నాతో కాసేపు మాట్లాడవూ! (కవిత)-పంపోతు నాగేశ్వరరావు
రవికిరణాల సెగలకు
ఇసుకనేలలో అడుగెట్టి
పాదం మండే తరుణంలో
కాసేపు నా పంచన నిలువవూ.!
నా ఛాయచే చల్లబడిన మట్టిని
నీ పాదాలకంటిస్తాను
బొబ్బంటిన అరికాలకు సైబాల్ రాసే అమ్మలా.
కాసేపు నా నీడలో ఉండవూ
వేసవిలో
నీ మూర్ధాన అమ్మ చెంగు
అడ్డుపెట్టినట్టు
నా విశాల కొమ్మలతో నీడనిస్తాను
కాసేపు
నా ఒడిలో నిద్రపోవూ.!
అమ్మ ఒడిలో నిద్రపోయినట్టు
చల్లని చిరుగాలిని మేనుపై స్పర్శిస్తాను.
మీ వెచ్చని ఉచ్ఛ్వాస భరించి
పచ్చని నిశ్వాస నిచ్చేదాన్ని
జగతికి ప్రాణవాయువునిచ్చే దాన్ని నేను
కాసేపు నాతో మాట్లాడవూ!
ఆకలేస్తే అమ్మ బువ్వెట్టినట్టు
నీ ఉదరానికి తీయని ఫలాలనిస్తాను.
కాసేపు నన్ను ప్రేమగా హత్తుకోవూ!
కష్టాలు అలలెదురైనప్పుడు
నాలా తటస్థంగా నిలబడే
ధైర్యాన్నిస్తాను.
నాతో కాసేపు మాట్లాడవూ.!
చరమాంకంలో
నువ్వు పోయాక
నా దేహాన్ని వ్యధతో చీల్చుకొని
ముక్కల మంచం సేసి
కన్నీటితో నింజేరి
కాష్ఠంతో చేరువై
బూడిదనై కలిసి నిను చేరతాను!
ఇప్పుడైనా నాతో మాట్లాడవా..!
మనిషి ప్రకృతి ఒకటేనని
మనుషులుంటేనే
ప్రకృతి ఉంటుందని
ప్రకృతిని కోపిస్తే మనిషుండడని
ఇప్పటికైనా తెలిసిందా..!
ఓసారి వయనాడ్ చూడు
నేలతో నా బంధం తెగాకనేగా
మృత్యు బంధం చేకలిపింది
నువ్వు నేనూ ప్రకృతిలోక భాగమని
ఇవ్వడమే తప్ప తీసుకొవడమెరుగని మూగజీవిని నేను
ఇంతకీ
నువ్వేమిస్తున్నావూ..?
తుంచడమే తప్ప వొక పత్రంలోనైనా చిరునవ్వునైనా
పూయించావా….!
(చెట్టు -మనిషితో సంభాషణ)
–పంపోతు నాగేశ్వరరావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


Super ga undhi sir