నిష్పాక్షికతను, నిజాయితీని అన్వేషించిన పరిశోధన (పుస్తక సమీక్ష )-ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు

“ముస్లిం ప్రపంచానికి రెండు పెద్ద పర్వదినాలుగా చెప్పుకునే రంజాన్,బక్రీద్ పర్వదినాలు లాగా తెలుగు సాహిత్యానికి ఇద్దరు ఇస్మాయిళ్లు. ఒకరు ‘చెట్టుకవి’ ఇస్మాయిల్, మరొకరు ‘ఖాళీసీసాలు’ ఇస్మాయిల్.పాఠకులు గందరగోళం చెందకూడదనే ఖాళీసీసాలు ఇస్మాయిల్ తన పేరులో స్మైల్ మాత్రం మిగుల్చుకున్నాడు.” ఈ వాక్యాలు నన్ను చాలా ఆకర్షించాయి. ఇవి డాక్టర్ మద్దాల పెద్దిరాజు పరిశోధన గ్రంథంలోనివి. ఆ పరిశోధన పేరు “స్మైల్ రచనలు -అనుశీలన”
పరిశోధకుడు డాక్టర్ మద్దాల పెద్దిరాజు తన సిద్ధాంత గ్రంథంలో ఇస్మాయిల్ జీవితాన్ని,కవిత్వాన్ని, కథలను, అనువాదాలను, నాటకాలను,లేఖా సాహిత్యం, సాహిత్య విమర్శనను సంక్షిప్తంగా, సమగ్రంగా సోదాహరణంగా విశ్లేషిస్తూ ఈ గ్రంథాన్ని అందించారు. ఇతర సాహిత్య సంబంధించిన విషయాలన్నిటినీ సమగ్రంగా అందించిన సిద్ధాంత గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని చదివిన తర్వాత స్మైల్ సాహిత్య దృక్పథాన్ని పాఠకులు చక్కగా అవగాహన చేసుకుంటారు. అంతకు ముందు ఆయన సాహిత్యంతో పరిచయం లేని వారికి ఆయన రచనలను చదవాలని ప్రేరణ కలుగుతుంది. ఆయనతో పరిచయం ఉండీ ఆయన రచనలను చదివిన వారికి మరొకసారి చదివించేలా క్రొత్త సమాచారం ఈ విశ్లేషణ కొనసాగింది.
సాహిత్యంలో కూడా కుట్రపూరిత రాజకీయాలు ప్రవేశించి కవి /రచయిత పేరును బట్టి ప్రాంతాన్ని బట్టి సాహిత్యాన్ని అంచనా వేసే ఒక అవాంఛనీయ సాహిత్య విమర్శ ధోరణి కూడా అక్కడక్కడ కనిపిస్తోంది. అటువంటి వారికి స్మైల్ గారిని ఆయన సాహిత్యం ద్వారా చెప్పాలనుకున్న అంశాలను అంతే స్పష్టంగా ఈ పరిశోధకుడు వివిధ ఆకరాలతో సమన్వయించిన తీరు పరిశోధకుడికి ఉండవలసిన నిజమైన పరిశోధన అన్వేషణను తెలియజేస్తుంది.
స్మైల్ సాహిత్య లక్ష్యాలను మూల్యాంకనం చేసేటప్పుడు పరిశోధకుడు ఒక ఉత్తమం విమర్శకుడిలా వ్యవహరించాడు.పరిశోధకుని శైలి ప్రత్యేకంగా చెప్పుకోవాలి సిద్ధాంత గ్రంథాలలో వివిధ ఆకరాలను వివరించడం తప్పనిసరి, అయినప్పటికీ అవి పాఠకుని పఠనాశక్తిని కుంచించకూడదు. అలాంటి వాక్యం రాయాలంటే పరిశోధకుడు ముందుగా ఆ పరిశోధనను బాగా జీర్ణించుకోవాలి దాన్ని సారాంశాన్ని తన మాటల్లో చెప్పగలిగే పరిణతిని సాధించాలి.వివిధ ఆకరాలను (sources) వివరిస్తూనే తన అభిప్రాయాలను సమర్థవంతంగా చెప్పగలగాలి. అలాంటి పరిణతి చెందిన వాక్యం ఈ సిద్ధాంత గ్రంథంలో కనిపిస్తుంది. పరిశోధకుడు తాను పరిశోధన చేసిన కవి, రచయిత, అనువాదకుడు, నాటక కర్త, విమర్శకుడిగా ఎన్నో రచనలు చేసిన ‘స్మైల్’గా ప్రఖ్యాతి పొందిన మహమ్మద్ ఇస్మాయిల్ (1942-2008) అంటే ఆయన ఇంచుమించు 66 సంవత్సరాలు జీవించారు. పుట్టింది కృష్ణాజిల్లా అయినప్పటికీ అనుబంధం అంతా అత్యధికంగా ఏలూరు,తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి,కాకినాడ తదితర ప్రాంతాల సాహితీవేత్తలతో గడిపారు. స్మైల్ ఉత్తిరీత్యా కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ గా పని చేశారు ప్రవృత్తి రీత్యా ఆయన ఒక సాహితీవేత్త.
ప్రముఖ సాహితీవేత్తలు శ్రీశ్రీ, చాసో, కాళీపట్నం రామారావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి,కాళోజీ నారాయణరావు, ఆచార్య వెల్చేరు నారాయణరావు,ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య చేకూరి రామారావు, వేగుంట మోహన్ ప్రసాద్, భమిడిపాటి రామగోపాల్,నగ్నముని, జ్వాలాముఖి, దేవీ ప్రియ, చెట్టుకవిగా పేరుపొందిన ఇస్మాయిల్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్, పతాంజలి శాస్త్రి,ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ,కడియాల రామ్మోహన్ రాయ్, కొండేపూడి నిర్మల, జయప్రభ,అప్సర్,మహమ్మద్ ఖదీర్ బాబు మొదలైన వాళ్ళతో సాహిత్య పరిచయాలు ఉన్నాయి . తనకంటే పూర్వం ఇస్మాయిల్ పేరుతో ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక కవి ఉండటం ఆ పేరు తన పేరు ఒకేలా ఉండటం వల్ల తన పేరును స్మైల్ గా మార్చుకున్న సహృదయుడు తెలివైన రచయిత.
ఇస్మాయిల్ పేరుతో మరొక ప్రసిద్ధ కవి ఉన్నాడనుకున్నాం కదా! ఆయన 1928లో జన్మించి 2003లో మరణించారు. అంటే దాదాపు 75 సంవత్సరాలు జీవించారు. చిలుకలువాలిన చెట్టు (1980) చెట్టు నా ఆదర్శం (1982) వంటి ఇమేజరీ పోయెట్రీని, కప్పుల నిశ్శబ్దం,బాల్చీలో చంద్రోదయం వంటి హైకూ కవితల సంపుటాలను రాయడంలోనూ ఆయన బాగా చేయి తిరిగిన కవి. ఆయన రాసిన కవిత్వంలో నిశ్శబ్దం (1990)గ్రంథం కూడా ఉత్తమ విమర్శ గ్రంథం. వృత్తిరీత్యా ఒక అధ్యాపకుడు, తత్వశాస్త్రాన్ని బోధించే అధ్యాపకుడు. పుట్టింది నెల్లూరు జిల్లా కావలి అయినప్పటికీ ఆయన విద్యాభ్యాసమంతా కాకినాడ, విశాఖపట్నం లోను ఉద్యోగం మాత్రం కాకినాడ, విజయవాడలోనూ కొనసాగింది. ఆయన ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు.
పరిశోధకుడు డాక్టర్ మద్దాల పెద్దిరాజు తన సిద్ధాంత గ్రంథంలో సంక్షిప్తంగానే చెప్పినా స్పష్టంగా అర్థమయ్యేలా ఇస్మాయిల్ గారు స్మైల్ కి అభిమానమైన కవుల్లో ఒకరని వివరించారు. వీళ్ళిద్దరినీ పోల్చి చెప్పకుండా పరిశోధకుడు చక్కని సంయమాన్ని పాటించడం బాగుంది. వాళ్ల ఉత్తమత్వాలను బేరీజు వేయకుండా ఇస్మాయిల్ పేరుతో ఇద్దరున్నా ఇస్మాయిల్, స్మైల్ వేరు వేరు సాహితివేత్తలని తన పరిధి వరకే చెప్పి ఆగిపోయాడు. పరిశోధకుడికి తన పరిధులు తెలిసి ప్రవర్తించడం ముఖ్యం అది ఇక్కడ కనిపిస్తుంది.
పరిశోధకుడు స్మైల్ గురించి మొదటి అధ్యాయంలో కొండను అద్దంలో చూపించినట్లుగా ఆయన జీవితాన్ని, రచనలను దృక్పథాన్ని స్పష్టంగా వివరించాడు. స్మైల్ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించేటప్పుడు పురుషోత్తం గారనే ఒక తెలుగు పండితుని ప్రభావం తనను పద్యాలను కంఠస్థం చేసేలా చేసిందని అదే ఆయనలో చక్కని తెలుగు భాష నేర్చుకోవడానికి, ఉత్తమ సాహిత్య సృజన కారణమైందని పరిశోధకుడు ప్రతిపాదిస్తూ తన సిద్ధాంతాన్ని మొదలుపెట్టాడు.
తల్లిదండ్రులు మత దృక్పథంతో కాకుండా స్వేచ్ఛగా అనేక పుస్తకాలను చదివించడం వల్ల స్మైల్ లో కుల, మత దృక్పథాలతో సాహిత్యాన్ని చూసే దృష్టి రాలేదని వ్యాఖ్యానించాడు. తన ముగ్గురు పిల్లలకూ కులాంతర వివాహాలు చేసి సమాజానికి ఆదర్శప్రాయుడయ్యాడు. స్మైల్ వర్గాలకి, కుల,మతాలకి, భాషా ప్రాంతాలకి అతీతంగా జీవించిన ‘మహామనిషి’ అని సిద్ధాంతికరిస్తూనే పరిశోధకుడు ఒక కవితాత్మక వాక్యంతో ఆయన్ని అభివర్ణించాడు. “ఎప్పుడూ పరిశుభ్రంగా, డేవిడ్ రోజ్ పువ్వులా ఉండేవాడు.” అదే పరిస్థితిలో స్మైల్ పీడన, వివక్షలకు గురి అవుతున్న ముస్లిం రచయితలకు మద్దతుగా నిలిచిన రచయితగా కూడా పరిశోధకుడు నిరూపించాడు. తాను ప్రతిపాదించే ప్రతి వాక్యానికి ఒక ఆకరాన్ని చూపించడం పరిశోధకుడు పాటించిన ప్రమాణాలకు శాస్త్రీయతకు నిదర్శనం.
స్మైల్ రాసిన 10 కథలను సంక్షిప్తంగా పరిచయం చేస్తూనే ఆ మూలంలో ఉన్న కథలను చదవాలనిపించేలా విశ్లేషణ చేశాడు.స్మైల్ కి ఎంతో పేరు తీర్చిన కథలలో ఖాళీ సీసాలు ఒకటి, ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు ఉచితంగా వైద్యం చేసి మందులు అరుకు(syrup) వంటివి ఇచ్చినా, ఆ ఆరుకును తీసుకోవడానికి ఖాళీసీసాలు ఇవ్వరు. తన తల్లి రోగం బాగుపడాలంటే అరుకు పోయాలి. అరుకు పోయాలంటే తనకి ఒక ఖాళీసీసా కావాలి. ఆ సీసా కోసం ఆ బాలుడు వెతుకుతూ బయటకు వస్తాడు. ఖాళీ సీసాలు అమ్ముకుని బ్రతికే ఇద్దరు ఆడవాళ్ళ మధ్య జరిగిన సంఘటన కేంద్రంగా చేసుకొని కథ రాశారు.
ఒకామె వయసులో ఉన్నది. మరొకరు వయసు వుడిగినామె. తమ కుటుంబం పోషించుకోవడం కోసం ఖాళీ సీసాలు అమ్ముకొని జీవిస్తూవుంటారు. ఈ అబ్బాయి దగ్గర తక్కువ డబ్బులు ఉండటం ఆ డబ్బులతో ఒక ఆమె దగ్గర ఖాళీ సీసా కొనడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమవుతుంది. అది చివరికి ఒక ఆమె చీర లాగేసే వరకు వెళుతుంది. ఆ చీర లాగేసిన తర్వాత నగ్నంగా రోడ్డు మీద నిలబడ్డ ఆమెను ఆధారం చేసుకుని రచయిత వర్ణించిన భావాలు ఈ సమాజంలో ఉన్న వికృత స్వభావాన్ని పట్టి చూపిస్తాయి.
ఇలా కథలను పరిచయం చేస్తూనే ఆ కథలపై వచ్చిన విశ్లేషణలతో తన ప్రతిపాదనలను పరిశోధకుడు ముందుకు తీసుకువెళ్ళాడు. స్మైల్ కథలు ద్వారా సామాజిక స్పృహను, దేశభక్తిని గుర్తించవచ్చునని పరిశోధకుడు ప్రతిపాదించాడు. పరిశోధకుని కొన్ని ప్రతిపాదనలను ఈ క్రింది విధంగా క్రోఢీకరించే అవకాశం ఉంది.
- స్మైల్ జాతీయ భావాలున్న,ప్రత్యేక శైలీ విన్యాసంతో కొత్త నిర్మాణంతో కథలు రాసిన రచయిత.
- సమాజంలో స్త్రీ,పురుష లైంగిక సంబంధాలతో ముడిపడిన అనేక సమస్యలను తన రచనల ద్వారా సమాజం ముందు ఉంచిన రచయిత. స్మైల్ తన కథలు, కవితలలో లైంగికత,లైంగిక ప్రతీకలు వాటి వలన వచ్చే వివిధ సమస్యలను లోతైన పరిశీలనతో సృజనీకరించిన రచయిత.
- తన కథలలో అస్తితవాద ఛాయలను మానసిక సంఘర్షణలను మనిషి అంతర్గత స్వభావాలను చిత్రించడంలో స్మైల్ చేయితిరిన రచయిత.
- కంబళి వంటి కథను పరిచయం చేస్తూ స్త్రీ పురుష లైంగిక సంబంధాలు ఒకవేళ సక్రంగా లేకపోతే అవి హోమో సెక్సువల్ కి ఎలా దారి తీస్తాయో చెప్పిన కథ.
- స్మైల్ కథలలో క్లుప్తత, మానసిక సంఘర్షణల చిత్రణ, అస్తిత్వవేదన శీలం పోగొట్టుకున్న స్త్రీల మనస్తత్వ చిత్రణ, పేదరికం దాని చుట్టూ అల్లుకున్న జీవితాలు వాటిని కథనం చేయడంలో శిల్ప పరంగా చైతన్య స్రవంతి వంటి శిల్పాన్ని వాడడం ఇవన్నీ రచయిత ప్రతిభకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. వస్తురూప శిల్ప వైవిధ్యాలను ప్రదర్శిస్తూ తన కథల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయితలలో స్మైల్ ఒకడుగా నిలుస్తాడు.
- ఆధునిక తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేసినా కవిత సంపుటల్లో స్మైల్ ‘ఒఖడే’ ఒకటి.
- స్మైల్ కాలంలో కవిత్వ రచనా నిర్మాణం, వస్తువు, రూపపరమైన మార్పులు రావడం ఆ మార్పులలో స్మైల్ కూడా ఒక కీలక పాత్ర పోషించారు.
- ఈయన కవిత్వంలో వాస్తవికత కన్నా నిక్షిప్తమైన తాత్విక ధోరణి అధికంగా కనిపిస్తుంది.
- స్మైల్ సంప్రదాయక నాటకం కంటే ప్రయోగ దృష్టితో వాస్తవికతకు దగ్గరగా జీవచైతన్యత ఉండాలని భావిస్తాడు దాన్ని నిరూపిస్తూ ‘ఆ!’అనే నాటకం రాశాడు.
- రచనకు అనుగుణమైన వర్ణనలు, సామెతలు, జాతీయాలు, పలుకుబడులు ఆ రచనకు ఉపయోగపడుతూనే వాటి ప్రత్యేక అస్తిత్వాన్ని కూడా నిలుపుకునేలా రచన చేయడం స్మైల్ ప్రత్యేకత. ఇలా భాషను వాడడంలో తెలుగు భాషపై ఆయనకున్న పట్టును తెలియజేస్తుంది.
- వచన కవిగా స్మైల్ అనేక ప్రయోగాలు చేశాడు. ఆ ప్రయోగాలు అతని విశిష్ట వ్యక్తిత్వానికి, భాషలో తనదైన శైలిని అన్వేషించడానికి ఆయన పడిన తపనకి ప్రతిబింబాలుగా నిలుస్తాయి.
- జీవితానుభవాలను, వాస్తవికంగా కళ్ళెదుట జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని గమనించి పర్యావరణ, పరిరక్షణ ఆవశ్యకతను తెలిపేలా కూడా కవిత్వాన్ని రాశాడు.
- స్మైల్ ఆంగ్ల సాహిత్యాన్ని బాగా చదివేవాడు. తనకు నచ్చిన రచనలను తెలుగులో కూడా అనువాదం చేసేవాడు. అనువాదం కూడా సహజమైన సొంత రచనలా అభివ్యక్తం కావడం వీరి అనువాద శైలి ప్రత్యేకత.
- సాహిత్య విమర్శలో సమకాలీన సాహిత్య చర్చలో పాల్గొని నిష్పక్షపాత దృష్టితో నిజాయితీగా స్మైల్ తన భావాలను స్పష్టంగా చెప్పేవారు. నవలలు, కథల పైన సమకాలీన అంశాలపై వచ్చిన వ్యాసాల పైన తన విమర్శను కొనసాగించడం ఆయన విమర్శకు ఉన్నటువంటి పరిధి.
- స్మైల్ వివిధ అంశాలపై సాహితీవేత్తలతోనూ సాహిత్యేతర వ్యక్తులకు రాసిన లేఖలు, ఆయన వ్యక్తిత్వాన్ని, సమకాలీన సమాజం పట్ల ఆయనకు ఉన్న అవగాహనను తెలియజేస్తాయి.
ఇలా మొత్తం ఆయన కథలు, కవితలు, నాటకం, అనువాద రచనలు, విమర్శనాంశాలు వీటి సంబంధించిన వివిధ అంశాలను సోదాహరణంగా సమన్వయిస్తూ పరిశోధకుడు తనదైన ప్రతిపాదనను మన ముందు ఉంచటం ఈ సిద్ధాంత గ్రంథంలో కనిపించే ఒక విశిష్టత.
స్మైల్ అనువాదానికి సంబంధించిన పరిశోధకుడు లోతైన పరిశీలన చేశాడు. అది ప్రత్యేకంగా ఒక పరిశోధన చేయవలసిన అవసరం ఉందనిపించేలా ఆ రచనలను సోదాహరణంగా విశ్లేషించాడు. నిజానికి దీనిలో ఉన్న ప్రతి అధ్యాయం ఒక్కొక్క ప్రత్యేక పరిశోధన చేసే అవకాశం ఉన్న విభాగంగా అనిపించేలా పరిశోధకుడు విస్తృతమైన సమాచార సేకరించి దాన్ని సమన్వయించి తన ప్రతిపాదనలను మన ముందుంచాడు.
పరిశోధనలో సాధారణంగా నూతన సత్యాలను ఆవిష్కరించడం, నూతన సిద్ధాంతాలను రూపొందించడం, నూతన సిద్ధాంతాలను సమన్వయం చేయడం లేదా పూర్వ సిద్ధాంతాలను ఖండించి తన సిద్ధాంతాన్ని నిరూపించడం వంటిది ఏదో ఒకటి జరగాలి. ఈ సిద్ధాంత గ్రంథంలో- స్మైల్ తన జీవితమంతా సాహిత్యేతర వృత్తిలో ఉన్నప్పటికీ తాను తనకున్న సాహిత్యాభిరుచితో ఒక సృజనాత్మక రచయితగా సమాజంలోని అట్టడుగున ఎంతోమందికి కనిపించని అనేక సమస్యలను వస్తువులుగా స్వీకరించి, వాటిని ప్రయోగాత్మకంగా ప్రజలకు చేరువ చేసే ప్రక్రియలలో సాహిత్య సృష్టి చేసిన ఒక అభ్యుదయవాదిగా కనిపిస్తారు. ఒక సిద్ధాంతాన్ని ఈ గ్రంథంలో పరిశోధకుడు డాక్టర్ మద్దాల పెద్దిరాజు ఎంతో శాస్త్రీయంగా ప్రతిపాదించాడు. దీనికి కావలసిన ప్రామాణిక ఆకరాలను సందర్భానుసారంగా పేర్కొన్నాడు.
ఇంత చక్కని పరిశోధన గ్రంథం తెలుగు సాహిత్య చరిత్ర బృహత్తర గ్రంథానికి పరిశోధకుడు తన వంతు ఎంతో కృషి చేసినట్లుగా ఈ సిద్ధాంత గ్రంథాన్ని బట్టి తెలుస్తుంది. పేర్లను బట్టీ, ప్రాంతాలను బట్టీ సంకుచిత దృష్టితో రచయితలను రచనలను అంచనా వేయకూడదని ఒక విశ్వజనీన దృక్పథాన్ని అలవర్చుకోవడం ఎలాగో ఈ పరిశోధన గ్రంథం చదివితే తెలుస్తుంది.
స్మైల్ పుట్టింది ఒక ముస్లిం కుటుంబంలోనే అయినా అతను పెరిగిందీ,అతను తన రచనల్లో ప్రతిపాదించేలా చేసిందీ మాత్రం మానవత్వమేనని రచయిత కులం, ప్రాంతం కంటే సామాజిక స్పృహ పీడిత వర్గాల పట్ల సానుభూతి అవసరమని చాటిన గొప్ప రచయితగా నిరూపించాడు. ఇంత మంచి పరిశోధన చేసిన పరిశోధకుడు డాక్టర్ మద్దాల పెద్దిరాజుని ఈ సందర్భంగా హృదయపూర్వకం గా అభినందిస్తున్నాను.
ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు
కేంద్రీయ విశ్వవిద్యాలయం
హైదరాబాద్.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
నిష్పాక్షికతను, నిజాయితీని అన్వేషించిన పరిశోధన (పుస్తక సమీక్ష )-ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>