగిపోవడం వల్ల సర్వాయివైపు వెళ్లిపోయాము. చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి అన్నట్టు చిక్కటి అడవే. అయితే భారీ టేకువృక్షాలు లేవు. అవి ఎప్పుడో తరలించబడ్డాయి. ఉన్నకొన్ని మధ్యస్థంగా ఉండేవి. ఎదుగుతున్నవి మాత్రం ఉన్నాయి. టేకుతో బాగా కనిపించే చెట్టు నల్లమద్ది. నల్లమద్ది బెరడు మొసలిచర్మంలా ఉంటుంది. కొన్ని చెట్లు మరికొన్నిచెట్లతో కలిసి పెరుగుతాయి. వాటిని Associated Sps అంటారు. మనం అనుబంధజాతులు అనుకోవచ్చు. కొన్ని జాతులు మరికొన్ని జాతులతో కలిసి పెరుగుతాయి, మరికొన్ని వాటికి ప్రత్యేకమైన జాతులతో మాత్రమే కలిసి పెరుగుతాయి. వాటి నుంచి దూరంగా పెంచినప్పుడు బతకలేవు. ఉదాహరణకు మధ్య భారతంనుంచి కనిపించే సాలవృక్షాలు ఒంటరిగా పెగలేవని ప్రయోగాలు నిరూపించాయి. మన రాష్ట్రంలో టేకువృక్షాలతో పాటు కనిపించే వృక్షాలలో నల్లమద్ది ఒకటి.వీటితో పాటు ఇప్ప, పెద్దయేగిస,యేరుమద్ది,బండారు,మోదుగ,రేల వంటివి కనిపిస్తాయి.అడవిలోపలికి వెళ్తున్నప్పుడు అక్కడక్కడా నిండుగా పూచిన మోదుగలు,రేలచెట్లు భూమికి పసుపు కుంకుమల బొట్లు పెట్టినట్టు కనిపిస్తున్నాయి. ఎర్రటి ఎండ,గుయ్యిమన్న శబ్దం, కొన్ని ఎండినచెట్లు , కొన్ని చిగురిస్తున్నచెట్లు , కొన్ని పూత పట్టిన చెట్లు, ఋతువుల కళలు వరస కట్టినట్టున్నాయి. మధ్యమధ్యన చిన్నచిన్న పల్లెలు, దడికట్టిన మట్టి ఇండ్లు, పక్కన పశువులకోసం కట్టినదడులు. ఏటూరునాగారం వస్తున్నానని అనుకున్నప్పుడు ఇక్కడ అడవి కదా, పాలుపెరుగుబాగా దొరకుతుందని అనుకున్నాను,కానీ వచ్చాక తెలిసింది,ఇక్కడ ఆవులనుంచి పాలు ఎవరూతీయరని!ఇంటికిన్ని పశువులుంటాయి.అడవిలో మేసివస్తాయి.దడిలో నివసిస్తాయి.వ్యవసాయమా అంతంత మాత్రం,మరి పాలు తీయకుండా వీటిని ఏంచేస్తారో అనుకుంటే వీటిని నగరాలకు కోతకోసం తరలిస్తారని తెలిసి ఆశ్చర్యపోయాను. పశువుల వారపు సంత అయితే చూడలేదు కానీ ఇదీ తెలుసుకున్నది.
మట్టిఇండ్లు కట్టడంలో ఇక్కడకి మిగిలిన తెలంగాణ మట్టిఇండ్లకు తేడాఉంది. ఇక్కడ ముందు పొరకనో, వెదురు తడకలో చేసి, వాటిని గదుల్లా నిలబెట్టి తరువాత పెండ,మెత్తని మట్టి కలిపి పూత పూసి ఆరాక ఎర్రమట్టితో అలికి లేకపోతే పెండతోనే అలికి ముగ్గులుపెడతారు.గోడమందం నాలుగుఇంచులకు మించదు. పైనకప్పుకూడా బలమైనదికాదు, మొగురాలు, దూలాలువంటివి బలమైనవి కాదు. పైకప్పు పెంకులు వాడటం అరుదు. కొంతకాలం ఇందులో ఉన్నాక మళ్ళీ అవసరాన్నిబట్టి మళ్ళీకడతారు.ఇలా కట్టిన ఇండ్లు తాత్కాలికమైనవే.ఇతర తెలంగాణపల్లెల్లో అయితే మట్టిని బాగాకలిపి పెద్దపెద్ద ముద్దలుగా పేర్చి గోడలుగా కడతారు.గోడ మందం తొమ్మిదినుంచి పన్నెండుఇంచులకు తగ్గదు,లోపల మొగురాలు, దూలాలు బలమైనవి. పేరుకే మట్టిఇండ్లు గానీ ధృడమైనవి. ముగ్గులు,అలంకరణలు తక్కువ. కొంచం పెద్దగ్రామాల్లో ఎర్రమట్టి గోడలకు అలకడం ఉండదు ఒకవేళ ఉన్నా కుటుంబఆచారంగాకూడా అలంకరణలుంటాయి.అయితే స్పష్టంగా గుర్తించిన మరోఅంశం మొట్లతో దడికట్టడం. అడవి దగ్గరగా ఉండడంవల్ల ఇక్కడివారంతా నల్లమద్ది గుంజలను, ఇంకా ఇతర వృక్షాల గుంజలను తెచ్చి కట్టుకున్నారు. ఇంటికి వందకు తక్కువకాకుండా గుంజలు ఒకదాని పక్కన ఒకటి నిలబెట్టి గుంజలతోనే దడిచేసారు. కొంచం పెద్దదడికి రెండువందల పైనే గుంజలు ఉండవచ్చు, అంత దగ్గరగా గుంజలు పాతారు. ఈ గుంజల దడి కూడా ఎక్కువ రోజులు ఉండేది కాదు. అయినా వీరికి ఇలా అలవాటైన వ్యవహారం కావచ్చు.
ఇక్కడ పల్లెలను పరిశీలిస్తూ సర్వాయిలోపలికి వెళ్ళాము. ఎంతో దూరం నడిచాకగానీ మేము వెళ్లాలని అనుకున్న చోటికి చేరలేదు.అక్కడక్కడా రాళ్ళు తేలిన నల్లమట్టి, చిందరవందర చెట్లు,ముందు తెలిసినట్టే శిలాజాల ముక్కలు పైపైననే ఉన్నాయి. బీర్బల్ సాహ్ని ఇన్స్టి ట్యూట్ ఆఫ్ పేలియో సైన్స్స్ అని శిలాజ అవశేషాల మీద పరిశోధనలు చేసే సంస్థ లక్నోలో ఉంటుంది. వారికి తగిన సమాచారం ఇస్తే ఇటువంటి వృక్ష శిలాజాలమీద పరిశోదనలు చేస్తారు. ఈసమాచారం వివిధ భూభాగాల భూ భౌతిక నేపథ్యాలను పరిశీలించడానికి,పరిశోధించడానికి,పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది.మన కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరి అంటే భూఖండచలన సిద్దాంతాన్ని బలపరచడానికి ఇటువంటి జీవశిలాజఆధారాలు ఎంతో ఉపయోగపడతాయి. పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవడంలోకూడా వీటి ఉపయోగం ఉంటుంది.ఒకవేళ ఇటువంటి శిలాజ ప్రాంతాలు మానవాళి పరిణామంలో గొప్పవని తేలితే అది మనఅడవికి మరింత గొప్పదనాన్ని తెస్తుంది.ఇవన్నీ గమనిస్తే ఇక్కడ చేయవల్సింది చాలా ఉందని అనిపించింది. ఒకటి శిలాజాల పరిశోధనలు ముందుకు తీసుకువెళ్ళడం, ఇక్కడి ప్రజల పురాజీవన విధానాన్ని రికార్డుచేయడం, వాటిలోనుంచి ప్రస్తుత అటవీపునరుజ్జీవనంలో (Forest Regeneration) వారి సంప్రదాయ అలవాట్ల స్థానంలో మెరుగైన నూతన విధానాలను ప్రతిక్షేపించడం వంటివి ఇప్పటికిప్పుడు మొదలుపెట్టవల్సినవి అనిపించింది.
మేమలా ముందుకు వెళ్ళినప్పుడు మిట్టమధ్యాహ్నం వేళకు మరో అద్భుతమైన విషయం కనిపించింది. సూర్యుని కాంతికి నీలాకాశం తేజోవంతమైన నీలిరంగులో ఉండగా రెండు పెద్ద నల్లమద్దిచెట్లు ఒకదానికి ఒకటి ఒకవంతెన కట్టుకున్నాయి. దీన్నినిజంగా చూడగలగని ఎప్పుడూ అనుకోలేదు. అంటే రెండు పక్కపక్కనేఉన్న చెట్లు ఒకబొడిపెలాంటి నిర్మాణంతో కలిసిఉండడం. ఒక్కోసారి అది బొడిపెలాగానూ వంతెనలాగానూ ఉంటుంది.శాస్త్రీయంగా ఇనాస్కులేషన్ ( inosculation) అని అంటారు. లాటిన్ భాషకు చెందిన ఈ పదానికి ముద్దు పెట్టుకోవడమనే అర్థం ఉంది.విదేశాలలో ఇలాటి చెట్లను వివాహితులుగా గుర్తించే సంప్రదాయమూ ఉంది. చెట్ల ఈకలయికమీద కథలుకూడా ఉన్నాయి.మనవద్ద ఏమైనా జానపద కథలు ఉన్నాయేమో చూడాలి. ఇలాంటి చెట్లు విడివిడిగానే పెరగినా కొంత కాలానికి పక్క చెట్లతో లేక గాలివల్లనో ఏదైనా కారణం వల్ల గాయాలై వాటి యొక్క విభజనకణజాలం కలిసిపోయినప్పుడో పెరిగిన భాగం ఒక వంతెనగా ఏర్పడుతుంది. సహజంగా ఈపని జరగడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది.ఒకే జాతికి చెందిన వృక్షాల మధ్య ఇది సాధారణంగా జరుగుతుంది. ఇలాజరిగిన చెట్లమధ్య ఆహారమూ, నీటి సరఫరా ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది. ఒకే చెట్టుకు చెందిన రెండు శాఖలలో కూడా ఇది జరగవచ్చు. మేము తిరిగినంత సేపు ఇటువంటి చెట్లను రెండు మూడింటిని గమనించాము.
భూమిలోపల వేర్లకన్నా సూక్ష్మజీవులదే ఎక్కవ పాత్ర. ఖనిజ లవణాలు,నీరు అందించడంలో ముఖ్యంగా శిలీంధ్రాలదే ముఖ్యపాత్ర.వాసక్యులర్ ఆర్బేస్క్యూలార్ మైకోరైజా(VAM Fungi)అనే శిలీంధ్రాలు ఒక తొడుగులా వేర్ల చుట్టూఉండి అన్నిటినీ కలిపి ఉంచుతాయి. ఈశీలీంద్రాల బలమైన ఎంజైములు మొక్కలకు కావలసిన లవణాలను కరిగించి ఇస్తే మొక్కలు వాటికి కావలసిన గ్లూకోజులాంటి బలాన్ని ఇస్తాయి. VAMశిలీంధ్రాలగురించి డిగ్రీ చదువుతున్నప్పుడు తెలుసుకున్నానుగానీ అటవీశాఖలో పని చేస్తున్నప్పుడే దానియొక్క అసలు విలువ అర్థం చేసుకోగలిగాను. చాలా చోట్ల అసలు ఏమాత్రం బతకడానికి అవకాశంలేనిచోట్లకూడా మొక్కలు వృక్షాలుగా మనగలుగుతున్నాయంటే ఈసూక్ష్మజీవులే కారణం. ఆల్బర్ట్ ఫ్రాంక్ అనే జర్మన్ శాస్త్రవేత్త ట్రఫెల్స్(Truffels) అనే ఒకరకమైన పుట్టగొడుగుల్లాంటివాటిని ఎలా పెంచగలమో తెలుసుకోవాలని చేసిన ప్రయత్నంలో యాదృచ్ఛికంగా వృక్షాలని ఆశ్రయించి పెరిగే శిలీంధ్రాలను కనుక్కుంటాడు. ట్రఫెల్స్, 17,18వ శతాబ్దాలలో జర్మనీ, ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాలలో బాగా డిమాండ్ ఉన్నటువంటి తిండి పదార్థం. దీనిని మోజార్ట్ ఆఫ్ మష్రూమ్స్ అంటే అత్యంత విలువైనవని పేరుఉంది. ఇది అప్పటికాలంలో ధనవంతులు తీసుకునే ఒక ఆహార పదార్థం. మన భారతదేశంలోనైతే హిమాలయ పరిసర ప్రాంతాల్లో పెరుగుతాయి. 1880లో అప్పటి జర్మనీ ప్రభువు విల్ హెల్మె-I వీటిని ఎలా సాగు చేయగలమో తెలుసుకోవాలని ఫ్రాంక్ ని పురమాయిస్తాడు. ఈ ప్రత్యేక శిలీంద్రం కొన్ని చెట్లవేర్ల మీదనే ఆశ్రయించి పెరుగుతుంది.ఫ్రాంక్ తన పరిశోదనల్లో విజయం సాధించలేకపోయినా మైకోరైజాను మాత్రం ఆవిష్కరించగలిగాడు. మైకో అంటే శిలీంద్రమనీ, రైజా అంటే వేర్లని మొత్తంగా వేర్లను ఆశ్రయించిఉండే శిలీంద్రమని అర్థం. అతని పరిశోధనలను గౌరవిస్తూ వేరుబొడిపెలలో ఉండే ఒకబాక్టీరియాకు ఫ్రాంకియా అనేపేరుపెట్టారు. ఇప్పటికీ ఈ ట్రఫెల్స్ని బయట ఎలా పెంచాలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
భూమిమీద యేజీవికి అయినా అత్యంత అవరమైన మూలకాలు నత్రజని,భాస్వరంవంటివి,వాతావరణంలో విస్తారంగా ఉన్నాసరే మొక్కలు ప్రత్యక్షంగా స్వీకరించే స్థితిలో ఉండవు.ఇతర మూలకాలతోకలిపి సంక్లిష్టాలుగాఉంటాయి. వీటిని సరళపదార్థాలుగా మార్చగలిగితేనే మొక్కలు స్వీకరించే స్థితిలోకివస్తాయి. మొక్కలు తాముగా ఆపని చేయాలంటే చాలా శక్తికావాలి. కనుక శిలీంధ్రాలవంటి సూక్ష్మజీవుల సహాయంతో సరళపదార్థాలుగా మారాక స్వీకరిస్తాయి. ప్రతిగా శిలీంద్రాలకు కావలసిన శక్తి అందుతుంది.అంతటి సహజీవనమన్నమాట. భూమిపైనమాత్రం అప్పుడప్పుడు ఇందాక చెప్పిన చమత్కారాలు చేస్తుంటాయి.ఇంతటి సహజీవనం ఉంటుంది కనుకనే అటవీవృక్షాలు సాధారణంగా విడిగా పెరగవు.శిలీంధ్రాలుకాకుండా భూమిలోపల వేర్లన్నీ కలిసిపోయి వుడ్ వైడ్ వెబ్ ను ఏర్పరుస్తాయన్న సిద్ధాంతంఉంది. సుజన్నే సిమార్డ్ అనే అతను ఈ వుడ్ వైడ్ వెబ్ మొదటిసారి ప్రతిపాదించాడు. కానీ దీనిమీద శాస్త్రవేత్తల్లో భిన్నమైన అభిప్రాయాలున్నాయి.
ఏటూరునాగారం రావడానికిముందు వృక్షాలజీవనంమీద జర్మనీకి చెందిన పీటర్ వోలెబెన్ రాసిన The Hidden Life of Trees, The Secrete Wisdome of Nature పుస్తకాలు తెప్పించి చదివాను. 2016లోవచ్చిన The Hidden Life of Trees పుస్తకం అతనికి బాగాప్రాచుర్యం తెచ్చిపెట్టింది.పీటర్ ఈపుస్తకంలో వృక్షాలు ఎలా ఒకటినొకటి సమాచారం ఇచ్చి పుచ్చుకుంటాయని వారు తెలుసుకుని ఆపాదించిన అంశాలు అందులో రాశాడు. మైకోరైజా గురించి, వుడ్ వైడ్ వెబ్ గురించి, మొక్కలను జంతువులు తినడానికి వచ్చినప్పుడు మొక్కలు విడుదల చేసే జీవరసాయానాల గురించి రాశాడు.చదవడానికి బాగున్నా శాస్త్రీయతకు లోబడిన వివరాలేనా అనే అనుమానం కలుగుతుంది. అయితే పెంగ్విన్ వారు ముద్రించి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేయబడిన ఈపుస్తకంలో ప్రదీప్ క్రిషేన్ రాసిన ముందుమాట నాకెంతో విస్మయాన్ని కలిగించింది. భారతదేశంలోని అటవీవనరుల వివరాలునమోదు చేయగలిగినా , ఆవరణవ్యస్థల సంబంధాలను ఆవిష్కరించ లేకపోయిందని అటవీశాఖనే దీనికి ప్రధాననేరస్థురాలని,ఏదేనా నేర్చుకోవడానికిగానీ నేర్పడానికిగానీ ఇది దూరంగా ఉందని, ఇంకా అటవీశాఖస్వతంత్ర శాస్త్రీయనిర్వహణలు అపఖ్యాతి పాలయ్యాయని ఇది చాలా సిగ్గుపడవలసిన విషయమని రాశారు. ఒక విదేశీవ్యక్తి ముద్రించిన పుస్తకంలో మనదేశ అటవీశాఖ పనితీరుని, మనదేశస్తుడే అంతలా విమర్శిస్తూ రాయడం సాహసమనే చెప్పాలి. దీన్ని ఎవరూ గమనించలేదో, గమనించినా మనకెందుకని వదిలేశారో తెలియదు కానీ ఎక్కడా అతని వ్యాఖ్యలను ఖండిస్తూవచ్చిన సమీక్షలను నేనైతే చదవలేదు.ఇది దేశం యొక్క శాస్త్రీయ సుసంపన్నతను తక్కువ చేయడమే. నామటుకు ప్రదీప్ క్రిషేన్ భారతీయ అటవీశాఖప్రస్తానాన్ని అర్థంచేసుకోలేదనే అంటాను.
ప్రపంచానికి నవీనఅటవీశాస్త్ర అధ్యయనంలో జర్మనీ, ఫ్రాన్స్ ముందున్నట్టు కనిపిస్తాయి కానీ ఒకసారి మన చరిత్రను తిరగేస్తే ఎన్నో అద్భుతమైన సాంకేతిక అంశాలున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది.రామాయణంలో అరణ్యకాండ, మహాభారతంలోని వనపర్వం, కౌటిల్యుని అర్థశాస్త్రం,అశోకుని అటవీపాలన,ఇంకా వివిధస్మృతుల్లో అటవీనిర్వహణమీద ఇచ్చిన వివరణలు ఎంతో విలువైనవి. అన్నిటికీమించి వృక్షాలకు తగిన పేర్లు పెట్టడంలో అద్భుతమయిన ప్రజ్ఞకు కారణం ఆనాటికే మనవద్ద ఉన్న సాంకేతికపరిజ్ఞానమే అన్న విషయం గుర్తుంచుకోవాలి.మరీముఖ్యంగా భారతీయపరిపాలకులు తాము ఏర్పరచిన అడవులకు ప్రత్యేకవిధానాన్ని,మొక్కలను ఎన్నుకున్నారని గుర్తించాలి. ఋగ్వేదదేవత ఇంద్రుని నందనవనం, రావణుని అశోక వనం,కృష్ణుని బృందావనం, బుద్ధుని జన్మస్థలం లుంబినీవనం ఇంకా ఎన్నో. ప్రతీ పౌరాణికపాత్రకూ ఒకవనం కేటాయించబడిన అంశమూ గమనించదగినదే.వనం అంటే మానవ ప్రయోజనం ఆశించి పెంచే వృక్షసముదాయం. దీనికి భిన్నంగా అరణ్యం అనేది సహజమైనఅడవి. అంటే వనాలని పేరు పెట్టబడినవన్నీ ఎంతో కొంత మానవ నిర్వహణకు వచ్చినవే. రామాయణంనాటికే వనపాలకుని పాత్ర నిశ్చయంగా ఉంది. సాహిత్యపరమైన ఆధారాలను, వివిధ రాజ్యాలపాలకుల అనుసరించిన విధానాలను దూరదృష్టవశాత్తూ నవీన అటవీనిర్వహణలో చేర్చలేకపోయాం. భారత అటవీపరిశోధనాసంస్థ బ్రిటిష్ కాలంలో ఏర్పడింది.కనుక బ్రిటిష్వారితోనే అటవీనిర్వహణ మొదలైందని అనుకోవడం సమంజసంకాదు. అటవీశాఖకు దోషాన్ని ఆపాదించడమూ సమంజసం కాదు. నిజానికి మనదేశంలో ప్రభుత్వం తరఫున ఏర్పాటయిన అటవీశాఖ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ అవసరాలకోసం ఏర్పాటు చేయబడిందేతప్ప శాస్త్రీయనిర్వహణకోసం కాదు.అడవులనుంచి కేవలం కలపనుపొందడమే లక్ష్యంగా ఫలసాయ పట్టికలు(Yield Tables)రూపొందించడం,వనరులను స్థానికప్రజలనుంచి దూరంగా ఉంచడంవంటివి జరిగాయి. ఆనాటి అటవీశాఖనిర్వాకంవల్ల జరిగిన పుల్లరిఉద్యమాలు,ఆదివాసీ అస్తత్వఉద్యమాలు మనం మరువలేనివి. మన తెలుగురాష్ట్రాల్లోనూ నాటి అటవీయాజమాన్యంమీద జరిగిన రంప తిరుగుబాటు, కొమురం భీమ్ తిరుగుబాట్లను మర్చిపోలేము.
జర్మనీ 17వశతాబ్ధంలో శాస్త్రీయఅటవీఅధ్యయనం మొదలుపెడితే,భారతదేశంలో అది కేవలం డెబ్బైఏళ్లుగామాత్రమే స్వతంత్రంగా మొదలైంది.సంప్రదాయ నిర్వహణాజ్ఞానం నిర్లక్ష్యం చేయబడింది బ్రిటిష్ హయాములోనే. బ్రిటిష్ఇండియాఅటవీ నిర్వహణప్రయోజనం వేరు, స్వాతంత్ర్యభారతఅటవీ నిర్వహణప్రయోజనాలు వేరు.భారతదేశం కేవలం డెబ్భైఏళ్ల ప్రయాణంలో ప్రపమచంతో పోటీపడి ఎన్నో గొప్పవిధాననిర్ణయాలు తీసుకుంది.వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా , జీవ వైవిధ్య పరిశోదక సంస్థ వంటి ప్రఖ్యాతసంస్థలు ఏర్పరచింది. ప్రాజెక్టు టైగర్ , ప్రాజెక్టు ఎలిఫెంట్, ప్రాజెక్టు క్రోకడైల్,డాల్ఫిన్ సంరక్షణవంటి ప్రత్యేకకార్యక్రమాలు, ఆవరణ వ్యవస్థల పరిరక్షణ కోసం బయోస్పియర్ రిజర్వులను, జాతీయవనాలు,అభయారణ్యాలకొరకు చట్ట పరమైన ఆరక్షణలు, అడవి అంటిపెట్టుకున్న ఆదిమ సమాజాల బాగోగులకోసం, భద్రతకోసం అటవీహక్కుచట్టంవంటి విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంది.అటవీ సంరక్షణలో మానవ వనరులకు శిక్షణ కోసం ప్రత్యేక కళాశాలలను, పరిశోధనలను విస్తృతం చేసింది. అనేక పరిమితుల మధ్య అటవీశాఖ దేశ సహజవనరుల్ని కాపాడడంలో అంకితమై ఉంది.అయితే మన పురాతన సాంకేతిక విజ్ఞానాన్ని విస్మరించామని ఇప్పటికైనా నవీన అవసరాలకు తగినవిధంగా దాన్ని పునఃస్వాగతించాలని సంకల్పంమాత్రం చేయాల్సివుంది.వైవిధ్యమైన జీవ,భౌతిక,సామాజిక పరిస్థితులున్నమనఅడవుల్ని కాపాడుకుంటూ,మానవవనరులకుతగిన అవసరాలు చూస్తూ,పారిశ్రామిక పురోగతిని నియంత్రిస్తూ సాంకేతకంగాపరిపుష్టం చేయాలంటే మరికొంత సమయమైతే తప్పనిసరి.ఇవేవీ గమనించకుండా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండే పుస్తకంలో ముందుమాటలోనే మనదేశప్రణాళికలను,పనితనాన్ని తూలనాడటం సమంజసం కాదు.
సర్వాయి అడవులలోంచి బయటపడి,వచ్చేటప్పుడు చిన్నగా చేతిలో పట్టగలిగిన నాలుగైదు శిలాజాలని తాడ్వాయిలో పర్యావరణవిద్యామందిరంలో ఉంచడంవల్ల అక్కడకివచ్చే సందర్శకులకు అవగాహనకోసం పనికివస్తుందని నాతోపాటు తెచ్చాను.ఎక్కువగా పిల్లలు వస్తుంటారు కనుక వారికి ఇది ఉపయోగపడుతుంది.అలాగే ఇనాస్కులేటెడ్ ట్రీస్ అంటే రెండు కాండాలు కలిసిపోయిన నల్లమద్దిచెట్లను ఫోటోలు తీసినవికూడాఉన్నాయి.వీటినికూడా అడవులలో జరిగే చమత్కారాల పేరుతో ప్రదర్శనగా ఉంచవచ్చని అనిపించింది. పిల్లలకి ఎంత నేర్పగలిగితే భవిష్యత్తులో అంత సంరక్షణ వారినుంచి ఆశించవచ్చు.
సాయంత్రంవేళ ఇంతకుముందు కలిసిన కామారం,బిర్సాముండా యువజనసంఘానికిచెందిన యువకులు వచ్చారు. నిన్న సాయంత్రం ఆఫీస్‌లో కలిసి బీడీఆకు కాంట్రాక్టర్లు అడవికి నిప్పు పెడుతున్నారని దానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నో స్థానిక విషయాలు చెప్పారు.తప్పక చర్యలు తీసుకోగలమని హామీ ఇచ్చి బెట్టుఉడతతావులు తెలిసనవారు వారిగ్రామంలో ఉన్నారా అని విచారిస్తే ఒక పెద్దాయన ఉన్నారనీ వారికి బెట్టుడతల మీద చాలా అవగాహన ఉందనీ వీలైతే కలవడానికి ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. బెట్టు ఉడతల తావులు గుర్తించి వాటి దినసరి ఆహారంలో ఉండే మొక్కలు, విత్తనల వంటి వివరాలు సేకరిస్తే ఆయా మొక్కలు పెంచడానికి తగిన ఏర్పాట్లుచేయవచ్చు. కోయలు బెట్టుఉడతలను వేటాడతారని , తింటారనీ విన్నాను. వేట అయితే ఉందన్నారుగానీ ఎక్కడఎలా అని ఒక్కకేసు నమోదుచేసిన వివరాలైతేలేవు. విన్న విషయాలే ఇవి. మాటల్లో ఏటూరునాగారానికి చెందినకోయ యువకులంతా కలిసి బిర్సాముండా యువజన, ఉద్యోగసంఘంగా ఏర్పడిన క్రమం గురించి చెప్పారు.వారి సంఘం తరఫున తమసంస్కృతిని,ఆచారవ్యవహారాలని కాపాడుకోవడం కోసం, తమ అస్తిత్వ వికాసాన్ని ఇండీజీనస్ నాలెడ్జ్ ఆఫ్ ది కోయతూర్ ఆఫ్ కామారం అని పుస్తకం వేశామనీ చెప్పారు. నాకు ఒక కాపీ ఇవ్వగలరా అని అడిగితే ఆ పుస్తకం ఒకటి తీసుకొని ఇప్పుడు కలవడానికి వచ్చారు. గొప్ప సంతోషంతో ఆ పుస్తకాన్ని తీసుకొని కృతజ్ఞతలుచెప్పి వారు కోరిన విషయాలకు హామీ మరోసారి ఇచ్చి పంపాను. వారు కూడా ఆ పుస్తకం నాకివ్వడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇండిజీనస్ నాలెడ్జ్ ఆఫ్ ది కోయతూర్ ఆఫ్ కామారం అనేక విధాలుగా విప్లవాత్మకమైనదని రాత్రి చదివినప్పుడు అనిపించింది. ఒక పురాతనజాతి తనఅస్తిత్వాన్నితానే రాసుకుంది.తనపుట్టుక,చరిత్ర, అలవాట్లు, నమ్మకాలు, విశ్వాసాలు, ఆటలు, పాటలు, విజ్ఞానం, విలవలూ ఒకటేమిటి తనను తానే స్పృశించుకున్న చెట్టులా అది మానవజాతి ప్రస్థాన చరిత్రలో ప్రస్పుటమైన ముద్ర మన ముందు నిలబడ్డట్టు అనిపించింది. గోపీనాథ మహంతి తన అమృతసంతానంలో ఇవే రాశాడు. తమ ప్రపంచంలో తాముంటూ తమకుతామే ఆవరణవ్యవస్థగామారిన మానవసమూహం ఆదిమం కాదని మానవ వికాస పరిణామంలో స్వతంత్రంగా వెలిగే మిణుగురులని రాశాడు.అటువంటి ఒక మిణుగురు వెలుగు నేనీరోజు చూశాను. ఈ రాత్రి భావి భారత శాస్త్రీయ వికాసం పట్ల నాకున్న కలలకు మరొక మెరుపు జత చేసింది.
ఇండిజీనస్ నాలెడ్జ్ ఆఫ్ ది కోయతూర్ ఆఫ్ కామారం పట్ల అంతటి భావోద్వేగం కలగడానికి కారణాలలో ఒకటి లిపి లేని వారి భాషకు ఇప్పటికైనా ఒక లిపిని ఆధారం చేసుకొని తమ చరిత్రను తామే రాసుకోవడం, ఇది మరెన్నో లిపిలేని భాషా సమాజాలకు మార్గదర్శిగా నిలబడుతుందని చెప్పడంలో సందేహం ఏమీలేదు. ఇంకా సాంకేతిక అంశాలను జోడించడం, ఇవి కొత్త ఆవిష్కరణలుగా ఇప్పటికైనా ప్రపంచం ముందుకు వస్తాయని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. పసుపు విషయంలో చూసాము ,మనకు ఎంతటి చిన్నవిషయమైన ప్రపంచవిఫణిలో దాని ప్రభావం ఎటువంటిదో. యునెస్కోవంటి సంస్థ మెమొరీ ఆఫ్ ది వరల్డ్ అని మొదలుపెట్టింది గానీ మనదేశంలో మెమొరీ ఆఫ్ ది కమ్యూనిటీ అని మొదలు పెట్టాలి. ఒక్కోమానవ సమూహంలో ఎన్ని సమూహ జ్ఞాపకాలు, ఎంత సాంకేతిక, ఎంత సంప్రదాయ విజ్ఞానం ! అలా చూస్తే ఈ పుస్తకం మెమొరీ ఆఫ్ ది కమ్యూనిటీ అంటే నిర్దిష్ట మానవ సమూహ జ్ఞాపకాలను ఇప్పటికైనా రచించుకోవాలని సూచించే మహత్తరమైన ఆలోచన. అది వడ్రంగి కర్రను కోయడంలో వాడే పనిమొట్టు కావచ్చు, వెదురు బద్దలు చీల్చే కొడవలి కావచ్చు, స్వర్ణ కారుని పట్టకారు కావచ్చు,సాలె వారి మగ్గం నెమలి ముద్ర అచ్చులు కావచ్చు, కామెర్లు రాకుండా నాటు వైద్యుడు ఇచ్చే ఆముదం చిగురులో కలిపిన పచ్చివెన్నముద్ద కావచ్చు అన్నీ ఎంతోవిలువైన ఆవిష్కరణలే.ఈ లెక్కన ఎన్ని సమూహ సాంకేతిక జ్ఞాపకాలు ఎన్నిడిజిటల్ లైబ్రరీలకు ఎక్కాలి, ఎన్ని నమామి ప్రణాళికలు పరిపుష్టం కావాలి! ఈ పుస్తకం లిపిలేని సమాజాలనుంచి మౌఖికసంప్రదాయకృతులను సేకరించడానికి మనకున్న పరిమితులు – అవకాశాలు అనే మరోఅంశాన్ని ఆలోచింపజేస్తుంది. గిరిజనవికాసంలో ఉన్న మౌఖికసంప్రదాయకృతులను సేకరించి భద్రపరచవలసిన అవసరం కూడా గుర్తు చేసింది. ఇటువంటి ప్రయత్నం చేసినవారిని అభినందించకుండా ఉండలేకపోయాను. ఒకనాడు ఈ దేశంలో పరాయి పాలనలో హెర్బర్ట్ హోప్ రిస్లే అనే విదేశీయుడు భారతీయుల ముక్కులను ఆధారంగా చేసుకొని జాతిభేధాలను వర్గీకరించాడు.మరొకరు నేరస్థ తెగలచట్టాన్నితెచ్చారు. ఎన్నో సంఘర్షణల తర్వాత, స్వతంత్రం వచ్చిన ఇన్నాళ్ళకి ఎన్నో పరిమితులని దాటి ఒక జాతి ఒక కొత్త మార్గంలో తాముగా తమ ఉనికిని చాటుకోవడం గొప్ప విషయమే కదా.
రాసుకునే అలవాటు ఉంది కనుక చింతామణిని రాస్తూ ఈ పుస్తకాన్ని చూస్తే భక్తచింతామణి శతకంలోని పద్యం తచ్చాడింది.
తనదేశంబు స్వభాష నైజమతమున్ అస్మత్సదాచారముల్
తనదేహాత్మల నెత్తెఱంగున సదాతానట్లు ప్రేమించి తనస
ద్ఘనతా వ్యాప్తికి సాధనంబులగు సత్కార్యమ్ములన్ చేయగా
అనువౌ బుద్ధి యొసంగుమీ ప్రజకు దేవా! భక్త చింతామణి !
వడ్డాది సుబ్బారాయుడుగారు రాసిన ఈ పద్యం ప్రజలకు తన దేశంపట్ల,ఆచార వ్యవహారాలపట్ల గౌరవం ఉండాలని దేశం యొక్క ఘనతను నిలిపే సత్కార్యాలను చేయాలనే బుద్దికలగాలని భక్తుని చింతనలో ఉన్న భగవంతుని కోరుతుంది. ఈ కోరిక ఇప్పుడు పౌరచింతామణి కావాలి. ప్రతి పౌరుడి చింతనలో తన జాతి అస్తిత్వం,ఔన్నత్యం మణిపూసై ఉండగలిగితే నమామి కేవలం రికార్డుల నమోదుకోసమే కాదు ప్రపంచానికి నమామి వందే భారతం అవుతుంది. కోయతూర్ సమాజం అటువైపుగా అడుగు ఇప్పటికే వేసి దీపం పట్టుకుంది.
-దేవనపల్లి వీణావాణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
అరణ్యం 2 – చింతామణి – వీణావాణి దేవనపల్లి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>