భూస్వామ్య చావుకేక “ పెడ్రో పరామో” (పుస్తక సమీక్ష )- డా.జె.రవీంద్రనాథ్
జువాన్ రూల్ఫో( 1918-1986) జెలిస్కోలోని అపుల్కో అనే ప్రాంతంలో పుట్టాడు. ఆరేళ్లకే తన తండ్రి ,పిన తండ్రి ఇద్దరు క్రిస్టరో తిరుగుబాటులో చనిపోయారు.రూల్ఫో తల్లి 1927లో తన తొమ్మిదేళ్ళ వయసులో మృతి చెందడంతో అనాధ శరణాలయంలో 1928- 32 ల మధ్య పెరిగాడు. 1933లో మెక్సికో వెళ్ళాడు. తన చదువు తర్వాత పాత్రికేయుడిగా, ఫోటోగ్రాఫర్, ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ గా, ట్రావెలింగ్ సేల్స్ ఏజెంట్ గా పని చేశాడు. అతడు క్లారా ఏంజెలీనా అపారిసియో రేయ్స్ ను వివాహమాడాడు. వారికి నలుగురు పిల్లలు.
జువాన్ రూల్ఫో నవలలో పాత్రలు కూడా అనాధలు .సంప్రదాయ మూలాలు ,గతం, కుటుంబ, ప్రేమ, కమ్యూనిటీ, పౌర హక్కులు, విశ్లేషణ శక్తి ,అంతరాత్మ లేక చట్టానికి తిరస్కృతులుగా ఉంటారు. మొట్టమొదట తన నవలకు “ద విస్పర్స్” అని పేరు పెట్టాడు .దీనిని 1920 -30 లలో ‘ ప్రాంతీయ నవల’ అని కూడా అనవచ్చు . మొదట 300 పేజీలుగా రాసిన నవలలు 129 పేజీలకు కుదించాడు. తాను బారోకీ (baroque)శైలికి వ్యతిరేకంగా ఉన్నాడు. అతడి ముఖ్య రచనలు “ది బర్నింగ్ ప్లెయిన్” మరియు “పెడ్రో పరమో”.ఆయన రచనల పై జేమ్స్ జాయిస్, విలియమ్ ఫాక్నర్, నట్ హంసన్ ల ప్రభావముంది.
జువాన్ రూల్ఫో “పెడ్రో పరామో” నవల మెక్సికో విప్లవం తర్వాత వచ్చిన విశిష్టమైన రచన. దీని కథనరీతికి ముగ్ధుడైన గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్ ఈ నవల తనకు కంఠతా వచ్చని రాశాడు ,ఈ నవల లోని అత్యంత సంక్షిప్తత పలు వ్యాఖ్యానాలకు అవకాశమిస్తుంది. ఇది లాటిన్ అమెరికా నవలలో ఒక క్లాసిక్ నవల.
జాసన్ విల్సన్ అనే విమర్శకుడు ఈ నవల గురించి ఇది మెక్సికన్ విప్లవం సాగిన 1910 -20 ల మధ్య కుంగదీసే అనుభవాలను, ప్రత్యేకంగా హింస ,అధికారం కోసం పెనుగులాట వల్ల గ్రామాల నుంచి పట్టణాలకు జరిగిన గొప్ప వలసను చిత్రిస్తుంది అని రాశాడు. 16వ శతాబ్దంలో స్పానిష్ దురాక్రమణ వల్ల రైతుల గతం హతమయింది. వారు ఆధునిక మెక్సికో లోను ఇమడలేకపోయారు. టీ.ఎస్ ఇలియట్ కావ్యం “ద వేస్ట్ లాండ్” పోల్చిన ఈ నవల “మెక్సికో గ్రామీణ మనస్తత్వంపై తీవ్రమైన పరోక్ష దాడి” అని కూడా విల్సన్ వర్ణించాడు.
ఎడ్వర్డో గాలియానో రాసిన “ఓపెన్ వీన్స్ ఆఫ్ లాటిన్ అమెరికా” అనే పుస్తకంలో సామ్రాజ్య వాదం ఏ విధంగా స్ధానిక భూస్వాములు , పెట్టబడిదారీ అనుయాయులతో కలిసి శతాబ్దాల పాటు దోచుకున్నదీ తెలిపారు.మెక్సికో చరిత్రలో ఇరవయ్యో శతాబ్దంలో 1910 నాటికి 800 మంది భూస్వాములు, విదేశీయుల చేతుల్లో ఎక్కువ భూమి ఉండేది. మొత్తం 15 మిలియన్ల మందిలో 12 మిలియన్ల మంది గ్రామీణ రైతులు. అప్పులు, ఒప్పందాల పిడికిలిలో బానిసలు. అమెరికా వారి పెట్టుబడులు పెరిగి వారు నియంత డయాజ్ కు మద్దతు ఇచ్చారు. 1845 లోనే అమెరికా మెక్సికో నుంచి టెక్సాస్, ,కాలిఫోర్నియా లను తీసుకుని బానిస విధానం తెచ్చింది.ఇంకా కొలరాడో, అరిజోనా, నెవాడా, ఉతా ప్రాంతాలను స్వాధీనం చేసుకుని దాదాపు సగం దేశాన్ని లాక్కుంది. మిగిలిన చోట రాగి, పెట్రోలియం, రబ్బర్, చక్కెర, బ్యాంకు, రవాణా రంగాల్లో అమెరికా పెట్టుబడులు పెట్టింది.అమెరికన్ ఆయిల్ కంపెనీ , స్టాండర్డ్ ఆయిల్ అఫిలియేట్ అమెరికన్ కోర్దేజ్ ట్రస్ట్ మాయా, యాకీ ఇండియన్ నేటివ్ జాతులను నిర్మూలించారు. బానిసత్వ దోపిడీ పెరిగింది. 19 వ శతాబ్దం చివరి దశాబ్దంలో మొరేలాస్ ప్రాంతంలో పట్నాలు, గ్రామాలు, చక్కెర ప్లాంటేషన్లు పెరిగి భూమి, నీరు, శ్రామిక శక్తి కబ్జా జరిగింది. చక్కెర ఎస్టేట్లలో సంపద పెరిగి మిల్లులు, డిస్టిలరీలు, రైలు రోడ్లు వచ్చాయి. భూములు పోయి ఎదురు తిరిగిన రైతులను యూకాటాన్ నిర్బంధ శిబిరానికి పంపారు.
మెక్సికో లో నియంతలైన డయాజ్ ,మదేరో ల పాలనలో మార్పు లేదు.దక్షిణ మెక్సికో నుంచి వచ్చిన జపాటా దోపిడీ దారు నియంతలైన డయాజ్, మదేరో, హుయెర్టా, కరంజా లకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. చివరకు విజయం సాధించిన జపాటా, పాన్చోవిల్లో లు .అధికారంలోకి రాగానే 1914లో మొరేలాస్ ప్రాంతంలో వ్యవసాయ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. విప్లవ వ్యతిరేక శక్తుల భూములు లాక్కున్నారు.చక్కెర మిల్లులు, డిస్టిలరీలు జాతీయం చేశారు. 1916లో జపాటిస్టా జిల్లా, మొరేలాస్ రాజధాని అయిన కోయనవాకా పై దాడి జరిగింది.మరో మూడేళ్లకు జపాతా హత్యకు గురయ్యాడు.1934 నుంచి 40 మధ్య కార్డెనాస్ విప్లవ సాంప్రదాయం కొనసాగించి దేశీయ, విదేశీ కబ్జాదారుల నుంచి 67 మిలియన్ హెక్టార్ల భూమి స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆధునికీకరణ , పారిశ్రామికీకరణ, నగరాలు, వినియోగ దారులు మార్కెట్ పెరిగాయి. కానీ క్రమేణా విప్లవ ఫలితాలు మందగించి జనం బాధలు పెరిగాయి.1968లో ట్లాటేలోల్కో జరిగిన 500 మంది విద్యార్థుల ఊచకోత ఆ దేశ వ్యవస్థ లోని వైరుధ్యాలు బయట పెట్టిండి..
నవలలో ఒక పట్నం లోని నిర్జన వాతావరణం, భూస్వామి చేష్టలు, అకృత్యాలు తనకు అనుగుణంగా విప్లవాన్ని తన వ్యతిరేక పట్నం వైపు తిప్పటం, తన తండ్రి హత్య , పెంచిన కొడుకుల దుర్మరణం తరువాత భూస్వామి పెడ్రో పరమో లో చెలరేగిన ప్రతీకార భావం , చేసిన హత్యా కాండ. తాను ప్రేమించి కోల్పోయిన సుసానా కోసం తపన ఉన్నాయి. ఈ నవలలో చాలా పాత్రలన్నీ మొదట సజీవమని మనం భ్రమించినా తర్వాత అవి మృతుల ఆత్మలనే సంగతి తెలుస్తుంది.
జువాన్ ప్రెసియాడో తన తల్లికి ఇచ్చిన మాట కోసం తన తండ్రిని వెతుక్కుంటూ కొమర పట్నం వస్తాడు. దారిలో ఎదురైన అబండియో ద్వారా ఆ పట్టణంలో పలువురు తన తండ్రి పెడ్రో పరమో సంతానమని తెలుస్తుంది. తాను వెళ్లిన చోట నిశ్శబ్దం రాజ్యం చేస్తుంటుంది. విరిగిన తలుపులు, నాచు మొక్కలు పెరిగిన ఖాళీ ఇళ్ళు దర్శనమిస్తాయి. తన తల్లి చెప్పినట్లు డోనా ఎదువిగేస్ ని వెతుక్కుంటూ వెళ్ళగా ఆమె అతన్ని ఆదరిస్తుంది. అతడి తల్లి తనకు తెలుసని, అతనికి దారి చూపిన అబండియోఎప్పుడో పోయాడని చెబుతుంది. అతడి తల్లి పెడ్రో పరమోను పెళ్లి చేసుకుని కూడా తనను వేడుకుంటే ఆమె బదులు తాను పెడ్రో తో ఒక రాత్రి ఉన్నానని చెబుతుంది. జువాన్ తల్లి కొంతకాలం తర్వాత తన సోదరినీ చూసే వంకతోటి ఆ ఊరు వదిలి మళ్లీ తిరిగి రాదు.
పెడ్రో పెంచిన మిగేల్ ఒక ఆకతాయి. స్త్రీ లోలుడు. అతడు ఫాదర్ రెంటేరియా సోదరుని చంపి, ఆ సోదరుడి కూతుర్ని చీకటిలో లొంగ తీసుకుంటాడు. ఆమెకు అతని మొహం కూడా తెలియదు. ఫాదర్ వెంటనే తాను భూస్వామి పై ఆధారపడినందున బాధపడుతూ ఉంటాడు . మిగేల్ దుర్మరణం తర్వాత ప్రార్థన చేసేందుకు కూడా ఇష్టపడడు .తాను పేదలకు ఏమీ చేయలేకపోతున్నానని విచారిస్తుంటాడు .మరియా డ్యాడా ను అందరూ వాడుకొని వదిలేస్తే, ఆ అక్రమ సంతానానికి ఆమె తల్లి తండ్రి అవుతుంది. ఆమె నిస్సహాయంగా, చివరకు ఫాదర్ కూడా ఏమీ చేయలేకపోవడంతోటి ఆత్మహత్య చేసుకుంటుంది.
భూస్వామి పెడ్రో తన కన్నుబడిన డోలొరెస్ కోసం ఫుల్గారో అనే అనుచరుని పంపుతాడు. ఆమె భూమిని కబ్జా చేస్తాడు. ఆమె తండ్రిని దూరంగా మైనింగ్ ప్రాంతానికి పంపిస్తాడు . తన పెంపుడు కొడుకు మిగేల్ దుష్ట చర్యలను కాస్తాడు. విప్లవం వచ్చిన తరువాత నాయకులలో కొందరికి ధనమిచ్చి తన మీద కాకుండా పక్కనున్న కోట్ల పట్నం వైపు వారి దృష్టిని తిప్పుతాడు తండ్రి
తన తండ్రి పెట్రోలు వెతికేందుకు వచ్చిన జువాన్ అతి నీరసంగా ఉండటంతో ఒక ఇంట్లోకి వెళ్తాడు .అక్కడ ఒక జంట అతనికి ఆశ్రయమిస్తుంది అయితే ఆ జంట లో స్త్రీ పురుషులు అన్నాచెల్లెళ్ళు. కలిసి ఉన్నందుకు అపరాధ భావనతో ఉంటారు. ఒక రాత్రి పూట మగవాడు ఒక ఆవు దూడను వెతికే నెపంతో వెళ్లిపోతాడు. ఆ స్త్రీ జువాన్ కు దగ్గరవుతుంది .తరువాత జువాన్ ఆ ఇంటి బయటకు వచ్చి తన తల్లి స్వరంతోపాటు పలు స్వరాలు వింటాడు. జువాన్ కూడా ఒక ఒక ఆత్మ అని అప్పుడు పాఠకునికి తెలుస్తుంది .
ఫాదర్ రెంటేరియో అందరి పాపాలు వింటుంటాడు. కానీ అతడు భూస్వామి పెడ్రో పరామో కు అనుకూలమని తెలిసి ప్రీస్ట్ అతనికి తన ఆశీర్వాదాన్ని ఇవ్వడు. చివరకు ఫాదర్ సైతం విప్లవకారులతో కలిసిపోతాడు అణగారిన జనంలో నుంచి వచ్చిన అబండియో , పెడ్రో అక్రమసంతానమే చివరకు భూస్వామినీ అంతం చేస్తాడు. నవలలో చివరి వాక్యం అతడు “ఒక బోలు శబ్దం చేస్తూ నేల మీద పడ్డాడు ఒక రాళ్ల కుప్పలాగా కూలిపోతూ.”
నవలలో భూత, వర్తమాన, భావి కాలాల మధ్య హద్దులు చెరిగిపోతాయి. కథనం చెప్పే గొంతులు మారుతుంటాయి. నవలలో నశించిపోతున్న భూస్వామ్య వ్యవస్థలోని అణిచివేత , విచ్చలవిడితనం పీడిత స్త్రీల లొంగుబాటు ,భయానక వాతావరణం, సస్పెన్స్ ,నిరాశ ,చావులు కనిపిస్తాయి .ఒక నిశ్శబ్ద , నీరవ , నిశీధి వాతావరణం లో కథ సాగుతుంది.
గెరాల్డ్ మార్టిన్ అనే విమర్శకుడు ఈ నవలలో ఇతివృత్తాలు ఓడిపల్, థీసియన్, డాంటే తరహా అన్వేషణలు ఉన్నాయి. ఇవి పురాణ శక్తితో ఐక్యమైన దేశం లేదా మొత్తం ఖండం యొక్క వలసవాద, భూస్వామ్య వారసత్వాన్ని అలంకారికంగా వర్ణించాయని రాశాడు. “నవల జాతీయ (మెక్సికో/ లాటిన్ అమెరికన్) మరియు వ్యక్తిగత (విశ్వజనీన) స్థాయిల్లో పనిచేస్తుంది. నవ మార్క్స్ , నవ ఫ్రాయిడ్లకు అనుగుణమైన విమర్శనాత్మక దృష్టి మొత్తం కథన రీతిలో అంతర్లీనంగా ఉంటుంది. పాఠకుడు ఒక డిటెక్టివ్ లాగా , ఊహాత్మకంగా ఆలోచించి వ్యాఖ్యానించాలి. సుసాన్ ప్రకృతి లయలకు అనువైన స్త్రీ లైంగికత కు ప్రతీక. నవలలో మెక్సికో విప్లవం గందరగోళంగా, నిరాశమయంగా, అవకాశవాదంగా కానవస్తుంది” అని మార్టిన్ అభిప్రాయపడ్డాడు.
“ధనిక -పేద ,నగరము -పల్లెలను వేరు చేసే సాంస్కృతిక ద్వంద్వత్వానికి పరిష్కారం సాంస్కృతికంగా కుదరదు. సామాజిక ,చారిత్రక ,అంతిమంగా రాజకీయ పరిష్కారమే తగినద”ని సూచించాడు విమర్శకుడు నీల్ లార్సెన్.
-డా.జె.రవీంద్రనాథ్
విశ్రాంత ఆంగ్ల ఆచార్యులు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
భూస్వామ్య చావుకేక “ పెడ్రో పరామో” (పుస్తక సమీక్ష )- డా.జె.రవీంద్రనాథ్ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>