#థాంక్యూ సో మచ్#(కథ) – శశి,

ఆఫీసులోకి అడుగుపెట్టడంతోనే ,వాళ్ళ మాటలు చెవిని పడటంతో మొహం చిట్లించుకుని ,”అబ్బా ” అని మనసులో బాధగా, విసుగ్గా, అనుకుంటూ ,లోపలికి ప్రవేశించింది మృదుల .
“ఏంటి శ్రావణి గారు ఇవాళ డల్ గా కనిపిస్తున్నారు? పొద్దు పొద్దుటే మీ వారితో దెబ్బలాడి వచ్చారా ఏంటి” అంటూ పళ్ళని బయటపెట్టి, నవ్వుతున్నాడు విక్రమ్. పక్కనే ఉన్న శశాంక్ ,గౌరీష్ ఆ నవ్వుతో శృతి కలిపారు.
శ్రావణి ఇబ్బందిగా కదిలి “అయ్యో అదేం లేదండి కొంచెం నీరసంగా ఉంది అంతే” అని సమాధానం చెప్పింది మొహమాటంగా.
అప్పుడే వచ్చిన మృదులను చూసి ,”మృదుల గారు ఇవాళ ఏం వండారు ?”అని అడిగాడు లేని చనువు తీసుకుంటూ ,
“ఆ వంటదేముందిలెండి. ఏదో ఒకటి చేయాలిగా! నిన్న మీరు మెయిల్ చెక్ చేసుకోవడంలో పొరపాటు పడి ఒక ఫైల్ పెండింగ్ పెట్టారు. అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని, ఇవాళ సాయంత్రానికి కంప్లీట్ చేసి సబ్మిట్ చేయమని మేనేజర్ చెప్పారు .అది మీరు త్వరగా టైపు చేస్తే దానికి ప్రోగ్రాం డిజైన్ చేయాలి” అంది శ్రావణి చాకచక్యంగా మాట మారుస్తూ.
” చేస్తాలెండి ఎంతసేపు నేను తలుచుకుంటే పది నిమిషాలు పని “అన్నాడు కాలర్ ఎగరేస్తూ విక్రమ్ .
హెచ్ఆర్ రత్నాకర్ పిలవడంతో, అతనితో మాట్లాడటానికి అక్కడినుంచి కదిలారు విక్రమ్ బ్యాచ్ .
అది చూసి శ్రావణి ,మృదుల, కావ్య ,మనస్విని ” అన్నట్లుగా ఊపిరి పీల్చుకుని ఒకరినొకరు చూసుకున్నారు .
మనస్విని”రోజురోజుకీ వీళ్ళ అతి చనువు ఎక్కువైపోతోంది”.
శ్రావణి”అవును ఆ కుళ్ళు జోకులు భరించలేకపోతున్నాం “
కావ్య”ఆఫీస్ అంటేనే చిరాకు వస్తుంది గట్టిగా సమాధానం చెప్తామంటే ,కొలీగ్స్ కదా అనవసరంగా గొడవ ఎందుకు? అని ఆలోచించాల్సి వస్తోంది “
మృదుల”మనం ఆవేశ పడటం వలన ప్రయోజనం ఉండదు .ఇలాంటివన్నీ పట్టించుకుంటూ పోతే మనం బయటకు వచ్చి ఉద్యోగాలు చేయలేం అందరూ మంచివాళ్లే ఉండరు కదా అభివృద్ధి ఆకాశాన్ని తాకుతున్నా ,ఆలోచనలు మురికి కాలంలోనే ఉండే ఇలాంటి వాళ్ళు అడుగడుగున ఉంటారు. మనం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా దృఢంగా ఉండాలి .ఇలాంటి వాళ్ళు అతిచనువు తీసుకోకుండా మాటలు మధ్యలోనే కత్తిరిస్తూ తెలివిగా మన పని మనం చేసుకోవాలి .
మృదుల మాటలు వింటూ, మిగిలిన ముగ్గురు అవును అన్నట్లుగా తలఊపి పనిలో పడ్డారు .
వారం తర్వాత జరగబోయే సంక్రాంతి సంబరాల ఏర్పాట్లలో ఎవరికి వాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు .
కేవలం పనే కాదు ఆటవిడుపు, ఉత్సాహం కూడా ఉండాలని ఉద్దేశంతో, కంపెనీ యాజమాన్యం “ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాల్గొనాలి “అనే నిబంధన పెట్టడంతో ,
కొంతమంది ఏర్పాట్లు చేయడంలో ,
ఇంకొంతమంది గేమ్స్ లో,
మరికొంతమంది డెకరేషన్, ఫుడ్ ఏర్పాట్లు, ఇలాంటి వాటిల్లో పాల్గొన్నారు .
విక్రమ్ గ్యాంగు మాటలతూటాలు, కొంత ఇబ్బంది పెట్టినా ,ఆడవాళ్లు కూడా ఉత్సాహంగానే పాల్గొన్నారు .
అది శుక్రవారం, అప్పటివరకు నవ్వుతూ ,వేళాకోళాలతో, సందడిగా ఉన్న ,ఆఫీస్ ,వారం రోజులు మీటింగ్ నిమిత్తమై జార్జియా వెళ్లి ఆ రోజే తిరిగి వచ్చిన, HR ,మేనేజర్ ఇద్దరూ ,ఆఫీసులోకి ప్రవేశించడంతో నిశ్శబ్దంగా పనిలో మునిగిపోయింది .
ఒక అరగంట నిశ్శబ్ద వాతావరణం తర్వాత అప్పటికే సమయం మూడు దాటడంతో ,టీ బ్రేక్ కోసం ఒక్కొక్కరే లేచి క్యాంటీన్ వైపు నడవసాగారు.
మృదుల , మనస్విని, కావ్య, శ్రావణి లు కూడా టీ తాగుతూ ఉండగా ,విక్రమ్ గౌరీ శశాంకులు క్యాంటీన్లోకి ప్రవేశించారు. వాళ్ళని చూడడంతోనే ఆడవాళ్లు మొహాలు ఇబ్బందిగా పెట్టారు .
మనస్విని”త్వరగా తాగండి వాళ్ళు టీ తెచ్చుకునే లోపే వెళ్ళిపోదాం. లేదంటే ఆ కుళ్ళు జోకులు వినలేక చావాలి” అంది నెమ్మదిగా స్నేహితులకు మాత్రమే వినపడేలాగా .
ఈలోగా విక్రమ్ వాళ్లు టీ దగ్గరికి వెళ్లకుండా, సరాసరి వీళ్ళు ఉన్నచోటకే వచ్చారు .
విక్రమ్”కావ్యగారు ఈమధ్య ఓళ్ళు చేసినట్టు కనిపిస్తున్నారేంటి ?”అని అడిగాడు.
గౌరీష్”ఇంటి పని ,వంట పని, అంతా వాళ్ళ ఆయన గారే చేసేస్తున్నారు ఏమో ?”
అంటూ పగలబడి నవ్వాడు . మిగిలిన
ఇద్దరు శృతి కలిపారు .
కావ్య”అందరి ఇళ్లల్లో ఒకే పరిస్థితి ఉండదు కదండీ “
అ0ది కోపాన్ని అణుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ .
విక్రమ్ వాళ్ళు ఆ మాటను అర్థం చేసుకునే లోపే, ఆడవాళ్లు నలుగురు అక్కడి నుంచి కదిలారు.
ఇంకో అరగంటలో ఆఫీస్ అయిపోతుంది అనగా, మేనేజర్ మృదులను తన కాబిన్ కి పిలిచాడు.
మేనేజర్”మృదులు గారు ఆ బెంగళూరుకి సంబంధించిన ఫైల్స్ కి ప్రోగ్రామింగ్ చేయడం అయిందా? ఒకసారి చూసి పంపించేస్తాను. వాళ్ళ ఓకే అనుకుంటే సోమవారం వస్తారు మీటింగ్ కి “అన్నాడు .
ఆ మాటలు విన్న మృదుల ఆశ్చర్యపోతూ”ఏం ఫైల్ సర్? మీరు ఏమి చెప్పలేదుగా? అంతకుముందు ఇచ్చినవే, ఇంకా పెండింగ్ ఉన్నాయి. మీరు నెలాఖరు వరకు సమయం ఉందన్నారని నెమ్మదిగా చేస్తున్నా”అంది .
“అదేంటి మీకు విక్రమ్ ఫైల్స్ రెడీ చేసి ఇవ్వలేదా?”అని అడిగాడు .
“లేదు సార్”అంది మృదుల అయోమయంగా చూస్తూ .
వెంటనే మేనేజర్ సీట్లోంచి లేచి, గబగబా బయటికి వచ్చి ,
“విక్రమ్ !మిస్టర్ విక్రమ్! “అని పిలుస్తూ ,విక్రమ్ సీటు వైపుగా నడిచాడు .
ఫ్రెండ్స్ తో నవ్వుతూ కబుర్లు చెప్తున్న విక్రమ్ ,తన పేరు గట్టిగా వినపడేసరికి, ఉలిక్కిపడి ,పక్కకు తిరిగి చూసి, తన వైపుగా వస్తున్న మేనేజర్ ని చూసి ,లేచి నిలబడి ,ప్రశ్నార్ధకంగా చూశాడు.
“విక్రమ్ నేను ఊరు వెళ్లే ముందు రోజు మిమ్మల్ని నా క్యాబిన్ కి పిలిచి మీకు నాలుగు ఫైల్స్ మెయిల్ చేస్తా! వాటిని చెక్ చేసి, టైప్ చేసి మృదుల గారికి ఇమ్మని చెప్పాను కదా! మృదుల గారిని కోడింగులు చేసి నేను వచ్చేసరికి రెడీగా ఉంచమని చెప్పమని చెప్పా కదా! ఆరోజు మృదుల గారు, ఫ్యామిలీ ఫంక్షన్ ఉందని సెలవు పెడితే, ఆవిడకి కాల్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకని, మిమ్మల్ని చెప్పమని చెప్పాను. మీరు చెప్పలేదా? మీకు అప్పగించిన పనైనా చేశారా? అది కూడా లేదా?” అని అడిగాడు. మేనేజర్ కొంచెం కోపంగానే .
“సర్ ఆరోజు సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు చూస్తూనే ఉన్నాను కానీ మీ నుంచి మెయిల్ ఏం రాలేదు”అన్నాడు విక్రమ్ .
“అయ్యో విక్రమ్ తెల్లవారి మీకు మెయిల్ చేసే నేను బయలుదేరాను. మధ్యలో కూడా రెండుసార్లు వర్క్ ఎంతవరకు వచ్చిందని? మెయిల్ చేశాను.
అక్కడికి ఇక్కడికి సమయం తేడా ఉండటం వలన కాల్ చేయకుండా మెయిల్ చేశాను. చూడలేదా”
“చూడలేదు సార్”
“మీకు ఎన్నిసార్లు చెప్పాను విక్రమ్ .మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి అని. ఈ వారంలో ఒక్కసారి మెయిల్ చెక్ చేసిన ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా! అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పినా కూడా, మీరు ఇలా చేశారంటే ఏమనుకోవాలి? ఇదివరకు కూడా చాలా సార్లు ఇలానే చేశారు”
“సారీ సార్”
“సారీ కాదు ఏం చేస్తావో నాకు తెలియదు .ఇవాళ ఆ మెయిల్ లో ఉన్న ఫైల్ లు అన్ని చెక్ చేసి ,టైప్ చేసి ఇంటికి వెళ్ళండి . మిమ్మల్ని నమ్మినందుకు శిక్షగా నేను కూడా మీ పని అయ్యేవరకు ఇక్కడే కూర్చుంటాను”అని విక్రంతో చెప్పి ,మృదుల వైపు తిరిగి
“సారీ మృదుల గారు! మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాల్సి వస్తోంది .రేపు శనివారం ,ఎల్లుండి ఆదివారం రెండు రోజులు మనకు సెలవు. కానీ మీరు లాప్టాప్ ఇంటికి పట్టుకెళ్ళి, రేపు సాయంత్రం లోపు కోడింగ్ పూర్తి చేసి నాకు పంపాలి. మీ చేత ఎక్స్ట్రా వర్క్ చేయిస్తున్నందుకుగాను, నేను మీకు పే చేస్తాను. ఈ ఒక్కసారికే తప్పదు ప్లీజ్”అన్నాడు ఎంతో వినయంగా.
“అలాగే సర్ పర్వాలేదు”అని సమాధానం చెప్పింది మృదుల .
మేనేజర్ క్యాబిన్లోకి వెళ్లిపోయాక ఒక్క నిమిషం తల పట్టుకు కూర్చున్నాడు విక్రమ్
“నాలుగు ఫైల్స్ ఎంత వేగంగా చేసినా ఒక్కో ఫైల్ కి గంటన్నర సమయం పడుతుంది. ఇప్పుడు టైం ఐదు అవుతోంది. అంటే పని పూర్తి అయ్యేసరికి, రాత్రి 11 దాటుతుంది .ఎవరి సహాయం అయినా తీసుకుంటే పని త్వరగా అవుతుంది కదా”అని ఆలోచించుకొని తన స్నేహితులు శశాంక్ గౌరీష్ లను సహాయం చేయమని అడిగాడు .
శశాంక్”సారీ విక్రమ్! ఇవాళ సినిమా ప్రోగ్రాం వేసుకున్నాం. టికెట్లు కూడా బుక్ చేసేసుకున్నాం. మీ చెల్లాయి పిల్లలు బాధపడతారు ఏమనుకోకు”అని నెమ్మదిగా జారుకున్నాడు.
గౌరీష్”నీకు తెలీదురా! మా ఆవిడకు అనుమానం ఎక్కువ. ట్రాఫిక్ వల్ల ఒక అరగంట ఆలస్యమైనా, సవాలక్ష ప్రశ్నలు వేసి చంపేస్తుంది. ఇప్పుడు వర్క్ అని చెప్పిన నమ్మదు .సారీరా ఇంకోసారి తప్పకుండా సాయం చేస్తా”అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా గబగబా వెళ్ళిపోయాడు.
ఇదంతా చూస్తున్న మృదుల వాళ్లు, తమలోతాము మాట్లాడుకుని విక్రమ్ కి సహాయం చేయాలని నిశ్చయించుకున్నారు.
మనస్విని వాళ్ళ అబ్బాయికి కొద్దిగా జ్వరంగా ఉండటంతో, తనని పంపి, మిగిలిన ముగ్గురు విక్రమ్ దగ్గరికి వచ్చారు.
మృదుల”విక్రమ్ గారు మేము కూడా ఫైల్స్ చెక్ చేసి టైప్ చేస్తాం .త్వరగా అయిపోతుంది. కంగారు పడకండి .ఆ ఫైల్స్ మాకు సెండ్ చేయండి”అంది.
“మీరా”అన్నాడు విక్రమ్ అపరాధ భావంతో
“తప్పేముంది విక్రమ్ గారు మనందరం ఒకే ఆఫీస్. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి త్వరగా పంపండి పని త్వరగా పూర్తి చేసి ఇంటికి వెళ్లిపోదాం”అంది శ్రావణి.
కృతజ్ఞతా పూర్వకంగా ఒక చిరునవ్వు నవ్వి ,ఫైల్స్ వాళ్ళకి సెండ్ చేసాడు విక్రమ్.
నలుగురు తలో ఫైల్ గంటన్నరలో పూర్తి చేసేసారు. 6:45 కి అవన్నీ మృదులకు సెండ్ చేసి విషయం చెప్పడానికి మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళాడు విక్రమ్.
“చూశారా విక్రమ్ మీ మాటలతో రోజు వాళ్ళని బాధపెడుతున్న, ఇప్పుడు మీకు అవసరమంటే వాళ్లే నిలబడ్డారు. మీ వెనక తిరిగే మీ స్నేహితులు కాదు అదే స్త్రీ గొప్పతనం .ఆమెకున్న సహనం ,ఓర్పు, క్షమించే గుణం, మనకు ఉండవు .ఆ లక్షణాలే కనక వారిలో లేకపోతే మానవజాతికి మనుగుడే ఉండదు. ఇప్పటికైనా వారిని ఇబ్బంది పెట్టడం మానుకోండి గౌరవించడం నేర్చుకోండి”అని చెప్పి పంపిస్తాడు.
మేనేజర్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన విక్రమ్, బ్యాగులు సర్దుకుంటూ వెళ్ళటానికి సిద్ధమవుతున్న, మృదుల ,శ్రావణి ,కావ్యాలను చూస్తూ ,మనస్ఫూర్తిగా చేతులు జోడించి “థాంక్యూ సో మచ్” అన్నాడు.
శశి,
అజ్జమూరు,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~“

చాలా బాగుంది శశి గారు. మనకు ఎవరు హితులు అన్నది మనం కష్టాల్లో ఉన్నప్పుడే తెలుస్తుంది. మిగిలిన వారంతా కేవలం కాగితపు పడవల వంటి వారని అవసరంలో ముంచేస్తారని భలేగా చెప్పారు.