రాజయోగ సారము : ఆధునిక జీవనశైలికి పరిష్కార మార్గం(పరిశోధనాత్మక వ్యాసం)-డా. శిరీష ఈడ్పుగంటి


18వ శతాబ్దంలో భక్తి ఉద్యమ వారసత్వాన్ని అద్భుతమైన యోగ మార్గంతో అనుసంధానించిన మహాయోగిని తరిగొండ వెంగమాంబ. సామాన్య భక్తులు కీర్తనలు, పూజలకే పరిమితమైన కాలంలో, ఆమె ‘రాజయోగం’ ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది, భక్తి ఉద్యమానికి ఒక కొత్త కోణాన్ని అందించారు. ఇందుకు నిదర్శనం ఈమె చేసిన రచన‘రాజయోగ సారము’. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు, మనోవిజ్ఞాన శాస్త్రం, జీవన సూత్రాల సమాహారం.
భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో తరిగొండ వెంగమాంబ ఒక కవయిత్రి మాత్రమే కాదు, గొప్ప యోగిని కూడా. స్త్రీలకు అక్షర జ్ఞానమే నిషిద్ధమైన రోజుల్లో, అద్వైత వేదాంతాన్ని ఔపోసన పట్టి, వేల సంఖ్యలో పద్యాలు, యక్షగానాలు రచించిన విదుషీమణి. తరిగొండలో అప్పటి సమాజం నుండి ఎదురైన అవమానాల కారణంగా ఆమె తిరుమలకు వెళ్ళి అక్కడ శేషాచల కొండల్లోని తుంబురు కోనలో ఆరు సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశారు. ఈమె కేవలం ఒక భక్తురాలు మాత్రమే కాదు, స్త్రీ సాధికారతకు ప్రతిరూపం. అనాదిగా వస్తున్న మూఢనమ్మకాలను ఎదిరించి, వితంతువులకు సైతం దైవచింతన చేసే అధికారం ఉందని నిరూపించారు. అప్పటి సమాజం విధించిన వైధవ్య ఆచారాలను ధిక్కరించి, భక్తి ద్వారా స్త్రీ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహాయోగిని.
వ్యాస ముఖ్య ఉద్దేశ్యం:
ప్రస్తుత వ్యాసంలో యోగినిగా తరిగొండ వెంగమాంబ గారి జీవిత ప్రస్థానాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఆమె రాసిన రాజయోగసారము రచనను ప్రధాన ఆకారంగా తీసుకోవడం జరిగింది. ఈ రచనలోని ప్రధాన అంశాలను, ఆధునిక జీవనశైలికి పరిష్కార మార్గంగా చెబుతూ, ఈ రచన నేటి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేయడం వ్యాస ఉద్దేశ్యం.
కవయిత్రి తరిగొండ వెంగమాంబ గారి గురించి చాలా రచనలు, పరిశోధనలు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఆమె జీవిత విశేషాలు, రచనల సమీక్ష, విశ్లేషణా వ్యాసాలు చాలానే వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు, వావిళ్ళ వారి ఆధ్వర్యంలో ఈమె రచనలు తిరిగి ముద్రణ పొందాయి. ఈ రచనలపై చాలామంది పరిశోధన కూడా చేశారు. అందుచే వెంగమాంబ గారి పుట్టుపూర్వోత్రాలు, కుటుంబం, జీవిత విశేషాలు.. ఇతర విషయాలు తిరిగి వ్యాసంలో పునరావృతం చేయలేదు. కేవలం ఆమె రాసిన ఒక రచనను మాత్రమే తీసుకుని అది నేటి మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెబుతూ అందులో ఉన్న విశేష సారాంశాన్ని ఈ వ్యాసంలో అందించే ప్రయత్నం చేయడం జరిగింది.
రాజయోగ సారము:
ఈమె రచించిన రాజయోగ సారము’ రచన ఆధునిక మానవాళికి ఒక దిక్సూచి. ఆధునిక కాలంలో మానసిక ఒత్తిడితో కూడిన నేటి సమాజానికి ఒక సంజీవని వంటిది. ఆచార్య బిరుదురాజు. రామరాజు గారు తన ఆంధ్ర యోగులు ప్రథమ సంపుటంలో పేర్కొన్నట్లుగా, ‘వెంగమాంబ అద్వైత వేదాంతాన్ని యోగశాస్త్రంతో ముడిపెట్టి సామాన్యులకు అందించారు’. ఈ రచనలో ప్రాణాయామం, ముద్రల గురించి అత్యంత నిగూఢమైన, శాస్త్రీయమైన వివరణలు ఇచ్చారు. కేవలం భక్తితోనే కాకుండా, శరీరంలోని వాయువులను నియంత్రించడం ద్వారా మనస్సును ఎలా స్వాధీనం చేసుకోవచ్చో ఆమె ఇందులో వివరించారు. అప్పట్లోనే (18వ శతాబ్దంలో) ఆమె మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి అవసరమైన సూత్రాలను అత్యంత సరళమైన తెలుగు ద్విపదలో అందించారు. ఇది 3 ఆశ్వాసాల ద్విపద కావ్యం. ఇందులో పిండ బ్రహ్మాండ రహస్యాలను వివరించారు. ద్విపద కావ్య రూపంలో ఉన్న ఈ రచనలో సాంఖ్య, తారక, అమనస్క యోగాల గురించి వివరించారు.
1.దేహ తత్వ విచారణ – పర్యావరణ స్పృహ:
నేటి కాలంలో శారీరక ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. శరీరమే ఒక దేవాలయమని, దానిని శుచిగా ఉంచుకోవడం మన బాధ్యతని ఆమె ప్రబోధించారు. కవయిత్రి పిండోత్పత్తి క్రమాన్ని, దేహ నిర్మాణం (అస్థి, మాంస, రక్తములతో కూడిన తీరు) గురించి ప్రథమ ప్రకరణంలో వివరించారు. దేహము అస్థిరమని గుర్తించినప్పుడే మనిషి అనవసరమైన భౌతిక వ్యామోహాల నుండి బయటపడతాడని ఆమె ప్రబోధించారు. నేటి గ్లోబల్ వార్మింగ్ కాలంలో, ప్రకృతిని ప్రేమించాల్సిన అవసరం ఉంది. మన శరీరాన్ని విశ్వంతో పోల్చారు. విశ్వంలో ఉన్న పంచభూతాలే మన శరీరంలో ఉన్నాయని, కాబట్టి ప్రకృతిని రక్షించుకోవడం అంటే మనల్ని మనం రక్షించుకోవడమేనని ఆమె సిద్ధాంతం.
2.శారీరక ఆరోగ్యం – నాడీ వ్యవస్థ శుద్ధి:
ఆధునిక వైద్యశాస్త్రం చెప్పే సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ గురించి రచయిత్రి వివరించారు. “ఘనత యెసంగు గంగాయమునలకు ననుపొందు మధ్యయా నాడికాగ్రమున.. ” రచనా ప్రారంభంలోనే శరీరంలోని నాడుల ప్రాముఖ్యతను, ముఖ్యంగా గంగా-యమునలుగా పిలవబడే నాడుల మధ్య ఉండే సుషుమ్న నాడి గురించి ప్రస్తావన ఉంది (వెంగమాంబ, తరిగొండ. 1930: 3). నాడుల శుద్ధి ద్వారా కలిగే ఫలితాల గురించి ప్రస్తావించారు. “లలిని ఇళెపింగళలు సుషుమ్నయును నలరార నాధారమందుండి వచ్చి.. మొనసి యాజ్ఞాచక్రమున మూఁడుఁ గూడి.. సరవిగ ఘన సహస్రారంబు నేరి గురుతరంబుగ నందు గోప్యమై యుండు”. ఇడ, పింగళ, సుషుమ్న నాడుల గురించి అవి ప్రాణవాయువుతో ఎలా అనుసంధానించబడి ఉన్నాయో వివరించారు. నాడుల ద్వారా ప్రాణశక్తి ప్రవహించి సహస్రార చక్రాన్ని చేరినప్పుడు కలిగే ఆధ్యాత్మిక స్థితిని రచయిత్రి వర్ణించారు. (వెంగమాంబ, తరిగొండ. 1930: 26)
నేటి అవసరం:
జీవనశైలి వ్యాధులైన బీపీ, షుగర్ వంటి వాటిని యోగ సాధన ద్వారా ఎలా నియంత్రించవచ్చో ఇది నిరూపిస్తుంది. నేటి కాలంలో ‘యోగా’ అనేది కేవలం వ్యాయామంగా మారింది. కానీ రచయిత్రి శరీరంలోని నాడీ వ్యవస్థను, షట్చక్రాలను శుద్ధి చేసుకోవడం ద్వారా రోగాల నుండి ఎలా విముక్తి పొందవచ్చో శాస్త్రీయంగా చెప్పారు.
3.ప్రాణాయామం- మనోనిగ్రహం:
ఆధునిక ఒత్తిడిని జయించడానికి ప్రాణాయామం ఒక గొప్ప మార్గం. ద్వితీయ ప్రకరణంలో దశవిధ వాయువుల (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ) స్థానాలను, వాటి విధులను వివరించారు. మనస్సు, ప్రాణవాయువు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. గాలిని నిలపడం ద్వారా మనస్సును స్థిరం చేయవచ్చని ఆమె వివరించారు.
4.ఇంద్రియ నిగ్రహం – మానసిక ఒత్తిడి:
నేటి సమాజంలో మనిషి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు మానసిక ఆందోళన. ఈ రచనలో మనస్సును ఎలా స్థిరపరచుకోవాలో వివరించారు. “… మదిని మోదంబుతో మర్మమును దగుత్రోవ యందుంచి యచలతత్వార్థంబుసరణిఁ బొందించి భావించి పుణ్యప్రయుక్త…” (వెంగమాంబ, తరిగొండ. 1930: 3). చంచలమైన మనసును నిశ్చలమైన ‘అచల తత్త్వము’ నందు లగ్నం చేయడాన్ని వివరించారు. మనసును (చిత్తమును) మర్మమునందు ఉంచి, అచల తత్వార్థం వైపు మళ్లించాలని ఆమె పేర్కొన్నారు. బాహ్య ప్రపంచంలోని విషయాల వైపు సోషల్ మీడియా, భోగ విలాసాలు మొదలైనవి, పరుగెత్తే మనస్సును లోపలికి మళ్లించడమే రాజయోగం. ఇది ఆధునిక కాలంలో ‘మైండ్ఫుల్నెస్’ కు మూలం. ఇంద్రియాల వెంట పరుగులు తీయకుండా మనస్సును లోపలికి మళ్ళించడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని ఆమె నిరూపించారు.
4,1.యువతకు మార్గదర్శనం
నేటి యువత వివిధ వ్యసనాలకు లోనవుతున్నారు. రాజయోగసారము రచన ‘ఇంద్రియ నిగ్రహం’ గురించి అద్భుతమైన మార్గదర్శకత్వం చేస్తుంది. బాహ్య సుఖాల కంటే అంతర్గత ఆనందం గొప్పదని తెలుసుకున్నప్పుడు మనిషి చెడు వ్యసనాల వైపు వెళ్ళడని వెంగమాంబ నిరూపించారు. యువత వ్యసనాల బారిన పడకుండా ఉండటానికి ‘ప్రత్యాహారం’ అనే యోగ దశను ఆమె వివరించారు. బాహ్య ఆకర్షణలకు లొంగకుండా ఆత్మ గౌరవంతో బతకడం ఎలాగో ఆమె తన జీవితం ద్వారా, రచన ద్వారా చూపారు.
4.2.బాహ్య ఆకర్షణల నియంత్రణ (ప్రత్యాహారం):
“కపట ప్రపంచాంధకారంబు వాసి” బాహ్య ప్రపంచం అనే చీకటిని విడిచి, ఇంద్రియాలను జయించడం గురించి తెలియజేశారు.
4.3.ప్రత్యాహార స్థితి:
ఇంద్రియాలను బాహ్య విషయాల నుండి మళ్లించి అంతర్ముఖం చేయడాన్ని ప్రత్యాహారం ‘వెలిప్రపంచంబును విడిచి యాలోన నిలిచి చూచెడి తెల్వి’ ప్రత్యాహారం అని పేర్కొన్నారు.
4.4.దుర్మార్గాల నుండి విముక్తి: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించి, తప్పుడు మార్గాల (దుర్మార్గము) బారిన పడకుండా ఉండాలని హెచ్చరించారు.
4.5.నిజమైన యోగి లక్షణం:
బాహ్య వేషధారణల కంటే, మనశ్శుద్ధి కలిగి ఉండటమే ముఖ్యమని వివరించారు.
ఈ విధంగా యువత వ్యసనాలకు (అరిషడ్వర్గాలకు) లోను కాకుండా, ఇంద్రియ నిగ్రహంతో (ప్రత్యాహారం) ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలో ఈ రచన బోధిస్తుంది.
5.షడూర్ములు, మానసిక సమతుల్యత:
మానవ సంబంధాలలో ఎదురయ్యే సమస్యలకు మూలం ఆరు ఊర్ములు (ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము) అని తృతీయ ప్రకరణంలో వివరించబడింది. వీటిని ఆత్మధర్మం నుండి వేరు చేసి చూడగలిగితే మనిషి సుఖదుఃఖాలకు అతీతంగా ఉండగలడు.
6.జీవన్ముక్తి – వర్తమానంలో జీవించడం:
కవయిత్రి ప్రకారం, రాజయోగం అంటే లోకాన్ని వదిలి అడవులకు వెళ్లడం కాదు. సంసారియై ఇంట్లో ఉన్నా, విరక్తుడై అడవిలో ఉన్నా ఆత్మజ్ఞానం కలిగినవాడు ముక్తుడే. దీని ప్రకారం ఆధునిక కాలానికి అన్వయించుకుంటే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే, మనస్సును దైవంపై లేదా ఉన్నతమైన లక్ష్యంపై ఉంచడం ద్వారా ఎవరైనా రాజయోగి కావచ్చు.
7.ధ్యాన పద్ధతులు (షణ్ముఖీ ముద్ర, తారకము)
ధ్యానం ఎలా చేయాలి? అనే ప్రశ్నలకు సమాధానంగా ఆమె శాంభవీ ముద్ర, తారక యోగ లక్షణాలను వివరించారు. భ్రూమధ్యంలో (కనుబొమ్మల మధ్య) దృష్టిని నిలిపి, అంతర్లక్ష్యాన్ని సాధించే విధానం మానసిక ఏకాగ్రతను పెంచుతుంది.
8.రాజయోగ సారము- మూడు యోగ పద్ధతులు
ఈ రచన ప్రధానంగా మూడు యోగ పద్ధతుల సమ్మేళనం. అవి సాంఖ్యము, తారకము, అమనస్కము. ఆధునిక జీవనశైలిలో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ మూడు పద్ధతులు ఎలా ఉపయోగపడతాయో రచనలో వివరించారు.
8.1.సాంఖ్య యోగము (విచారణ మార్గము)
సాంఖ్య యోగం అంటే దేహము, ఆత్మ మధ్య గల భేదాన్ని విచారణ చేయడం.
దేహ స్వభావం: ఈ దేహం పంచభూతాలతో నిర్మితమైందని, ఇది అస్థిరమైనదని వివరించారు.
తత్వ విచారణ: దేహములోని 25 తత్వాలను (పంచేంద్రియాలు, పంచప్రాణాలు మొదలైనవి) విశ్లేషించి, తాను దేహము కాదు, కేవలం సాక్షిగా ఉన్న ఆత్మను అని తెలుసుకోవడమే సాంఖ్యము.
ప్రయోజనం: నేటి కాలంలో శారీరక రోగాల పట్ల అతిగా ఆందోళన చెందేవారికి, ‘నేను దేహాన్ని కాదు’ అనే అవగాహన మానసిక దృఢత్వాన్ని ఇస్తుంది.
8.2.తారక యోగము (లక్ష్య సాధన)
తారక యోగం అనేది దృష్టిని, ప్రాణాన్ని ఏకం చేసే పద్ధతి. దీనిని కవయిత్రి రెండు విధాలుగా వర్ణించారు. పూర్వ తారకము, ఉత్తర తారకము.
ముద్రలు: ఇందులో ‘శాంభవీ ముద్ర’ అత్యంత ప్రధానమైనది. రెప్ప వేయకుండా దృష్టిని నిలపడం ద్వారా చిత్తం స్థిరమవుతుంది.
జ్యోతి దర్శనం: భ్రూమధ్యంలో (కనుబొమ్మల మధ్య) వెలిగే నీలజ్యోతిని దర్శించడం తారక యోగ లక్ష్యం.
ఆధునిక అన్వయం: ఏకాగ్రత లోపంతో బాధపడేవారికి, ఈ పద్ధతి మనస్సును ఒకే చోట లగ్నం చేయడానికి అద్భుతమైన వ్యాయామంలా పనిచేస్తుంది.
8.3.అమనస్క యోగము (నిర్మల స్థితి)
అమనస్కము అంటే ‘మనస్సు లేని స్థితి’ లేదా మనస్సును ఆత్మలో లయం చేయడం. ఇది యోగ సాధనలో అత్యున్నతమైన శిఖరం.
మనోలయం: మనస్సు చంచలత్వము వీడి, ఏ ఆలోచనలు లేని నిర్వికల్ప స్థితిని పొందడమే అమనస్కము.
“వెలిలోను వెల్గుచు విషయశూన్యముగ జలరాశిగత కలశంబు చందానఁ బొలుపొంద వెలిలోను పూర్ణమై యుండి” (వెంగమాంబ, తరిగొండ. 1930: 35)
నిత్యానందం: ‘జలరాశిగత కలశంబు చందాన’ – అంటే సముద్రంలో మునిగిన కుండలోనూ, బయటా నీరే ఉన్నట్లు, సాధకుడు అంతటా బ్రహ్మమునే చూస్తూ ఆనందంలో మునిగిపోతాడు. ఆత్మానుభవం పొందిన యవధూత స్థితిని వివరిస్తూ వెంగమాంబగారు ఈ పోలికను ఉపయోగించారు. సముద్రంలో మునిగి ఉన్న కలశం లోపల, వెలుపల ఏ విధంగా నీరు నిండి ఉంటుందో, అలాగే బ్రహ్మజ్ఞాని లోపల, వెలుపల కూడా ఆ పరమాత్మ ప్రకాశమే నిండి ఉంటుందని దీని అర్థం.
ప్రయోజనం: విపరీతమైన ఆలోచనలు, ఆందోళన ఉన్నవారికి, మనస్సును శూన్యం చేసి ప్రశాంతతను పొందడానికి ఈ అమనస్క స్థితి పరిష్కార మార్గం చూపుతుంది.
వెంగమాంబగారు ఈ మూడు యోగాలను కలిపి అభ్యసించమని సూచించారు. సాంఖ్యముతో జ్ఞానాన్ని, తారకముతో ఏకాగ్రతను, అమనస్కముతో శాంతిని పొందవచ్చని ఆమె బోధించారు.
రాజయోగ సారము – ప్రధానాంశాలు:
1.గురు పరంపర, రచన ఉద్దేశ్యం
రచన ప్రారంభంలో వెంగమాంబ తన గురు పరంపరను స్మరించుకున్నారు. గణపతిని, తన ఇష్టదైవమైన తరిగొండ నరసింహుని కీర్తించారు. విద్యారణ్యులు, బ్రహ్మేంద్రులు, సచ్చిదానంద యోగి వంటి మహనీయులను స్మరిస్తూ, ఈ రాజయోగ సారాన్ని ద్విపద కావ్యంగా రచిస్తున్నట్లు పేర్కొన్నారు. సామాన్యులకు కూడా అర్థమయ్యేలా పరమ రహస్యమైన యోగాన్ని వివరించడమే ఈ రచన ఉద్దేశ్యంగా కనబడుతుంది.
2.పిండోత్పత్తి విధానం
జీవుడు ఈ ప్రపంచంలోకి ఎలా వస్తాడు, ఈ శరీరం ఎలా నిర్మితమైంది అనే విషయాలను శాస్త్రీయంగా చర్చించారు.
“శుక్ల శోణితములు రెండు కలసి యేకంబుగ గర్భమందుండి నెరినది యైదింట నీటబుగ్గౌను పరిదగ గట్టియౌ బది దినంబులకు నమరి దేనింట నండ మైయుండు స్థిమితమై నెలనింట శిర మేరుపడును..” (వెంగమాంబ, తరిగొండ. 1930: 10)
అండోత్పత్తి: శుక్ల శోణితాల కలయిక నుండి ఐదు రోజులకు నీటి బుగ్గలా, పది రోజులకు అండంగా, నెలకు శిరస్సుగా, రెండు నెలలకు కాళ్ళు చేతులుగా శిశువు రూపుదిద్దుకుంటుందని వివరించారు.
గర్భస్థ శిశువు ప్రార్థన: గర్భంలో ఉన్నప్పుడు శిశువు తన పూర్వ జన్మ కర్మలను తలచుకుంటూ, బయటకు వచ్చిన తర్వాత భగవంతుని స్మరిస్తానని ప్రతిజ్ఞ చేయడం, కానీ పుట్టగానే విష్ణుమాయ వల్ల వాటన్నింటినీ మర్చిపోవడాన్ని ఆమె హృద్యంగా వర్ణించారు.
3.విశ్వోత్పత్తి, పంచీకరణ
సృష్టి ఎలా జరిగిందో సాంఖ్య శాస్త్ర రీతిలో వెంగమాంబ వివరించారు. నిర్గుణ పరబ్రహ్మము నుండి మాయ, దాని నుండి అహంకారము, త్రిగుణములు (సత్వ, రజో, తమో) ఎలా ఉద్భవించాయో వివరించారు. పంచభూతాల (ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వి) ఉత్పత్తి, అవి ఒకదానితో ఒకటి కలిసి ఏ విధంగా శరీర తత్వాలుగా మారాయో (పంచీకరణ) చర్చించారు.
4.యోగ ప్రక్రియలు – షట్చక్రములు
మానవ శరీరంలోని శక్తి కేంద్రాలైన షట్చక్రాల గురించి రచనలో స్పష్టమైన వివరణ ఇచ్చారు.
ఆధార చక్రము: మూలాధారం – ఇది రహస్య స్థానంలో 4 రేకులతో ఉంటుంది.
స్వాధిష్ఠానము: 6 రేకులతో జలజాత భవుడు (బ్రహ్మ) ఉండే చోటు.
మణిపూరకము: నాభి వద్ద ఉండే 10 రేకుల చక్రం.
అనాహతము: హృదయం వద్ద ఉండే 12 రేకుల చక్రం.
విశుద్ధము: కంఠం వద్ద ఉండే 16 రేకుల చక్రం.
ఆజ్ఞా చక్రము: భ్రూమధ్యంలో (కనుబొమ్మల మధ్య) ఉండే రెండు రేకుల చక్రం.
సహస్రారము: శిరస్సు పైభాగంలో ఉండే వేయి రేకుల చక్రం, ఇక్కడ సచ్చిదానంద గురువు కొలువై ఉంటారు.
5.తారక యోగము, రాజయోగము
ఈ రచన లోని ప్రధానాంశం యోగ సాధన.
రాజయోగ నిర్వచనం: ఇంద్రియాలు చంచలమై జవదాటి పరుగెత్తకుండా, చిత్తాన్ని ఆత్మయందు లగ్నం చేయడమే రాజయోగం.
తారకము: ఇది పూర్వ, అపర యోగాలని రెండు విధాలు. సూర్య చంద్ర బింబాల మధ్య వెలిగే తారకను నిలకడగా చూడటం ద్వారా మనస్సును లయం చేయవచ్చు.
అమనస్కము: మనస్సును పూర్తిగా శూన్యం చేసి, బ్రహ్మముతో ఐక్యం చేసే స్థితిని అమనస్క యోగంగా పేర్కొన్నారు.
6.జీవన్ముక్తి, భక్తి
ముక్తి అనేది కేవలం అడవులకు వెళ్లడం వల్ల రాదు. కాశీ, గయ వంటి తీర్థయాత్రలు చేసినా, శరీరానికి జడలు దాల్చినా ఆత్మజ్ఞానం లేనిదే ముక్తి లభించదు. సంసారంలో ఉంటూ కూడా తామరాకుపై నీటి బొట్టులా జీవించేవారే నిజమైన సిద్ధ యోగులు. అంతర్లక్ష్యాన్ని సాధించి, తనను తాను తెలుసుకోవడమే పరమ పదము.
7.పంచకోశముల వివరణ
ఆత్మను కప్పి ఉంచే ఐదు పొరల (కోశముల) గురించి చర్చించారు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ మరియు ఆనందమయ కోశాలు. వీటిని దాటినప్పుడే పంచకోశాతీతమైన పరబ్రహ్మ స్థితి కలుగుతుంది.
ఈ విధంగా ‘రాజయోగ సారము’ ఒక సాధకుడికి కావలసిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని సంపూర్ణంగా అందిస్తుంది. కవయిత్రి ఈ రచన ద్వారా అందించిన జ్ఞానం, మనిషి తనను తాను శారీరకంగానూ, మానసికంగానూ సిద్ధం చేసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గదర్శిని. బి. రామరాజు గారు అన్నట్లుగా వేదాంతం కేవలం మాటల్లో ఉండకూడదు, అది అనుభవంలోకి రావాలి. దానికి షట్చక్రాల సాధనే మార్గం. ఇది కేవలం భక్తి మార్గాన్ని మాత్రమే కాకుండా, శరీర నిర్మాణ శాస్త్రాన్ని, మనస్తత్వశాస్త్రాన్ని, యోగశాస్త్రాన్ని ఏకకాలంలో బోధిస్తుంది. ఇందులో సూచించిన నియమాలు పాటిస్తే ప్రశాంతమైన మరియు అర్థవంతమైన జీవనం సాధ్యమవుతుంది.
యోగినిగా వెంగమాంబ:
తరిగొండ వెంగమాంబ జీవితం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ రచనలో ఆమె కేవలం ఇతరులు చెప్పిన విషయాలను రాయడమే కాకుండా, తన స్వంత అనుభవాలను పొందుపరిచారు.
ఆండ్ర శేషగిరిరావు గారు రచించిన విదుషీమణి వెంగమాంబ రచనలో వెంగమాంబగారి జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని తెలిపే వాక్యాలు…
“ఇట్లుండ నొకప్పు డా యూరికి పుష్పగిరిపీఠాధిపతు లరుదెంచిరి. అప్పుడు బ్రాహ్మణులందరు వెంగమ్మను గూర్చి స్వామివారికి విన్నవించి, యా యింట భిక్ష గొనగూడదని వచించిరి. స్వామివారును లౌకికాచారముల బాటించువారు గనుక, కృష్ణయామాత్యుని బిలిపించిరి. ‘నీ బిడ్డకు దలవెండ్రుకలు తీయిం పనిదే మీ యింట భిక్ష గొనము. మా యాజ్ఞల నుల్లంఘింతువేని మిమ్ముల వెలివెట్టున ట్లాంక్ష యిత్తు’మని చెప్ప, గృష్ణయామాత్యుడు ‘స్వామీ ! ఇందు నా దోషము లేదు. ఈ విషయమును గూర్చి నాబిడ్డతోనే ముచ్చటింపు’డని పలికెను. అప్పుడు స్వామివారు వెంగమ్మను బిలిపించి తల వెంట్రుకలు తీయించుకొనవలసిందని నొక్కి చెప్పిరి. వెంగమ్మయు చేతులు జోడించి, ‘అయ్యా! మీరు జగద్గురువులు. మీ కంటె నేను దెలిసినదాని గాను. అయినను విధవకు శిరోజము లుండకూడదని యే వేదములో జెప్పబడినది?
ఆమె మానసిక ప్రవృత్తియే పరిశుద్ధమైనప్పుడు శిరోజములున్న నేమి? సొమ్ములు ధరించిన నేమి? మఱియు భగవత్కృపాతిశయము వలన పుట్టుకతోడనే లభించిన యా వెంట్రుకలను గొరిగించి నంత మాత్రమున తిరిగి మొలవకుండునా? మొలవకుండ జేయు సామర్థ్యము మీకు గలదేని యప్పుడు గొరిగింపుడు. భగవంతుడిచ్చిన యా యైశ్వర్యమును భగవంతునికే యర్పిం తునుగాని, మూఢులగు నీ బ్రాహ్మణుల కర్పింప’ నని ఖండితంబుగా బలుక, స్వామివా రాగ్రహించి ‘నీవు మాకు బోధించుదానవా? బ్రాహ్మణ సంఘములో నున్నంతవరకు నీవు బ్రాహ్మణాచారములను బాటించవలెను. నీ కిష్టము లేకున్నను బలవంతము గానైన గొరిగింతు’ మని పలికి, యప్పుడే మంగలివానిని రప్పించి యామె శిరోజములను దీయించిరి. కాని క్షురకర్మ పూర్తి యగునప్పటి కామె శిరోజములు యథా ప్రకారముగా నుండెను. ఇదియేమి చిత్ర?మని మఱియెక మాఱు గొరిగింప, నెప్పటి యట్లుండెను. అది చూచి యచ్చటి బ్రాహ్మణులేగాక, స్వామివారును మహాశ్చర్యపడి, యేమియు జేయజాలక, దిక్కులు చూడజొచ్చిరి. అప్పుడు వెంగమ్మ యథా ప్రకారముగా గొప్పు ముడిచి ‘స్వామీ! లౌకికాచారమే ప్రధానమో, పరిశుద్ధమైన మానసిక ప్రవృత్తియే ప్రధానమో యిప్పటికైన నిర్ణయింపుడు. శ్రీ వేంకటేశ్వరుని యైశ్వర్యమైన యీ కేశజాలమును హరింప మీ రెవ్వరు? నా శరీరముతోబా టివియు నా దేవునకు జెందవలసినవే’ యని వచింప, స్వామివా రామెను మహాభక్తురాలని తెలిసికొని, యకారణముగా నామె యెడ నిందారోపణ మొనర్చినందులకు బ్రాహ్మణులను మందలించి, క్షమాపణ గోరిరి. బ్రాహ్మణులును బుద్ధి గలిగి యామె పాదములపై బడి తమ తప్పు మన్నించునది యని ప్రార్థించిరి. తరిగొండ వెంగమ్మ సచ్ఛీలయని యెల్లరచే నుతింపబడియె.” (శేషగిరి రావు, ఆండ్ర. 2009: 15,16 &17)
మరొక సంఘటన
“వెంగమాంబ తొలుత నుండియు లక్ష్మీనృసింహాలయములో ఎడమవైపున గల ఆంజనేయుని విగ్రహము వెనుక నున్న స్థలములో కూర్చుండి, పెక్కుగడియలు ధ్యానసమాధి యందు గడుపుచుండెడిది. ఆమె గుడికి వచ్చిపోవుచుండుట చాలమంది ఎఱిగియున్నను, అట్లు ఆంజనేయ విగ్రహము చాటున ధ్యాన నిమగ్న యగుచుండుట యెవ్వరెఱుగరు. ఒకనాడామె యాంజనేయ విగ్రహము వెనుక యోగ సమాధిలీనయై, కొన్ని దినము లట్లే యుండెను. వెంగమ్మ గుడిలో గాని, గ్రామములో గాని కనిపింపనందున ఎల్లరును ఆమె యూరువిడిచి ఎచటికైన పారిపోయి యుండునని పరిపరి విధముల ఊహించిరి, ఆలయార్చకు డొకనాడు ఆంజనేయుని పూజించుచు, వెనుక నున్న వెంగమాంబను జూచుట తటస్థించెను. చూచి, దయ్యమో, భూతమో యని భయపడెను. ధైర్యము తెచ్చుకొని మరల నొకమాఱు పరికించి, విగ్రహము చాటున చీకటిలో నున్నది కానాల కృష్ణయ్య కూతురగు వెంగమ్మయే యని నిశ్చయించి, గుప్తవర్తనమునకై అచ్చట చేరినదని ఆ భక్తురాలిని శంకించి, యతడు కోపాటోపముతో బిగ్గరగా దూషించుచు, తలవెండ్రుకలుపట్టి యామె నీవలికి లాగెను. కేశములు లాగబడుటవలని బాధచే సమాధి భంగము కాగా ఆమె కనులుదెరచి చూచినది. ఆ యోగిని దృష్టికి తాళలేక అర్చకుడు మూర్ఛితుడై పడెను. కొంతవడికి తెప్పిరిల్లి, అపరాధమును క్షమించుమని యామె చరణములపైబడి ప్రార్థించినాడు. తన ధ్యానమున కారీతిని విఘ్నము కల్గుట దైవసంకల్పమే యని తలపోసి, వెంటనే ఆ యూరు వదలి వెళ్లవలసినదిగా నరహరి తనను ఆజ్ఞాపించిన ట్లామె నిశ్చయించి, ఆ యిష్టదైవమును మనసార ధ్యానించి మ్రొక్కి దారిబట్టెను.” ( కృష్ణమూర్తి, కె .జె. 2008: 16&17)
సామాజిక అడ్డంకులను అధిగమించిన ధీశాలి:
ఆ కాలంలో మహిళలకు వేదాంత విద్య, యోగ సాధన నిషిద్ధం. కానీ వెంగమాంబ లోకనిందలను, ఆచారాలను ధిక్కరించి రాజయోగాన్ని సాధించారు. రచన ప్రారంభంలో ఆమె తన గురువులను స్మరించుకున్న తీరు, ఆమెకు శాస్త్రాలపై ఉన్న గౌరవాన్ని, సాధన పట్ల ఉన్న పట్టుదలను చూపిస్తుంది.
నిరాడంబరత, నిష్కామ కర్మ:
రాజయోగ సారము లోని ద్విపదలు ఆమె నిరాడంబర వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. తాను గొప్ప పండితురాలిని అని ఎక్కడా చెప్పుకోకుండా, అంతా ఆ తరిగొండ నరసింహుని దయ అని పేర్కొన్నారు. ‘కర్మ ఫలములను ఆశించక, కర్తవ్యమును దైవార్పణము చేయుట’ అనే గీతా సారాన్ని ఆమె స్వయంగా పాటించి చూపారు.
సిద్ధ యోగినిగా అనుభవ పూర్వక వివరణ:
యోగాభ్యాసంలో ఎదురయ్యే అతి సూక్ష్మమైన విషయాలను ఆమె వివరించిన తీరు చూస్తే, ఆమె ఒక సిద్ధ యోగిని అని స్పష్టమవుతుంది. ఉదాహరణకు దశవిధ నాదాలు, జ్యోతి దర్శనం, కుండలిని చలనం. షట్చక్రాల వర్ణనలో ఆమె ఆయా చక్రాలలో కలిగే అనుభూతులను వర్ణించారు. ఇది కేవలం పుస్తక జ్ఞానం కాదు, సాధనానుభవం.
సర్వసంగ పరిత్యాగి, లోక కల్యాణ కాంక్షి:
ఆమె అడవులలో తపస్సు చేసినా, చివరకు సామాన్య ప్రజల కోసం యోగ రహస్యాలను సరళమైన ద్విపద ఛందస్సులో రాశారు. కఠినమైన సంస్కృత శ్లోకాలలో ఉన్న రాజయోగాన్ని, సామాన్యులకు అర్థమయ్యేలా తెలుగులో అందించడం ఆమెలోని ఉదాత్తతకు నిదర్శనం.
సమన్వయ కర్త:
వెంగమాంబ వ్యక్తిత్వంలోని గొప్పదనం ‘సమన్వయం’. ఆమె భక్తిని (నరసింహ స్వామి సేవ), జ్ఞానాన్ని (సాంఖ్య విచారణ), మరియు కర్మను (యోగ సాధన) మూడింటినీ మేళవించారు. ఆమె దృష్టిలో భక్తి లేని జ్ఞానం, జ్ఞానం లేని యోగం నిష్ప్రయోజనం.
వెంగమాంబ కేవలం ఒక గ్రంథకర్త మాత్రమే కాదు, ఆమె ‘ఒక ప్రయోగశాల’. తన శరీరాన్నే క్షేత్రంగా చేసుకుని, శ్వాసను సాధనంగా మలుచుకుని రాజయోగాన్ని సాక్షాత్కరింపజేసుకున్న అపర యోగిని. ఆమె వ్యక్తిత్వంలోని ధైర్యం, నిలకడ మరియు ఆర్తి రాజయోగ సారము లోని ప్రతి పద్యంలోనూ ప్రతిధ్వనిస్తాయి. ఆధునిక కాలంలో ఒత్తిడితో సతమతమయ్యే సాధకులకు ఆమె జీవితం ఒక సజీవ ప్రేరణ.
ఆధార గ్రంథాలు:
- కృష్ణమూర్తి, కె .జె. 2008. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కృతుల పరిశీలనము (సిద్ధాంతగ్రంథము). తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
- రామరాజు, బిరుదురాజు. ఆంధ్ర యోగులు (ప్రథమ సంపుటం). నవోదయ బుక్ హౌస్. హైదరాబాద్.
- వెంగమాంబ, తరిగొండ. రాజయోగ సారము. వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ ప్రచురణ, మద్రాస్.
- శేషగిరి రావు, ఆండ్ర. 2009. విదుషీమణి వెంగమాంబ. తిరుమల తిరుపతి దేవస్థానములు. తిరుపతి.
– డా. శిరీష ఈడ్పుగంటి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
రాజయోగ సారము : ఆధునిక జీవనశైలికి పరిష్కార మార్గం(పరిశోధనాత్మక వ్యాసం)-డా. శిరీష ఈడ్పుగంటి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>