గాయపడని దారి (కవిత)- దేవనపల్లి వీణావాణి

మనుషుల్ని మనుషులతో కలిపి
సమాజానికి అనుబంధాల
ఆమ్లజని
ప్రవహింపజేసే రక్తనాళాలు
కదా రహదారులంటే
కాళ్లను నమ్ముకున్నప్పుడు
జీవాలను చేరదీసి
వాడుకున్నపుడు
వేగ నిదాన సంయమనంతో
ప్రాణమున్న కళ్ళు
పరస్పర గమనాలను గౌరవించుకున్నాయి
వికసించిన బుద్ధిబలం
అనాయాసపు యంత్రపరుగునిచ్చింది
పరిగెత్తే కాలాన్ని
చేదుకొని నిలుపుకోవడానికే
ప్రాణంలేని గాలి తిత్తులమీద
ప్రాణాలను పరుగెత్తిస్తున్న వాడా
ప్రయాణపు
మిత హితాలను లెక్కచేయకుంటే
నిర్లక్ష్యాల ఒరిపిడికి జీవితాలు
రద్దు చేయబడతాయి
బతుకు రథం నడుపుకోవాల్సిన
పథికుడివి
చేతిలోని పగ్గాలు చితికి చేర్చకుండా
పట్టుకోవడంలోనే
మెతుకులు మిగిలి ఉండేది
కన్ను రెప్పవేయక ఎదురుచూసే
చూరు చుట్టూ
మసి మబ్బులు
ముసురుకోవద్దనుకుంటే
మసలుకొనే ఒడుపురావాలి
వేగాన్ని పురిగొల్పే చేతులకు
లోచూపుని అతికించి వెళ్ళు
అవి యమపాశపు పరివేదనను
తప్పిస్తాయి
దారుల్ని గాయపడకుండా కాచుకుంటాయి
-దేవనపల్లి వీణావాణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
గాయపడని దారి (కవిత)- దేవనపల్లి వీణావాణి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>