కులం కన్నా గుణం ముఖ్యం(కథ)- శశి

“అన్నయ్యా !వదినా! రండి ఏంటి హఠాత్తుగా? చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే, రండి రండి”
“బాగున్నావా రజని? ఏం చేస్తున్నావ్? శ్రీకర్ ఎలా ఉన్నాడు? అంటూ లోపలికి వచ్చింది దివ్య. ఆ వెనకాలే ఆమె భర్త నీరజ్”
బాగున్నా వదినా! శ్రీకర్ కూడా బాగున్నాడు. ఆఫీస్ కి వెళ్ళాడు. మీరు బాగున్నారా? మీరు వచ్చారని ఫోన్ చేస్తా, ముందుగా వస్తాడు. కూర్చోండి” అని సోఫా చూపించింది రజని.
“మేం నీతో మాట్లాడే పని మీద వచ్చాము .మళ్లీ వచ్చి శ్రీకర్ నీ చూస్తాములే .ముందు నువ్వు కూడా కూర్చో”
“అలాగే అన్నయ్య మీకు మంచినీళ్లు తెస్తా ఉండండి” అంటూ వంటింట్లోకి వెళ్లి, పొయ్యి మీద టీ పెట్టి, మంచినీళ్లు ఇచ్చి, బిస్కెట్లు టీ తీసుకోవచ్చి, అన్నయ్య వదినలకి ఇచ్చి, వాళ్ళ ఎదురుగా కూర్చుంది రజనీ.
“అమ్మా రజిని . నీకు తెలుసుగా నీ మేనకోడలు వర్షిణి ,ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. శ్రీకర్ కి వర్షిణి ని ఇచ్చి వివాహం చేస్తే, ఈడు జోడు బాగుంటుందని మా ఇద్దరి అభిప్రాయం. నాన్నగారు ఒక పుస్తకంలో మనందరి పుట్టిన తేదీలు రాశారు అందులో శ్రీకర్ పుట్టిన తేదీ సమయం కూడా ఉన్నాయి .ఇద్దరి జాతకాలు మన ఇంటి దగ్గర శివాలయంలో పంతులుగారికి చూపించాము .’జాతకాలు చక్కగా కుదిరాయి ‘అని చెప్పారు. వర్షిణికి కూడా చెప్పాము .దానికి ఇష్టమే. నువ్వు శ్రీకర్ కి కూడా చెబితే ముహూర్తాలు పెట్టేసుకుందాం “అన్నాడు నీరజ్.
ఆ మాటలు విన్న రజినీకి ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు ఆనందం. తను ఇది వరలో చాలాసార్లు, పిల్లలకి పెళ్లి చేస్తే బాగుంటుంది .నా మేనకోడలే నా కోడలు అవుతుంది. అంటే, ‘చిన్న పిల్లల్ని పట్టుకుని పెళ్ళంటూ ఏంటా మాటలు? అయినా నా కూతుర్ని రాణిలా పెంచుతున్నాను. రాజా లాంటి గొప్ప సంబంధం చూసి చేస్తా’ అన్న అన్నయ్యేనా,ఇలా తన ఇంటికి వచ్చి మరి సంబంధం అడుగుతున్నాడు. అని మనసులో అనుకుంది.
“రజని ఏమంటావ్ ?”అన్న నీరజ్ మాటలకు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చిన రజని “సరే అన్నయ్య “అంది.
సరే అయితే మేం బయలుదేరుతాం. నువ్వు శ్రీకర్ తోమాట్లాడి సాయంకాలం ఫోన్ చెయ్. అని భార్యాభర్తలిద్దరూ తాము తెచ్చిన స్వీట్లు ,పళ్ళు రజిన చేతికి ఇచ్చి, బయలుదేరారు.
వాళ్లు వెళ్లిపోయాక సంతోషంతో గాల్లో తేలుతున్నట్టుగా ఉంది రజనీకి. సాయంత్రం కొడుకు రాగానే విషయం చెప్పింది చాలా ఉత్సాహంగా.
శ్రీకర్ ఒకసారి తల్లి వైపు చూసి “అమ్మ ఈరోజు మామయ్య వాళ్ళు మన ఇంటికి వచ్చి సంబంధం అడిగారని సంబరపడుతున్నావ్ .కానీ నీకు గుర్తుందా ?నేను ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్నప్పుడు నాన్న చనిపోతే ఏ ఒక్కరూ మనల్ని ఆదుకోలేదు. దాచిన కొద్ది డబ్బులు తో నాన్న కార్యక్రమాలు పూర్తిచేసి, ఇక నెల నెల ఆదాయం వచ్చే మార్గం లేదు కనుక, వైజాగ్ లో మనం ఉన్న అద్దింటిని ఖాళీ చేసి గోపవరంలో మన వాటాకి వచ్చిన చిన్న పోషన్లోకి మకాం మార్చాం. అప్పుడు నాన్న ఫ్రెండు ‘ప్రకాశం అంకుల్ ‘, నీకు ధైర్యం చెప్పి నన్ను ఆయనతో తీసుకువెళ్లి వాళ్ళింట్లో అట్టి పెట్టుకుని చదివించారు. నాకు ఏ లోటు లేకుండా ప్రేమగా చూసుకున్నారు. ఆ సమయంలో మనం ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడ్డామో మర్చిపోయావా? అప్పుడు ఈ మావయ్య వాళ్ళు కానీ, మరే బంధువులుకానీ, మనకు సహాయం చేయలేదు సరి కదా, చాలా లోకువగా, హీనంగా చూసేవారు. వర్షిణి కూడా చాలా గర్వంగా ప్రవర్తించేది. ఆ కసి పట్టుదలతో, నిన్ను బాగా చూసుకోవాలనే కోరికతో ,రాత్రి పగలు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాను .క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం సంపాదించా. ప్రమోషన్ కూడా తెచ్చుకున్నాను. ఇల్లు కారు అన్ని సమకూర్చాను.
ఆరోజు మనకి ఏవీ లేవు కాబట్టి, హీనంగా చూశారు. ఈరోజు అన్ని ఉన్నాయి కాబట్టి, గౌరవిస్తున్నారు. రేపు మళ్లీ మనకేం లేకపోతే, ఈ ప్రేమ అభిమానాలు మాయమైపోతాయి .ఇలాంటి ఊసరవెల్లి ఇలాంటి మనస్తత్వం కలిగిన వారితో బంధుత్వం వద్దమ్మా!
నేను ప్రకాశం అంకుల్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్లంతా నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. వాళ్ళ అమ్మాయి ప్రియ నేనంటే చాలా అభిమానం గా ఉండేది. మన పరిస్థితి నాకు తెలుసు కాబట్టి, నేను నా హద్దుల్లో ఉండేవాడిని. ఉద్యోగం వచ్చిన కొత్తల్లో, వైజాగ్ వెళ్లి ,వాళ్ళని కలిసి నా ఆఫీస్ అడ్రస్ ఇచ్చి వచ్చాను. తర్వాత కూడా ఒకటి రెండు సార్లు ప్రియతో మాట్లాడాను. నా ఫోన్ నీళ్లలో పడిపోవడంతో, నెంబర్లన్నీ పోయాయి .అదే నెంబర్ తీసుకుని ప్రియ ఫోన్ కోసం చాలా ఎదురు చూశాను .కానీ ఫోన్ రాలేదు. సెలవులు చూసుకుని వైజాగ్ కూడా వెళ్లాను .వాళ్ళు ఇల్లు మారారట .కొత్త అడ్రస్ తెలియలేదు. అప్పటి నుంచి వాళ్ల గురించి ఎంక్వయిరీ చేస్తూనే ఉన్నా. ప్రకాశం అంకుల్ కి పక్షవాతం వచ్చిందిట . ప్రియ చదువు ఆపేసి, ఉద్యోగం చేస్తూ ఇంటిని నడుపుతోందిట. నాలుగు రోజుల క్రితమే వాళ్ళ అడ్రస్ దొరికింది. ఈ శనీ ఆదివారాల్లో వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నా. నువ్వు ఒప్పుకుంటే ప్రియను పెళ్లి చేసుకుంటా. వాళ్ళ కుటుంబ పోషణకి నెలనెలా డబ్బు పంపి ,ప్రియ తమ్ముడు రాహుల్ ని కూడా చదివించాలి అనుకుంటున్నాను”.
“నువ్వు చెప్పిందంతా నిజమే కానీ ప్రకాశం అంకుల్ వాళ్ళది మన కులం కాదు. కులాంతర వివాహం చేసుకుంటే మన చుట్టాలు మన ఇంటికి రారేమో”
“అవసరమైనప్పుడు ఆదుకోలేని చుట్టాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావ్? అమ్మ కులం కన్నా గుణం, మంచితనం ముఖ్యం. ఆపద సమయంలో మనల్ని ఆదుకుని ,చదివించి నన్ను ఇంత వాడిని చేసిన, ప్రకాశం అంకుల్ వాళ్లకు తోడుగా ఉండాలి అనుకుంటున్నాను. కాదనకమ్మ”
“నిజమేరా నీతో పాటు వైజాగ్ నేను వస్తాను . ఇవాళ సాయంత్రం నన్ను బజారుకు తీసుకెళ్ళు నా కోడలికి చీర జాకెట్టు ఇంకా చాలా కొనాలి” అంది రజని సంబరంగా.
“సరే అమ్మ”అన్నాడు సంతోషంగా శ్రీకర్ తల్లివైపు చూస్తూ.
-శశి,
అజ్జమూరు,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
కులం కన్నా గుణం ముఖ్యం(కథ)- శశి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>