నా ఆశావాదం నా ఊపిరి…(కవిత) -ముక్కమల్ల ధరిత్రీ దేవి
నా కలలు కల్లలై కూలిననాడు
కలవరపడను…మరో కలకు
ఆహ్వానం పలుకుతాను…
నిరాశ..నిస్పృహలు ముంచెత్తినక్షణాన..
నీరసించిపోను..నన్ను నేను నిందించుకోను…
తడబడక నిలబడి అడుగులు కదుపుతాను…
అవహేళనలు..అవమానాలు…
నా భావి కట్టడానికి పునాదులు…
ప్రతి అపజయం నా విజయానికి ఓ మెట్టు..
ఆ నిచ్చెన నాకో ఆసరా…
నిత్యం భుజం తడుతూ ఇచ్చే భరోసా…
నా దృఢసంకల్పం నాలో
నవచైతన్యానికి రహదారి…
ఒకనాటికది నాచేతి కందే
సత్ఫలితానికి నాంది…అందుకే…
కలలు కల్లలైతే కలవరపడను…
మరో కలలో లీనమవుతాను…
నా ఆశావాదం నా ఊపిరి…
నా జీవనగమనానికి
అదో తిరుగులేని ఇంధనం…
అనుక్షణం ఆగక నను ముందుకు
నడిపించే ఆయుధం….
–ముక్కమల్ల ధరిత్రీ దేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
నా ఆశావాదం నా ఊపిరి…(కవిత) -ముక్కమల్ల ధరిత్రీ దేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>