వృద్ధాప్య విలాపం(కవిత)-బాలాజీ పోతుల

కొన ఊపిరితో కొట్టుమిట్టాడు ప్రాప్తం
దీనత్వపు దీప విలాప తాపం
ఆందరిచూపుల్ని చిలుకొయ్యలకి తగిలించారు
ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఉడుకుతోంది
కాలం చావుకి కాలు దుయ్యమంటోంది
నోరు పిడచగట్టుకు పోయింది
కాళ్ళ కీళ్ళన్నీ కొయ్యబారిపోయాయి
దేహమంతా స్వేదంలో నానుతోంది
రేపా? మాపా? అన్నట్టే ఉంది పానం!
పాలు పోసి పోసి గొంతునంతా ట్రాఫిక్ జామ్ చేశారు
నిస్సహాయ స్థితిలో నిర్మానుష నేత్రాన,
నిండా మునిగిన రాత్రులు దర్శనమిచ్చాయి
విషాదాల తిమ్మిరి బుసలుకొట్టింది
హృదయం ఎన్నడూ చూడని బాధని నింపుకొంది
ఓ జీవి కుప్పకూలిన కేక విని,
కుక్క అప్పుడే వింతగా విలపించింది
చెట్టుపైన పక్షి తన పిల్లల్ని రొమ్ముల్లో దాచుకొంది
ఊర్లోని జనాలంతా వారి శయనమందిరాల్లో సుప్తుగా నిద్రిస్తున్నారు
ఆ ఆత్మఘోష మాత్రం మేఘాలకు విన్పించింది
ఆ రోజంతా భోరున వర్షం కురిసింది
వృద్ధాప్యం సుఖాల కంటే బాధల్ని నింపుతుంది.
అందరి వృద్ధాప్యాలు సుఖాలయితే ఎంత బాగుండునో?
-బాలాజీ పోతుల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
వృద్ధాప్య విలాపం(కవిత)-బాలాజీ పోతుల — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>