కొంగు(కవిత) డాక్టర్ నాగారం డి ప్రకాష్.
1.
అమ్మ అబద్ధం చెబుతూ ఉండేది.
ఎడ్లబండిలో ప్రయాణిస్తున్నప్పుడు
నా పై కొంగును కప్పేది.
భూమిని ఆకాశం కప్పినట్టు.
దొంగోడు వస్తున్నాడని
బయటకి వస్తే ఎత్తుకుపోతాడని
అబద్ధం చెప్పి భయపెట్టేది.
నా అల్లరిని ఆపడానికి.
రాత్రిపూట ఇంటి నుండి
బయటకు వెళ్లకూడదని
దయ్యాలు ఉంటాయని
అబద్ధం చెప్పి భయపెట్టేది.
ఇంకా గుడికి తీసుకెళ్లి
ఇక్కడ దేవుడు ఉన్నాడు అనేది.
అన్నీ అబద్ధాలే.
మా అమ్మనే దైవం.
అమ్మ కాలి కింది ధూళి
నాకు విభూతి.
2.
అమ్మ మోసం చేస్తూ ఉండేది.
ఆకలిని తన కడుపులో దాచుకొని
కడుపు నిండినది అని చెప్పేది.
అమ్మ చేసే మోసాలను పసిగట్టాలని
అమ్మ కొంగు ముడి వేసి ఉండడం చూసి
ఆ ముడిలో డబ్బులు ఉన్నాయని
నేను విప్పి చూశాను.
చినిగిన తన చీర కొంగును
ఒక ముడిగా వేసిందని
నేను ఆ ముడిని విప్పినప్పుడు
అందులో నుండి పేదరికం స్వేచ్ఛగా
ఒక సీతాకోకచిలుకలా
ఎగిరినప్పుడు అమ్మ మోసం తెలిసింది.
3.
తను తినకుండా నాకు పెట్టినప్పుడు
అమ్మ తినలేదనే విషయం
నేను ఎన్నడూ గుర్తించనే లేదు.
అలా అమ్మ ఎన్నిసార్లు మోసం చేసిందో…
బతుకుదెరువు కోసం అనడం కంటే
బతకడం కోసం బొంబాయి వెళ్లి
తట్ట మోసి కూలీ చేసి
జాగా (స్థలం) ఆపుకొని
జోప్డా (ఇల్లు) కట్టుకొని
కుట్టు మిషన్ కొనుక్కుని
బట్టలు కుట్టి
కొన్ని కొన్ని డబ్బులు కూడ పెట్టి
పేదరికాన్ని ఎదిరించిన కథలన్నీ చెప్పింది.
అమ్మతోడు అమ్మ అబద్ధం చెప్పలేదు.
అమ్మతోడు అమ్మ మోసం చేయలేదు.
-డాక్టర్ నాగారం డి ప్రకాష్.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
చాలా అద్భుతమైన అభివ్యక్తికరణ