వాడని స్నేహ పరిమళాలు (స్మృతి వ్యాసం)- మందరపు హైమవతి
ఆత్మీయ మిత్రులు మనలను వదిలి వెళ్లినప్పుడు ఏమైనా రెండు మాటలు రాయాలన్నా, మనసు ఒణుకుతుంది. గుండె చెరువవుతుంది. ఇటీవల హఠాత్తుగా మరణించిన మిత్రురాలు రజిత గురించి రాయాలనుకున్న క్షణాల్లో ఇదే పరిస్థితి.
నిన్నగాక మొన్ననే వచ్చింది మా విజయవాడకు. చినముండా’ న్ఙ్గోజి అడిచే’ రాసిన ‘ఫెమినిష్ట్ మానిఫెస్టో ప్రసంగాలు’ పుస్తకం ఆవిష్కరించారు. రుద్రమ ప్రచురణల తరపున ఆ పుస్తకం ఎప్పుడో అచ్చయివుంది. పి.సత్యవతి గారికి తీరికలేకపోవడంతో ఆ పుస్తకం ఆవిష్కరణ కాలేదు. ఆ సందర్భంలో నాతో చాలాసార్లు మాట్లాడింది. చివరకు ‘బాలాంత్రపు ప్రసూన’ గారి ఇంట్లో ఆ పుస్తక ఆవిషర్కణ సభ పెట్టడానికి రావడం జరిగింది. అప్పుడే తనని చివరిసారిగా తనను చూడడం. ఆతర్వాత కొన్నిరోజులకే, తన మరణ వార్త వినడం విచారకరం.
రజితతో నా పరిచయo, సుమారు నాలుగు దశాబ్దాలు దాటింది. 82లో నేను హన్మకొండలో తెలుగు పoడిట్ ట్రైనింగ్ కి వెళ్లినప్పుడు తనతో నా పరిచయం. మధ్యలో రజితతో చిరు ఆటంకాలు వచ్చినా, ఆ స్నేహం చివరివరకు కొనసాగింది.
ఇటీవల ఆకాశవాణి కార్యక్రమం కోసం డా. ముదిగంటి సుజాతారెడ్డి గారి పుస్తకాల కోసం వెతుక్కుంటున్నప్పుడు ఆవిడ ఫోన్ నెంబర్ ఇచ్చి ప్రోత్సహించిన మంచి స్నేహశీలి. హన్మకొండ ట్రైనింగ్ లో వున్నప్పుడు ప్రతిరోజూ సాయంత్రం అనిశెట్టి రజిత, భండారు విజయ, శ్రీరంగస్వామి, నిధి(బ్రహ్మచారి), పొట్లపల్లి శ్రీనివాసరావు మొదలగు సాహితీ మిత్రు లoదరితో కలిసి అనేక సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనేవాళ్ళం. ప్రతి సాయంత్రం ఏదో ఒక సాహిత్య సురభి పరిమళం హన్మకొండలో వుండేది.
ఆ తర్వాత విశాఖపట్టణంలో ‘మనలోమనం’ కె.ఎన్ మల్లేశ్వరి గారు నిర్వహించిన సభలో కలుసుకున్నాం. మనలో మనం ‘ప్రరవే’ గా మారినప్పుడు తెలంగాణ శాఖకు అధ్యక్షురాలిగా, జాతీయ శాఖ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించింది. అనిశెట్టి రజిత రచయిత్రి, కవయిత్రి. మంచి వక్త. అంతేకాదు ‘రుద్రమ ప్రచురణలు’ పేర జిగర్,ఉద్విగ్న మొదలైన అనేక సంకలనాలు తన మిత్రబృంద, సహ సంపాధకీయవర్గంతో కలిసి అనేక సంకలనాలను ప్రచురిoచింది. ఎన్నో కవిత్వ సంపుటాలు, నానీలు, హైకులు, దీర్ఘ కవితా కావ్యాలు ప్రచురించింది. తను ఎన్నో వైవిధ్యమైన అంశాలతో కూడిన పుస్తకాలకు సంపాదకత్వం వహించి ‘అక్షర శరధి దాశరధి’ మొదలగు వ్యాస సంకలనాలు తీసుకుని వచ్చింది.
రజిత జీవితం, సాహిత్యం వేరు, వేరు కాదు. దేనినైతే నమ్మిందో దాని గురించే రాసింది. ‘ముజఫర్ నగర్’ లోముస్లిం మహిళలపై మారణకాండ జరిగినప్పుడు భండారు విజయతో ఆప్రాంతాన్ని దందర్శించి, బాధితులను పరామర్శించి, వారిని ఓదార్చి, కన్నీటిని తుడవడమే కాకుండా, తిరిగివచ్చిన తర్వాత విజయతో కలిసి ‘ముజఫర్ నగర్ మారణకాండ’ పుస్తకం రాసింది.
విద్యార్ధి దశ నుంచే తజిత ఉద్యమ కార్యకర్త. ఎక్కడ అన్యాయం జరిగిన, ప్రతిఘటించేది. బడుగు,బహుజనుల పక్షాణ అన్యాయానికి గురిఅతున్నవారి పక్షాణ నిల్చి, అక్షర ఆయుధాలు ప్రయోగించింది. కవిత్వంలో, జీవితంలో అలుపెరుగక పోరాడింది.
అశేష పాఠకుల అభిమానాన్ని పొంది, తెలంగాణ సాహిత్యంలో కవయిత్రిగా, ఉద్యమకారిణిగా నిలిచినా, జీవితంలో అనారోగ్యానికి బలై ఓడిపోయింది. అకాలమరణం పొందింది. అయినా,చివరి వరకు అంతులేని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు.
రజితలో చెప్పుకో దగింది అచ్చమైన స్నేహ హృదయం. స్నేహితులంటే ప్రాణం పెట్టింది. ఎక్కడ ఏ ఊర్లో ప్రరావే సభలు జరిగినా, వరంగల్లు మిత్రులానందరిని కలుపుకుని వస్తుంది. ఎప్పుడూ బండారి సుజాత, శింగరాజు రామాదేవి,కొమర్రాజు రామలక్ష్మి, కొలిపాక శోభారాణి గారు మొదల్గు వారితో కలిసి వచ్చేది.
విజయవాడ మొన్న వచ్చినప్పుడు కూడా, తన మిత్రులందరితో కలిసి వచ్చి, కలిసి వెళ్ళేవారు. ఇటీవల కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంత తొందరగా వెళ్లి పోతుందని అనుకోలేదు. ఏదీ ఏమైనా, ‘సృష్టిలో తియ్యనిది స్నేహమేనోయ్’ అన్నట్లు స్నేహ సుగంధాలు ఆపాతమధురాలు.
ఎంతటి మంచివారికైనా కోపం అప్పుడప్పుడు కోపం రావడం సహజం. అప్పుడు ఉచితానుచిత వివక్షను కోల్పోతారు. అలాంటి సందర్భాలలో కొన్నిసార్లు, పెడుసుగా మాట్లాడినా, తార్వత మామూలుగా అయిపోయేది. ఈ సందర్భంలో నన్నయ పద్యం “నిండు మనంబు, నవనీత సమానంబు, పల్కు ధారుణాఖండల శస్త్ర తుల్యము” గుర్తుకువస్తుంది, మాట వజ్రంలా కఠినమైనా, మనసు మాత్రం అప్పుడే తీసిన వెన్నలా మృధుమధురం అంటాడు కవి.రజితకు అదే వర్తిస్తుంది.
టాల్ స్టాయ్ అన్న్తట్లు మనిషికి కావాల్సింది ఆరడుగుల నేల మాత్రమే. మానవ జీవితం బుద్బుదప్రాయం అయినా, ఆమె బతికి ఉన్నప్పుడు మాట్లాడిన, ప్రేమపూర్వక సoభాషణలు , ఆమె రాసిన రాతలే చరిత్రలో మిగిలిపోతాయి. బతుకు ఆశాశ్వితమైన అక్షరాలు శాశ్వితo. తన రచనల్లో చెప్పిన సత్యాలు, విలువలు, ఆత్మవిశ్వాస బోధనలు, జీవితం పట్ల కలిగించిన ఆశక్తి , చెప్పిన ధైర్యవచనాలు ప్రజలను ఉద్దేజిత్తులను చేస్తాయి. ఆ రచనలను రచయితలను బతికిస్తాయి. పూలు ఉదయo వికసించి, సాయంత్రానికి వాడిపోయి, నేల రాలిపోయినా, రజిత పంచిన ‘నెయ్యపు నేత్తావి తావులు’ స్నేహితుల హృదయాలలో ఎప్పటికీ పరిమళిస్తూనే వుంటాయి. రజిత బౌతికంగా మన మధ్య లేక పోవచ్చు. కానీ మన అంతరాలలో, అశేష పాఠకుల హృదయాంతరాలలో చిరకాలం జీవించే వుంటుంది. ఆమెకు నా కన్నీటి నివాళులు.
-మందరపు హైమవతి,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఔను…మనసు మరువని మనిషి దూరం ఓ గాయమే…
తలపు ఓ అనివార్య నరకం…జ్ఞాపకాలు జీవనదులు…పొంగుతాయి…ముంచుతాయి…బాధలో తెలుచుతాయి…సృష్టి విలాసం లో మనసు యాతన బహుచిత్రం.. మాయ…ఏమి చేస్తాం…ఎవరిని అడుగుతాను..ఇదేమిటని?…తప్పదు ఒక్కో మనిషి ఒక్కో కన్నీటి బిందువుగా కొట్టుకుపోవసిందే…