నీకోసం నీవే..(కవిత)-ముక్కమల్ల ధరిత్రీ దేవి
“ఎవరో వస్తారని ఏదో చేస్తారని..
ఎదురు చూసి మోసపోకుమా..
నిజం మరిచి నిదురపోకుమా…”
అన్నాడో కవి..మాటలా అవి..!
కానేకావు..పచ్చి నిజాలు…
మనిషిలో నిద్రాణమై ఉన్న శక్తిని
మేల్కొలిపే అక్షరసత్యాలు…
గమ్యం వైపు అడుగులు కదపమంటూ
ముందుకు నడిపించే హితబోధలు..
అందుకే..నేస్తమా…
ఎదురు చూడకు ఎవ్వరికోసం
ఎవరో వచ్చి ఏదో చేస్తారని..
నిన్ను అందలం ఎక్కిస్తారని ఆశపడకు…
స్వయంకృషిని మించినదేదీ
ఉండదు..గ్రహించు..
ఆత్మన్యూనతను వదిలించుకుని
ఆత్మవిశ్వాసం పెంపొందించుకొని
ఆత్మగౌరవం నిలబెట్టుకుంటూ
కదులు ముందుకు..మున్ముందుకు..
ఆత్మనిర్భరత నీకు శ్రీరామరక్ష..
ఎల్లవేళలా నీకదే అండాదండ…
స్వ ఆధారితజీవనం వైపు దృష్టి సారించు
స్వయంసమృద్ధిని సాధించు..
స్వావలంబన ఇచ్చే ధైర్యంతో
నిర్భీతిగా సాగు ముందుకు…
అహాన్ని మాత్రం దరిజేరనీకు…
నీ దృఢసంకల్పమే సదా
నీ గుండెధైర్యానికి చేయూత..
నీ ఆశయసాధనకు ఊపిరులూదే
స్ఫూర్తి ప్రదాత..తెలుసుకో..
నీ భుజం నీవే తట్టుకో…
నీకోసం నీవే ఆలోచించుకో…
నాకేమీ తెలియదని దిక్కులు చూడకు
నీలో ప్రతిభ నిజంగా ఉంటే..
అదే నీకు పట్టం కడుతుంది
అందుకే నేస్తమా…
ఎదురు చూడకు ఎవ్వరికోసం..
స్వయంకృషిని మించినదేదీ
ఉండదని గ్రహించు..
పయనం సాగించు…
-ముక్కమల్ల ధరిత్రీ దేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
నీకోసం నీవే..(కవిత)-ముక్కమల్ల ధరిత్రీ దేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>