ఇంకాస్త సంతృప్తిగా జీవిద్దాం!(కవిత)-విజయభాను కోటే
స్వేచ్ఛకు ప్రతీకగా మనం పిలిచే పక్షి
ఆకాశాన ఏ మాత్రం అలుపు లేక ఎగిరిపోతూ ఉంటే
మన కలలను దాని రెక్కలకు ముడి వేసి
మనమూ నింగిని కొలిచేందుకు పైకెగరమూ?
మబ్బుల పరదాలను దాటి ఇంకొంచెం ఇంకొంచెం అంటూ రివ్వు రివ్వున సాగిపోమూ?
ఆపుడపుడూ చిన్న ఆలోచన వస్తూ ఉంటుంది
మన కళ్ళు నింగిన ఎగిరే ఆ రెక్కలను ఆశగా చూసినట్లే
పక్షి కూడా భూమి వైపుకు చూస్తుందేమో
దాని కళ్ల నిండా భూమిపై బెంగతీరా నాడయాడాలని కలలున్నాయేమో
పచ్చిక బయళ్ళ మెత్తదనపు స్పర్శ కోసం పరితపిస్తోందేమో
నువ్వు, నేను అనుభవించే అనుబంధాలపై ఆశలున్నాయేమో
మట్టి సువాసనతో స్నేహం చేయాలన్న స్వప్నాలున్నాయేమో
నిదానంగా, నిర్భీతిగా నేలను స్పృశించాలన్న ఉద్వేగం ఉందేమో
గుడ్డు దాటిన పిల్లలు ఏ తుఫానుకో గూడుతో సహా నేలకొరుగుతుంటే చూడలేక
కొండల నడుమ లోయలలో చిన్ని పొదరిల్లు కట్టుకోవాలన్న కోరికుందేమో
దొరకని వాటిపై మక్కువ మనకేనా? ఇతర జీవులకు కూడా ఉందేమో
నేలను హత్తుకుని జీవించే భాగ్యం మనకే దొరికింది
నింగి అంచుల గమనం వాటికి దక్కింది
మట్టిని కాసింత గట్టిగా హత్తుకుందాం
నిండారా, నిండైన జీవితాన్ని ఇంకొంచెం సంతృప్తితో జీవిద్దాం!
-విజయభాను కోటే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
ఇంకాస్త సంతృప్తిగా జీవిద్దాం!(కవిత)-విజయభాను కోటే — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>