“Bison ” (కవిత ) -బాలాజీ పోతుల

కొమ్ములు తిరిగిన గొర్రె ఒక్కతే
ఆ నిర్మానుష్య పుర్రె దగ్గరే
అయోమయంగా తిరుగాడుతోంది!
ఒక ముఖం అద్దంలో చూసుకుంటోంది
యుద్ధ వీరుడిలా రౌద్రపు కళ్ళు
మానిన పాత గాయాలనే పదే పదే చూపుతోంది
గొర్రె ఒంటరిగా పరుగులు తీస్తోందిప్పుడు
ఒకటే గజ్జెల చప్పుడు ఆ స్థితిని
కంటికి కట్టి పోతోంది
ఆ వీరుడి కళ్ళు బైర్లు కమ్మాయి
ఒళ్లంతా రక్తపు వాసన
***
నాగు పాము బుసలు కొడుతోంది
పడగ విప్పి నిల్చుంది
ఆ వీరుడి పసి కళ్ళు తదేకంగా
దాన్నే చూస్తున్నాయి
***
కాలం గిర్రున తిరిగింది
కడలి తీరాల్లో ఆ కుర్రాడి కంఠం
కబడ్డీ ఆడుతోంది
నల్లని థార్ రోడ్లపై
గరుకు పాదాలు పరిగెడుతున్నాయి
దమ్మొచ్చింది,
ఊపిరి బిగపట్టి ఊదేస్తే
ఉత్సాహం ఉప్పొంగింది
తుపాకీ పేల్చిన ఓ చేయి
గడ్డిపోచ కంటే తేలికనుకున్న
ప్రాణాల్ని సైతం లెక్కచేయని ఆ చేయే
తెల్లని గుడ్డనంతా ఒంటికి పులుముకుంది
నెత్తుల్ని తెగ నరికే ఇంకో చేయి
అణుబాంబుల్ని అవలీలగా సంధిస్తూ
ఎర్రటి రక్తాన్ని నల్లటి రక్తంగా పారిస్తోంది
వేట కత్తుల విసురులకి
తోడేళ్లు తోక ముడిచాయి
పచ్చబొట్టేసుకున్న గుండెలన్నీ
కాలే కట్టెల్లో బూడిదయ్యాయి
ఉదయిస్తున్న సూర్యుడి వెలుగులో
కత్తి పట్టుకొని తిరుగుతుందా బాంబుల చేయి!
ఆ గొర్రె యజమాని కంట పడింది
ఎవరో ఇంటిపై రాయి విసిరారు
-బాలాజీ పోతుల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

Comments
“Bison ” (కవిత ) -బాలాజీ పోతుల — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>