“ఇదిగో తోక -అదిగో పులి” -(కథ)- మజ్జి భారతి

“ఏమిటండి! నేను విన్నది నిజమేనా! కొట్టి, కొట్టి మీరు నన్ను ఇంటి నుండి తరిమేశారట” జనార్ధన్ ని అడిగింది సౌమ్య.
“నేను ఇంకొకలా విన్నానే! విడాకులు నా ముఖాన కొట్టి మరీ, నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోయావట. ఈ మాట నిజమేనా!” ఆశ్చర్యంగా అడిగాడు జనార్ధన్ సౌమ్యని.
ఒకరిముఖమొకరు చూసుకుని పగలబడి నవ్వుకున్నారు వారంరోజుల తర్వాత కలుసుకున్న భార్యాభర్తలిద్దరూ.
***
వారం రోజుల క్రిందటి విషయం…
“అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానండి” సౌమ్య మాట గట్టిగా వినిపించింది బయటకు.
ఆ ఇంట్లో దంపతులు ఏం మాట్లాడుకుంటారోనని ఎప్పుడూ ఒక చెవి అటేవేసి ఉంచిన రాఘవమ్మకు ఆ ఒక్కమాటే వినిపించింది. ఆ మాట తర్వాత ఇంకేమన్నా మాటల తూటాలు గాని, విసిరేసిన గిన్నెల శబ్దాలు గాని వినిపిస్తాయేమోనని చాలా సేపు ఎదురు చూసింది రాఘవమ్మ. ఇంకేమీ వినిపించక పోయేటప్పటికి ఈ సంగతి పక్కింటి వర్ధనమ్మ చెవిలో వేద్దామని పక్కింటికి వెళ్ళింది.
“ఈ మాట విన్నావా వర్ధనమ్మక్కా! మా పక్కింట్లో అద్దెకుంటున్న టీచరుగారు, వాళ్లావిడా ఏదో గొడవ పడినట్లు ఉన్నారు. దాంతో నేను పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరిస్తుందావిడ” తను విన్నది, అనుకుంటున్నది కలిపి చెప్పింది, వర్ధనమ్మకు రాఘవమ్మ.
“ఈ మధ్యనే మీ పక్కింట్లో ఎవరో కొత్తజంట అద్దెకు దిగారని చెప్పావు. ఇంటికెవరు వచ్చినా ఆయనతో పాటుగా ముందు గదిలోనే కూర్చుంటుంది. మగవాళ్ళతో సమానంగా మాట్లాడుతుందని చెప్పావు. వాళ్ల గురించేనా ఏమిటి?” ఆరా తీసింది వర్ధనమ్మ.
“మరే అక్కా! మగవాళ్ళతో కలిసి మాట్లాడడమే కాదు. వాళ్ళతో ఆ నవ్వులూ, వికవికలు పకపకలు ఒకటేమిటి? వింటుంటే నాకాశ్చర్యంగా ఉంటుంది సుమా! ఆడవాళ్ళు ఇలా కూడా ఉంటారా అని” ఆశ్చర్యంగా బదులిచ్చింది రాఘవమ్మ.
“మరేనమ్మా! కాలం మారిపోయింది. మా కాలంలో అయితే ఇలాంటివి చూసేవాళ్ళమా! అవునూ! ఇంతకీ ఏం జరిగిందట?”
“మగవాళ్ళతో సమానంగా మాట్లాడవద్దని ఆ టీచరుగారు చెబితే, సరేననడం పోయి ఆమె పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరిస్తోంది” ఈ సారి తన ఊహలకు మాటలు పేర్చి చెప్పింది రాఘవమ్మ.
“నిజమా!” ఆశ్చర్యంగా అడిగింది వర్ధనమ్మ.
“నిజంకాక? నా చెవులతో నేనే విన్నానా మాట. ఆమె పుట్టింటికి వెళ్ళిపోతానని మొగుడిని బెదిరించడం” నొక్కి చెప్పింది రాఘవమ్మ.
***
“వదినా! వదినా! ఈ మాట విన్నావా? మన వీధిలో కొత్తగా దిగిన టీచరుగారు, వాళ్ళావిడ ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారట. ఆవిడ చేతికి ఏది అందితే అదే మొగుడి మీద విసిరేస్తుందట.” వర్ధనమ్మ సుందరితో చెప్పింది.
“నువ్వూ విన్నావా?” ఎదురడిగింది సుందరి.
“ఏమిటీ! నువ్వు కూడా విన్నావా వదినా?” ఆశ్చర్యపోయింది వర్ధనమ్మ.
“ఆ, మరేనమ్మా! ఊరందరికీ తెలిశాక మనకొక్కరికే తెలియకుండా ఉంటుందా?” సుందరి
“ఎందుకు వాళ్ళిద్దరి మధ్య గొడవలు?”
“ఆ ఏముంది? ఇక్కడ ఉన్న ఆ టీచరు మధ్యమధ్యలో ఎవరినో కలవడానికి వెళ్ళిపోతుంటే…. ఆడపుట్టుక కాదుటమ్మా! ఇలాంటి విషయాలలో సహించి ఎలా ఉండగలదు ఏ ఆడదన్నా? ఆ కోపంలో, ఆవిడ గిన్నెలు విసిరేస్తూ ఉంటుందట. ఆ గిన్నెలు కొనడానికే ఆయన జీతం సరిపోతుందట” సుందరి క్లారిటీ ఇచ్చింది.
***
“పిన్నీ! ఈ విషయం తెలుసా నీకు?” కాంతమ్మను అడిగింది సుందరి.
“ఏమైందే సుందరి? ఏ విషయం?” “అదే పిన్నీ! కొత్తగా ఈ ఊరు వచ్చిన ఆ టీచరు విషయం.”
“ఏమైందేమిటి?” ఆరాగా అడిగింది కాంతమ్మ. “అదేమిటి పిన్నీ! లోకమంతా కోడైకూస్తుంటే నీకు ఇంకా తెలియకపోవడం ఏమిటి?” ఆశ్చర్య పోయింది సుందరి.
“ఏదీ! నిన్నే కదా ఊరి నుండి వచ్చాను, మీ చెల్లి రాగిణి దగ్గరకు వెళ్లి. ఇంతకీ ఏం జరిగిందిట?”
“ఏం చెప్పను? ఆ టీచరు ఎవరినో ఉంచుకున్నాడట. ఆ విషయం తెలిసి ఆ టీచరుని బెదిరించడానికి వాళ్ళావిడ కొద్దిగా ఎలకల మందు తాగిందట. మగవాడిని, ఒకదానితో కాకపోతే పది మందితో తిరుగుతాను. దానికే నన్ను బెదిరిస్తావా అని ఆ టీచరు ఆవిడను గొడ్డును బాదినట్టు బాదాడట” కళ్ళింత చేసుకుని చెప్పింది సుందరి.
“అయ్యో! ఇంత అన్యాయం ఏమిటమ్మా? మన ఊరిలో ఎక్కడా లేదు? మొగుడూ పెళ్ళాలన్నాక ఇలాంటి చిన్న,చిన్నవి ఉంటూనే ఉంటాయి. దానికే ఎలుకల మందు తాగడాలు, గొడ్డును బాదినట్టు బాదుకోడాలేమిటమ్మా? కనీవినీ ఎరుగము ” ముక్కున వేలేసుకుంది కాంతమ్మ.
***
“ఏమే లక్ష్మి! నల్లపూస అయిపోయావు? ఎక్కడా కనిపించడం లేదు?” నీళ్లు పట్టుకోవడానికి కొళాయి దగ్గరకొచ్చిన లక్ష్మిని అడిగింది కళ్యాణి.
“లేదక్కా! మా అమ్మకు బాగోలేదంటే మా పుట్టింటికి వెళ్లాను.” బదులిచ్చింది లక్ష్మి.
“అయితే ఈ విషయం నీకు తెలియదన్నమాట”
“ఏమిటా విషయం?”
“మన ఊరిలో కొత్తగా అద్దెకు దిగలేదూ! ఆ టీచరు, వాళ్ళావిడ గురించి”. “ఏమిటి! ఏమి జరిగింది?”
“ఏం చెప్పమంటావమ్మా! ఈ రోజు మొగుడు పెళ్ళాలు ఒకరినొకరు గట్టిగా కొట్టుకున్నారట. అట్లపుల్లతో ఆవిడ ఆయనను కొడితే, క్రికెట్ బ్యాటుతో ఆయన కొట్టాడట. వాళ్ల అల్లరి భరించలేక, వాళ్ల పక్కింట్లో ఉన్న రాఘవమ్మ ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోవాలని అనుకుంటుందట” చేతులు తిప్పుకుంటూ చెప్పింది కళ్యాణి.
ఇంతలో అక్కడికి వచ్చిన రాణి “రాఘవక్క ఇల్లు ఖాళీచేసి ఎప్పుడో వెళ్ళిపోయిందట” ఎవరో అనుకుంటుంటే విన్నానంది.
“ఎక్కడికి వెళ్ళింది? పక్కనున్న వాళ్ళ గొడవ భరించలేక, సొంతింటి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయడమేమిటి? ఇదేం ఘోరమమ్మా!” హాశ్చర్యపోయారిద్దరూ.
అటుగా వెళ్ళిపోతున్న రాజమ్మ ఆ మాట విని “రాఘవమ్మ ఇంకా ఇల్లు ఖాళీ చేయలేదు. గానీ ఇల్లు ఖాళీ చేసే బాధ తప్పిందిలే రాఘవమ్మకు” అని అంది.
“ఏమిటేమిటి? ఎలా తప్పింది?” ఆతృతగా అడిగారు ముగ్గురూ.
“ఆ టీచరుగారు వాళ్ళావిడను, ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి బస్సు ఎక్కించాడట. మరల తిరిగి వస్తే కాళ్లూ, చేతులూ విరగ్గొడతానన్నాడట. బస్టాండులో అందరూ విరగబడి చూశారట ఆ మొగుడూ, పెళ్ళాలను. ఆ టైంకి అక్కడే ఉన్న రంగా అది చూసి, పూసగుచ్చినట్టు చెప్పాడు నాకు” అని చెప్పింది రాజమ్మ.
“అసలు విషయం అది కాదుటమ్మా!” వాళ్ళందరూ మాట్లాడుకోవడం చూసి దగ్గరకు వచ్చిన చంద్రావతి అంది.
“మరేమిటట?” అందరూ ఒకేసారి అడిగారు.
“ఆవిడే విడాకులాయన మొహాన కొట్టి మరీ వెళ్లిపోయిందట” అటూ, ఇటూ చూసి, గొంతు తగ్గించి చెప్పింది చంద్రావతి.
“ఏమిటేమిటి? విడాకులే! ఆయన మొహాన కొట్టిందా? ఏమటా?”
“ఆవిడకు టీచరుగారిని పెళ్లి చేసుకోవడం ముందు నుండీ ఇష్టం లేదట. చదువుకున్నప్పుడు ఎవర్నో ప్రేమించిందట. అందుకని ఇప్పుడాయన్నే పెళ్లి చేసుకోవాలని టీచరుగారికి విడాకులు ఇచ్చిందట” అసలు రహస్యం చెప్పింది చంద్రావతి.
“కలికాలం కాకపోతే, ఇలాంటివి ఎప్పుడన్నా విన్నామా! కన్నామా! అందుకే ఆడపిల్లలను ఎక్కువ చదివించకూడదని మా అమ్మ చెబుతుంటుంది.”
“మీ అమ్మ చెప్పింది నిజమే వదినా. ఆడవాళ్లకు అందంతోపాటు చదువులూ ఉంటే ఇలాగే ఉంటాయి కాపురాలు మరి”
“పోనీలే మన ఊరికి పట్టిన పీడ వదిలిపోయింది. వచ్చిన కొత్తలో ఎంత అన్యోన్యంగా ఉన్నట్టు కనిపించేవారు. అంతా పై పై మెరుగులేనన్నమాట.”
“అంతేకదా మరి. అందుకే కదా, కంచుమ్రోగినట్లు కనకంబు మ్రోగునా! అన్నారు.” ఇలా మరొక అరగంట మాట్లాడుకుని అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు బయలుదేరారు అమ్మలక్కలు.
***
అసలు జరిగిన విషయం ఏమిటంటే జనార్ధన్ కు ఏవో ఎగ్జామ్స్ ఉండి, ఒక వారం రోజులు విశాఖపట్నం వెళ్లాలంటే, “అయితే మీరు లేకుండా ఒక్కదానినే ఈ వూరిలో ఎందుకు? మా పుట్టింటికి వెళ్తానని” చెప్పింది సౌమ్య. పక్కింటి వాళ్ళ టీవీ సౌండులో ఒకరి మాట ఒకరికి వినిపించక, కాస్త గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. అదీ జరిగిన విషయం.
ఆ మాత్రం దానికి…….
వారం రోజులు గడిచాక, వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేసరికి చూశారు కదా మీరే? ఏమి జరిగిందో? మనుషుల ఊహాగానాలకు అవధులేముంటాయి. అవధులు లేని అమ్మలక్కల ఊహాగానాలతో వీరిద్దరూ కొట్టుకోవడం, విడిపోవడం, ఆఖరికి వారం రోజులు పోయాక ఇంటికి వచ్చిన ఆ భార్యా భర్తలకు తమ ఊహలలో వీరందరూ కలిసి విడాకులు కూడా ఇప్పించేశారు. అదండీ సంగతి.
–
-డాక్టర్ మజ్జి భారతి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
“ఇదిగో తోక -అదిగో పులి” -(కథ)- మజ్జి భారతి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>