ప్రియ శిష్యా…..(కవిత)-సుధా మురళి

నువ్వెప్పుడూ ఓడిపోతూ ఉండిపోకూడదనే
నీకు బలమవ్వాలని అనుకుంటాను
నిన్ను నిన్నుగా మార్చేందుకు
నన్ను నేను చాలానే కోల్పోతుంటాను
నీ గెలుపు శబ్దాన్ని ఈ లోకం వినాలనే
నా నిశ్శబ్దాన్ని బలి చేస్తుంటాను
నీ గురించి నువ్వు పడే తపనకన్నా
నీ జీవితం గురించి నేను పడే
తపన ఎక్కువని కాదు కానీ
అత్యంత అవసరమైనదని భ్రమిస్తుంటాను…
నువ్వు ఈలవేసినా గోలచేసినా
నీ బాల్యపు అల్లర్లని మురిసే నేనే
ఆ అల్లరి అలవాటుగా మారి
నువ్వెక్కడ నలుగురిలో
అల్లరిపాలు అవుతావో అని
నిన్ను మందలిస్తాను
నీ మనసులో మచ్చగా
మిగిలిపోతుంటాను….
అడ్డదిడ్డంగా నువ్వు పరిగెడుతుంటే
నీ అసలు చిరునామా
ఏదో చెప్పే ప్రయత్నంలో
నా చేతులతో
అడ్డుకట్టలు వేస్తాను
ఆనకట్టలు కడతాను
ఆ చేతలనే నువ్వు ముళ్ళ
కంచెలని విసుక్కుంటావు…
విలనిజం ఎరుగని విలన్ పాత్రలకే
నువ్వు పరిమితమౌతుంటే
నీ అసలు హీరోయిజాన్ని బయటకి లాగి
నీ చిత్తాన్ని ఏకాగ్రచిత్తంతో చిత్రించడంలో
నేను మరింత కఠినమౌతుంటాను
పొట్టిగా ఉన్నా పొడవుగా ఉన్నా
లావైనా సన్నమైనా
నువ్వెప్పుడూ మేలిమి బంగారానివే
నిన్ను మెరుగులు దిద్దే నిప్పును కదా
అందుకే ఎప్పుడూ కాలిపోతుంటాను
అప్పుడప్పుడూ బూడిదై రాలిపోతుంటాను
నా ద్వారానే
ఈ వ్యవస్థ నీ మెడపై కత్తులు పెడుతుంది
నీముందు నన్ను జోకర్ లా నిలబెట్టి
ఇక్కడి ఉరుకులు పరుగులు
పోటీతత్వం నీతో ఆటలాడుకుంటాయి…
అందుకే….
నీకు నీ భవిష్యత్తుకు వారధినైన నేనే
నీ దృష్టిలో నీకలలను చంపేస్తున్న హంతకురాలిని
నువ్వెప్పటికీ క్షమించలేని
నీ ప్రియ శత్రువుని
ప్రతిరోజూ ఒకరికొకరం ఎదురుపడే
మనమే
పరస్పర ప్రత్యర్ధులం
ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు చేసుకుంటున్న
ఆజన్మ విరోధులం
అయినా నీకు
నేనంటే కొంచెం ఇష్టం ఉన్నట్టే ఉంది
కష్టంగా అయినా నా మాటల్ని కొన్ని వింటావు
నువ్వెంతో గొప్పగా ఎదిగిపోతావు….
-సుధామురళి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

చాలా చాలా బాగుంది.సందేశాత్మకంగా ఉంది.