జ్ఞాపకం – 108 – అంగులూరి అంజనీదేవి
జీవితంలో క్లిష్ట పరిస్థితులు వస్తేనే గాని అవి ఎలా వుంటాయో అర్థం కావు. ఎలా వున్నవాళ్లం ఎలా అయ్యాం అన్నది కూడా అలా అయ్యాకనే తెలుస్తుంది. ఏదీ అనుకున్నట్టు జరగదు. జరిగేది అనుకున్నదే అయితే ఆ ఆనందమే వేరు. రాజారాం అలాంటి ఆనందంలోనే వున్నాడు. అతను చేసిన పనిని అందరు మెచ్చుకుంటున్నారు. ఇంతగా మెచ్చుకుంటారని అతను ఊహించలేదు. ఏదో తన సంతృప్తి కోసం చేశాను అనుకున్నాడు.
కానీ రెండు రోజులుగా అన్నం తినకుండా, భర్త చేసిన పని నచ్చక బాధపడుతోంది వినీల. పేషంటులా తయారయింది.
రాజారాం స్కూల్ నుండి రాగానే ఎవరూ చూడకుండా తలుపు పెట్టి మీదపడింది “ఎంతపని చేశారండీ! నేను బ్రతకాలా? చావాలా?” అంటూ లబోదిబోమంది. అతని చొక్కాపట్టుకొని బటన్స్ తెగిపోయేలా లాగింది. జుట్టుపట్టి పీకింది. పూనకం వచ్చిన దానిలా వూగిపోయింది.
అంతవరకు ప్రశాంతంగా భరించిన రాజారాం ఒక్కసారిగా కళ్లెర్రజేసి చూసాడు.
“ఇక ఆపుతావా నీ ఆగడం!” అంటూ అరిచాడు.
ఆమె ఆగలేదు. కసిగా కొడుతూనే వుంది. తట్టుకోలేక అతనామె రెండు చేతుల్ని ఒడిసిపట్టుకున్నాడు. పొట్టేలు కుమ్మినట్లు తలతో అతని గుండెలపై మోదుతోంది. ఇక ఆపుకోలేక జుట్టుపట్టుకొని తలను ఆపి ఆమె చెంపలు రెండూ వాచిపోయేలా కొట్టాడు. ఆ దెబ్బలకి దెయ్యం వదిలినట్లు బిత్తరపోయింది. రెండు చేతులతో చెంపల్ని పట్టుకొని కింద కూర్చుంది. రాజారాం కూడా కింద కూర్చుని “నేనేం తప్పు చేశాను?” అడిగాడు.
అరచేతుల్లో ముఖాన్ని దాచుకుందే కాని సమాధానమివ్వలేదు. తొలిసారిగా అతన్ని చూసి వణికింది వినీల.
ఆమె చేతుల్ని నెమ్మదిగా తొలగిస్తూ “చెప్పు! నేనేం తప్పు చేశాను?” అంటూ లేచి నిలబడ్డాడు. చొక్కాను సవరించుకొని, జుట్టులోకి వేళ్లుపోనిచ్చి వెనక్కి నెట్టుకున్నాడు. వెళ్లి కిటికీ లోంచి బయటకు చూస్తూ నిలబడ్డాడు.
నొప్పిగా వున్న చెంపల్ని చేతులతో తడుముకుంది. కనీళ్లను మోచేతులతో తుడుచుకుంది. ముక్కు చీదింది “మీకు నాకన్నా ఆ వికలాంగులే ఎక్కువయ్యారా? జీతంలో సగం జీతం ఆ వికలాంగుల సంస్థ అకౌంట్ కి నెలనెలా జమ అయ్యేల చేశారే. చేసేముందు నాతో ఒక్క మాటయినా అడిగారా?” అంది. ఆమె గొంతు చాలా నీరసంగా విన్పిస్తోంది.
“కొన్ని పనులు చెయ్యాలనుకున్నప్పుడు రెండో వ్యక్తితో సంప్రదింపులుంటే ఆ పనులు జరగవు. అలా జరగొద్దనే నేనెవరితో చెప్పలేదు” అన్నాడు.
“కనీసం నాతో కూడానా ?” అంది.
“నువ్వు నాకు ఎవరి కన్నా ఎక్కువ? నాకన్నా ఎక్కువా నువ్వు?” అన్నాడు.
బిత్తరబోయింది.
అతను ఆమె వైపు చూడకుండా “నిజానికి నాకీ ఆలోచన వచ్చేదే కాదు” అన్నాడు.
“మరెందుకొచ్చింది?” అంది.
“నాకు కాళ్లు లేనప్పుడు నేను చాలా బాధలు పడ్డాను. ఆ బాధలే నన్నిలా ఆలోచింపజేశాయి”
“మీరేం బాధలు పడ్డారు? నేను కదా బాధలు పడింది. అందరి మొగుళ్లకి కాళ్లున్నాయి. నా మొగుడుకే కాళ్లు లేవని నేను ఏడవని రోజు లేదు తెలుసా? తిలక్కయితే మీకు కాళ్లు లేవని నన్ను లోకువగా చూసి రోజూ గొడవ పడేవాడు” అంది.
“నాకొచ్చిన సమస్య నీ కన్నీళ్లతో, గొడవలతో తీరేది కాదు. నాకు దూరంగా నిలబడి ఎవరెంత బాధపడి ఏం లాభం? ఆ సమయంలో నన్ను చూసేవాళ్లు లేరు. మంచంలోంచి లేపి నడిపించేవాళ్లు లేరు. చివరకి తిలక్ కూడా వెళ్లిపోయాడు. ఎంత బ్రతిమిలాడినా ఆగలేదు. నీక్కూడా నేనిలా లేచి నడుస్తానన్న నమ్మకం లేకనే నిర్లక్ష్యంగా చూశావు” అన్నాడు.
కనురెప్పలు ఆర్పుతూ అలాగే చూసింది వినీల.
“దానికి నిన్ను నేనేం తప్పుపట్టడం లేదు. నేనున్న స్థితిలో ‘ఈయన వల్ల నాకేంటి‘ అన్నది నీక్కూడా వుండొచ్చు. నువ్వు కూడా తిలక్ లాంటి మనిషివే కదా! నాకు తెలుసు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి వుంటాయని. అలా లేకుండా సేవ చెయ్యటం అందరికి సాధ్యం అవుతుందా?” అన్నాడు.
సిగ్గుతో చితికిపోయింది వినీల.
“తాతయ్యకు సమాధి కట్టించాల్సిన డబ్బులతో నాకు ట్రీటమెంట్ ఇప్పించాడు మా నాన్న! నీలాగా, తిలక్ లాగా డబ్బు గురించి ఆలోచించలేదాయన. ‘ఇలా ఎందుకు నాన్నా?’ అని నేను ఆశ్చర్యపోయి అడిగాను ‘లోకంలో కాళ్లులేని వాళ్లు ఎంత మంది వున్నారో నాకు తెలియదు రాజా! నా కొడుకు కాళ్లు లేకుండా బాధపడుతుంటే రోజూ నాకు నరకంగానే వుంది. ఈ నరకం ఏ తండ్రికీ వుండొద్దు. నాకు నా తండ్రి సమాధి కన్నా నా కొడుకు కాళ్లు ముఖ్యం‘ అన్నాడు. నిజానికి కాళ్లు లేని బాధ ఎలా వుంటుందో మా నాన్నకి తెలియదు. అలాంటి మా నాన్నే నాకోసం అంత ఖర్చు పెడితే ఆ బాధను అనుభవించిన నేను కాళ్లు లేని వాళ్లకోసం ఖర్చు పెడితే తప్పులేదనిపించింది. వాళ్లిప్పుడు ప్రతినెలా నా శాలరీ కోసం ఆశగా ఎదురుచూస్తారు. ఆ ఊహే నాకు కొత్త శక్తిని ఇస్తోంది” అన్నాడు.
వినీల నోరు పడిపోయిన దానిలా వింటోంది. ఆమెనలా చూస్తుంటే ఇప్పుడే వినటం అలవాటు చేసుకున్న దానిలా అన్పిస్తోంది.
“మనం ఈ భూమ్మీద పాదాలను పెట్టి నడుస్తున్నప్పుడు మనం ఎలాంటి పనులను చేస్తున్నామో ఖాళీ సమయాల్లో కూర్చుని గుర్తు చేసుకోవాలి. ఈ పనులను చేస్తే భూమి మనల్ని భరిస్తుందా లేదా అని ఆలోచించాలి. కొంతమంది నడిస్తే భూమి నర్తిస్తుందట. తరిస్తుందట. చివరకి పులకించిపోతూ వాళ్ల పాదాలకి తన అమృత స్పర్శను అందిస్తుందట. ఇదంతా నాకు యాక్సిడెంట్ కాకముందు తెలియదు.
– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
జ్ఞాపకం – 108 – అంగులూరి అంజనీదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>